[4/24, 07:00] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 28🌹
👌అవగాహన అనుభవంగా మారాలి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
🌈 28. అవగాహన అనుభవంగా మారాలి 🌹
✳️ నిద్రను ఎంత వర్ణించినా అది నిద్రలో లభించే సుఖంతో సమానం కాదు. నిద్రలో మనం పొందే శాంతిని స్వయంగా పొందాల్సిందే. ఏ భాషలో వివరించినా అది, ఆ హాయితో సరితూగదు. ముక్తి కూడా అలాంటిదే. ప్రాపంచిక విషయాలవనుండి విముక్తి పోందడమే జీవన్ముక్తి. అయితే ఇది కేవలం భాషా పరిజ్ఞానమే కానీ అనుభవం కాదు కదా! నేను హాయిగా నిద్రపోతున్నానని చెప్పేవాడు అప్పటికే నిద్రలో లేడనే కదా అర్థం. ముక్తిని, మోక్షాన్ని గురించి ఎంత వివరించినా, విన్నా, అది మనని ముక్తుల్ని చేయదు. అసలు ముక్తుడు కానివారే లేరని శ్రీరమణభగవాన్ అంటారు. అంటే ముక్తి స్థితి అందరిలోనూ ఇప్పటికే ఉందని ఆ జ్ఞాని స్పష్టం చేస్తున్నారు. కాకపోతే అదిమనకి తెలియడానికే కాలం పడుతుంది. అదే మనం అనుకునే సాధన.
✳️ లౌకిక వస్తువుల్లాగా ముక్తి కూడా ఒకప్పుడు వచ్చే వస్తువే అయితే మరొక్కప్పుడు అది పోయేదే అవుతుంది. సత్యవస్తువు మాత్రమే సదా నిలిచి ఉంటుంది. అది ఎప్పుడూ మన అనుభవంలోనే ఉంది. మన అధ్యాస వల్ల తెలియడంలేదు. సాధన మనని ముక్తి స్థితికి చేర్చదు. మనం ముక్తులమేనన్న సత్యాన్ని తెలియజేస్తుంది. పుట్టినప్పుడు తాము మొగపిల్లలమో, ఆడపిల్లలమో తెలియని పసికందులు వయసు పెరిగేకొద్ది తాము ఫలానా అని తెలుసుకుంటారు. అంతే గానీ కొత్తగా వచ్చేది మారేది ఏదీ ఉండదు. ముక్తి కూడా అంతే.
✳️ మన స్వస్వరూపం తెలుసు కోవడమే మోక్షమని సాధకులు గ్రహించాలి. పేపరు చదివేటప్పుడు, టి.వి. చూసేటప్పుడు మనకి ఇష్టమైన కాఫీ కప్పు చేతిలో ఉన్నా త్రాగటం మర్చిపోతాం. మనం వార్తల్లో, సినిమాలో లీనం కావడమే అందుకు కారణం. ధ్యానం విషయంలో మాత్రం సాధకుడు ఆ మమైకతను సాధించడానికి చాలా కష్టపడాల్సివస్తుంది. ప్రయత్నంతో పనిలేని సహజమైన ఆసక్తి ఉంటే, ఏ కష్టం లేకుండానే ధ్యానం కూడా సిద్ధిస్తుంది. పరధ్యానంతో ఉన్నప్పుడు మన ఒళ్లు మనం మర్చిపోతున్నాం కానీ దైవాన్ని పూజించేటప్పుడూ, ఆత్మను ధ్యానించేటప్పుడూ మాత్రం అది సాధ్యపడటంలేదు. తగిన ఆసక్తి, జిజ్ఞాస లేకపోవడమే అందుకు కారణం. ఉన్నంతకాలం ప్రాపంచిక విషయాలపై ఇష్టం మనలోని దివ్యత్వాన్ని తెలుసుకోడానికి అడ్డంగా ఉంది. మనకి టి.వి. గానీ, సినిమాగానీ స్పష్టంగా కనిపించాలంటే బయట వెలుతురు తగ్గాలి లేదా టి.వి కాంతి బాగా పెరగాలి. అలాగే ప్రాపంచిక విషయాలపై ఇష్టాన్ని తగ్గించుకోవడం, దైవంపై అంతకు మించిన ఇష్టాన్ని పెంచుకోవడం సాధనకు, సత్య దర్శనానికి మార్గం అవుతాయి.
✳️ ధ్యానం అంటే మన ఇంద్రియాలన్ని ఒకే విషయంపై ఉండటమే. కానీ మన వికారాలు, వాసనలు అలా ఉండనివ్వవు. మనసులోని వికారాలు, వాసనలు రాలిపోవాలంటే నిరంతరం వాటిని పరిశీలించడం సులువైన మార్గమని శ్రీరమణ భగవాన్ ప్రబోధిస్తున్నారు. మనం నిరంతరం మనసును, దాని పోకడలను గమనించడం సాధన చేస్తే దాని చేష్టలు, చేతలు ఉడిగి పోతాయి. మనసు ఎడల నిర్విరామమైన సావధానతను అలవర్చుకోవడమే విచారణ మార్గంలో మనం చేయాల్సిన సాధన. ధ్యానం చేయాలంటే మనసు మరొక ధ్యేయ వస్తువును వెతుక్కోవాలి. కానీ, విచారణ మార్గంలో మనసు దానికదే ధ్యేయ వస్తువుగా ఉంటుంది. విచారణ ఎడల ఆసక్తి కనక లేకపోతే, మన మనసు మూలాన్ని అన్వేషించడం అనేది మరో మార్గమని శ్రీ భగవాన్ సెలవిచ్చారు. మనసు మూలాన్ని వెతికే ప్రయత్నంలో మనసు చేష్టలు బలహీనపడిపోతాయి. వాస్తవానికి మన మనసు ఈ వికారాలకు అతీతంగానే ఉంది. వికారాలను మనసు వ్యక్తం చేస్తుంది కనుక అవన్నీ దానివేనని భ్రమిస్తున్నాం. (శుద్ధ) మనసు ఎలా ఉంటుందో మనకి తెలియకపోవడమే అందుకు కారణం. శుద్ధమనసును తెలుసుకోవడానికే శ్రీభగవాన్ విచారణ మార్గాన్ని సూచించారు. బి.పి. మిషన్లో పాదరసం ఉంటుంది. అది మన రక్తపోటు ఎంత ఉందో తెలియజేస్తుంది. పాదరసం కేవలం వాహకం మాత్రమే. మన బి.పి.తో దానికి ఏ సంబంధం లేదు. బి.పి. మిషన్లోని గోళంలో పాదరసం నిశ్చలంగానే ఉంది. గొట్టంలో అది ఎంత ఎత్తుకు పెరిగినా తిరిగి తన స్వస్థానాన్ని, స్వరూపాన్ని విడిచిపెట్టదు. మనలోని మనసుకూడా ఎన్ని వికారాలు ప్రతిబింబించినా దాని సహజమైన దివ్యత్వాన్ని అది విడిచిపెట్టదు. కాబట్టే ముక్తికి అందరూ అర్హులం కాగలుగుతున్నాము.
✳️ ముక్తి అంటే మనసు యొక్క స్వస్థితి. మన వికారాలను దాటటమే ముక్తి. ప్రతిరోజు మనం నిద్రలో ముక్తులం అవుతున్నాం. కానీ ఆ వికారాలను శాశ్వతంగా దాటగలిగినరోజు జీవన్ముక్తులం అవుతాం. పాదరసం లాంటి మన మనసు స్వస్థితి తెలుసుకోవడం ద్వారా దానికి ఆత్మతత్వం తెలుస్తుంది. మన మనసు బాహ్యముఖం వికారాలతో కనిపించినట్లే అంతర్ముఖం చూడగలిగితే దాని ఆత్మతత్వం తెలుస్తుంది.
✳️ మనసు దివ్యత్వం తెలియడానికి దాన్ని ఒకే తలపుపై ఉంచడాన్ని సాధన చేయాలి. అందుకే మన పెద్దలు మంత్రజపాన్ని నిర్దేశించారు. దానికి తరుణోపాయంగా శ్రీ భగవాన్ ఆత్మవిచారణ మార్గాన్ని సూచించారు. మంత్రం జపిస్తూనే ఆ జపించేది ఎవరన్న అన్వేషణ ద్వారా మంత్రస్వరూపం త్వరగా సిద్ధిస్తుంది. మనసుకు ఏదో ఒక తలపు తప్పదు.
[4/24, 07:00] +91 73963 92086: కనుక మనసులోని తలపులను పరిశీలించడమే ముఖ్య తలపుగా మార్చుకుంటే ఆత్మవిచారణ సులభం అవుతుంది. మనసును ఒకే తలంపుపై నిలిపిఉంచే సమయంలో పూర్తి ఎరుకతో ఉండాలి. లేదంటే నిద్రాస్థితికి చేరుకుని అదే ఆనందస్థితిగా, ధ్యానంగా భ్రమించే ప్రమాదం ఉందని శ్రీభగవాన్ హెచ్చరిస్తున్నారు.
✳️ తన స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు యోగవిధానంలో ప్రాణాయామాన్ని సాధనగా చెప్తారు. ప్రాణాయామంలో శ్వాసను గమనించి నియంత్రించడం ద్వారా దాని మూలంలో ఉన్న ప్రాణ స్వరూపాన్ని తెలుసు కోవడం లక్ష్యం. ఎంతో కష్టసాధ్యమైన యోగమార్గం అందరికి అనుకూలించదు. మనలో శ్వాస మూలమే మనసు మూలంగా ఉంది. అదే మనలోని ఆత్మస్థానం. మనసును గమనించడం ద్వారా మనోమూలాన్ని తెలుసుకోగలుగుతాం.
✳️ మనం ముక్కుతో గాలిని పీలుస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ముక్కుద్వారా గాలి లోనికి వెళ్లటానికి, తిరిగి బయటికి రావడానికి మనలో నిజంగా శ్వాసించే స్థానం ఒకటి ఉంది. అది మన హృదయంలో ఉంది. అక్కడి నుండే గాలిలోని ప్రాణశక్తి శరీరమంతా వ్యాపిస్తుంది. అక్కడే మన మనసు కూడా రూపాన్ని పొందుతుంది. అంటే నేను అనే భావన పుట్టేస్థానం అది. నేను దేహాన్ని అన్న భావనే మనసుకు తొలి ఆహంభావన. ఆ హృదయస్థానం తెలిస్తే ఆత్మగా ఉన్న మనసును, మనసుగా మారే ఆత్మను తెలుసుకోగలుగుతాం. అప్పుడుగానీ, మనం ఏవిధంగా ఆత్మ స్వరూపులమో తెలుస్తుంది.
✳️ ఆత్మదర్శనం అన్నా. దైవదర్శనం అన్నా అనుభవమే తప్ప రూపదర్శనం కాదు. అది ఇంద్రియాలకు అతీతమైన అనుభవం. మనసు మనసుగా పొందే అనుభవం. మనలోని చైతన్యం సంకల్పిస్తేనే మనం ముక్కుద్వారా గాలిని పీల్చుకోగలుగుతున్నాం. మన హృదయంలో నుండి ఆ గాలిని పీల్చే చైతన్యాన్ని తెలుసుకునే మార్గం ప్రాణాయామం. అలాగే మనసుగా మారుతున్న చైతన్యాన్ని తెలుసుకునేందుకే ఆత్మవిచారణ. వెలుగుతున్న కొవ్వొత్తిపై గిన్నె బోర్లిస్తే దీపం ఆరిపోతుంది. కానీ కొవ్వొత్తి అలానే ఉంటుంది. అంటే అప్పటి వరకూ శ్వాసించింది వెలిగే దీపమేగానీ కొవ్వొత్తికాదన్నమాట. అలాగే మనలో శ్వాసించేది ప్రాణంగా నిలిచిన ఆత్మచైతన్యమే. అదే ఈ దేహాన్ని నిలిపి ఉంచుతుంది. ప్రయాణాన్ని సాగిస్తే గమ్యాన్ని చేరుకుంటాం. కేవలం గమ్యం ఇదని తెలుసుకున్నంతమాత్రాన ప్రయోజనం ఉండదు. గమ్యాన్ని గురించిన అవగాహన అనుభవంగా మారాలంటే సరైన ప్రయత్నంతో సాగే సాధన అవసరం.
✳️ మన జీవనాన్నే మనం ఆలోచన అనుకుంటున్నాం. మన జీవనం అంటే కావాలనుకోవడం లేదా వద్దనుకోవడంగా ఉంది. మనలో తలంపు విధి(తలరాత,), మన పురుషాకారం (అహంకారం) తప్పవు. తలంపు నుండి తప్పించుకుంటేనే ఆలోచన నుండి తప్పించుకోగలుగుతాం. మనలో ఆలోచించేవాడు, ఆలోచన ఒకటిగానే ఉన్నాయి. అందుకే ఆలోచించేవాడు లేకపోతే ఆలోచనలేదు. ఆలోచనలేకపోతే ఆలోచించేవాడు లేడు. తలపోసేవాడు ఉంటేనేకదా తలపులకు ఆస్కారం. మనసు అనుక్షణం ఆలోచన రూపం పొందుతుంది. మనసుగా అందరం ఒక్కటిగానే ఉన్నాం. కానీ ఆలోచనగా మాత్రం ఎవరికీ వారుగా ఉన్నాం. మనసులో స్థిరరూపం పొందే ఆలోచనలే జ్ఞాపకాలుగా మారుతున్నాయి. మనకి జ్ఞాపకాలుగా మారేనన్ని లౌకిక విషయాలే. సత్యవస్తువుకు ఏ ఆలోచనతోనూ, జ్ఞాపకంతోనూ పనిలేదు. అది మనలో కలిగే ఆకలిలాగా సహజంగా వ్యక్తమయే అనుభవం, ఆ పరిపకృత, పరిశుభ్రత రావడమే మనం సాధించాల్సింది.
✳️ మనకు కలలోనూ, ధ్యానంలోనూ కనిపించే రూపాలన్నీ మన మనసు పొందేరూపాలే. కానీ మనలోని వేరుభావన చేత ఆ సత్యాన్ని విశ్వసించలేకపోతున్నాం. మనం చూసేదంతా ఆత్మవస్తువేనన్న సత్యభావనవల్ల ఈ భేదభావన పోతుంది. భాహ్య విషయాలవైపు పోయే మనసుకే అంతర్ముఖత్వం అవసరం అవుతుంది. సదా నేను ఆత్మ స్వరూపాన్ని అన్న స్థిరభావనతో ఉంటే ప్రత్యేకించి అంతర్ముఖత్వంతో పనిలేదు. మనం జీవించి నంతకాలం మనసులేని స్థితి అనేది సాధ్యంకాదు. మనసు అంతర్ముఖంగా ఆత్మానందాన్ని పొందడం గానీ, బహిర్ముఖంగా విషయ వ్యాపారం చేయడం గానీ చేస్తూ ఉంటుంది. శ్రీ రమణ భగవాన్ చెప్పిన మనసులేని స్థితి అంటే భౌతిక విషయాలపై మనసులేని స్థితి అని అర్థం. అంతర్ముఖం, బాహ్యముఖం కాని మనసు నిద్రావస్థలో ఉందని అర్థం. ఎరుక (మెళకువ) లేకపోవడాన్నే నిద్ర అంటారు. మన మనసు ప్రస్తుతం దేహభావనలో ఉంది. కనుక తాను ఆత్మ స్వరూపమేనని అనుభవం పొందేవరకూ ఆత్మను జ్ఞప్తి తెచ్చుకోవడం అవసరమే.
✳️ మనం మన ప్రవృత్తులను వదలకుండా ఏ క్షేత్రాలు తిరిగినా ప్రయోజన శూన్యంగా ఉంటుంది. సినిమాపిచ్చి తిరుపతి వెళ్ళినా వదలదు. ఆ తప్పు మన బలహీనత వల్ల జరిగిందికానీ తిరుపతి క్షేత్రం వల్లకాదు. మన వంకలన్నీ “ఆడలేక మద్దెల ఓడు”అన్నట్లుగా ఉంటాయి. సాధన కోసం దైవంపై ఇష్టం పెంచుకోవడానికి బదులు వంకలు వెతుకుతూ ఉంటాం. మనసు బాగుచేసుకుందామని క్షేత్రానికి వెళ్తాం. ఆ క్షేత్రాన్ని విమర్శించి మనసును మరింత పాడుచేసుకుని తిరిగి వస్తాం. వికారాలకు అతీతమైనది మనసు. కానీ మన పరిసరాలకు, పరిస్థితులకు అది లొంగిపోతుంది. ఆ మనసుకు తిరిగి తన స్థిరత్వం రావాలంటే అనవసర అరాటాలు తగ్గాలి. మనం ఆత్మవిచారణతో ముందుకు సాగాలి.
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment