Thursday, April 20, 2023

భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?...4

 భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా?...4

రామకృష్ణ పరమహంస వారు చెప్పిన ఓ చక్కటి కథ గుర్తుకొస్తుంది.

నిరంతరం అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే  ఓ సాలెవాడు, ఒకరోజు రాత్రి నిద్రపట్టక ఆరుబయట కూర్చొని భగవత్ నామజపం చేస్తున్నాడు. అదే సమయంలో ఆ దారిలో వచ్చిన దొంగలు, మూటలు మోయలేక ఈ సాలెవాన్ని తమతో పాటు నడవమని, ఆ మూటలు ఆయనపై వేసి తీసుకెళ్తుండగా, రక్షకభటులు రావడంతో ఆమూటలను, సాలెవాన్ని వదిలి దొంగలు పారిపోయారు. ఈ సాలెవాన్ని రక్షకభటులు న్యాయాదికారి ఎదుట హాజరు పర్చగా, ఎప్పుడూ అంతా రామేచ్ఛ అన్న భావనలో ఉండే సాలెవాడు 'రామేచ్ఛ వలన అంతవరకు మగ్గం నేస్తున్న నేను అలసి పడుకుందామనుకుంటే, నిద్ర పట్టక నామజపం చేసుకుంటూ ఆరుబయట కూర్చున్నాను. రామేచ్ఛ వలన అటుగా వచ్చిన దొంగలు, వారు మోస్తున్న మూటలు నాపై వేసి వాళ్ళతో పాటు నడవమన్నారు. రామేచ్ఛ వలన కొంతసేపటికి ఈ రక్షకభటులు వచ్చి నన్ను పట్టుకున్నారు. రామేచ్ఛ వలన ఇప్పుడు మీ ముందు నన్ను హాజరుపర్చారు' అని చెప్పగా, ఇతను సజ్జనుడు విడిచిపెట్టండి అని న్యాయాధికారి ఆదేశించెను. ఈ కథలో మాదిరిగా ప్రతీది ఆధ్యాత్మిక కోణంలో స్వీకరించాలి. ఎదురయ్యే కష్టసుఖాలను కూడా భగవత్ ప్రసాదంగా / దేవేచ్ఛగా భావించడం కూడా భగవత్ ఉనికిని అనుభవం లోనికి తెచ్చుకోవడమే. నేరుగా పట్టుకొలేకపోయినా, ఇలా భగవత్ ఉనికిని గుర్తించడం వలన కొంత పట్టుకున్నట్లే.
                       


అలా ప్రతీ పనిలోనూ భగవంతుని ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకోవడమే సరైన ఆద్యాత్మికత. ఇలా అనుభవంలోనికి తెచ్చుకోవడం అంత సులువు కాదు, అందుకు ఎంతో అభ్యాసం, పూర్తి విశ్వాసం, సర్వమూ భగవన్మయంగా చూడగలిగే చిత్తశుద్ధి ఉండాలి. 
                     


ఇక ఆధ్యాత్మికత అంటే ఏమిటో గత కొన్ని టపాలలో తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాను.
ఆధ్యాత్మికత అంటే -
"ఆది నుండి ఉన్న ఆత్మ కథ".
"నిత్యమూ ఆత్మను అధ్యాయనం చేయడం".
"శరీరం, ప్రాణం, మనస్సే కాకుండా ఆత్మ అనే సద్వస్తువు ఉంది అనే జ్ఞానపు ఎఱుక".
"నేను అంటే ఏదో నాకు తెలిపే యోగం".
"ఎఱుక కోల్పోకుండా దైవ స్ఫురణలో ఉండడం"
"బహిర్ముఖమైన మనస్సును అంతర్ముఖం చేయడం".....

ప్రాపంచిక జీవితం, పారమార్థిక జీవితం అని రెండు జీవితాలు లేవు. ఉన్నది ఒకటే జీవితం. ఆధ్యాత్మికత వ్యవహార జీవితానికి అతీతం కాదు. అందులో పార్శమే.
భౌతిక ప్రపంచం పెద్ద మాయాజాలం... మనం బలహీనులం... ఊహూ.....ఈ భావమూ సరికాదు.
                   


భౌతిక ప్రపంచంలో ధర్మపరమైన అనుబంధం వుండాలి. అంతరంగంలో ఆత్మ స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడనే స్పృహ వుండాలి. . అసలు భౌతిక ప్రపంచం మాయకాదు. అంతర ప్రపంచం యొక్క కొనసాగింపే భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచమే అంతర ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి దారి చూపిస్తుంది. మాయ అనేది మనం ఏర్పరుచుకున్న అజ్ఞానం. మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ, ఇదే సత్యమనుకొని ఏర్పరుచుకున్న అభిప్రాయాలు భావాలు నమ్మకాలు వదిలితే, మాయ వీడుతుంది. 
దేనిని మనం మాయ అంటున్నామో, అది సాక్షాత్ బ్రహ్మమే అని తెలుసుకునేంతవరకు ఆధ్యాత్మిక సాధన పరిసమాప్తం కాదు. 
అలానే, మనం బలహీనులం కావొచ్చు. కానీ, మనం ఎవరి శరణు పొందామో, ఆయన సర్వశక్తి సంపన్నుడని మరిచిపోకూడదు. భగవంతుడు అండగా ఉన్నాడన్న విశ్వాసం మనకున్నప్పుడు బలహీనులమనే భావనకు తావులేదు.

పువ్వులో మకరందం ఉంటే భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది అలాగే మనలో భక్తి మాధుర్యం ఉంటే భగవంతుడు తనకు తాను పట్టుబడతారు,🙏

సేకరణ రాధ 🙏

No comments:

Post a Comment