Sunday, April 23, 2023

నేనెవరు రమణ మహర్షి

 నేనెవరు రమణ మహర్షి

‘నేను’ కన్నా భిన్నంగా ఏదీ లేనప్పుడు, అంతా ‘నేనే’ అయినప్పుడు జీవితంలోని ద్వంద్వాలు అన్నీ అంతరించిపోతాయి. చావు పుట్టుకల అర్థం, సృష్టి- స్థితి- లయాలకు ఉన్న పరమార్థం అవగతం అవుతుంది.

ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ, జీవశక్తికీ, దేహానికీ కూడా అది అతీతమైనది. అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది. ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి. సన్నిహితం కావాలి. సంయోగం కావాలి. మనలో ఉన్న ఆకాంక్షా జ్వాల అందుకోసమే! అదే ఆధ్యాత్మికం అంటే! 

నేను ఎవరిని? ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచంలోని చావు పుట్టుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టుకకు ముందు నేను ఉన్నానా? మరణం తరువాత నేను ఉంటానా? ఉంటే ఎలా ఉంటాను? ఈ చావు పుట్టుకల వలయంలోకి నేను రావడం ఎందుకు జరిగింది? ఇన్ని బాధలు పడడం ఎందుకు? ఈ జగత్తులోకి నేను రావడానికి కారణం ఏమిటి? ఏది సాధించాలని వచ్చాను? ఏం చేస్తున్నాను? చేయాల్సిందే చేస్తున్నానా? లేక తప్పటడుగులు వేస్తున్నానా? ఈ రహస్యం తెలిసేదెలా?

ఈ ప్రశ్నలు ఈనాటివి కావు. అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్నవే! వీటన్నిటికీ సమాధానాలు మన మహర్షులు ఏనాడో కనుగొన్నారు. ‘‘అన్నిటికీ మూలం ‘నేను ఎవరిని?’ అనే ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకుంటే మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు వాటంతట అవే దొరుకుతాయి’’ అంటారు భగవాన్‌ శ్రీరమణ మహర్షి. అందుకే ‘‘నేనెవరిని అనేది ముందు తెలుసుకో!’’ అని చెప్పారు ఆ మహానుభావుడు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ ‘అహం బ్రహ్మాస్మి’ అని ఒకే ఒక వాక్యంలో ‘బృహదారణ్యకోపనిషత్తు’ సమాధానం చెప్పింది. ‘అహం’ అంటే ‘నేను’. ‘బ్రహ్మ’ అంటే సర్వానికీ మూలం అయిన పరతత్త్వం. ‘అస్మి’ అంటే ‘అయి ఉన్నాను’ అని అర్థం. మనలో రెండు ‘నేను’లు ఉన్నాయి. ఒకటి అజ్ఞానంలో ఉన్న ‘నేను’. ఈ ‘నేను’కు అసలైన ‘నేను’ ఎవరో తెలీదు. మరొకటి అన్ని ‘నేను’లూ నేనైన ‘నేను’! వీటిలో మొదటిది రెండవ దాన్ని తెలుసుకొని, దానిలో ఏకమైనప్పుడు- మొదటిది తన ఉనికిని కోల్పోతుంది. అసలైన ‘నేను’ మిగులుతుంది. అదే ‘బ్రహ్మ’. ‘ఓం తద్బ్రహ్మ’ అంటుంది మంత్రపుష్పం.

ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్న ‘నేను’ ఈ దేహానికే పరిమితమై, తన ఉనికిని అంతటితోనే సరిపెట్టుకుంటోంది. ‘నేను వేరు- మిగిలినవారందరూ, ఈ ప్రపంచమంతా నాకన్నా భిన్నమైనది’ అనుకుంటోంది. ఈ ‘నేను’ ఎక్కడ ఉందో అక్కడ ‘నాది’ అనేది కాచుకొనే ఉంటుంది. ఈ ‘నేను - నాది’ అనేవే అహంకార - మమకారాలు. ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడ సుఖ దుఃఖాలు, వెలుగు చీకట్లూ, ఈర్ష్య అసూయలు, పగ ప్రతీకారాలు, అభిమాన దురభిమానాలు, జయాపజయాలు... ఇలా ద్వంద్వాలన్నీ ఉంటాయి. వీటన్నిటినీ జయించేందుకే ఆధ్యాత్మిక సాధన - అంటే ఈ ‘నేను’ను ఆ ‘నేను’తో కలిపే సాధన అవసరం అవుతుంది.

అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? దాన్ని గురించి శ్రీఅరవిందులు ఇలా చెప్పారు: ‘‘ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ, జీవశక్తికీ, దేహానికీ కూడా అది అతీతమైనది. అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది. దానికి ఆధారంగా కూడా ఉంది. ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి. సన్నిహితం కావాలి. సంయోగం కావాలి. మనలో ఉన్న ఆకాంక్షా జ్వాల అందుకోసమే! అదే ఆధ్యాత్మికం అంటే! ఈ ‘నేను’ ఆ ‘నేను’ను చేరుకోవడానికి చేసే ప్రయాణమే యోగసాధన అంటే.! ఇంతవరకూ మానవుడు చేస్తున్న ఆలోచనలు అప్పుడు ఆ ‘నేను’ను కలుసుకోవడంతో ఆగిపోతాయి. ‘అహం బ్రహ్మాస్మి - నేనే బ్రహ్మను’ అని తెలుసుకోవడమే ఈ జీవితానికి సార్థకత! అదే మోక్షం!!’’ కానీ శ్రీ అరవిందుల యోగం అంతటితో సరిపెట్టుకోదు. వాస్తవానికి వారి యోగసాధన అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ‘‘దైవాన్ని తెలుసుకోవాలి. దైవంతో ఏకం కావాలి. దైవాన్ని అభివ్యక్తం చేయాలి’’ అంటారు శ్రీఅరవిందులు. 

మనం ఆ స్థితిని సాధించినప్పుడు... మనం సాధించినది మనతోనే ఆగిపోదు. ‘నేను’ అంతటా, అన్నిటా అభివ్యక్తం అవుతుంది. అనుభూతం అవుతుంది. ప్రకటితం అవుతుంది. తన వెలుగును ప్రసరిస్తుంది. అంతా తానే అయినప్పుడు ఇక తనకు వెలితి ఏముంటుంది? తనకు లేనిది కానీ, కావలసింది కానీ ఏదీ ఉండదు. అంతా నిండుగా ఉంటుంది. తన కన్నా భిన్నంగా ఏదీ లేనప్పుడు, అంతా తానే అయినప్పుడు ఈ అవినీతి, దోపిడి, నేను- నాది, గెలుపు - ఓటమి, తన - పర, అధికార లాలస, స్వార్థం, అహంకారం, ఈర్ష్య - ద్వేషం, పగ - ప్రతీకారం, ఆశ - నిరాశ వంటి ద్వంద్వాలు, మత ఛాందసాలు, ప్రాంతీయ దురభిమానాలు, భాషా వైషమ్యాలు, ఉగ్రవాదాలు, పనికిమాలిన ఇజాలు... అన్నీ అంతరించిపోతాయి. చావు పుట్టుకల అర్థం - సృష్టి - స్థితి, లయాలకు ఉన్న పరమార్థం అవగతం అవుతుంది. మనలో ఈ అవగాహనను పెంపొందించుకోవడానికి ఇకనైనా ప్రయత్నించమని చెబుతోంది...

ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే....

అరుదైన మానవదేహమనే రథం సహాయంతో ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందవచ్చో కఠోపనిషత్తు వివరిస్తుంది.

౧. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు!
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ!! (కఠోపనిషత్తు)

శరీరం – రథం; ఇంద్రియాలు – గుర్రాలు; ఇంద్రియ విషయాలు – మార్గం; మనసు – కళ్ళెం; బుద్ధి – సారథి; ఆత్మ – రథికుడు.

శరీరం అనే రథానికి ఇంద్రియాలే గుర్రాలు. గమ్యస్థానానికి చేర్చేందుకు రథానికి గుర్రాలు ఎంత ముఖ్యమో మన గమ్య స్థానమైన మోక్షస్థానానికి చేర్చడానికి ఇంద్రియాలూ అంతే ముఖ్యం. గుర్రాలకు చంచలత్వం ఎంత సహజమో ఇంద్రియాలకు కూడా చంచలత్వం అంతే సహజం. అదుపులో లేని గుర్రాలు రథికుణ్ణి గమ్యానికి సురక్షితంగా చేర్చలేవు. అధీనంలో లేని ఇంద్రియాలు కూడా మనిషిని పరమపదానికి చేర్చలేవు. 

కాబట్టి సారథి కళ్ళాన్ని పట్టుకొని నేర్పుతో గుర్రాలను సవ్యమైన మార్గంలో నడిపించినప్పుడే క్షేమంగా గమ్యానికి చేరగలుగుతాం.

 అలాగే చంచలమైన ఇంద్రియాలను మనసు అనే కళ్ళెంతో అదుపుచేస్తూ బుద్ధి అనే సారధి, రథం అనే శరీరాన్ని నడిపించినప్పుడే మోక్షపదాన్ని చేరుకోవడం సాధ్యమని కఠోపనిషత్తు వివరిస్తుంది.

రథం దృఢంగా ఉండవచ్చు. సారథి నైపుణ్యవంతుడు కావచ్చు, మార్గం సుగమంగా ఉండవచ్చుకానీ గుర్రాలు అదుపులో లేకపోతే గమ్యాన్ని చేరుకోలేం. మన జీవన యాత్రలో ఇంద్రియాలనే గుర్రాలు అధీనంలో లేకపోతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అసాధ్యం. కాబట్టి బహిర్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖం కావించి ప్రయాణం కొనసాగించాలి...

భగవాన్! నేను సంసారాన్ని వొదిలేద్దామనుకుంటున్నాను! 

ఒకసారి మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు, నడివయస్సు వారు, భగవాన్ ని సమీపించి 'స్వామీ! నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంటా, సాయంత్రం ఒక గంటా జపిస్తూ వుంటే, కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి, అంత కంతకు అధికమై, ఎప్పటికో మనం చేసే జపం మరచి పోయామే అని తోస్తుంది. ఏం చేసేది? ఈ అంతరాలు రావడానికి కారణం సంసారం గదా. 
అందువల్ల సంసారం వదలివేద్దామా, అని యోచిస్తున్నానన్నాడు. 

 'ఓహో! అట్లాగా! అసలు సంసారమంటే యేమి? అది లోపల వున్నదా? బయట వున్నదా?' అన్నారు భగవాన్. 

'భార్య పిల్లలూనూ ఇత్యాదులండీ ' అన్నాడాయన. 

 'అదేనా సంసారం? వారేం చేశారు? అసలు సంసారమంటే ఏదో తెలుసుకోండి ముందు. ఆ వెనక విడవటం యోచిద్దాం'. అన్నారు భగవాన్. ఆయన నిరుత్తరుడై తలవంచి వూరుకున్నాడు. 

భగవాన్ కరుణాదృష్టితో చూస్తూ 'భార్యా పిల్లలను  వదలి వచ్చి  ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారమవుతుంది. సన్యసిస్తే కఱ్ఱ, కమండలం  ఇత్యాదులతో అదొకరకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకదీ? సంసారమంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ వున్నా ఒకటే, ఏదీ బాధించదు ' అన్నారు భగవాన్...

సద్వస్తువు బయట దొరకదు

ధనంతోటి  భోగాలు  కొనుక్కోవచ్చు.  అలాగే  పుణ్యకర్మల  ఫలితం  సుఖరూపంలో  వస్తుంది.  పాపఖర్మల  ఫలితం  దుఃఖరూపంలో  ఖర్చయిపోతుంది.  ఒక  చైతన్యం  తప్పించి,  కాలప్రవాహంలో  అన్ని  భోగాలు,  సుఖాలు  కొట్టుకుపోతాయి.

Nothing  is  too  heavy  for  dsstiny.

మోక్షం  శాస్త్రంలో  లేదు.  శాస్త్రం  ఆత్మను  సూచిస్తుంది  తప్ప  ఆత్మజ్ఞానం  ఇవ్వదు  కదా!  శాస్త్రం  ఆ సద్వస్తువు  హృదయంలో  ఉందని  చెబుతుంది.  ఆ సద్వస్తువు  ఉన్నచోట  అన్వేషణ  చెయ్యాలి.  అందుకే  ఏసుక్రీస్తు  "తట్టండి  తెరువ - బడుతుంది.  అడగండి  ఇవ్వబడుతుంది"  అన్నాడు.

భక్తులలో  మోక్షకాంక్ష  ఉన్నవారు  వెయ్యిమందిలో  ఒక్కరు  కూడా  ఉండటంలేదు.  వారికి  మోక్షం  విలువ  తెలియదు  కదా,  పాపం  వాళ్ళు  మాత్రం  ఏం చేస్తారు?  డబ్బు  విలువ  తెలుస్తోంది,  చదువు  విలువ  తెలుస్తోంది,  అధికారం  విలువ  తెలుస్తోంది.  అందుకని  వాటి  గురించే  ఆ భగవంతుడిని  అడుగుతారు.  భగవంతుడు  మనం  అడిగింది  ఇస్తాడు.  మనం  లౌకికమైనవి  అడుగుతూ  ఉంటే  మోక్షం  ఇవ్వడు...

సర్వమూ శివమయంగా ఎలా తెలుసుకోవాలి !?

ప్రకృతి ప్రభావం చేత ఏర్పడే గుణాలు లేకుండా చూడగలిగిన రోజు మనకు సర్వమూ శివమయంగా తెలుస్తుంది. 

మామిడుపండు చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచి తెలియని పిల్లవాడికి ఆ పండు ఒక బొమ్మతో సమానం. 

ఆ మాధుర్యాన్ని చవిచూసిన తర్వాత మనలో ఆ రుచికోసం తపన మొదలవుతుంది.

 ఇలా మొదలైన తపనే మనలో ఏర్పడే గుణం. 

ఇప్పుడు గుణం మామిడిపండులో ఉందా ? లేక మనసులో ఉందా ? అంటే ఆ రెండింటి సంబంధంలో ఉంది.

 మామిడిపండులో రుచి ఉన్నది కనుక మనలో కోరిక కలిగింది. 

ఈ ప్రకృతి అంతా చైతన్యంతో నిండి ఉంది. మామిడిపండులో మనలోనూ చైతన్యం ఉంది.

 కానీ ఇప్పుడు ఏర్పడిన ఈ రుచి అనే గుణం ఈ ఆ రెండింటినీ చైతన్యంగా కాక ప్రాపంచిక వస్తువులుగా భాసించేలా చేస్తుంది. 

ఒక్క మామిడిపండునే కాదు, మనం చేసే ప్రతిదాన్ని దాని గుణాలతో కలిపి చూస్తున్నాం. అందుకే అది మనను ప్రభావితం చేస్తుంది.

 ప్రకృతి ప్రభావం చేత ఏర్పడే గుణాలు లేకుండా చూడగలిగిన రోజు మనకు సర్వమూ శివమయంగా స్పష్టంగా అర్ధమవుతుంది !....

ఓం నమో భగవతే శ్రీ రమ ణాయ🙏🕉️
 .

No comments:

Post a Comment