Sunday, April 23, 2023

దైవాన్వేషణలోనే సత్యాన్వేషణ

 దైవాన్వేషణలోనే సత్యాన్వేషణ

హిందూధర్మం ఎంతో గొప్పది అందులో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి వీటన్నింటినీ సరిగా అధ్యాయం చేస్తే కనీసం వీటిని చెబుతున్నప్పుడు వింటే కలిగే మార్పు, తిరిగే జీవిత దిశ గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినదే. అలా ఉపనిషత్తులలో బృహదారణ్యకోపనిషత్తులో ప్రస్తావించిన శ్లోకం కూడా ఈ లోకంలో మనిషి స్థితిని చెప్పకనే చెబుతుంది. ఆదిశంకరాచార్యులు భాష్యం అందించిన ఈ శ్లోకం మరెంతో ప్రాచుర్యం పొందింది కూడా.

శ్లోకం:- అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతం గమయ

ఓం శాంతిః శాంతిః శాంతిః

భావం:- అసత్యం నుండి సత్యం వైపుకు నడిపించు, చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించు, మరణం నుండి అమృతత్వం వైపుకు నడిపించు అని అర్థం.
సత్యానికి అసత్యానికి మధ్య తేడా ఏమిటి, అసలు సత్యం అంటే ఏమిటి అంటే నిన్న ఉన్నది ఈరోజు ఉండదు,ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఇలా నిరంతరం మారుతూ ఉండేది సత్యం అసత్యం అని ఎట్లా నిర్ణయిస్తారు. మనిషి తన మనసులో నిరంతర సంఘర్షణలో నలుగుతూ తనకు ఎలా అనూకులమైన వైపుకు అలా తిరుగుతూ దాన్ని సత్యమనే చట్రంలో ఇరికిస్తున్నపుడు సత్యానికంటూ సరైన నిర్వచనం ఎట్లా ఇస్తారు, తను అనుకున్నదే సత్యమైతే ఈ సృష్టి ఏమి చెబుతోంది అందులో తెలుసుకోవలదినది ఏమిటి అనేది పెద్ద ప్రశ్న కదా!! అది ఎవరికీ అక్కర్లేదా, ఇలా మారుతూ పోతున్న అర్థాల వల్లనే కదా నేటి తరాల వరకూ మనుషులు స్వార్థపూరిత జీవితాల్లో కూరుకుపోయారు. కనీసం తమ జీవితం గురించి అయినా నిజమేమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు.

ఈ సృష్టిలో ఎప్పటికి మారకుండా నిలిచి ఉండేది సత్యం. అదేమిటి అన్ని ఎప్పుడో ఒకప్పుడు నశించేవిగా అనిపిస్తే, నశించనిది ఏది అనే ప్రశ్న వస్తే, ఆ ప్రశ్నకు సమాధానమే ఆ భగవంతుడు. ఆ భగవంతుడి వైపు నడుస్తూ ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ సృష్టిని కూడా తెలుసుకుంటూ సత్యాన్ని తెలుసుకోవచ్చు. అదే ఇందులో అర్థం.

చీకటి నుండి వెలుగులోకి నడిపించడం అంటే సూర్యుడొస్తే వెలుగు, రాత్రి అయితే చీకటి కాదు. ఇవన్నీ కాలనియమానికి మారుతూ జరిగే మార్పులు. ఇక్కడ చీకటి అంటే మనసులో ఉన్న అంధకారం. ఆ అంధకారం మూలానే జీవితంలో నిజమైన వెలుగు అంటే ఏమిటో చూడలేకపోతున్నాం. ఈ జీవితంలో నిజమైన వెలుగు చూడాలి అంటే ఒక్కసారిగా సాధ్యం కాదు, అదొక ప్రక్రియగా మొదలవ్వాలి. దాన్నే జ్ఞానం అనవచ్చు. జ్ఞానజ్యోతిని వెలిగించడమే ఈ జ్యోతిర్గమయ అంతరార్థం.

జననం, మరణం రెండూ నిజమైనవి. కచ్చితంగా జరిగేవి. దేనికి శాశ్వత స్థానం లేదు ఈ సృష్టిలో. కానీ మరణం నుండి శాశ్వతం వైపుకు నడిపించమని కోరుకోవడం అంటే ఈ దేహాన్ని ఇలాగే ఈ భూమి మీద ఎన్నేళ్లయినా ఉండేలా చేయమని అడగడం కాదు. శరీరానికి అంతం ఉంది కానీ ఆత్మకు లేదన్నది సత్యవచనం. అలాంటి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటే అసలు మరణం అనే భయం కానీ దాని తాలూకూ ఆలోచనలు కానీ మనిషిని వెంటాడవు. జ్ఞానంతో ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసుకున్నపుడు మనిషి అమృతత్వమైన భావానికి లోనవుతారు, భౌతికమైన వాటి పట్ల మోహాన్ని వదులుకుంటాడు. అప్పుడే మనిషి పరిపూర్ణుడు కూడా కాగలడు.

🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment