భగవంతుడు ఉన్నాడా?
ఉంటే కనబడతాడా?
ఎప్పుడు కనబడతాడు?
ఎవరికి కనబడతాడు?
ఏం చేస్తే కనబడతాడు?
ఈ ప్రశ్నల పరంపర మానవజాతి...
పుట్టిన నాటినుంచి కొనసాగుతూ వస్తోంది🤔
ఈ ప్రశ్నలకు సమాధానాలను వేదాలు
సుందరంగా చెప్పాయి. వేదమంత్రద్రష్టలైన మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు.
ప్రవక్తలు వేనోళ్ల ప్రవచించారు. అయినా
మానవుల్లో కరడుగట్టిన అజ్ఞానం...
ఆ విషయాలను మరచిపోయేట్లు చేస్తోంది*
ఏమీ తెలియని అసమర్థుల్లా మార్చివేస్తోంది😴
పాలతో కడిగితే బొగ్గు తెల్లబడుతుందా?
అలాగే ఎంత ప్రక్షాళన చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషికి జ్ఞానప్రబోధాలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం.*
భగవంతుణ్ని చూడటం అంటే
తన గురించి తాను తెలుసుకోవడమే. దీనికి
కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు ప్రవచించారు. ఉన్నత విద్యల్లో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యల్లో ముందుగా నిష్ణాతులు కావాలి*
అక్షరాలు రాని వారికి అంతరిక్ష విజ్ఞానాన్ని బోధపరచగలమా? అలాంటిదే బ్రహ్మవిద్య కూడా....
‘బ్రహ్మం’ అంటే భగవంతుడు కనుక,
బ్రహ్మవిద్య అంటే భగవంతుణ్ని తెలిపే విద్య.
ఈ విద్యను తెలుసుకోవడానికి నాలుగు దారులున్నాయని పెద్దలు చెప్పారు. అంటే,
ఒక ఇంటి చిరునామాను కనుక్కోవడానికి ముందు
ఆ ఇంటికి చేరే దారులను కనుక్కోవడం అన్నమాట.
మొదటిదారిలో వెళ్లడం అంటే-
భగవంతుడు ఒక్కడే నిత్యుడు,
శాశ్వతంగా ఉండేవాడు అని తెలుసుకోవడం* అంతేకాదు. భగవంతుడికి భిన్నమైనదంతా అనిత్యం,
అంటే అశాశ్వతం అనీ గ్రహించడం. నిత్యం అంటే ఎంతకాలం గడచినా చెక్కు చెదరకుండా ఉండటమే. భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోకి జారుకొని అంతరిస్తుంది. కనుక సృష్టి అంతా అనిత్యమే. ఏది పుడుతుందో అది నశిస్తుంది. ఏది పుట్టదో అది నశించదు. అందుకే జీవకోటి నశిస్తుంది. భగవంతుడు నిత్యమై ఉంటాడు.
రెండోదారిలో వెళ్లడం అంటే,
మనిషి అనుభవిస్తున్న భౌతికసుఖాలకు
సంబంధించిన సామగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవడం.
యజ్ఞయాగాలు, తపస్సులు, దానాలు చేసి సంపాదించుకొన్న పుణ్యంతో స్వర్గానికి వెళ్లి
పారలౌకిక సుఖాలను పొందినా- అవీ ఒకనాటికి నశించిపోయేవే అని తెలుసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే- ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవి
అనే జ్ఞానం కలగడం.
మూడోదారిలో వెళ్లడం అంటే-
ఆకలి వేసినప్పుడు అన్నం కోసం,
దాహం వేసినప్పుడు నీళ్ల కోసం ఎలా మనసు పరుగులు తీస్తుందో, అలాగే పరమార్థజ్ఞానాన్ని సంపాదించడం కోసం సద్బోధనలు వినడం, విన్నవాటిని మళ్లీమళ్లీ గుర్తు చేసుకోవడం,
అలాంటి విషయాలపై మనసును నిలపడం.
పనికిరాని దృశ్యాలను చూడకుండా కళ్లను,
వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను,
అసభ్య సంభాషణలు పలుకకుండా నోటినీ నియంత్రించుకోవడం.
చలికీ గాలికీ ఎండకూ తట్టుకోగలగడం,
దూషణ భూషణలకు ఏ మాత్రం చలించకుండా స్థిరంగా నిలవడం. వికారాలన్నీ శరీర ధర్మాలేగానీ
ఆత్మకు వాటితో సంబంధంలేదని తెలుసుకోవడం. గురువులనూ, పూజ్యులనూ సేవించి,
వారినుంచి జ్ఞానాన్ని పొందడం.*
నాలుగో దారిలో ప్రయాణించడం అంటే-
అజ్ఞానం వలన కలిగే సాంసారిక బాధలను
జ్ఞానసాధన ద్వారా అధిగమించడం. అంటే
మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలనీ, అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయేగానీ, స్థిరంగా ఉండవనీ చక్కగా గ్రహించగలగడం. ఈ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మనసు చలించకుండాఉంటుంది. అప్పుడు అన్నింటికీ అతీతమైన స్థితి లభిస్తుంది. అన్ని బంధాల నుంచి మనిషి విముక్తుడవుతాడు. అదే భగవంతుని సాక్షాత్కారం. అలాంటి అనుభూతిని పొందినవాడు సామాన్యజీవుడైనా దేవుడే అవుతాడు.
No comments:
Post a Comment