Thursday, April 27, 2023

శ్రీ ఆదిశంకరాచార్య జయంతి / శ్రీ రామానుజాచార్య జయంతి...

 🎻🌹🙏నేడు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి / శ్రీ రామానుజాచార్య జయంతి...

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌸*అద్వైతం - విశిష్టాద్వైతం / జగత్ గురువులు జగతికి వెలుగులు*🌸

🌷*శ్రీ శంకరాచార్యులు - అద్వైతం* - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.🌷

🌷శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం*🌷

 🌸- సర్వ భౌతిక ప్రపంచంతో బ్రహ్మం అంతర్లీనమై అంతా ఒక్కటే.🌸

     
 జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.


వేదాంతులందరూ జరిపే తత్వవిచారం జీవాత్మ, పరమాత్మల అంతర్లీనత ప్రాతిపదికన జరుగుతుంది. అవి వేరుకాదన్న ఏకాభిప్రాయమే వారందరిలో కనపడుతుంది. ప్రామాణికాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత- అద్వైతం చెప్పేదంతా పొందుపరచి బ్రహ్మజిజ్ఞాసులకు అందుబాటులో ఉంచాయి. వేదాంతులైన మహాగురువులు ఆదిశంకరుడు, రామానుజుడు ఇద్దరూ జీవాత్మపరమాత్మల సంలీనమే అద్వైతానికి మూల సూత్రంగా అంగీకరిస్తారు. ఆ రెండింటి స్వరూపం మీద, ఆ సంయోగం జరిగేది ఎలాగో, అందుకు వారిచ్చే వివరణలు మాత్రం భిన్నమైనవిగా ఉన్నట్లు అనిపిస్తాయి.


జీవాత్మ పరమాత్మలు వేరుకాదని చెప్పే తిరుగులేని అద్వైతం శంకరుడిది. ‘లోకమాయ’, ‘కర్మసిద్ధాంతం’ కేంద్ర బిందువులుగా ఆయన అద్వైత వాదనలుంటాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న నిజాన్ని మాయా ప్రభావంతో మనిషి గుర్తించలేడంటారు శంకరులు. చీకటిలో చూసిన తాడును పాము అనుకుని, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లే- లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపింపజేసే ‘సర్పరజ్జుభ్రాంతి’లాంటి అటువంటి మాయను అధిగమించలేనంత కాలం ‘అవిద్య’తో ఉండిపోతాడని చెబుతారు. జీవితకాలమంతా అతణ్ని వెంటాడుతూ వేధించే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూలరూపమంటారు. ఆత్మశక్తికి తప్ప అవి లొంగుబాటులోకి రావని తెలుసుకొమ్మంటారు. కార్యం లేకుండా ఫలితం ఉండదని, ఫలితం ఉండబట్టే అందుకొక కారణం ఉండితీరాలని ఆయన విశ్వసిస్తారు. వర్తమానంలో మనిషికి ఎదురయ్యే పర్యవసానాలన్నీ కార్యకారణాలతో ముడివడిఉన్నవేనని చెప్పే కర్మసిద్ధాంతం, ఆయన అద్వైతవాదనలన్నింటిలో కీలకమై కనిపిస్తుంది.


శంకరులు- నిద్రాణమై తనలోనే ఉన్న ఆత్మను జ్ఞానభక్తి సాధనలతో జాగృతం చేయమంటారు. అప్పుడే అది బ్రహ్మంతో పునరేకీకరణ పొందగలదంటారు. జ్ఞానానికి, భక్తికి సమగ్రమైన వివరణలుండే సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి వంటి రచనలు శంకరులవే. అహంకారభావనలు తొలగిపోవటమే జ్ఞానమని చెప్పే సారాంశమే ఆ రచనలన్నీ ప్రస్ఫుటిస్తాయి.


రామానుజులు వైదిక పరమైన దైవత్వాన్ని గురించి చెప్పే అద్వైతాన్ని ఆమోదిస్తారు. వేదోక్తమైన ఆస్తికత్వాన్ని సమర్థించేదాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు. దేహం, ఆత్మ రెండూ దైవ స్వరూపాలే అంటారాయన. శంకరులు చేసినట్లు- సగుణ నిర్గుణ బ్రహ్మలుగా, బ్రహ్మాన్ని వేరుచేసేందుకు అంగీకరించరు. అద్వైతానికి మౌలిక సూత్రమైన జీవాత్మపరమాత్మల సంవిలీనాన్ని మాత్రం వ్యతిరేకించరు. జీవుడు, పరమాత్ముడు ఒకరేనన్న ప్రగాఢ విశ్వాసంతో జీవుణ్ని పరమాత్ముడిని వెదకమంటారు. కర్మరాహిత్యం అయినప్పుడే జీవుడికి ‘శుద్ద సత్వస్వరూపం’ లభిస్తుందని, ‘బ్రహ్మశరీరం’ అంటే అదేనని, ఆ శరీరంతోనే అతడు అంతర్యామిలో విలీనం కాగలడన్నారు. ‘వైకుంఠపాప్త్రి’ అదేనంటారు.


సామాజిక స్పృహ కనపడని ఆధ్యాత్మికతను విశిష్టాద్వైతం ప్రోత్సహించదు. రామానుజులు-మనుషుల మధ్య సంచారం చేస్తూ, కులం మూఢనమ్మకాలకు అతీతంగా వారిని కొనసాగమంటూ ఉద్బోధించారు. దేవాలయాల్లో ప్రవేశానికి అందరూ అర్హులేనన్నారు. సామూహికంగా ప్రజలు, భగవత్సేవలు నిర్వహించమన్నారు. విశిష్టాద్వైతానికి వివరణలన్నీ ఆయన రచించిన శ్రీభాష్యం, వేదాంత సాగరం, వేదాంత సంగ్రహాల్లో కనపడతాయి.


శంకరుడు అది అద్వైతం అన్నా, రామానుజుడు విశిష్టాద్వైతం అని చెప్పినా, వారిద్దరూ భగవంతుడైన బ్రహ్మాన్ని చేర్చేది అద్వైత మార్గం ఒక్కటేనని తెలిసిన మహాజ్ఞానులు. అది సూత్రీకరించి మనిషికి సులభగ్రాహ్యం చేసిన మహాపురుషులు.


మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి జన్మించిన
మహనీయులు,ఈ రోజు మన ధర్మం ఉందంటే
అది వారు ఏర్పరిచిన బాట,క్షేత్రాలు,మార్గదర్శనం తోనే అని మనం తెలుసుకోవాలి......


మన భారతీయ సంప్రదాయంలో ‘గురు’ శబ్దం చాలా మహత్తరమైనది. ఆధ్యాత్మిక వేత్తల్ని గురువులుగా భావించే విలక్షణ సంస్కృతి మనది. 


విశిష్ట దర్శనాలతో ప్రజానీకానికి మార్గదర్శనం చేసిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇరువురూ వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించడం విశేషం.

No comments:

Post a Comment