🥀 *కోపం మోతాదులు* 🥀
✍️ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు.
🙏🌺🌺🌺🌺🔯🌺🌺🌺🌺🙏
కోపం అనునది చాలా చెడ్డగుణం. అగ్రస్థానం పొందిన దుర్గుణాల్లో కోపం కూడా చోటుచేసుకుంది. కోపం వచ్చినపుడు మానవుడు మానవుడుగా ఉండడు, దానవుడుగా మారిపోతాడు. వికృతరూపం ధరిస్తాడు, చేయరాని పనులు చేస్తాడు. ఆ వికారం పోయేవరకు అతడు తన స్వాధీనంలో ఉండడు.
కోప తీవ్రతలో ఎదుటివాడెవడో తెల్సుకొనే పరిస్థితుల్లో మానవుడుండడు. కోపవేగంలో ఆప్త బంధువులను కూడా వైరులుగా జమకడతాడు. అనేక అపచారాలు చేస్తాడు.
కల్లు త్రాగినవాని చేష్టలకు, కోపిష్టి చర్యలకు తేడా ఎక్కువ ఉండదు. కల్లు కైపులో మనుజుడెట్లా దిగజారిపోతాడో, హీనమైన పనులు చేస్తాడో, అట్లే కోపం కైపులో కూడా మానవుడు నికృష్టమైన పనులను చేస్తూ వుంటాడు.
ఉత్తముడైనవానికి కోపం రానేరాదు. ఒకవేళ ఎపుడైనా వచ్చినా దానికి వివేకంతో వెంటనే బ్రేకు వేస్తాడు. అపుడది వచ్చిన దారినే తిరిగి వెళ్తుంది. ఉత్తముడైనవానికి ఎపుడయినా కోపం వస్తే అది నీటిమీద వ్రాత వంటిది. క్షణంలో మాయమైపోతుంది.
ఇక మధ్యమునకు కోపంవస్తే ఆ కోపం దాదాపు రెండు ఘడియల సేపు ఉంటుంది. ఆ కొద్దిసేపు అతనిని పీడిస్తూంటుంది. కాని వెంటనే అతడు తెలివి తెచ్చుకొని వివేక సహాయంతో దానిని సాగనంపుతాడు. మధ్యముల కోపం ఇసుకపై వ్రాసిన అక్షరం వంటిది. ఇసుకపై వ్రాయబడినటువంటి అక్షరాలు కొద్దిసేపుండి, తర్వాత గాలికి చెదరిపోతాయి.
ఇక అధముడికి కోపం వస్తే అది దాదాపు 24 గంటలసేపు ఉంటుంది. అనగా, ఒక రాత్రి పగలు అతనిని వేధిస్తూంటుంది. మరల నెమ్మదిగా అది తగ్గిపోతుంది. అట్టివాని కోపం పలకమీద వ్రాసిన వ్రాతతో పోల్చవచ్చును.
ఇక అధమాధముడికి కోపం వస్తే అతడు చచ్చేవరకు అది పోదు. అట్టి కోపంతో యావజ్జీవితం అతడు సతమతమై పోతూంటాడు. అట్టివాని కోపం శిలాఫలకంపై చెక్కబడిన అక్షరం వంటిది.
కాబట్టి వివేకవంతుడు ఈ కోపము అనే రాక్షసుణ్ణి జీవితంలో ఎపుడు కూడా దరికి చేర్చకూడదు. ఒకవేళ చేర్చినా, అపాయం ముంచుకొస్తుంది. అది సాధకునకు 'నిత్యవైరి' అని గీతా చార్యులు చెప్పనే చెప్పారు.
కావున విజ్ఞుడైనవాడు తన హృదయ పీఠమున దానికేమాత్రం చోటీయక బహు జాగరూకుడై మెలగాలి. వివేకమను ఆయుధాన్ని ఎపుడూ దగ్గరుంచుకొని కోప శత్రువు దరికి చేరకుండా చూస్తూండాలి. అపుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది.
గాలిలేని చోట గల దీపం నిశ్చలంగా నిర్మలముగా వెలుగునట్లు, అతని జ్ఞాన దీపం కూడా చక్కగా వెలుగుతుంది. జీవితానికి వెలుగు నిస్తుంది. ఆనందాన్ని అందిస్తుంది. కావున జీవుడా! ఉత్తముల కోవలో చేరుకో. కోపానికి తిలాంజలి ఇయ్యి. ఆ పాడు వికారానికి స్వస్తి చెప్పు. జీవితాన్ని వసంతంగా చేసుకో. జాగ్రత్త వహించు.
కోపాది దుష్ట చోరులకు నీ హృదయ ఫలకంలో ఏ మాత్రం తావివ్వకు. అపుడే జీవితం శోభిస్తుంది. నీకు ఎనలేని సౌఖ్యం చేకూరుతుంది. కనుక చిత్తమందు ఏ వికారాలు లేక నిశ్చలంగా, నిర్వికారంగా జీవితం గడుపు. ఆనందాన్ని అనుభవించు. జీవన్ముక్తుడవై విలసిల్లు. అదే పరమార్థం. అదే జీవుని గమ్యం.
*ఉత్తమేక్షణకోపం స్యాన్మధ్యమే ఘటికాద్వయమ్!*
*అధమే తు అహోరాత్రం నీచే తు మరణాంతకమ్!!*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
*సేకరణ:*
No comments:
Post a Comment