Friday, May 19, 2023

యదార్థంగా జరిగిన సంఘటన

 నేలతల్లి 

"నాన్నా ! పొలం సంగతి ఎప్పట్నుంచో అడుగుతున్నాం కదా..ఇదిగో చూద్దాం..అదిగో చేద్దాం..అంటున్నారు కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు..మీకా వయసు మీద పడుతుంది.. మా పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది..అందుకని..? అంటూ చెప్పటం ఆపాడు గురవయ్య 

వింటున్న వెంకటయ్య ఒక్కసారి చుట్టూ చూసాడు 

నలుగురు కొడుకులూ.. కోడళ్లు ఆయనేం చెప్తారా అని ఆత్రంగా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నారు 

కానీ వెంకటయ్యలో ఏ భావమూ లేదు 

"ఊ..అందుకని..? నిర్లిప్తంగా అడిగాడు 

" అందుకని ఆ పొలం అమ్మేసి మా నలుగురికీ పంచేస్తే మాకు చేతికింద  సాయం అవుతుంది " వెంటనే చెప్పాడు పెద్ద కొడుకు గురవయ్య 

వెంకటయ్య క్షణం పాటు ఏం మాట్లాడలేదు 

వెంకటయ్య మౌనం వాళ్లలో అసహనం పెంచింది 

" అవును నాన్నా ! అన్నయ్య చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్..ఇంకెంతకాలం ఈ ఊరిని ఆ పొలాన్ని పట్టుకుని బతుకీడుస్తారు ? మాకూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు.. డబ్బుకు ఇబ్బందిగా ఉంది..అందుకే పొలం అమ్మి నలుగురికీ పంచేస్తే బాగుంటుంది " రెండో కొడుకు కల్పించుకుని అడిగాడు 

దానికి అవునన్నట్టు మిగిలిన ముగ్గురు కొడుకులు తలాడించారు 

" ఒరేయ్ ! నాకిప్పుడు తొంభై ఏళ్ళు..నాకు ఇద్దరు అమ్మలు..ఒకరు నా కన్నతల్లి..ఇంకొకరు ఈ నేలతల్లి.. నా కన్నతల్లి చిన్ననాటే కన్నుమూస్తే ఈ నేలతల్లే నన్ను సాకి పెంచింది..అంతెందుకు మీ అమ్మ దాటిపోయినతర్వాత ఒంటరివాడినైన నాకు మిమ్మల్ని ఓ దారిలో పెట్టటానికి  చేయూత ఇచ్చింది కూడా ఈ నేలతల్లే..ఆ బంధం అంత తేలిగ్గా తెంచుకునేది కాదురా..మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయేది..ఉన్న నాలుగు రోజులు ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగనివ్వండ్రా " వెంకటయ్య కల్లోలోనుంచి కన్నీటి బొట్లు రాలి నేలను తడిమాయి 

"అంటే మీకు మీ కొడుకులకన్నా ఈ మట్టే ఎక్కువా..అవతల మేము ఎలా అడుక్కుతిన్నా మీరు మాత్రం హాయిగా పొలంలో కాలక్షేపం చేస్తారు..అంతేగా ? విసురుగా అంది పెద్ద కోడలు 

" అమ్మా ! నన్ను అపార్థం చేసుకోకు తల్లీ..ఈ నేలతో నాకున్న అనుబంధం చెప్పాను..అంతేకానీ నా కొడుకులకు అన్యాయం చెయ్యాలని కాదమ్మా..ఏదో ఈ నాలుగు ఎకరాల పొలం చేతిలో ఉంది కాబట్టి ఇంతవరకు ఎవరినీ చేయి చాచి అడక్కుండా రోజులు నెట్టుకొస్తున్నా..నా తర్వాత ఈ భూమి నా కొడుకులదే కదమ్మా " ఆర్ద్రంగా చెప్పాడు వెంకటయ్య 

" అదేంటండీ..ఎంతసేపూ మీ గురించే ఆలోచిస్తారు..కొడుకుల గురించి ఆలోచించరా? ఉన్నన్నాళ్లు అని పదేళ్లబట్టి చెప్తున్నారు..మీరు తేల్చేసరికి మా ప్రాణాలు పోయేట్టున్నాయ్"ఘాటుగా అందుకుంది రెండో కోడలు 

"అదికాదమ్మా..ఉన్న ఆ కాస్త పొలం అమ్మేస్తే నేను మీకు భారం అవుతానేమో అని ఆలోచిస్తున్నా తల్లీ..అప్పుడు నా భారం మీలో ఎవరో ఒకరు మోయాలి.." వెంకటయ్య మాటలు బాంబులా పేలాయి 

ఒక్క క్షణం అక్కడంతా నిశ్శబ్దం 

కొడుకులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు 

కోడళ్లకు అయితే గొంతులో పచ్చి వెలక్కాయ పడింది 

ఇదేంటి ఈ ముసలాడు పొలం పంచమంటే నన్నెవరు చూస్తారు అంటాడు ?

"అదేంటి మామయ్యా.. ఉన్న నలుగురిలో పెద్దబావగారి పొజిషన్ బావుంది కదా..మిమ్మల్ని ఆయన కంటికి రెప్పలా చూసుకుంటారులే " వెనకనుంచి చిన్న కోడలు గొణిగింది 

" ఏంటమ్మో బావుండేది..పిల్ల పెళ్ళికొసం మా ఆయన చేసిన అప్పు ఇంకా తీరలేదు..అంత ఇదిగా ఉంటే మామయ్యని మీ ఇంట్లో ఉంచుకోవొచ్చుగా..అయినా మీరిద్దరూ మాట్లాడరే ? మిగిలిన ఇద్దరినీ చూస్తూ కసురుకుంది పెద్దకోడలు 

" ఆ..ఇక్కడెవరి పరిస్థితి బాగుందిలే..అంత బావుంటే ముష్టి పొలం కోసం ఇక్కడ అడుక్కోవాల్సిన ఖర్మ మాకేం పట్టింది..? వంత పాడారు మిగిలిన ఇద్దరు 

" అబ్బాబ్బా..మీరుండండీ.. ఒకళ్లకోకళ్ళకి అస్సలు పడిచావదు..ఇలా కాదు కానీ ఓ పని చేద్దాం.."కసురుకుంటూ చెప్పాడు పెద్దవాడు 

ఏంటన్నట్టు చూసారు మిగిలినవాళ్ళు 

" ఏముంది సింపుల్..సోమవారం మంగళవారం నాన్న  ఆదిలాబాద్ లో మా ఇంట్లో ఉంటారు.. బుధవారం..గురువారం..నిజామాబాద్ లో రెండో తమ్ముడి ఇంట్లోనూ..శుక్రవారం శనివారం మెదక్ లో మూడో తమ్ముడి ఇంట్లోనూ ఆదివారం ఆఖరి వాడింట్లోనూ ఉంటారు"

" అదేంటి ఆఖరాయన ఇంట్లో ఒక్క రోజేనా ? ముఖం మటమట లాడిస్తూ అంది పెద్ద కోడలు 

"పోనీలేవే..మా నలుగురిలో వాడే చిన్నవాడు కదా..అందుకే వాడికి డిస్మౌంట్ " నవ్వుతూ అన్నాడు పెద్ద కొడుకు 

ఆ మాటతో మిగిలిన వాళ్లకు కూడా నవ్వొచ్చింది 

అందరూ నవ్వుతున్నారు

నవ్వులపాలైపోయిన తన జీవితాన్ని తల్చుకుని వెంకటయ్యకు ఏడుపొచ్చింది 

ఆయన కళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తున్నాయ్ 

ఇకపై నలుగురు కొడుకులూ వంతులు వేసుకుని నన్ను చూసుకుంటారన్నమాట 

రెండ్రోజులు ఒక ఊర్లో ఉంటే ఇంకో రెండ్రోజులు ఇంకో ఊర్లో ఉండాలన్నమాట 

తొంభై ఏళ్లపాటు కన్నతల్లిలా సాకిన నేలతల్లిని ఉన్న ఊరిని విడిచిపెట్టి వెళ్లాలా ? 

ఈ ప్రాణం ఈ మట్టిలోనే కలిసిపోవాలని ఆశ పడ్డాను కదా..ఇప్పుడది ఆడియాస అవుతుందా ? 

" ఏంటి మామయ్యా..ఆలోచిస్తున్నారు..? తలకు మించిన భారం అయినా మీ అబ్బాయిలు వంతులు వేసుకుని అయినా మిమ్మల్ని చూసుకుంటాం అంటున్నారుగా? ఇంకెందుకాలస్యం..ఆ పొలమేదో నలుగురికీ పంచెయ్యండి" కంక్లూజన్ అన్నట్టుగా చెప్పింది పెద్ద కోడలు 

అప్పటికే బాగా చీకటి పడటంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు 

 వెంకటయ్య ఒంటరిగా మిగిలిపోయాడు 

ఏడ్చి ఏడ్చి అతడి కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది 

నలుగురు కొడుకుల  పేరున పొలాన్ని పంచుతున్నట్టు రాసి కాగితం బల్లమీద పెట్టాడు 

చాలసేపటి తర్వాత అర్ధరాత్రి లాంతరు తీసుకుని పొలానికి బయలుదేరాడు 

పొలంలో నేల మీద కూర్చుని ఆ మట్టిని ముద్దాడాడు 
ఇప్పుడు అతడి మనసు తేలికైంది  
ప్రశాంతంగా అనిపించింది 

అక్కడే గుట్టమీద పడి ఉన్న ఎండు పుల్లలను ఆకులను చితిలా పేర్చి నిశ్శబ్దంగా దానిమీద పడుకుని అగ్గిని రగిల్చాడు 

నిమిషాల్లోనే 90 ఏళ్ల వెంకటయ్య శరీరాన్ని  నేలతల్లి తన ఒడిలోకి తీసుకుంది !!

*   *  *

ఇది కథ అనుకుంటున్నారా ? 
కాదు యదార్థంగా జరిగిన సంఘటన 
సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడు కొడుకులు వంతులు వేసుకుని తనను పోషిస్తారన్న మాట విని తట్టుకోలేక  నిన్న చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త చదివి కన్నీటితో రాసిన కథ లాంటి నిజం !

పరేష్ తుర్లపాటి

No comments:

Post a Comment