🙏🙏🙏ఓం🙏🙏🏼🙏🏽
*బర్బరీకుడు..!*
మహాభారతంలోని ఓ వింత పాత్ర… మాయకే బలి..!! ఎన్నిరకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు… మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక
పాత్రలు దర్శనమిస్తాయి… కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి…
కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి… దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే… మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది… తన పేరు బర్బరీకుడు..!
బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో… కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి… బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది…
నిజానికి భాగవతం అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాం గానీ, నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే…
తను లేనిదే భారతం లేదు… భారతం లేనిదే కృష్ణుడూ లేడు…
ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా..? తను ఘటోత్కచుడి కొడుకు… (ఘటోత్కచుడు ఎవరూ అని అడగకండి… మాయాబజార్ సినిమా చూడని తెలుగువాడు ఎవరున్నారని..?) లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో… హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు… (ఆ
కథ వేరు)… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు
మురు బిడ్డ మౌర్వి (అహిలావతి) ని పెళ్లాడతాడు… వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు… నిజానికి తను ఓ యక్షుడు… ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు…
రాజస్థాన్‌లో
ఖటుశ్యామ్‌జీ పేరిట, గుజరాత్‌లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని… అక్కడి జానపదులు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లారు. అతను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు… దేవీ ఉపాసకుడు కూడా… దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది… ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు… అందుకే తనను ‘త్రిబాణధారి’ అంటారు… పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక… భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ… బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు… వెళ్లే ముందు తల్లికి ఓ మాటఇస్తాడు… ‘‘ఒకవేళ
నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే మాత్రం… నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను… ఓడిపోయేవారిని గెలిపిస్తాను’’… ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు…
యుద్ధం ప్రారంభం కావటానికి
ముందు ప్రతి యోధుడినీ కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు… ‘నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్నిరోజులలో ముగించగలవు..?’ ఇదీ ప్రశ్న… 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు… 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28
రోజులు పడుతుందని అర్జునుడు… ఇలా తలాఓరకంగా చెబుతారు… దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు… ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి… ‘కృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ
ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా..? అని అడుగుతాడు… నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు… కృష్ణుడు
ఒక్కక్షణం దిగ్భ్రాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు… తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు… వాటి శక్తి వివరిస్తాడు…
నేను ఒక బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది… (టార్గెట్స్‌ను ఐడెంటిఫై చేస్తుంది)… రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని
రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది… మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది… ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు… నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవడూ దీన్ని నమ్మడు… నమ్మలేడు అంటాడు కృష్ణుడు… బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది… ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు కృష్ణుడు… చాలా సులభం అంటాడు బర్బరీకుడు… చేసి
చూపించు అంటాడు కృష్ణుడు…
బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లుమూసుకుంటాడు బర్బరీకుడు… ఈలోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద
దాచిపెడతాడు… ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది… చివరకు కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది… ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా కృష్ణుడు…
నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది… అందుకే అదక్కడకు వచ్చింది, నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు… తప్పనిసరై పాదం తీసేస్తాడు… మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది… (రక్షింపబడాల్సినవి)… తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది, ఆశ్చర్యంగా చూస్తాడు కృష్ణుడు… ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది… అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు… బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే, కౌరవపక్షాన చేరితే పాండవుల్నితాను కాపాడలేననీ గుర్తిస్తాడు… కలవరపడతాడు… ఒకవేళ భీముడి మనమడు కాబట్టి,
పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది..? అందుకే దివ్యదృష్టిని సారించి, కొన్ని
నిజాలు తెలుసుకుని, ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు…
ఏమోయీ, నువ్వు ఎవరు..? నువ్వు కూడా యుద్ధం చేస్తావా..?
నేను ఘటోత్కచుడి కుమారుడిని, యుద్ధం చూడాలని వచ్చాను, చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన
నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను…పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది… కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు… అంటే పాండవులే బలహీనులు కదా…అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది…
అదే జరిగితే, వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు
బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా…
అవునవును, తిరిగి నేను
కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది… కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి
పాండవులు బలహీనులు అవుతారు కదా… మరేం చేయుట..?
ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది… తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి, ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ, విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది… కృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా…
ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు కృష్ణుడు… అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు… అప్పుడు కృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు… తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు… సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు… ‘‘యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా… ఇంత భారీ జనహనన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం, నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, నిన్నెవరూ హతమార్చలేరు, అందుకే నువ్వే నీ తలను తీసి, నాకివ్వు…’ అంటాడు కృష్ణుడు… నన్నే ఎందుకు బలి ఇవ్వాలి, ఇంతమంది యోధులు ఉండగా.., పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు… అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు…
‘‘బర్బరీకా… నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి… భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి విష్ణూ అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు… దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో
మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను… ఇదంతా వింటున్న నువ్వు ‘ఈమాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి..? నేనొక్కడిని చాలనా’ అని ఒకింత పొగరుగా మాట్లాడావు… దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు…
‘ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, మొట్టమొదట బలయ్యేది నువ్వే’ అని శపించాడు… అందుకే నీ బలి… అంతేకాదు, నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు… కానీ నాకు యుద్ధానికి చూడాలని
ఉంది అంటాడు బర్బరీకుడు… ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు… అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు… కృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు…
యుద్ధం ముగిసింది... విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే
కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు… వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు కృష్ణుడు… తన కథ చెబుతాడు… భీముడు విలపిస్తాడు…
తరువాత కృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు… ‘‘వత్సా, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే… నువ్వు చెప్పు, ఏం గమనించావో..?’’ స్వామీ, ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను… మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను… ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ధ కారకులు, యుద్ధకర్తలు… మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే… అని సమాధానమిచ్చి, తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ద్వలోకాలకు
వెళ్లిపోతాడు… ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ.....!
సర్వేజనా సుఖినోభవంతు....
లోకా సమస్త సుఖినోభవంతు....
ఓం శాంతి శాంతి శాంతిః.....
స్వస్తి.....🙏
No comments:
Post a Comment