Sunday, May 21, 2023

భాష : "తెలుగులో పదాలకు ఉన్న అసలు అర్ధాలే మారుతూవుంటాయ్!"

 భాష :

"తెలుగులో పదాలకు ఉన్న అసలు అర్ధాలే మారుతూవుంటాయ్!"

ఒక మాటకి 'ఇదే అర్థం' అని కచ్చితంగా చెప్పలేం. సంస్కృతం జనం భాష కాదు   కాబట్టి, పూర్తిగా వ్యాకరణ బద్ధంగా నడిచేది కాబట్టీ భాష పదాలకు ఆట్టే మార్పు ఉండదు. 

  తెలుగు లాంటి జీవద్భాషలో  కాలాన్ని బట్టి   పదాలకు అర్థాలు మారిపోతుంటాయ్.  ఒక ప్రాంతంలో వాడే  మాటకి ఒక అర్థం వుంటే, దానికి   మరో ప్రాంతంలో మరో అర్థం వుంటుంది. కుల,  వృత్తి, మత, ఇతరేతర భాషల ప్రభావాల, రాజకీయ,  ఆర్థిక, భౌగాళికాది ప్రాతిపదికల మీదా అర్థాలలో మార్పులు చోటుచేసుకోవడం ( విపరిణామం ) సహజ క్రమ పరిణామమే. భాష విస్తృతికి ఒక మంచి సూచిక కూడా. 

 'చెంబు' అనే పదాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఎఱ్ఱని రాగితో చేసిన 'పాత్ర' ని చెంబు అనాలి నిజానికి. రాగిది కాని పాత్రనూ 'చెంబు' అనేస్తున్నాం. 'స్టీలు - చెంబు, ప్లాస్టిక్ చెంబు' అనీ వాడేస్తున్నాం. 

'నేను రాత్రిపూట భోజనం చెయ్యను, టిఫిన్ చేస్తా ' అనటం వింటుంటాం కదా!  భోజనం అంటే  మీల్స్ అనే కాదు, భుజించేది ఏదైనా 'భోజనమే అవుతుంది. 

అట్లాగే ' సంతర్పణ ' అన్న పదానికి ఉన్న అసలైన అర్ధం ' సంతృప్తి పర్చటం' . ఆ అర్ధం మరుగున పడి, సమారాధనల్లో పెట్టే భోజనానికే ' ' సంతర్పణ ' పదం స్థిరపడిపోయింది. 

' తద్దినం ' అనే పదాన్ని చచ్చిపోయిన వాళ్ళకి సంబంధించిన భ్రష్టార్థలో  వాడేస్తున్నాం . కానీ, తత్ +  దినం = తద్దినం ; అంటే ఆరోజు . ఆరోజు పుట్టినరోజైనా కావచ్చు, పెళ్లిరోజైనా కావచ్చు  .. నిజానికి! 

 ధర్మం' అంటే న్యాయం, విధి, కర్తవ్యం.  ధర్మాసుపత్రి, ధర్మ దర్శనం, ధర్మం చెయ్యండి. . అన్నప్పుడు అర్థాలు మారుతున్నాయి కదా మరి! 

'కోక' అంటే  'చీర' అని మాత్రమే చెప్తారు ఇప్పుడైతే. శ్రీనాథుడనే కవి కూడా 'కోక' ధరించాడు ఆయన రోజుల్లో మరి! అప్పట్లో కోక అంటే ఏదో ఒక వస్త్రం ..   పంచ, చీర, తుండు ఏదైనా కావచ్చన్నమాట!

 ఒక్కోసారి  పదం పూర్తిగా వూతిరేకార్థంలో వాడటం జరుగుతుంటుంది. 

'బియ్యం నిండుకున్నాయి' అంటే   బియ్యం అయిపోయాయి  అని అర్థం . 

అట్లాగే ఆరిపోయిన దీపాన్ని 'దీపం కొండెక్కింది' అంటుంటాం. 

సభ్యతగా చెప్పాలని అనుకోవటం వల్ల అసలైన అర్థం పోయి  మరో అర్థం వచ్చేలా పరోక్షంగా చెప్పే పద్ధతి కూడా ఉంది. . ఆవిడ నీళ్ళు పోసుకుంది; ఉత్త మనిషి కాదు; నెల తప్పింది వంటి వాటికి అసలైన అర్థాలు కాక 'గర్భవతి, కడుపుతో వుంది' అని అర్థం ఉంటుంది. 

కైంకర్యం - అనే మాటకు ' సేవ ' అసలు  అర్థం అయితే - కాజేయడం అనే అర్థంలో వాడేస్తున్నాం. 

నిజానికి, ఛాందసుడు అంటే ' ఛందస్సు తెలిసిన వాడు' అని అర్థం.  కాని, ఇప్పుడు చాదస్తుడు, లోకజ్ఞానం లేనివాడు అనే నిందార్థంలో వాడటం చూస్తున్నాం . 

చాలా మంది తెలీకుండా చేసే పెద్ద పొరపాటు ఒకటుంది. సభలో హాజరైన వాళ్లందర్నీ ఉద్దేశించి ' సభికులు ' అంటారు పెద్ద పెద్ద వక్తలు కూడా! కాని, సభికులు అనే పదానికి  ' జూదం ఆడేవాళ్లు ' అన్నదే అసలైన అర్థం. 

అట్లాగే ' శ్రాద్ధం ' కూడా. శ్రద్ధగా చేసే పని ' శ్రాద్ధం ' అయితే .. చచ్చిపోయినవాళ్లకు చేసే కర్మకాండ మాత్రమే శ్రాద్ధమనే  పదంగా  స్థిరపడిపోయింది  . 

ఆగ్రహం అంటే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నట్లు ' కోపం ' కానే కాదు సుమా . ' పట్టుదల ' అన్నది అసలైన అర్థం.

No comments:

Post a Comment