Sunday, May 14, 2023

✍🏼 నేటి కథ ✍🏼* *పిసనారి కాదు* *- రచన : తమిరిశ జానకి*

 *✍🏼 నేటి కథ ✍🏼*


*పిసనారి కాదు*

*- రచన : తమిరిశ జానకి*

 
రాజారావుకి తన పక్కింట్లో ఉండే శ్రీధర్ అంటే చాలా చిన్నచూపు. తనలాగా జల్సాలు చెయ్యడని లెక్కలేనట్టు డబ్బు ఖర్చు పెట్టడనీ లోకువగా చూస్తాడు.

ఉన్నదానికి నాలుగు రెట్లు ఖర్చుపెడుతూ ఆడంబరంగా బతికే రాజారావుని చూస్తుంటే శ్రీధర్ కి జాలి అనిపిస్తుంటుంది. ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అతనికి. వెనకాల ఆస్తిపాస్తులేమీ లేవు. సొంత ఇల్లు కాదు.అద్దె ఇల్లే.

తనకీ ఇద్దరు పిల్లలున్నారు. సొంత ఇల్లు కాదు. అద్దె ఇల్లే. వెనక ఆస్తులేమీ లేవు. గొప్పలకోసం అక్కర్లేని అనవసర ఖర్చులు పెట్టడం తన పద్ధతి కాదు.ఇంట్లో ఎవరికీ ఏ లోటూ లేకుండానే గడుపుకొస్తున్నాడు. రాజారావు తనని చిన్న చూపు చూస్తాడని తెలిసినా తేలిగ్గానే తీసుకుంటాడు తప్ప అతని పట్ల కోపం లేదు.

"మీ నాన్న పిసినారి వాడు కదూ!" ఆ రోజు అర్జున్ని అడిగాడు రాజారావు కొడుకు పవన్. చూసిన సినిమాకే మళ్ళీ మూడోసారి చూడటానికి వాళ్ళనాన్న తనూ వెళ్తున్నారు.

శ్రీధర్ కొడుకు అర్జున్ కి రాజారావు అంకుల్ లాగా తన తండ్రి కూడా ఉంటే బావుండుననిపించింది.ఇప్పుడనిపించడం ఏమిటి గానీ ఎప్పుడూ అలాగే అనిపిస్తుంటుంది. తను ఎప్పుడూ మనసులో అనుకునేదే పవన్ అన్నాడు.....కానీ ఎందుకో వాడు అంటే మాత్రం ఉడుకుమోత్తనంగా అనిపించింది. తలొంచుకుని ఇంట్లోకెళ్ళిపోయాడు.తల్లి దగ్గిరచేరి నసగడం మొదలుపెట్టాడు.
నవ్వింది శ్యామల" ఏవిట్రా నీ బాధ?""
“అది కాదమ్మా! అసలు....నాన్నెందుకు డబ్బు ఖర్చుపెట్టడానికి ఎంతో ఆలోచిస్తాడు?చక్కగా ఆ రాజారావు అంకుల్ చూడు తనకీ పవన్ కీ ఎన్ని రకాల బూట్లో ఉండగానే ఇంకా ఇంకా కొంటూనే ఉంటాడు.జీన్స్ ప్యాంట్లు ఎన్ని ఉన్నా అస్తమానం కొని తెస్తూనే ఉంటాడు.ఎప్పుడూ హోటళ్ళకీ సినిమాలకీ తీసికెళ్తుంటాడు.మొన్న నేను జీన్స్ ప్యాంటు కొని తెమ్మంటే కిందటి నెల్లోనే కదా కొన్నాను మళ్ళీ అప్పుడే ఏమిటి అన్నాడు నాన్న. సినిమా అంటే...టీవీ లో చూస్తూనే ఉన్నావుకదా అస్తమానం బయటకెళ్ళి చూడాలంటే ఎంత డబ్బవుతుందో తెలుసా అంటాడు. నాన్నెందుకమ్మా అంత పిసినారిగా ఉంటాడు ?"

"పొదుపరికీ పిసినారికీ తేడా తెలుసుకోరా నువ్వు ముందు. మనకేవన ్నాఇంట్లో ఎందులోనన్నా లోటు చేస్తున్నారా? లేదు కదా! నీకు కావలసినన్ని బట్టలున్నాయి. ఎవరినో చూసి..." తల్లి మాటలు పూర్తికాకుండానే కోపంగా లేచి వెళ్ళిపోయాడు అర్జున్ "నువ్వంతే ఎప్పుడూ నీతి పాఠాలు చెప్తావు" అంటూ.

........ ..................
ఎప్పుడూ తమ ఇంటివైపే చూడని రాజారావు అంకుల్ ఆ రోజు పొద్దున్నేకళ్ళల్లో నీళ్ళతో రావడం నాన్నచేతులు పట్టుకోడం వింతగా ఉంది అర్జున్ కి.

"ఇలా కూచోండి ముందు. ఏంజరిగింది?" శ్రీధర్ నెమ్మదిగా ఆయన్ని కూచోపెట్టాడు.
"శ్రీధర్ గారూ మీరే నాకు సాయం చెయ్యాలి. కొంచెం డబ్బు కావాలి... అప్పుగానే... జీతాలు రాగానే తిరిగి ఇస్తాను. మా బావమరిదికి యాక్సిడెంట్ అయ్యిందిట. పక్కింటివాళ్ళు ఫోన్ చేశారు.
మేము వెంటనే వెళ్ళాలి. మేము తప్ప ఎవరూ లేరతనికి. కానీ... కానీ... ఒకటో తేదీ జీతం వచ్చే దాకా నాదగ్గిర డబ్బు లేదు.
ముగ్గురు నలుగురిని అడిగాను. ఎవ్వరూ ఇవ్వలేదు. వాళ్ళదగ్గిర ఇప్పటివరకూ తీసుకున్న అప్పులు తీర్చకుండా మళ్ళీ అడిగితే వాళ్ళు మాత్రం ఎలా ఇస్తారు? నాకు భగవంతుడు మంచి గుణపాఠం నేర్పించాడు."

అర్జున్ అంకుల్ వైపు చూశాడు జాలిగా... నాన్న పిసనారి కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు... ఔను... మొన్న తనకి జీన్స్ ప్యాంటు బూట్లు కొనలేదుగా! నిన్న హోటల్ కి తీసికెళ్ళమని అడిగితే పదిహేను రోజులే కదా అయ్యింది హోటల్ కి వెళ్ళి వొచ్చేనెల్లో చూద్దాం అన్నాడు. అలాంటి నాన్న అంకుల్ కి సాయం చేస్తాడా!

"రాజారావు గారూ కంగారు పడకండి.... తప్పకుండా సాయం చేస్తాను." అంటూనే లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు.

అర్జున్ నమ్మలేనట్టుగా చూశాడు. రాజారావు వెళ్ళిపోయాక కొడుకుని దగ్గిరకి పిలిచాడు శ్రీధర్.
"అనవసరపు ఖర్చులు పెట్టకుండా కాస్త ఆలోచించి నడుచుకుంటే ప్రతిరోజూ అప్పులు చెయ్యడం.... అత్యవసరం వొచ్చినప్పుడు ఎవరూ అప్పు ఇవ్వకపోవడం జరగదు.... ఔనా కాదా..."

ఔను అన్నట్టుగా తల ఊపాడు అర్జున్.

"ఒప్పుకుంటావా ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేసేందుకు వెనకాడని స్వభావం మీ నాన్నగారిదని... పొదుపుగా ఉండే మనస్తత్వమనీ....." అమ్మ మాట పూర్తి కాకుండానే అందుకున్నాడు అర్జున్ "పిసనారి కాదని కూడా ఒప్పుకుంటాను."

అంటూనే నాన్నని వాటేసుకున్నాడు. ఆ ముఖంలో చెప్పలేనంత సంతోషం వెల్లివిరిసింది.

No comments:

Post a Comment