2103. 2-8. 290623-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రామానుజుడినే అవాక్కు చేసిన…
*గొల్ల మహిళ!
➖➖➖✍️
ఈ రోజు (ఏప్రిల్ 18, 2021) జగద్గురు భగవద్రామానుజాచార్యుల 1004వ జయంతి. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసి, అందరికీ ఆలయ ప్రవేశం కల్పించి భగవంతుడిని అర్చించే అర్హత అందరికీ ఉందని చాటిన ఆ సమతా వేత్త జీవితంలో ఒక ముఖ్యఘట్టం గురించి మాడభూషి శ్రీధర్ ఈ వ్యాసంలో వివరించారు.
ఒక సామాన్య గొల్ల మహిళ జగద్గురువు రామానుజుడినే తన ప్రశ్నలతో దిగ్భ్రాంతుడిని చేసింది. తమిళనాడు, తూత్తుకుడి జిల్లాలో తామ్రతర్ణీ నదీ తీరంలో రామానుజ స్వామికి ఆ భక్తురాలు ఎదురైంది.
తిరుక్కోలూరు దివ్యదేశ దర్శనానికి ఆయన వస్తూ ఉంటే, అక్కడినుంచి ఆమె వెళ్లిపోతూ ఉంది. ఆమె వృత్తి పెరుగు అమ్ముకోవడం.
శిష్యగణంతో వైభవంగా వస్తున్న రామానుజుని చూసి ఆమె భక్తిపూర్వకంగా మోకాళ్లమీద వంగి నమస్కరించింది. “ఆశీర్వదించండి స్వామీ! నేను తిరుక్కోలూరునుంచి వెళ్లిపోతున్నానని విన్నవించింది.
“ఎందుకమ్మా ఇంత పవిత్ర స్థలాన్ని వదులుతున్నావు. ఒక వస్త్రాన్నే ఏఢుగురు పంచుకునేంత పేదరికం ఉన్నవారు, తిండికోసం పోరాడవలసి వచ్చే వారు కూడా తిరుక్కోలూరు వదిలిపోవడానికి ఇష్టపడరే?” అనడిగారు రామానుజ.
“నేనొక అల్పురాలిని. నేను ఏ గొప్ప పనిచేసానని ఈ దివ్యదేశంలో ఉండే అర్హత నాకు ఉందంటారు స్వామీ. అందుకని వెళ్లిపోతున్నా”నని జవాబిచ్చారామె.
తాను వెళ్లడానికి 81 కారణాలు చెప్పారామె. ఆమె ప్రశ్నలు ఇవి:
అక్రూరుని వలె బలరామకృష్ణులను రాజధానికి తీసుకువెళ్లానా?
శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చినపుడు విదురుని వలె మనసు విప్పి మాట్లాడానా?
శ్రీకృష్ణుడు ఆకలి అంటే మునిపత్నుల వలె శరీరాలను త్యాగం చేసానా?
సీతమ్మ వలె రావణుడిని తృణీకరించానా?
తొండమాన్ రాజువలె క్రిష్ణశర్మ కుటుంబసభ్యుల మృతశరీరాలను మళ్లీ లేపగలిగానా?
ఘంటా కర్ణుడి వలె మోక్షం కోసం శ్రీకృష్ణుడికి శవంతో విందు ఇచ్చానా?
సతీ అనసూయ వలె త్రిమూర్తులకు తల్లికాగలిగానా?
ధృవుడు అడిగినట్టు నా తండ్రి ఎవరమ్మా అని అమ్మను అడిగానా?
మునులు ఆదేశించినట్టు మూడక్షరాల గోవింద నామాన్ని జపించి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టానా?
సతీ అహల్యవలె రామపాదాన్ని తాకి శాప విముక్తురాలైనానా?
బాలికగా ఉన్నపుడే ఆండాళ్ వలె పండుకాని కాయగానే భగవంతుడిని ప్రేమించానా?
పెరియాళ్వార్ వలె భగవంతుడే నాకు దిక్కని చెప్పి నారాయణుని దయతో మహాకవినైనానా?
తిరుమళిశై ఆళ్వార్ వలె ఇతర మతాలను వదిలేసి శ్రీవైష్ణవం అనుసరించానా?
తిరుమళిశైఆళ్వార్ వలె నేను అల్పురాలనని వినయంతో చెప్పుకున్నానా?
తిరుమల పర్వతాలలో ఏదో ఒక వస్తువుగా పుట్టించమని కులశేఖరాళ్వార్ వలె ప్రార్థించానా?
విష్ణు భక్తులవలె శ్రీ కృష్ణుడే సత్యస్వరూపుడని ప్రకటించానా?
కబందునివలె శ్రీరాముని చేతిలో మరణించి సీత జాడ చెప్పి శాపవిమోచనం పొందినానా?
రావణుని బలహీన రహస్యాలను సీతకు త్రిజటవలె వివరించానా?
మండోదరి వలె శ్రీరాముడు విష్ణువు అవతారమని ముందే గమనించి రావణుడికి రాముడే భగవానుడని ధైర్యంగా చెప్పగలిగానా?
నాకు రాముడి గురించి తెలుసని విశ్వామిత్రుడివలె దశరథుడికి చెప్పానా?
మధుర కవి రాయర్ వలె గురువు గారికి భగవంతుడికి నా భక్తిని రుజువుచేసుకోగలిగానా?
దేవకి వలె పరమాత్ముడికే జన్మనిచ్చానా?
కంసునికి భయపడి శంఖ చక్రాలు దాల్చిన చతుర్భుజాలను దాచి పసిపాపగా మారాలని దేవకి వలె వాసుదేవుడిని కోరానా?
యశోద వలె గొల్లబాలుడిని పెంచినానా?
రామదండులో కోతుల వెంట ఉడుత వలె లంకకు వంతెన కట్టేందుకు వెళ్లానా?
కుచేలుడి వలె శ్రీకృష్ణుడికి అటుకులిచ్చినానా?
అగస్త్యమహాముని వలె శ్రీ రాముడికి ఆయుధాలివ్వగలిగానా?
సంజయుడి వలె నిగూఢరహస్య సంఘటనలను దర్శించగలిగానా?
రాజర్షి జనకుడి వలె శ్రీరాముడినే అల్లుడిగా పొందగలిగానా?
తిరుమంగై ఆళ్వార్ వలె ముందుగా దొంగతనాలుచేసి తరువాత శ్రీమహా విష్ణువును దర్శించుకోగలిగానా?
ఆదిశేషుడివలె జనులను సూర్యుడి ప్రతాపం నుంచి లేదా వర్షాలనుంచి రక్షించే సేవ చేసానా?
గరుడుని వలె భగవంతుడిని అనేక ప్రదేశాలకు తీసుకువెళ్లగలిగానా?
ఆజన్మ బ్రహ్మరాక్షసిని విముక్తి చేయడం కోసం కైశిక చందస్సులో తానుభగవంతుడిని కీర్తిస్తూ ఒక కీర్తన పాడిన ఫలాన్ని నంపుదువాన్ ఇచ్చినట్టు నేను ఇచ్చానా?
పోయిగై, భూతత్తు, పేయ్ ఆళ్వార్ల వలె తిరుక్కోవళూర్ లో చిన్నస్థలాన్ని పంచుకోగలిగానా?
వాల్మీకి మహర్షిని సేవించిన భాగ్యవంతులైన ఇద్దరు రాజులు లవకుశులను పొందగలిగానా?
తొండరడిప్పొడియాళ్వార్ వలె భగవంతుడికి పూల మాల పదాల మాల అనే రెండు మాలలను ఇవ్వగలిగానా?
తిరుక్కచ్చినంబి వలె కాంచీపురంలో వరదరాజస్వామితో నిత్యం మాట్లాడే అదృష్ఠం నాకు ఉందా?
ఆలయ అర్చకుడి భుజాల మీద కూర్చుని గర్భాలయంలోకి వచ్చిన తిరుప్పాణి యాళ్వార్ వలె భగవంతుడిలో విలీనం అయ్యానా?
శ్రీ రామ లక్ష్మణులను విశ్వామిత్రుడివెంట పంపాలని దశరథుడికి వశిష్ఠుడు చెప్పినట్టు చెప్పగలిగానా?
కొంగిల్ పిరాట్టివలె రామానుజుడికి చెప్పులు (పాదరక్షలు ఇవ్వగలిగానా?
తిరుపతిలోని కురువపురంలో కురువనంబి వలె శ్రీవేంకటేశుడిని మట్టిపూలతో పూజించగలిగానా?
గజేంద్రుడి వలె భగవంతుడిని ఆదిమూలమైన వాడా అని ఎలుగెత్తి పిలిచానా?
మథురలో శ్రీకృష్ణుడికి కుబ్జ ఇచ్చినట్టు చందన గంధాలు ఇవ్వగలిగానా?
మథురలో పూలమ్ముకునే సుధాముడు శ్రీకృష్ణుడికి ఇచ్చినట్టు పూలు ఇచ్చినానా?
భరతుడు నీ పాదుకలు నిల్పిన చోట నేను నిలవగలిగానా?
శ్రీరాముడికి లక్ష్మణుడివలె నేనేమైనా సేవకుడినై సేవలు చేయగలిగానా?
గుహుడివలె రాముడిని గంగ దాటించగలిగానా?
సీతను కాపాడడం కోసం రావణుడితో జటాయువు వలె పోరాడినానా?
శ్రీరాముడిని చేరుకోవడానికి విభీషణుడివలె సముద్రం దాటి వెళ్లగలిగానా?
శబరివలె శ్రీరాముడికోసం తీయని పళ్లు దాచిపెట్టానా?
ప్రహ్లాదుడి వలె నారాయణుడి లేని చోటేదీ లేదని చెప్పగలిగానా?
పెరుగుఅమ్ముకునే దధిభాండుని వలె కుండలో దాగిన శ్రీబాలకృష్ణుడు ఇక్కడ లేడని చెప్పినానా?
శ్రీరాముడి వలె అడవులకు పయనమైనానా?
హనుమంతుడి వలె శ్రీరాముడికి “చూచాను సీతమ్మను” అని చెప్పానా?
రెండు చేతులతో పట్టుకున్న చీరను వదిలేసి, చేతులెత్తి ద్రౌపది వలె శ్రీకృష్ణుడిని పిలిచానా?
వడుగనంబి వలె పెరుమాళ్ల సేవను చూడడం కన్న తనకు రామానుజుని కోసం పాలు పొంగకుండా చూసుకోవడమే ముఖ్యమని అన్నానా?
మహ్మదీయ సుల్తాన్ రాకుమారి మందిరం నుంచి చెంగుచెంగున వచ్చిన శెల్వప్ఫిళ్లై మూర్తిని రామానుజుని వలె ప్రేమతో హత్తుకున్నానా?
వృద్ధాప్యం వల్ల కదలలేకపోయిన ఇడయత్తూర్ నంబి వలె ఉన్నచోటకే రంగరాజుని రప్పించుకుని నిలుపుకున్నానా?
ఇద్దరు పురుషులు ఒక కోతిని రామలక్ష్మణ ఆంజనేయులనుకుని వారిని పట్టుకోవడానికి నాథముని వలె చాలా దూరం అన్వేషించానా?
మారుతీ యాండాన్ వలె విష్ణుద్వేషి చోళుని మరణవార్తను శ్రీరంగంనుంచి రామానుజుడికి చేరవేసినానా?
రామానుజునితో తన సంబంధాన్ని ప్రకటించేదాకా రంగనాథుడిని చూసిన కన్నులతో మరెవరనీ చూడబోనని కూరత్తాళ్వార్ల వలె అన్నానా?
రామానుజ స్వామి వలె అద్వైత వాదులతో వాదించి గెలిచానా?
కేవలం వైష్ణవుడనే కారణంతో శవానికి దహన సంస్కారం చేసినందుకు మంచివారిలో చక్రవర్తి (నల్లాన్ చక్రవర్తి) అని శ్రీమన్నారాయణుడు బిరుదు ఇచ్చినపుడు నేను భగవంతుడి కరుణాసముద్రపు లోతులను చూడగలిగానా?
ఆళవందార్ వలె భగవంతుడి ఆజ్ఞమేరకు అనంత పద్మనాభస్వామిని దర్శించుకోవడానికి వెళ్లానా?
నా ఆచార్యుడు ఆళవందార్ ను కలిసేందుకు అందరినీ వదిలేసిన దైవ వారియాందానై వలె వెళ్లిపోయానా?
తనను పొగడడం ఇష్టం లేని గురువుగారి ఆదేశం మేరకు అముదనార్ (పెరియ కోయిల్ నంబి) వలె అంతతిని రచించానా?
యుద్దవినాశనాన్ని తప్పించడానికి తాత మాల్యవాన్ వలె శ్రీరాముడి పరాక్రమం గురించి రావణుడికి చెప్పానా?
గొప్ప గురువులవంటి వారు వామనుడై బలియాగశాలకు వచ్చిన శ్రీ మహావిష్ణువు బలి రాజ్యాన్ని దొంగలించడానికి వచ్చిన దొంగ అని వర్ణించినట్టు వర్ణించగలిగానా?
విష్ణు భక్తులంతా సముద్రం వంటి వారనీ, వారి నామస్మరణ సముద్రఘోష అనీ మార్నేని నంబి గురించి పెరియ నంబి చెప్పినట్టు నేనుచెప్పానా?
రామానుజస్వామి స్వయంగా నారాయణుడే అని నమ్మి ఆయన చుట్టూనే తిరుగుతున్నానా?
తాను చేసిన మంత్రోపదేశాన్ని మరెవరికీ చెప్పరాదని రామానుజునితో ఒట్టు పెట్టించుకున్న తిరుకోష్టినంబి వలె రామానుజునితో కఠినంగా వ్యవహరించానా?
మాటలు రాని మూగశిష్యుడి వలె నేనేమైనా రామానుజుని దివ్యాశీస్సులు పొందగలిగానా?
తొట్టియంలో భగవంతుడి అర్చారూపాన్ని కాపాడేందుకు తిరునారాయూరర్ వలె శరీరత్యాగం చేసానా?
రాజు ఉపరిచర వలె అన్ని జంతువులు తన వంటివేననీ కనుక అన్నింటికీ జీవించే హక్కు ఉందని విధంగా నేను ప్రకటించానా?
రామానుజునితో తిరుమల నంబి చెప్పినట్టు మొత్తం తిరుమలైలో ఎంత వెతికినా నాకన్న చిన్నవాడు కనిపించలేదని అన్నానా?
కావేరి పోటెత్తినపుడు నంపిల్లై అనే మునిని కాపాడడం కోసం పడవనుంచి దుమికి ప్రాణ త్యాగం చేసినానా?
కాశీ రాజు సింగన్ వలె భగవంతుడిని పద్మాలతో పూజించి, పిలిచి, రప్పించగలిగానా?
పరాశర భట్టర్ వలె వాగ్ధాటితో పండితులను గెలువగలిగానా?
ఎంబార్ వలె పామునోట్లో చేయి పెట్టి ముల్లు తీసి దాని బాధ నివారించగలిగానా?
గుంపును చెదరగొట్టడానికి కొరడా ఝళిపిస్తుంటే ఒక భుజానికి తాకిందని మరొక భుజాన్ని కూడా కొరడాతో కొట్టమని భట్టర్ వలెచెప్పగలిగానా?
కులం వల్ల నది ఆవలి తీరాన నదీ ఘాట్ కు వెళ్లి నారాయణుని సేవలో భాగంగా భాగవారై వలె ప్రభాత వందనాలు చేయగలిగానా?
తిరుక్కోలూరు దివ్యదేశంలో ఉండాలంటే ఎంతో గొప్పవారై ఉండాలని ఆమె ఉద్దేశ్యం.
తమిళ నాట వైష్ణవ భక్తి సామ్రాజ్యానికి బాటలు వేసే అద్భుత వాక్యాలుగా ఇవి తమిళ భక్తి సాహిత్యంలో నిలిచిపోయాయి.
ఈ…
81 వైష్ణవ రహస్యాలను వడివడిగా వినిపిస్తే రామానుజులు అవాక్కయిపోయారు.
ఇవి నిగూఢమైన భక్తి సూత్రాలని అందరూ తెలుసుకోవలసినవని అంటారు.
ఆమె చెప్పిన ఒక్కొక్క ప్రశ్నరూప వాక్యం ఒక్కొక్క భక్తుడి విశిష్ఠ ఘట్టానికి ప్రతీక.
ఆమె పేరు పెన్ పిళ్లై. రామాయణ భారత భాగవతాలలోని అద్భుత కీలక సన్నివేశాలను అందులో ధర్మసూక్ష్మాలను వివరించే ఈ ప్రశ్నలు తమిళ వైష్ణవ సాహిత్యంలో తిరుక్కోలూర్ పెన్ పిళ్లై భక్తి రహస్యాలుగా వినుతికెక్కినాయి.
ఆమె అద్భుత జ్ఞానానికి, భక్తికి మెచ్చి రామానుజులు ఆమె ఇంటికి వెళ్లారు. తన సన్యాసి నియమాన్ని పక్కన బెట్టారు. ఆమె వండి వడ్డిస్తే సాపాటు (భోజనం) చేసారు. ఆమెకు తీర్థప్రసాదాలు స్వయంగా ఇచ్చారు. తరువాత ఆమెకు ఉపదేశం చేసి శిష్యురాలిని చేసారు. లింగ కులభేదాలు పాటించని రామానుజుడు తన సమతా విధానాన్ని మరోసారి చాటుకున్నారు.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment