*బుజ్జి కథలు*
*12. జాతకం*
విజయ్, కిశోర్ ఇద్దరూ ఒక ఈడువారే. ఇద్దరూ పాఠశాలలోను కళాశాలలోను ఒకే బెంచి పై కూర్చుని చుదువుకునేవారు. వారిద్దరూ పుట్టింది ఒకేరోజు, ఒకే గడియలోనే అని వారి తల్లిదండ్రులు చెపుతూ వుండేవారు. డిగ్రీ చదివే వరకు ఇద్దరి ఆర్ధిక పరిస్థితి ఒకే విధంగా ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక విజయ్ కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆర్ధికంగా ఎదిగాడు. కిశోర్ ఎదుగుబొదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు.
తన భవిష్యత్తు తెలుసుకోవటం కోసం జాతకం చెప్పేవారిని ఆశ్రయించాడు కిషోర్. "నీవు పుట్టిన గడియ, వారం నీ జాతకానికి సరిపడలేదు" అని చెప్పారు వారు. నీ నుదుట ఉద్యోగ రాత లేదన్నారు. ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదన్నారు. వారి మాటలకు నిరాశ పడ్డాడు. ఇక తన జీవితం ఇంతే అని సరి పెట్టుకున్నాడు. ఏ పని చేయకుండా, ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉండిపోయాడు.
కొన్నాళ్ల తరువాత ఓ రోజు మిత్రుడు విజయ్ కలిసాడు. ఏం చేస్తున్నవని అడిగాడు. "నా జాతకం ఇలా వుంది. పుట్టిన గడియను బట్టి మన జాతకం రాసి ఉంటుంది. నాకు ఉద్యోగ యోగంలేదు. అందుకే ఏ ప్రయత్నం చేయటంలేదు." అన్నాడు కిషోర్.
విజయ్ నవ్వి. "పిచ్చివాడా! జాతకాలు లేవు, గీతకాలులేవు. జన్మగడియలు అసలే లేవు. అలా ఉంటే మనిద్దరం ఒకే గడియలో ఒకేరోజు పుట్టాం. మరి నాకు ఉద్యోగం రాలేదా? నీవు కూడా కృషి , ప్రయత్నం చేయి. తప్పకా వస్తుంది" అన్నాడు.
కిషోర్ ఆరోజునుండి ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించాడు. ఓ మంచి ప్రవేటు కంపినీలో ఉద్యోగం వచ్చింది. ఆ పనిని అంకితభావంతో చేసాడు. అతడి కష్టపడే తత్వానికి మెచ్చి ఏడాదిలోపే పదోన్నతి ఇచ్చారు. ఇలా అంచలంచలుగా ఎదిగి ఆ కంపినీకి జనరల్ మేనేజర్ అయ్యాడు. విజయ్ కన్నా ఎక్కువ జీతం పొందగలుగుతున్నాడు.
పిల్లలూ! జాతకాలు నమ్మి మోసపోకూడదని ఈ కధ ద్వారా తెలుస్తుంది కదూ. మనం చేసే కృషే మన అభివృద్ధికి సోపానం. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
*౼ డా.దార్ల బుజ్జిబాబు*
No comments:
Post a Comment