విష్ణుశర్మ వీవేకం (నీతికథ)
పూర్వం ఒక రాజ్యాన్ని పరిపాలించే మహారాజు, ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటూ, రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నా, రాజు మాత్రం విచారంగా ఉండేవాడు. అతని నలుగురు కొడుకులకూ విద్యలేకుండా ఉండుటే అతని విచారానికి కారణం. అతనికి వృద్ధాప్యం వస్తే, అయొగ్యులైన పుత్రులకు రాజ్యభారం ఎలా అప్పగించటం అని అతను విచారంతో ఉంటూ ఉండేవాడు. వీరికి ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పించి, వివేకవంతులుగా తీర్చిదిద్దమని ప్రతీ పండితుణ్ణి కోరేవాడు, కానీ ఎవ్వరూ సాహసించలేదు. విష్ణుశర్మ అనే పండితుడు ముందుకువచ్చి, రాకుమారులకు విద్యాబుద్ధులు నేర్పించి, యోగ్యులుగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చాడు.
రాకుమారులు ప్రతిరోజూ పావురాలని ఎగురవేస్తూ ఆడుకుంటూ ఉండేవారు. విష్ణుశర్మ కూడా ప్రతిరోజూ వారితోపాటు పావురాలను ఎగురవేస్తూ,ఆడుతూ -- పాడుతూ, అలా వారితో స్నేహం చేసి, వారికి దగ్గరయ్యాడు.
ఒకరోజు విష్ణుశర్మ వారితో "నేను మీకు ఒక పోటీ పెడతాను, ఆ పోటీలో గెలిచినవారికి మిఠాయిలు పంచిపెడతాను, మీరు సిద్ధమేనా" అని అడిగాడు. వారు ఉత్సాహంగా ఆ పోటీ ఏమిటి అని అడిగారు. తెలుగుభాష అక్షరాలు ఎలా ఉంటాయో ముందుగా వాళ్ళకి తెలియపరచాడు. "ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పావురాల కాళ్ళకు కట్టి ఎగురవేస్తాను, "క" అనే అక్షరం ఎవరైతే తెస్తారో, వారికి నేను ఒక బహుమతీ ఇస్తాను", అని చెప్పాడు. అదివిని రాకుమరులంతా "క" అనే అక్షరాన్ని వెతకటానికి బయలుదేరారు.
కనపడ్డ ప్రతీ పావురానికి కట్టివున్న అట్టలను వెతకటం, ఆ అక్షరాన్ని శ్రద్ధగా పరిశీలించటం చేయసాగారు. ఆ అక్షరం ఏమిటో, ఎలా దాన్ని చదువుతారో తెలుసుకున్నారు. ఇలా ప్రతీరోజూ విష్ణుశర్మ వారికి ఒక్కోరకమైన పోటీ పెట్టి, ముందుగా అక్షరాలూ, ఆతర్వాత పదాలు, వాక్యాలు, వ్యాకరణం.......ఇలా అన్నీ నేర్పించసాగాడు. రాకుమారులలో కూడా ఉత్సాహం, జిజ్ఞాస కలిగి క్రమంగా అందరూ మంచి విద్యార్థులై, సకల శాస్త్రాలూ నేర్చుకున్నారు. విష్ణుశర్మ బోధనలో మంచి రాజినీతిజ్ఞులుగా తయారయ్యారు.
నీతి ఏమిటంటే-----"మంచి గురువు అనేవాడు, విద్యార్థులకు తెలిసిన దాని నుండి ఆరంభించి... తెలియనిదానిని నేర్పించటమే అసలు సిసలైన మంచి విద్యాబోధన"
No comments:
Post a Comment