*దండ సర్ప మారణ న్యాయము*
**************
*దండము అంటే కఱ్ఱ. సర్పము అంటే పాము. మారణము అంటే చంపడం.కర్రతో పామును చంపుట అని అర్థం.*
*విష పూరితమైన కట్ల పాము ,త్రాచుపాము లాంటివి అప్పుడప్పుడూ దారి తప్పి జనావాసాలలోకి వస్తూ వుంటాయి.అవి చిన్నవైనా, పెద్దవైనా వానిని చంపడానికి అనువైన ఆయుధం కర్రనే.అవి తలఎత్తే లోపు వాటికి మరీ దగ్గరగా పోకుండా దూరం నుండే చంపడానికి పొడగాటి కర్ర ఉపయోగపడుతుంది.అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు.*
*దీనిని వ్యక్తులుగా మనకు అన్వయించి చూస్తే ..పాము లాంటి దురలవాటు కానీ, దురాలోచన, స్వార్థం కానీ మనలోకి ప్రవేశిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా దాన్ని వెంటనే గుర్తించి సమూలంగా తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.దానికి కర్రలాంటి క్రమశిక్షణ చాలు.*
*అంతే కానీ మనల్ని మనం కఠినంగా హింసించు కోవాల్సిన అవసరం లేదు.*
*పామును చంపడానికి పొడగాటి కర్ర చాలు కానీ గొడ్డలి పట్టుకుని బయలు దేరాల్సిన అవసరం లేదు కదా!.*
*దీనినే మరో పార్శ్వంలో చూద్దాం.చిన్న సమస్య అయినా అది చిలికి చిలికి గాలి వానలా కాకుండా పెద్ద తరహాగా వ్యవహార దక్షతను కనబరిచి సమస్యను పరిష్కరించుకోవాలి.*
*చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి మన చేయి దాటి పోయే ప్రమాదమూ లేకపోలేదు.*
*కాబట్టి సమస్య అయినా,పామైనా, మనలో పొడసూపే విపరీత భావనలైనా ఆదిలోనే త్రుంచేటందుకు తగు ప్రయత్నాలు జరగాలి.ఇవన్నీ పాముల్లా విషపూరితమైనవి.కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.*
*లేదంటే "గోటితో పోయేది గొడ్డలి దాకా పోతుంది.ఇలా ప్రతి న్యాయము వెనుక అంతర్లీనంగా మనకో హెచ్చరికతో పాటు హితకరమైన సందేశం ఉందని గ్రహించ వచ్చు.*
*ఇలా దండ సర్ప మారణ న్యాయమును సాధారణ ఉదంతాలకూ, మానవీయ జీవన విలువలకూ ఉపయోగించవచ్చు.*
*ప్రభాత కిరణాల నమస్సులతో 🙏*
No comments:
Post a Comment