భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ. చదివితే.. మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది.
భక్తుడు : స్వామీ.. ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి...?
భగవంతుడు : ఏం జరిగింది...? నా వల్ల వచ్చిన ఇబ్బందేమిటీ...?
భక్తుడు : ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే..! ఆఫీసులో అర్జంటు పని ఉందని... తొందరగా నిద్ర లేచేందుకు అలార్మ్ పెట్టి పడుకున్నాను... అది మ్రోగలేదు... దాంతో నేను లేటుగా లేచాను.
భగవంతుడు : అంతేనా...?
భక్తుడు : ఇంకా ఉంది. ఈ రోజే ఎప్పుడూ మొరాయించని నా కారు కూడా ఇబ్బంది పెట్టింది. దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది.
భగవంతుడు : అంతేగా...?
భక్తుడు : అప్పుడేనా...? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ కు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేటయ్యి మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం వృథా అయింది.
భగవంతుడు : సరే..ఇంకా...?
భక్తుడు : పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..స్నేహితుడితో మాట్లాడుతున్న ఫోను సడన్ గా కట్ అవడం...మళ్ళీ చేసేలోపు..బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం...ఏంటివన్నీ...?
భగవంతుడు : అయిపోయాయా...?
భక్తుడు : అసలైంది ఇప్పుడే స్వామీ...! చాలా అలసిపోయి, ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే, సరిగ్గా అప్పుడే ఫ్యాను, ఏ.సి. రెండూ ఒక్కసారే పని చేయకపోవడం... ఎందుకు స్వామీ.. నా మీద ఇంత కక్ష నీకు...?
భగవంతుడు : సరే..! నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను..!
ఇవాళ ప్రొద్దున్న అలార్మ్ మ్రోగితే నువ్వు వెంటనే స్నానానికని బాత్రూమ్ కు వెళ్ళేవాడివి. కానీ..ఆ సమయంలో అక్కడ ఒక నల్ల త్రాచు పడగవిప్పి సిద్ధంగా ఉంది. అందుకే అది వెళ్ళిపోయాక నువ్వు మేల్కోవాలని, అలార్మ్ మ్రోగనివ్వలేదు.
కారు మొరాయించకుండా ముందే బయల్దేరి వుంటే ఒక త్రాగుబోతు నడుపుతున్న ట్రక్కు వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగేది.
ఇక భోజనమంటావా , నువ్వెళ్ళిన సమయంలోనే అక్కడి వంటవారు సాంబారులో ఒక బల్లిని గమనించారు...దాంతో ఆ మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, మళ్ళీ సాంబారు కాచి వడ్డించడం వల్ల లేటయ్యింది.
కారులో నీతో ఫోను మాట్లాడుతున్న వ్యక్తి మీ బాస్ దగ్గర నీ పరువు తీయాలనుకున్నాడు. ఆ కుట్రలో భాగమే ఆ ఫోను. ఆ క్షణంలో ఫోను బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్నేమీ చేయలేకపోయాడు.
చివరిగా...ఫ్యాను, ఏ.సి. అంటావా... అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యుట్ జరిగి.. ఆ రాత్రంతా నువ్వు చీకట్లో గడపాల్సి వచ్చేది. అవసరమంటావా...చెప్పు ?
భక్తుడు : స్వామీ...నా అజ్ఞానాన్ని మన్నించు. నన్ను కాపాడడానికే ఇవన్నీ చేసావని అర్ధం చేసుకోలేక నిన్ను నిందించాను. క్షమించు స్వామీ..!
భగవంతుడు : క్షమాపణ అడగడం కాదు... నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో..! ఏం జరిగినా... మన మంచికే అనుకోవాలి. మీ దగ్గర ప్రణాళికలెన్ని ఉన్నా.., మీకు మంచి జరిగే అత్యుత్తమ ప్రణాళిక నేనెప్పుడో సిద్ధం చేసి ఉంచాను.
శుభం భూయాత్....!💐
Ganga Swaroop Varanasi: ధర్మసూక్ష్మం
పూర్వం త్రేత, ద్వాపరయుగాల సంధిలో ప్రజలు చేసిన పాపాల వల్ల వర్షాలు లేక పన్నెండేళ్ళపాటు కరువు సంభవించింది. భూమి బీటలు వారింది. ఏరులూ, చెరువులూ, కుంటలూ ఎండిపోయాయి. వ్యవసాయపు పనులు మందగించాయి. చెట్లూ, లతలూ వసివాడిపోయాయి. పశువులు మేత లేక చచ్చిపోయాయి. రాజులు ధర్మం తప్పి ప్రజల ధనధాన్యాల్ని లాక్కున్నారు. యాగాలూ, దేవతార్చనలూ కుంటుపడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు తప్పిపోయాయి. తినటానికి తిండి లేక జనులంతా మలమల మాడసాగారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలతో ఘోరంగా ఉంది.
ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహాముని ఆకలికి ఓర్చుకోలేక, తిండి కోసం యాచించి, ఎక్కడా దొరకక ఆకలిదప్పులతో తల్లడిల్లి పోయాడు. కొంచెం దూరం అలాగే వెళ్ళేసరికి అక్కడ కొన్ని పూరిగుడిసెలు కన్పించాయి. చుట్టూరా పశువుల ఎముకలు గుట్టలు! కుక్కల పుర్రెలు! పరమ అసహ్యంగా వుంది. దుర్గంధం ముక్కు బ్రద్ధలు చేస్తోంది. అక్కడికి వచ్చేసరికి విశ్వామిత్రుడిలో అడుగుతీసి అడుగువేసే శక్తి కూడా పోయింది. కుప్పకూలిపోయాడు.
"అయ్యో! ప్రాణం పోయేటట్టుంది! ఎలాగైనా ప్రాణం నిలుపుకోవడం పరమధర్మం. ఇప్పుడు ఏం ఉపాయం ఉంది?" అని ఆలోచించటం మొదలుపెట్టాడు. అటూ ఇటూ గాలించి చూసేసరికి అప్పుడే చర్మం ఒలిచి, గాలికి ఆరబెట్టిన కుక్కమాంసం కనిపించింది. విశ్వామిత్రుడికి ప్రాణం లేచివచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే విచారం కలిగింది.
"ఇది తప్ప ప్రాణాల్ని రక్షించుకోటానికి గత్యంతరం లేదిప్పుడు. ఇది కూడా అపహరించి తినవలసిన దుర్గతి పట్టింది! ప్రాణం కాపాడుకునేందుకు వేరే ఉపాయమేదీ లేనప్పుడు దొంగతనం చేయడం, నీచులధనం ఆశించటం తప్పు కాదన్నారు. ఇదే మంచి అదను. అర్ధర్రాతి సమయం! అందరూ నిద్రపోతున్నారు. అనుకుని నిస్సత్తువగా పాకుతూ వెళ్ళి ఆ కుక్కమాంసం పట్టుకుని లాగాడు విశ్వామిత్రుడు. అక్కడకు దగ్గరలోనే పడుకున్న బోయవాడు అలికిడికి నిద్రలేచాడు. విశ్వామిత్రుణ్ణి చూశాడు.
"ఎవడురా నువ్వు. నేను నిద్రపోతున్నాననుకుని మాంసం దొంగిలిస్తున్నావా? నీ ప్రాణాలు తీస్తాను వుండు" అని ముని మీదకు వచ్చాడు వాడు.
విశ్వామిత్రుడు గడగడలాడిపోయాడు. "నేను విశ్వామిత్రుణ్ణి " అన్నాడు హీనస్వరంతో.
కిరాతుడు అదిరి పడ్డాడు. భయపడిపోయాడు. కన్నీరు కారుస్తూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. "మహాత్మా! ఎవరో అనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. తప్పు క్షమించండి! అయినా స్వామీ ఎందుకిలా చేస్తున్నారు? దీని అంతరార్ధమేమిటి?" అని వినయంగా అడిగాడు.
నాయనా! ఆకలితో శరీరం దహించుకుపోతుంది. పాపమని తెలిసి కూడా గత్యంతరం లేక ప్రాణం రక్షించుకోడానికి ఈ కుక్క మాంసం దొంగిలించబోయాను" అన్నాడు విశ్వామిత్రుడు.
"అయ్యో! మృగాలన్నిటిలో నీచమైనది కుక్క. దీని మాంసం తిని ధర్మహాని ఎందుకు తెచ్చుకుంటారు? మరో మార్గం వెతుక్కోండి మహాత్మా" అన్నాడు బోయ.
"ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏం చేసినా ధర్మమే! అదీగాక సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు నాలో వున్నాడు. అగ్నిస్పర్శతో సర్వదోషాలూ నశిస్తాయి. బతికివుంటే తపస్సు వల్లా విద్యవల్లా పాపం పోగొట్టుకుంటాను. ఈ మాంసం ఇప్పుడు నా ప్రాణాధారం. నువ్వెన్ని చెప్పినా తినక మానను" అన్నాడు.
"ఇది చాలా నీచం స్వామీ!" అన్నాడు కిరాతుడు మళ్ళీ.
"అగస్త్యుడు రాక్షస మాంసం తిన్నాడు. అంతమాత్రంచేత ఆయన తేజస్సూ, పెంపూ నశించాయా? నా ఆత్మ బ్రహ్మజ్ఞానం కలది. అందుచేత నేను ఈ మాంసం తినడం వల్ల నాకు ఏ పాపమూ అంటదు. నువ్వు మాత్రం నాకు అడ్డు రాకు" అన్నాడు విశ్వామిత్రుడు.
"అయ్యా! మాంసం పోతుందనే చింతేలుదు నాకు. ఈ పనివల్ల మీకు తేజోహాని కలుగుతుందని దిగులుగా ఉంది" అన్నాడు బోయ.
"నాయనా! నీకు నా మీద దయ అనేది వుంటే ఈ మాంసాన్ని నువ్వే నాకు ఆహారంగా ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి పుణ్యం కట్టుకో. దానివల్ల నాకు దొంగతనం చెయ్యవలసిన అవసరమూ ఉండదు" అన్నాడు ముని.
"అయ్యా! మహిమాన్విత పుణ్యదీప్తుడవు నువ్వు. నీచుడైన నాదగ్గరనుంచి ఏదైనా యాచించటం.... నాకు భయంగా వుంది స్వామీ! మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి" అంటూ బోయ కుక్కమాంసం ఇచ్చేశాడు. దాన్ని తిని ప్రాణం నిలుపుకుని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు.
తరువాత ఇంద్రుడు కరువుతీరేలా వర్షించాడు. విశ్వామిత్రుడు నియమంతో తపస్సు చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడు.
కనుక ఆపద సమయాలలో అనుసరించతగిన ధర్మాలు సాధారణ ధర్మాలకు భిన్నంగా వుంటాయని తెలుసుకోవాలి.
No comments:
Post a Comment