*సంస్కర్తలు... బ్రహ్మజ్ఞాని.....*
మానవుని ఆయుస్సు వందేళ్లు. రెప్పపాటు జీవితం.
కానీ తానెవడో, ఈ భూమ్మీదకు ఎందుకొచ్చాడో తెలుసుకోకుండా.. ప్రపంచ స్థితిగతుల్ని మార్చాలని తన జీవితమంతా దారబోసి, ఏదో చేయబోతాడు చివరకు ఏదో జరుగుతోంది.. ఇదంతా సంఘసేవ అని చంకలు గుద్దుకుంటాడు. కానీ వాని సిద్ధాంతాలు వలన లోకం మరింత గందరగోళంగా తయారై ఉంటుంది. అప్పటికి వాడుండడు. వాడి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించి, ఉపాధ్యాయులు పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తారు.. "ఆదర్శపురుషులు" అని చెప్పి.
వ్యక్తిగతమైన సంస్కరణలోనే సంఘ సంస్కరణ ఇమిడి ఉంది అన్న గొప్ప రహస్యాన్ని మన ఋషులు కనుగొన్నారు. అందుకే మన ప్రాచీన భారతంలో.. ఋషులు ఉన్నారేగాని సంఘ సంస్కర్తలు లేరు.
అందుకే రామతీర్థులు.. "సంస్కర్తలు కావలెను.. అర్హత: తమను తాము సంస్కరించుకుని ఉండవలెను" అని పత్రికాప్రకటన ఇచ్చారు. దాని అర్థమేమంటే తనను తాను సంస్కరించుకుంటే మరొకరిని సంస్కరించడానికి వానికి ఇతరం, ఇతరులు గోచరించరు.
అందుకే భగవాన్.. ప్రపంచం సంగతి ప్రపంచం చూసుకుంటుంది. నీ సంగతి నీవు చూసుకో అనేవారు. అద్దంలో చూసుకుని తలదువ్వుకుంటే, ఏకకాలంలో ప్రతిబింబంలోని తల కూడా దువ్వబడే ఉంటుంది. ఈ ప్రపంచం తన ప్రతిబింబమే.. ఈ వ్యక్తిగతమైన సంస్కరణలో భాగమే
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమములు.. మన భారతీయ జీవన విధానంలోనే సంఘసంస్కరణ ఇమిడి ఉంది.
"సంఘసంస్కరణ" అనే ఓ ప్రత్యేక కార్యక్రమం ఏమీ అవసరం లేదు. సంఘాన్ని సంస్కరించడానికి కొంపా గోడు వదిలేసి దేశం మీద పడనక్కర్లేదు.. ఎవడికి వాడు వాడి వాకిలి శుభ్రం చేసుకుంటే, ఏకకాలంలో ఊరంతా శుభ్రమౌతుంది.. అంతేగాని నీవు చీపుర తీసుకుని ఊరినంతటినీ శుభ్రం చేయాలనుకోవడం మూర్ఖత్వం.
వివేకానంద అంతటివాడు విసిగిపోయి.. "ఈ లోకం కుక్క తోక వంటిది. అది అలానే ఉండడం దాని స్వభావం" అన్నారు.. సంస్కర్త తాను జీవించి ఉన్నంతవరకు కుక్కతోకను లాగి పట్టుకుని ఉంటాడు. వాడు మరుగవ్వగానే మళ్లీ వంకరే.
మరి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా.. అంటారేమో.. నిజమే ఆ ఒక్కడు వేదబ్రాహ్మణుడు.
ప్రాచీన భారతంలో చక్రవర్తులు సైతం వారి రాకతో సింహాసనం మీద నుంచి లేచి ఎదురేగి అతిధిసత్కార్యాలు ఘనంగా చేసేవారు.. బ్రాహ్మణుడు అంటే కుల సంబంధమైన వ్యక్తి అని కాదు. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు అని అర్థం.
అనగా.. తనను తాను సంస్కరించుకున్నవాడు అని అర్థం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు వాడు చంఢాలుడైనా సరే వాడు బ్రాహ్మణుడే.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించే సద్గురువును బ్రహ్మజ్ఞాని అనవచ్చు. నిన్ను అంతర్ముఖంలోకి నెట్టేవాడు యెవడైనా సరే వాణ్ణి బ్రహ్మజ్ఞాని అనవచ్చు.
ఎవడి పని వాడు చేసుకుంటే అదే గొప్ప దేశ సేవ అవుతుంది. నీ "కుటుంబం" అనే చిన్న యూనిట్ కు నీవు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగితే చాలు
లోకానికంతా నీవు మేలు చేసినవాడివే అవుతావు
అంటారు ఓ గురువుగారు.. నీవు, నీ కుటుంబం వరకే చూసుకో చాలు.. అనే మాటలు స్వార్థపరమైనవిగా అనిపిస్తాయి. కానీ కాదు.
"సేవ" అనే మాట కంటే మోసపూరితమైన మాట మరొకటి లేదు అంటారు ఆ గురువుగారు. ప్రతి ఒక్కరూ తాను, తన కుటుంబం వరకే చూసుకుంటే.. దేశంలో ఇంతమంది అనాధలు ఉండరు. ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండవు. దేశంలో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరగడం దేశాభివృద్ధి కాదు.
కుటుంబ వ్యవస్థ కుంటుపడడమే వీటికి కారణం.
నేల విడిచి సాము చేయరాదు.. తన్ను విడిచి సేవ చేయరాదు...
*|| ఓం నమః శివాయ ||*
No comments:
Post a Comment