Sunday, September 3, 2023

జలమౌక్తిక న్యాయము

 *జలమౌక్తిక న్యాయము*
**************
*జలము అంటే నీరు. మోక్తికము అంటే ముత్యము.*

*ముత్యపు చిప్పలో పడిన నీరు ముత్యము అవుతుంది. "సమయం వచ్చినప్పుడు అల్పుడు కూడా దొడ్డవాడు అంటే గొప్పవాడవుతాడు' అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.*

*నీరు ఆకాశం నుండి భూమి మీద పడేటప్పుడు స్వచ్ఛమైనదే కానీ అది పడే తావులను బట్టి దానికి విలువ  పెరుగుతుంది.గౌరవం కలుగుతుంది.దీనిని వ్యక్తులకు వర్తింప చేస్తే ఎలా ఉంటుందో ఈ జల మౌక్తిక న్యాయమునకు సంబంధించిన చక్కని  భర్తృహరి సుభాషితమును చూద్దాం.*

*'నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు నా /నా నీరమె  ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా /నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్/ భౌరుష వృత్తు లిట్లదము మధ్యము నుత్తము గొల్చు వారికిన్!'*

 *నీరు  కాలుతున్న పాత్రపై పడితే కనిపించకుండా ఆవిరైపోతుంది/ నశిస్తుంది.అదే నీరు తామరాకు మీద పడితే ముత్యం వలె కనిపిస్తుంది.అదే నీరు ముత్యపు చిప్పలో పడితే నిజమైన ముత్యమై ప్రకాశిస్తుంది.*

*అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వం కూడా. చేసే స్నేహాన్ని బట్టి పరిస్థితులు, పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది.*

*వేడి పాత్రలాంటి దుర్జనులతో చేరితే అధముడుగా పేరు కూడా లేకుండా నశించి పోతాడు.మంచి చెడులు మధ్యస్థంగా ఉన్న వారితో  చేరితే తామరాకుపై నీటిబొట్టులా కొంతైనా గుర్తింపు పొందగలడు.అదే ముత్యపు చిప్ప లాంటి మంచి వారితో చేరితే మంచి గుణాలను కలిగి ఆణిముత్యమై సమాజంలో గౌరవ, మర్యాదలతో ప్రకాశిస్తాడు.*

*శీల నిర్మాణం నిర్మాణము అనేది కుటుంబం నుండే మొదలవుతుంది కాబట్టి బాల్యం నుంచే వారికి నైతికత, మంచి నడవడిక  నేర్పాలి.అలాగే  వారిలో సహకారం, సామాజిక స్పృహ, దేశభక్తి,నీతీ నిజాయితీ లాంటి  మానవీయ విలువలు నేర్చుకునేలా  పాఠశాలతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాలి.అప్పుడే  ముత్యమంటి చక్కని వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు.  సమాజానికి  మేలు చేసే మానవతా తరం రూపొందుతుంది.*

No comments:

Post a Comment