Monday, October 23, 2023

తత్వమసి తత్వార్ధము - అవతార ఉపాసన

 🌸 *అమృతం గమయ* 🌸

*వ్యర్థ ప్రేలాపనలు కట్టిపెట్టు*
*పరమాత్మపై దృష్టి పెట్టు*
*అప్రస్తుత ప్రసంగాలు నిలువరించు*
*ఏకాగ్రత దృష్టిని కలిగి ఉండు*
*భగవద్దర్శనానికి ప్రాథమిక అర్హతలు ఇవే*

*సత్ చిత్*

*తత్వమసి తత్వార్ధము - అవతార ఉపాసన*

అష్ట కర్మ శ్రియాదక్ష్మ మొహం పుణ్యవర్ధనం
ఆయురారోగ్యదం సౌమ్యభం మృత్యు భయాపహం

శాస్తా యొక్క- యంత్రము, వశ్యము, స్తంభనము మొదలగు అష్ట కర్మ కార్యములందు పూజ చేసినచో తప్పక ఫలితములు సిద్ధించును. ఇది ఆయురారోగ్యమును ప్రసాదించునది, పుణ్యమును వృద్ధి చేయునది, సుఖమును ప్రసాదించునది, అకాల మృత్యువును పోగొట్టునది” అని వర్ణించుచున్నది ఆకాశ భైరవ కల్పము.

పైన తెలిపినవన్నియూ కత్తిమీద సాము వంటివి. కలికాలము నాటి మానవులకు ఇది సాధ్యము కానిది. అనన్యమైన భక్తి భావము, తల్లి వద్దకు బిడ్డ చేరునట్టి లాలిత్యము, సౌమ్యత్వము స్వామిని చేరుకొనుటకు ఇవి చాలును.

ఏకాంతవాసా, నన్నేలు ఈశా, ,
నా మనవి చేరలేదా నీచెంత పరమేశా॥

ప్రత్యేకమైన ఏ కోరికలూ లేక స్వామిని శరణాగతి కోరువారికి తల్లీ, తండ్రి, గురువు, దైవమూ అన్నీ తానే అయి, వారికి సకలమూ ప్రసాదించువాడూ ఆ దయాపరుడు.

భక్తియే, ప్రార్థనకు పునాది అయిననూ, సంప్రదాయ తీరులను మన ఇష్టము వచ్చిన రీతిని అనుసరించుట మార్చుకొనుట తగదు. పూజలు, మంత్ర ఉచ్ఛాటనలు, ఉపాసన మొదలగువాటిని అందులకు సద్గురువుల మార్గ నిర్దేశంలో సరియైన సాధన చేసిన వారు చేయుటయే ఉత్తమము.

ఇందులకు తగిన విజ్ఞుల పర్యవేక్షణలో చేయుటయే ఉత్తమము. వారి వద్ద ఉపదేశము పొందిన తరువాతనే పూజలు చేయుటకు అర్హతను పొందగలుగుదురు.

స్వామి యొక్క పూజావిధానము, నిర్దేశించబడిన కట్టుబాట్లు పాటించుచూ, నియమము తప్పక పూజించువారికి, కల్పవృక్షము వలె అన్ని వరములనూ ప్రసాదించునది.

సకల జగత్తునకు కారణ భూతుడైన, శ్రీమహాశాస్తా యొక్క ఉపాసనా విధానము మిక్కిలి ఉన్నతమైనది. మహాశాస్తా యొక్క ఉపాసనా విధానమున పండితులు పలువురు, ప్రత్యేకమైన పద్ధతిని సూచించిరి.

"కలౌ శాస్త్రు వినాయకౌ” అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవముగా వరములను అనుగ్రహించువాడు పరమదయాపరుడైన హరిహరపుత్రుడు. వ్రత కల్పములనునవి వేదములందలి భాగములే. ఒక కార్యమును పద్ధతి ప్రకారము ఎట్లు ఆచరించవలెనో తెలియజేయునది. ఇవి పటలం, పద్ధతి, ప్రయోగం, కవచం, నామావళి అని ఐదు విధములైన పంచాంగములుగా చెప్పబడుచున్నవి.

1. పటలం:

మూలమంత్రము యొక్క ప్రాశస్త్యము, సాంప్రదాయము, దానిని సూచించిన ఋషి, ఛందస్సు, దేవత, న్యాసములు, ధ్యానము, మంత్రము వీటిని గురించి తెలియజేయునది. 

2. పద్ధతి:

ఉదయము లేచినంతనే చేయవలసిన ప్రాతఃస్మరణము, స్నానము మొదలుకుని యంత్రపూజ, , దేవతాపూజ, బలిపూజ, తర్పణము, హోమము మొదలగు వాటిని వివరించునది.

3. ప్రయోగము:

వశ్యము, మోహనము, ఉచ్ఛాటనము, స్తంభనము, భేదనము, ఆకర్షణము, విద్వేషణము, మారణము వంటి ఎనిమిది కర్మలను చేయు విధానమును తెలుపునది.

 4. కవచము:

తల మొదలుకొని పాదముల వరకూ గల స్థూల శరీర ప్రాణగత అవయములు కాపాడి ధర్మరక్షణ లో ధర్మకర్మలను ఆచరించుటకు వేడుకొను విధానము.

5. నామావళి:

అష్టోత్తరశతం, సహస్త్రనామం, త్రిశతి వంటి నామావశులలో కూడుకున్నది.

శ్రీమహాశాస్తాకి పలురకములైన పూజావిధానములు అమలులో ఉన్నవి. కానీ వాటిలో శివ, పార్వతుల సంభాషణలో వారే స్వయముగా తెలియజేసిన ఆకాశభైరవ కల్పములోని శ్రీమహాశాస్తా పూజా విధానము ప్రత్యేకమైనది. యంత్రశాస్త్ర పద్ధతి ప్రకారము, విస్తారముగా చేయు పూజావిధానము కూడా మనకు లభ్యమగుచున్నది. కానీ అవన్నియూ కష్టసాధ్యమైనవి.

ఈ పూజా విధానము ప్రకారం చేసినచో స్వామి మిక్కిలి సంతుష్టుడై భక్తునికి, అతడి సంతతికి సకల సౌఖ్యములను ప్రసాదించుట తధ్యము.

*భక్తపరిపాలకుడు ఉత్సవమూర్తియై ఊరేగి వచ్చుచున్నాడు.*

ముల్లోకములందునూ సర్వవ్యాపియై నిండియుండు ఈశ్వరా! కరుణించుమా! భువిపై ఎచట కేగిననూ నిన్ను పొగడుచూ, స్తుతించుచూ, జీవించునట్లుగా పుత్ర,మిత్ర, కళత్ర, భక్తిముక్తి జ్ఞాన పురుషోత్తమములను నాకు ప్రసాదింతువుగాక.

*అమృతం గమయ*
*సత్ చిత్*


No comments:

Post a Comment