Monday, October 16, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, మీరు దృష్టిలో ఉన్నారు*

 *365 రోజులు✈️ హార్ట్ ఫుల్ నెస్🌍కథతో* 


 ♥️ *కథ- 38* ♥️

 *అనుభూతి -  నాలోని చైతన్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను, అది నన్ను ప్రతి క్షణం దివ్యత్వం వైపు ఎదగడానికి వీలు* *కల్పిస్తుంది.* 

  🪔 *మీరు దృష్టిలో ఉన్నారు* 🪔

 ఒకరోజు ఉదయం డోర్ బెల్ మోగింది. సిద్ధార్థ్ డోర్ తెరిచి చూసేసరికి, ఒక పొడవాటి ఆకర్షణీయమైన వ్యక్తి, ముఖంలో అందమైన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు.
సిద్ధార్థ్ "ఎవరు నువ్వు?" అని అడిగాడు.
ఆ వ్యక్తి, " నీవు ప్రతిరోజూ ఎవరికి ప్రార్థన చేస్తావో అది నేనే." అని బదులిచ్చాడు.
" క్షమించండి, కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు" అని అయోమయంగా సమాధానం ఇచ్చాడు సిద్ధార్థ్.
ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "సోదరా, నిన్ను సృష్టించిన భగవంతుడిని నేనే.! 
నీ కళ్ళు ఎప్పుడూ నా వైపే చూస్తూ ఉంటాయి,కానీ నన్ను ఎప్పటికీ చూడలేవు అని నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా. చూడు, నేను ఇక్కడ ఉన్నాను! ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను."
సిద్ధార్థ్ కి చిరాకుగా అనిపించి, "ఏమిటి ఈ వేళాకోళం?", అని అన్నాడు.
ఆ వ్యక్తి, "సోదరా, ఇది పరిహాసం కాదు. నీవు మాత్రమే నన్ను చూడగలవు. నీవు తప్ప ఎవరూ నన్ను చూడలేరు, వినలేరు", అని అన్నాడు.

సిద్ధార్థ్ ఇంకేదో మాట్లాడకముందే వెనక నుండి తల్లి  పిలిచి, "ఎందుకు ఒంటరిగా నిలబడ్డావు. ఏం చేస్తున్నావు, లోపలికి రా టీ సిద్దంగా ఉంది ", అని అంది.
ఆ వ్యక్తి మాటల్లో కొంత నిజం ఉండవచ్చని అప్పుడు అనుకున్నాడు, కాని మనసులో కొంచెం భయంగా కూడా ఉంది.
లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు.  ఆ వ్యక్తి కూడా అతని పక్కన కూర్చున్నాడు.
అతని తల్లి టీ తెచ్చింది. కప్పులో టీ కొంచెం త్రాగి, అరిచాడు, "అమ్మా ఏమిటిది? ఇంత చక్కెర వేశావు?" 
ఇలా అన్న వెంటనే, "ఈ వ్యక్తి నిజంగా దేవుడైతే, మా అమ్మపై ఇలా అరుస్తునందుకు ఖచ్చితంగా నా ప్రవర్తనను ఇష్టపడడు, " అని అనుకున్నాడు.
అందుకే తన మనసును శాంతింపజేసుకుని, 
*"ఈరోజు నువ్వు భగవంతుని దృష్టిలో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు"* అని తనకు తాను చెప్పుకున్నాడు.

ఇప్పుడు ఇంక సిద్ధార్థ్ ఎక్కడెక్కడికి వెళ్ళితే ఆ వ్యక్తి అన్ని చోట్లకు వెంట వచ్చాడు.
ఆఫీస్ కి వెళ్ళడానికి తయారయ్యాక, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నందున, మొదటిసారిగా భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థించాడు.
సిద్దార్థ్ ఆఫీసుకు బయలుదేరడానికి కారులో కూర్చున్నాడు, అప్పటికే ఆ వ్యక్తి తన పక్క సీట్లో కూర్చుని ఉన్నాడు.  దారిలో అతని మొబైల్ ఫోన్ మోగింది. కాల్ తీసుకోబోతూ, "ఈ రోజు నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు." అని గుర్తు చేసుకున్నాడు.
కారు పక్కన ఆపి ఫోన్ మాట్లాడాడు.  
మాట్లాడుతూ, "ఈ పని పూర్తి అవ్వాలంటే, అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది" అని చెప్పబోయాడు.  
కానీ తాను చేయబోయేది తప్పేమో, పాపమేమో అనుకున్నాడు. దేవుని ముందు పాపం ఎలా చేయగలడు?
 అందుకని, "తప్పకుండా! ఆఫీస్ కి రండి. మీ పని అయిపోతుంది" అని బదులిచ్చాడు.
ఆ రోజు, అతను తన సిబ్బందిపై అరవలేదు, సాటి ఉద్యోగులు ఎవరితోనూ వాదించలేదు. 
 సాధారణంగా దూషించే పదాలను ఉపయోగించేవాడు, కానీ ఈరోజు ఆ పదాల స్థానంలో 'సరే', 'ఫర్వాలేదు.' అని సరిపెట్టాడు.
మొదటిసారి కోపం, గర్వం, దురాశ, దూషించే మాటలు, మోసపూరిత మాటలు, అబద్ధాలు అతని దినచర్యలో భాగం కాలేదు.*
సాయంత్రం ఆఫీస్ నుంచి బయల్దేరి కారులో కూర్చున్నప్పుడు, పక్కనే కూర్చున్న దేవుడితో, " దేవా, సీట్ బెల్ట్ పెట్టుకో, నువ్వు కూడా కొన్ని రూల్స్ పాటించాలి!" అన్నాడు.
దేవుడి ముఖంలో సంతృప్తికరమైన ఒక చిరునవ్వు మెరిసింది.
రాత్రి, సిద్దార్ధ్ కి భోజనం వడ్డించినప్పుడు, అతను మొదటిసారిగా చెప్పాడు, "దేవుడా, ముందుగా నీవు తిను ".
దేవుడు చిరునవ్వుతో ఆ ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నాడు.
రాత్రి భోజనం తర్వాత, అతని తల్లి, "ఏమిటి విషయం? మొదటిసారి, ఆహారం గురించి ఎటువంటి ఫిర్యాదు చేయలేదు! ఈ రోజు సూర్యుడు పడమర నుండి ఉదయించాడా?" అని అంది.
అతను ఇలా జవాబిచ్చాడు, *"అమ్మా, ఈరోజు సూర్యుడు నా హృదయం నుండి ఉదయించాడు. 
సాధారణంగా రోజూ నేను ఆహారమే తింటాను, కానీ ఈ రోజు నేను ప్రసాదం (దేవునికి నైవేద్యంగా పెట్టేది ) తీసుకున్నాను, ఇందులో ఏ లోటూ లేదు."* అన్నాడు.

కాసేపు నడక తరువాత, సిద్ధార్థ్ తన గదిలోకి వెళ్లి ప్రశాంతమైన మనస్సుతో దిండుపై తల వాల్చాడు.  దేవుడు ప్రేమగా సిద్ధార్థ్ తలపై చేయి వేసి, "ఈరోజు నీకు నిద్రపోవడానికి సంగీతం, మందులు, ఏ పుస్తకమూ అవసరం లేదు" అన్నాడు.

సిద్ధార్థ్ చెంప మీద చిన్నగా ఎవరో తట్టడంతో గాఢనిద్రలోంచి లేచాడు.
"ఎంత సేపు పడుకుంటావు. ఇక లే,  ఈరోజు దీపావళి" అంటున్న తల్లి గొంతు వినిపించింది.
బహుశా అది ఒక కల అయ్యుండచ్చు... అవును, ఇది ఒక కల!  

ఇప్పుడు సిద్దార్ధ కి ‘ఆయన సంకేతం’  అర్థమైంది.  

*" నీవు దేవుని దృష్టిలో ఉన్నావు"* అని అనుకున్నాడు.

ఆయన మన కనుచూపు మేరలోనే ఉంటాడు .......ఈ కల సిద్దార్ధ కి  ప్రతీక్షణపు  అవగాహనా భావం కలిగింది. 
ఆ రోజు, అతని హృదయం దివ్యకాంతితో నిండిపోయింది.  
చెమ్మగిల్లిన కళ్లతో "అమ్మా! దీపావళి శుభాకాంక్షలు" అని తల్లికి శుభాకాంక్షలు తెలిపాడు.

       ♾️

 *ప్రతి అడుగులో, అనుక్షణం నా లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవడానికి, నాలో ధైర్యం* *ఉండాలి.* 

 *దాజీ* 


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team

No comments:

Post a Comment