*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ - 35 ♥️*
*అనుభూతి - నాలో ఉన్న అపరిమితమైన అవకాశాలకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.*
*(అజ్ఞాత) దాగిఉన్న లక్షణాల ప్రాముఖ్యత*
వసంత ఋతువులో, అడవి మధ్యలో ఒక గులాబీ మొక్క తన పువ్వుల అందాలను ఆరబోస్తోంది. సమీపంలోని కొన్ని దేవదారు వృక్షాలు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. ఒక దేవదారు చెట్టు గులాబీని చూస్తూ, "గులాబీ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. నేను అంత అందంగా లేనందుకు చాలా బాధగావుంది." అని అంది.
" మిత్రమా, బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ అన్నీ ఉండవు" అని మరొక దేవదారు చెట్టు సమాధానం ఇచ్చింది.
వారు మాట్లాడుకోవడం విన్న గులాబీ తన అందాన్ని చూసుకుని మరింత గర్వపడింది.
" ఈ అడవి అంతటికి నేనే చాలా అందమైన దానిని" అని అంది.
దీనికి పొద్దుతిరుగుడు పువ్వు అభ్యంతరం చెబుతూ, "అలా ఎలా చెప్పగలవు? ఈ అడవిలో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి వాటన్నిటిలో నీవు ఒకదానివి మాత్రమే " అని అంది.
"కానీ అందరూ నన్ను చూసే మెచ్చుకుంటారు" అని గులాబీ చెప్తూ, "చూడు ఈ ముళ్ల మొక్క ఎంత అసహ్యంగా ఉందో? దీని మీద అన్నీ ముళ్ళే ఉన్నాయి. ఎవరూ దీనిని మెచ్చుకోరు." అని అంది.
" మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?" , ఈసారి దేవదారు చెట్టు అడ్డుపడింది, "నీకూ ముళ్ళు ఉన్నాయి! అయినా కూడా నీవు అందంగా ఉన్నావు కదా."
దీనిపై గులాబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "నీకు అందం అంటే అర్థం కూడా తెలియదు. నా ముళ్లను, ఆ ముళ్లకంప ముళ్లను పోల్చలేవు. మా ఇద్దరిలో చాలా తేడా ఉంది! నేను అందంగా ఉన్నాను, అదిలేదు" అని చెప్పింది.
" నువ్వు అహంకారంతో ఉన్నావు, గులాబీ," అని అంటూ, దేవదారు చెట్టు తన కొమ్మలను పక్కకు వంచింది.
వీటన్నింటి మధ్య, ముళ్ల మొక్క మౌనంగా ఉండిపోయింది.
కానీ గులాబీ కోపంగా ముళ్ల మొక్క దగ్గరనుండి తన వ్రేళ్ళని పెకిలించిడానికి ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. కాసేపు ప్రయత్నించిన తర్వాత, "నువ్వు పనికిరాని మొక్కవి. నీలో అందం లేదు, నీకేమీ ప్రయోజనం లేదు. నీతో కలిసి ఉండవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను" అని గులాబీ కోపంగా ఆ ముళ్లమొక్కతో చెప్పింది.
గులాబీ మాటలకు ముళ్లమొక్క బాధపడింది, కానీ "భగవంతుడు ఎవరికీ అర్ధంలేని జీవితాన్ని ఇవ్వలేదు" అని మాత్రం అంది. గులాబీ పట్టించుకోలేదు.
వాతావరణం మారిపోయింది, వసంతకాలం వచ్చింది. ఎండ వేడిమి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోవడం మొదలయ్యాయి. గులాబీ కూడా వాడిపోవడం మొదలైంది.
ఒక రోజు, ఒక పక్షి ముళ్ల మొక్కపై కూర్చుని దాని ముక్కును ఆ మొక్క కొమ్మలో దూర్చిఉంచడం గులాబీ చూసింది. కొంతసేపటికి పక్షి చాలా తాజాగా కనిపించింది, అక్కడి నుండి ఎగిరిపోయింది.
గులాబీకి పక్షి ముళ్ల మొక్క మీద కూర్చుని ఏమి చేసిందో అర్థం కాలేదు. అది దేవదారు చెట్టును అడిగింది, “ఈ పక్షి ఏమి చేస్తోంది?” దేవదారు చెట్టు, “పక్షి, ముళ్లమొక్క నుండి నీరు తీసుకుంటోంది.” అని చెప్పింది.
" అయ్యో, అయితే పక్షి పొడుస్తున్నప్పుడు ముళ్ళమొక్కకు బాధ కలిగివుండాలి కదా," అని గులాబీ అడిగింది. “ ఖచ్చితంగా బాధించి ఉండాలి. కానీ ముళ్ళమొక్క దయగలది కాబట్టి పక్షిని ఇబ్బందుల్లో చూడలేకపోయింది" అని దేవదారు చెట్టు సమాధానం ఇచ్చింది.
“ అయ్యయ్యో ఈ వేసవిలో ముళ్ళమొక్కలో నీరు ఉంటుంది, నేనేమో ఇక్కడ నీరు లేకుండా ఎండిపోతున్నాను,” అని గులాబీ బాధపడింది.
“ సహాయం చేయమని ముళ్ళమొక్కను నువ్వు ఎందుకు అడగకూడదు? తప్పకుండా నీకు తను సహాయం చేస్తుంది. పక్షి తన ముక్కులో నీరు నింపి నీ దగ్గరకు తీసుకువస్తుంది" అని దేవదారు చెట్టు సలహా ఇచ్చింది.
గులాబీ ముళ్ళమొక్కని ఎలా సహాయం కోరుతుంది? అందం చూసుకుని అహంకారంతో దాని గురించి చాలా చెడుగా మాట్లాడింది.
కానీ చివరకు ఒక రోజు ఎండవేడికి తట్టుకోలేక గులాబీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సహాయం కోసం ముళ్ళమొక్కను అడిగింది. ముళ్ళమొక్క దయగలది. వెంటనే సహాయం చేయడానికి అంగీకరించింది. పక్షి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అది ముళ్ళమొక్క నుండి నీటిని పీల్చుకుని, ముక్కును నింపింది, గులాబీ మొక్క వ్రేళ్ళల్లోకి పోసింది. గులాబీ మొక్క మళ్లీ తాజాగా వికసించింది.
ఒకరి రూపాన్నిబట్టి వారి మీదఅభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదని గులాబీ అర్థం చేసుకుని, ముళ్ళమొక్కకు క్షమాపణ చెప్పింది.
ఒకరి ముఖాన్నిచూసి, వారి మీద మనం అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదు. మనిషికి బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం ముఖ్యం.
♾️
*నిజమైన వ్యక్తులు వారి సరళత, స్వచ్ఛతతో సంతృప్తి చెందుతారు. వారు ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించరు, ఎందుకంటే వారి* *గురించి వారికి తెలుసు కాబట్టి.*
*దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment