Ashok Vardhan Reddy:
పూర్తిగా... శ్రద్ధగా చదవండి అద్భుతమైన కథ........
ఒక్క్క కధ మన జీవితాన్ని మార్చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో...
ఇక చదవండీ...గోరంత దీపం..🪔*
🕉️🌞🌎🏵️🌼🚩
"ఎంత సేపు వెయిట్ చెయ్యలి?" కౌంటర్ దగ్గర తన పేరు తో ఫైల్ తయారవగానే డబ్బులు అందిస్తూ అడిగింది
పూజ.
"మేడమ్ , మీ నెంబర్ పన్నెండు. మీ ముందు పదకొండు మంది పేషెంట్లు ఉన్నారు." నవ్వుతు బదులిచ్చింది కౌంటర్ లోని అమ్మాయి.
"షిట్" తాను వేసుకున్న హీల్ తో నేలని ఒక తన్ను తన్ని " ఐ విల్ కమ్ అగైన్" అంటూ బయటకి నడిచింది పూజ . అసలీ బాబాయి ననాలి . ఆఫ్ట్రాల్ ఫిజిషియన్ ట. ఈయన కౌన్సెలింగ్ ఇచ్చే దేమిటి?ఏ రోజు అపాయింట్మెంట్లు ఆ రోజేనట. మై ఫుట్. ఎంత టైం వేస్ట్? అసలే సెవెన్ కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. అయినా తను సిటీ లోనే ఫేమస్ బోటిక్ ఓనర్ .ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఫూల్ లా నిలబడటమేమిటి?
ఒక్క ఫోన్ కాల్ చేస్తే వంద మంది డాక్టర్లు తన గుమ్మం లోనే ఎదురు చూస్తారు.
క్లినిక్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో కాఫీ తాగటం ముగించింది పూజ. ఏడిసినట్టుంది ఈ కాఫీ కూడా . ఈ డాక్టర్ చుట్టం ఎవరిదోనే అయి ఉంటుంది ఈ కాఫీ షాప్ . ఆయన గారి కోసం వెయిట్ చేసే టైములో ఇక్కడి కొచ్చి ఎదో ఒకటి తిని, తాగి పోతారు. ఇది కూడా ఓ రకం సంపాదనేగా!నిరసనగా అనుకుంది పూజ. ప్రతిదాన్ని వ్యాపారంతో, డబ్బుతో ముడిపెట్టి ఆలోచించటం ఆమె మనస్తత్వం. ఒక సారి సెల్ లో టైం చూసుకుంది. తాను ఇక్కడికి వచ్చి ఇరవై నిమిషాలు దాటిపోయింది, ఫోన్ చూసుకుంటూ మరో పది నిముషాలు గడిపి క్లినిక్ కేసి అడుగులేసింది. పేషెంటుకి మూడు నిమిషాల చొప్పున వేసుకున్నా ఈ పాటికి పది మందన్నా అయిపోయి ఉంటారు. ఈ రోజుల్లో డాక్టర్లకి అంత కన్నా పేషెంట్ కిచ్చేందుకు టైం ఎక్కడిది? తంబలు, తంబలు గా పేషెంట్స్ వచ్చిపడుతుంటారు. అసలిన్ని రోగాలు ఎక్కడ నించి వచ్చి పడుతున్నయ్యో తెలియట్లేదు. ఆరోహి డాక్టరేగా, దానితో ఒక క్లినిక్ పెట్టిస్తే ఎలా ఉంటుందో *అసలు?తన ఫ్రెండ్ ని గుర్తు చేసుకుంటూ అనుకుంది పూజ.
కౌంటర్ చేరుకొని అక్కడున్న అమ్మాయికి ఒక చిన్న స్మైల్ పడేసింది. ప్రతిగా ఆ అమ్మాయి నవ్వింది.
"నీ పేరేమిటి?"
"స్మిత"
"వావ్ . నీకు తగ్గ పేరు. చక్కటి నవ్వు నీది" ఎందుకన్న మంచిదని ఒక కాంప్లిమెంట్ విసిరేసింది పూజ. ఒక్కోసారి అవే హెల్ప్ చేస్తాయి మరి. ఆ అమ్మాయి మరో చక్కని చిరునవ్వు విసిరి తన పనిలోకి తల దూర్చింది.
"ఇంకా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు?"
పుస్తకం చూసి చెప్పింది ఆమె. "ఇంకా తొమ్మిది మంది ఉన్నారు మేడం"
“తొమ్మిది మందా!” నమ్మలేనట్లు అన్నది పూజ కళ్ళు పెద్దవి చేసి.. ఈ డొక్కు డాక్టర్ ఏమి చేస్తున్నట్లు? అరగంటలో ముగ్గురినా చూసేది? ఈ లెక్కన అయినట్లే. ముందు బాబాయిని అనాలి. ఈయనని చూడకపోతే నీ మొహం చూడనన్నాడని రావాల్సి వచ్చింది. ఎలా కాదనటం ఆయన మాటని! చిన్నప్పటి నుంచి పెంచి, పెద్ద చేసి,పెళ్ళి కూడా చేసాడాయె.
“నాకు 7 గంటలకు వేరే అప్పోయింట్ మెంట్ ఉన్నదండి. కొంచెం ముందుగా *పంపలేరా?"చాలా మర్యాదగా, రిక్వెస్ట్ చేస్తున్నట్లు మొహం పెట్టి అడిగింది పూజ.
“సారీ మేడం. అలా కుదలదు. మీకు తెలుసుగా. సర్ కోసం వేరే ఊళ్ళ నుంచి కూడా రోగులు వస్తుంటారు. అదిగో వాళ్ళందరూ అలా వచ్చినవాళ్ళే. వాళ్ళందరూ పేషెంట్సే.. అందరు వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే."
పేషెంట్సే ఎదురు చూస్తుంటే శుభ్రంగా ఉన్నావు .
నీకేం రోగం అని ఆమె అన్నట్లు అనిపించి అసహనంగా నిట్టూర్చింది పూజ. పైగా మీకు తెలుసుగా అని ఓ రాగం! నాకేం తెలుసు ఈయన గారి గురించి? చిరాగ్గా వాచీ వంక చూసుకుంది. అక్కడే ఉన్న ఓ సోఫాలో కూలబడి ఓ పుస్తకం చేతిలోకి తీసుకుంది. దాన్ని పేరుకి తిరగేస్తూ, ఎదురు చూస్తున్న పేషెంట్స్ వంక చూసింది. అందరు రకరకాలుగా ఉన్నారు. ఈ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ ఏడు వందల యాభై రూపాయలు. అంత ఫీజు అయినా కిటకిటలాడుతూనే ఉంది క్లినిక్.. పోనీ స్పెషలిస్టా అంటే అదీ లేదు. ఉత్త ఫిజిషియన్ .
ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ డాక్టర్ గారి రూమ్ తలుపు తెరవగానే కనిపించే విధంగా కూర్చుంది పూజ. ఆయనని చూపులతోనే రావచ్చా అని అడుగుదామని. దేవుని గుడి గంట మోగినట్టు డాక్టర్ గారి బెల్ మోగింది.పూజతో పాటు ఇంకో నలుగురు లేచి నిలుచున్నారు. ఊహూ. డాక్టర్ దేవుడుకానీ,బయటే ఉన్ననర్సు పూజారి కానీ కనికరించనే లేదు. ఉసూరుమని సీట్ లో కూలబడింది పూజ.
వెంటనే కిసుక్కున నవ్వు వినిపించింది. అప్రయత్నంగానే అటుకేసి చూసింది పూజ. ఇంచుమించు తన వయసు పిల్లే. సాధారణమైన ముతక చీరె, మెడలో పసుపు తాడు, చేతులకి మట్టి గాజులు, చెవులకి ఏవో చిన్న పూసల దిద్దులు. చాలా మాములుగా ఉంది. ఒక్కసారి తనకేసి చూసుకుంది. తన బోటిక్ లోనే డిజైన్ చేసిన చీరె, దానికి మాచింగ్ నగలు, బొట్టు, హై హీల్స్.. ఒక్కసారి మిగిలిన వాళ్ళందరిని చూసింది . తనలా అయితే ఎవరు *తయారయి రాలేదు. ఏం లాభం? అయినా డాక్టర్ ముందు పిలవట్లేదు,
మళ్ళా ఆ అమ్మాయి కేసి చూసింది పూజ. ఈసారి స్నేహ పూర్వకంగా చిరునవ్వు నవ్వుతోందా అమ్మాయి. నొసలు చిట్లించుకుంది పూజ. ఆమె ఎక్కడా? తనెక్కడా? తనని చూసి ఆ అమ్మాయి *నవ్వటమా! అయినా ఆ అమ్మాయి తనని చూసి ఎందుకు నవ్వింది? ఆమెలో కుతూహలం నిలవనియ్యలేదు.
లేచి వెళ్లి, ఆమె పక్కన ఉన్న కుర్చీ ఖాళీగానే ఉండటంతో అందులో కూర్చుంది. పూజ తన పక్కన కూర్చోగానే మళ్ళీ నవ్వింది ఆ అమ్మాయి. ఆమె దర్పాన్ని చూసి కుంచించుకు పోలేదు.
"నీ పేరేంటి?"అడిగింది పూజ
“సావిత్రి.”
"ఏమి చేస్తుంటావు?
“నేనా? ఒక ఐదు ఇళ్ళలో పనిచేస్తుంటాను. నెలకి ఒక ఎనిమిది వేలు సంపాదించు కుంటానులే. ఇంతకీ నీ పేరేంటి?” అడిగింది సావిత్రి.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది పూజ ఆ ఏక వచన ప్రయోగానికి. ఆమెకు కంపరమెక్కింది. అక్కడనించి లేచి వెళ్లి పోదామనుకుంది. కానీ కుతూహలం కదలనీయలేదు.
"పూజ."
"బాగుంది మంచిపేరు"నిజాయితీగా మెచ్చుకుంది సావిత్రి.
“అది సరేలే . నువ్వెందుకలా నవ్వావు నన్నుచూసి?
“అదా! లోపలకి వచ్చిఓ గంటన్నా కాలేదు, అప్పుడే వెళ్ళాలనే నీ తొందర చూసి. చీటికీ , మాటికీ వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ నక్కర లేదు. మన నెంబరు చూసి వాళ్ళే పిలుస్తారు. ఈ డాక్టర్ దగ్గిర కొచ్చిన ఎవరు అంత తొందరగా వెళ్ళలేరు. *నేను నాలుగింటి నించి ఎదురు చూస్తున్నా. ఇప్పటి వరకూ ఏది?" పెదవి విరిచింది సావిత్రి
"అమ్మయ్య" అనుకుంది పూజ. ఇంకా తన మేక్ అప్ లో ఏమన్నా లోపముందేమో అని ఎంత భయ పడింది. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇంత ఎడ్డెగా ఉన్న ఈ మనిషికి అసలు మేక్అప్ అంటే ఏమిటో అయినా తెలుస్తుందా.
"మీ ఆయన ఏమి చేస్తుంటాడు?" కాలక్షేపానికి అడిగింది పూజ
"ఆటో నడిపిస్తాడు. నెలకి ఇరవై వేల దాకా వస్తాయి. ఆటో అద్దె , పెట్రోలు, రిపేర్ల ఖర్చులు పోను ఓ పన్నెండువేల దాకా మిగలొచ్చు." గర్వంగా చెప్పుకుంది సావిత్రి.
"అంటే ఇద్దరికీ కలిపి నెలకి ఇరవై వేలు. అంతేగా అంది పూజ"*
"ఒక్కోసారి అంతకూడా రాదు,మా ఆయన నడిపే ఆటో పాతది కదా, రిపేర్లు ఎక్కువగా వస్తుంటాయి.”సహజంగా అన్నది సావిత్రి.
దానికే ఈ కిసుక్కు నవ్వులా! పూజ మనసులో ఆశ్చర్యం, కొద్దిపాటి హేళన కూడా. తన సంపాదన రోజుకి కనీసం లక్ష.
"అందులోనే పాపం ఇద్దరూ బతకాలేమో!"
" ఇద్దర మేంటీ, నా పిల్లలిద్దరూ, అత్తా,మామ అందరం అందులోనే బతకాలి." నవ్వింది సావిత్రి.
"సరిపోతుందా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది పూజ.
“ఏం సరిపోక?" ఎదురు ప్రశ్న వేసింది సావిత్రి.
"పిల్లలని ఎక్కడ చదివిస్తున్నారేమిటి?"
"మా ఇంటి దగ్గరే ఉన్న *గవర్నమెంట్ స్కూల్ లో."
"అవున్లే. అక్కడైతే ఫీజు లుండవుగా." చులకన ధ్వనించింది పూజ గొంతులో.
" ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్ళలో చదివించేంత డబ్బు మా దగ్గర లేదు కదా! అయినా మా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో. వాళ్ళ టీచర్ ఎప్పుడూ చెప్తుంటుంది. వీళ్ళిలాగే చదివితే పెద్ద చదువులకి స్కాలర్ షిప్పు లొస్తాయని.అయినా స్కూళ్ళని బట్టి చదువు లుంటాయా? మనం దగ్గరుండి చదివిస్తే
పిల్లలు బ్రహ్మాండంగా *చదువుకుంటారు."గర్వంగా చెప్పింది సావిత్రి.
పూజ కళ్ళల్లో నెలకి ఐదు వేలిచ్చి హోమ్ ట్యూషన్ పెట్టినా, చదవటానికి మొరాయించే తన ముద్దుల కూతురు మెదిలింది.
"ఇంతకీ నువ్వేం చదివావో వాళ్ళని చదివించేందుకు?" ఆరా తీసింది పూజ.
సావిత్రి సిగ్గు పడింది."పెద్దగా చదువుకోలేదు. టెన్తే. కానీ ఆవిషయం వాళ్ళకి తెలియదుగా. పక్కనే కూర్చుని గదమాయిస్తుంటే సరి, భయపడి వాళ్ళే చదువుకుంటారు." సిగ్గు పడుతూ చెప్పింది సావిత్రి.
అప్రయత్నంగా నవ్వింది పూజ "గడుసు దానివే"
"ఆ మాత్రం గడుసుదనం లేకపోతే పిల్లలు మన మాట వింటారా? ఇంకా రెండిళ్ళు పట్టుకుంటే , నాలుగు రాళ్ళు వచ్చునేమో కానీ పిల్లలతో గడిపి నట్టవదు కదా.
అందుకే మధ్యాహ్నమే ఇంటికొచ్చేస్తాను. వాళ్లకి రోజు కావలసినవి చేసిపెడతాను. వాళ్ళతో కబుర్లు చెప్తాను. ఆటలాడతాను. చదివిస్తాను.అలా వాళ్ళతో *గడుపుతుటే ఎంత బాగుంటుందో తెలుసా?"
పూజ కళ్ళ ముందు తన కోసం ఎదురు చూసి చూసి వంటామె పెట్టిన దేదో తిని సోఫాలోనే నిద్ర పోయే బేబీ మెదిలింది.ఒక్కో సారి ఆ చిట్టి బుగ్గల మీద కన్నీటి చారలు. " ఇప్పటి వరకు మీ కోసమే చూసి నిద్ర పోయిందమ్మా.అన్నం కూడా సరిగ్గా తినలేదు." అని బేబీ నప్పగిస్తూ వాచ్ మన్ భార్య చెప్పే మాటలు ఆమె చెవులలో మారుమోగాయి. కానీ బొటిక్ స్వయంగా చూసుకోక పోతే ఎంత నష్టం! ఈ సంపాదనంతా దాని కోసమేగా!
"నిజమేలే. ఇంతకు నీ పిల్లలు స్కూల్ కి ఎలా వెళ్తారు నువ్వు పొద్దున్నే పనిలోకెళ్తే? బస్సుమాట్లాడావా మరి?"పూజ అడిగింది.
ఈ మాత్రం తెలియదా అన్నట్లు తన స్టైల్ లో నవ్వింది సావిత్రి.
“ఎందుకా నవ్వు? "చికాగ్గా నొసలు చిట్లిస్తూ అడిగింది పూజ “ఇందాక కూడా నన్ను చూసి నవ్వావు. అసలు పదే పదే నవ్వుతుంటావు. ఏంటి సంగతి?”
"అయ్యో..అదేంటక్కా? నవ్వితే తప్పేంటి? నవ్వగలగటం *ఎంత అదృష్ట మసలు?”
అవును, నిజమే. అది తనకేది? అందుకేగా ఈ ఏడుపు. మనసులోనే అనుకుంది పూజ.
“ అయినా ఏమి తెలియని దానిలా అలా అడుగుతా వేమిటక్కా?మా బండి మాకుంటే బస్సెందుకంటా? ఒక్క స్కూల్ కనే కాదు. మేము ఎక్కడికి వెళ్లినా మా బండిలోనే వెళ్తాము. సినిమా కానీ, షికారు కానీ. అఖరికి నేను సందు చివర కొట్టుకెళ్ళి వెచ్చాలు తెస్తానన్న మా ఆయన నన్ను నడవనిస్తాడనుకున్నావా? మా బండిలోనే పోతాం. నేను ఏమన్నా చీరె ,నారా ఎప్పుడో పండక్కో, పబ్బానికో కొనుక్కుందామన్న మాబండే. పిల్లల్ని తొంగోపెట్టి మేము మా బండిలో సెకండ్ షో సినిమా కి కూడా వెళతాము తెలుసా? నేను గురువారం , గురువారం ఉన్నంతలో గుడి దగ్గర లేనోళ్ళకు ఓ పదిమందికి అన్నం వండి, వేడివేడిగా పెట్టి వస్తాలే ఇంత మజ్జిగలో పోపేసి కలిపి. ఆఖరికి దానికి కూడా మా బండి లోనే వెళ్తాం" గర్వంగా చెప్పింది సావిత్రి.
పూజకి ఛెళ్ళున కొట్టినట్లయ్యింది.
"అబ్బో, దానమా!"అంది.వ్యంగ్యంగా. సావిత్రి అది వ్యంగ్యమని గుర్తించనే లేదు.
"అవునక్కా! మనకన్నా తక్కువ వాళ్ళను మనం కాక ఎవరు చూసుకుంటారు చెప్పు? అలా చూసుకోక పోతే పదిమందీ బాగుపడేదెలా?సంపాదించుకున్నది అరుగుతుందా ఒక్కళ్ళమే తింటుంటే. నీకు తెలియని దేముంది? మనం పదిమందిని చూస్తే పైవాడు మనని *చూస్తాడు."
అసహనంగా ఆ టాపిక్ మార్చటానికి అన్నట్లు అడిగింది పూజ.
"మరి మీ పిల్లలు భయ పడరా మీరు వాళ్ళని వదిలి సినిమాకి వెళ్తే?"
“ఎందుకు? మా అత్తా మామ లుంటారుగా ఇంటి దగ్గర. వాళ్లకి సినిమా లంటే ఇష్టం లేదులే. అందుకని కొంత డబ్బు వెనకేసి ఏటేటా వాళ్ళని యాత్ర స్పెషల్ బస్సులో తీర్థ యాత్రలకి పంపుతాం. చేతి ఖర్చులకి కూడా డబ్బులిస్తాం. వాళ్ళు ఇంచుమించు దేశమంతా చూసేసినట్టే. అత్తమామల్ని బాగా చూసుకుంటే మన చేతికడ్డా, చేత కడ్డా? పైగా వాళ్ళు మటుకూ మా అమ్మానాన్నల లెక్క కాదూ? వాళ్ళు యాత్రలకు వెళ్తారే..అప్పుడు మటుకు మా వాడికి…."సిగ్గుపడి చటుక్కున *ఆగిపోయింది సావిత్రి.
ఎర్రబడ్డ ఆ నల్ల పిల్ల బుగ్గలను వినోదంగా చూస్తూ నవ్వుతూ అడిగింది పూజ. " చెప్పు,ఆగిపోయావేం?"
"...పండగే పండగ.నన్ను క్షణం కూడా వదలడక్కా. ఆటో కూడా నడపడు ఆ పది రోజులు. నన్ను అసలు కదలనివ్వడు. మంచం దిగనివ్వడు . ఆఖరికి మంచినీళ్ళు కూడా ఆయనే అందిస్తాడు. నిన్ను చాలా కష్ట పెడుతున్నాను గదే సావిత్రి అంటాడు. ఒకటే ఇదనుకో. “ సావిత్రి మొహాన్ని రెండు చేతులతో కప్పేసుకుంది. కందిపోయిన సావిత్రి మొహాన్ని చూస్తూ పూజ నవ్వేసింది హాయిగా.
"అయినా ఆలుమగల వివరాలు నీకు తెలియనివా అక్కా? మీరు గొప్పవాళ్ళు...మీ సరసాలింకా వేరుగా ఉంటాయేమోలే" స్వఛ్ఛంగా నవ్వేస్తూ అంది సావిత్రి.
సరసాలా! పూజకుఒక్కసారిగా మనసు చివుక్కుమనిపించింది. తామిద్దరు కలసి నవ్వుకుంటూ మాట్లాడుకుని ఎన్నిరోజులైందో అసలు.
"అలా ఏడాదికోసారి ఆయనతో మాత్రమే ఏకాంతంగా గడిపితే ఉంటుంది చూడూ ,ఆ సంతోషంతో, ఆయనిచ్చిన ప్రేమ బలంతో మరో ఏడాది హాయిగా గడిపేస్తాను.ఎంత పనైనా చేసేస్తాను, ఎంత బాధైనా భరించుకో గలను. మొగుడూ పెళ్ళా లన్నాక మధ్య మధ్య అలా గడిపితే ఆ మజానే వేరు. ఏమంటావు?"
ఆ ప్రశ్న దాటేస్తూ అడిగింది పూజ
"మరి పిల్లలు?"
"నువ్వు భలేదానివే.అమ్మా వాళ్ళింటికి పంపేస్తా ఆ పది రోజులూ. వాళ్ళెందుకూ పానకంలో పుడకల్లాగా" కొంటెగా నవ్వేసింది సావిత్రి. ఆ నవ్వు అంటువ్యాధిలా పూజనూ చుట్టుకుంది.
సావిత్రి వాళ్ళఆయన గురించి చెప్పే టప్పుడు ఆ కళ్ళల్లో మెరుపు , భర్త ప్రేమను పూర్తిగా జుర్రుకుంటున్నానన్న మైమరపు పూజకు స్పష్టంగా కనిపించి ముచ్చట పడింది. ఆమెతో మాట్లాడిన కొద్దీ పూజ తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడటం మొదలు పెట్టింది.
"అయితే సావిత్రి, నీకు జీవితంలో ఇవి కావాలి, అవి *కావాలి అని ఏమీ లేవా?"
" అదేంటి ?ఎందుకుండవు? నేను మటుకు మనిషిని కానా అక్కా? నాకు ఎప్పటినుంచో మా ఆయనకు ఒక మంచి ఫోను కొనిపెట్టాలని కోరిక. అదేదో స్మార్ట్ ఫోన్ ఉంటుందటగా. అది కొందామని. దానికని రహస్యంగా కొన్ని డబ్బుల్ని దాస్తున్నా కూడా" గొంతు తగ్గించి రహస్యం చెప్పింది సావిత్రి. "ఆయనకు తెలియకుండా నా ట్రంక్ పెట్టెలో నా పెళ్ళిచీరె మడతల మధ్యన దాస్తున్నా. అవిగానీ చూశాడంటే మాట్లాడకుండా నాకేదో ఒకటి కొని తెచ్చేస్తాడు.అందుకే ఆయనకు కనిపించకుండా దాస్తున్నా. ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని మా అమ్మ,నాన్న తూ తూమంత్రం పెళ్లి జరిపించేసి ఆయనకి ఏమి ఇవ్వలేదు. కనీసం బట్టలు కూడా పెట్టలేదు. మంచి మనిషి కనుక మనసులో పెట్టుకోలేదు. పైగా నాకు పెళ్ళికి ఓ మంచి చీర, బంగారపు ముక్కు పుడక కొన్నాడు. ఆ చీరె ఎంత బాగుంటుందను కున్నావ్? నేను మా ఆయనతో ఎప్పుడన్నా బయటకు వెళితే ఆ చీరే కట్టుకుంటా.ముదురాకు పచ్చకు జరీ అంచు."
"ఔనా,మంచి పట్టు చీరే లేదా నీకు? " ఆమె తనని అక్క అంటోందన్న విషయం కూడా తెలియలేదు పూజకి.
"పట్టు చీరె లెందుకక్కా.. మా ఆయనే పట్టు.. ఆయన మనసే బంగారం "మురిసి పోతూ కొంచెం గర్వంగా చెప్పింది గాయత్రి.
మతిపోయింది పూజకి. తను పక్కింటికి వెళ్ళాల్సి వచ్చినా పావుగంట బీరువా ముందు నిలబడి"ఏ చీరె కట్టుకోవాలి" అని ఆలోచిస్తుంది.మరి ఈ అమ్మాయి తరహా ఏంటి! విచిత్రంగా ఉందే.
"ఇంతకీ ఏదీ నీ ముక్కు పుడక? పెట్టుకోలేదేం?" బోసిగా ఉన్న ఆమె ముక్కు వంక చూస్తూ కుతూహలంగా అడిగింది.
అప్పటిదాకా నక్షత్రాల్లా మిలమిల మెరిసిపోతున్న సావిత్రి కళ్ళు ఒక్కసారిగా జడివాన కురిపించే మేఘాలయ్యాయి.
"మా ఆయనకీ మధ్య వంట్లో బాగుండట్లేదక్కా. మంచాన పడ్డాడు. ఆయనకోసం ఆ ముక్కుపుడకని, చిట్టీ లేపి చేయించుకున్న నా పుస్తెల గొలుసుని తాకట్టు పెట్టానక్కా. ఈ డాక్టర్ హస్తవాసి మంచిదని ఇక్కడ చూపిస్తున్నాను. కోలుకుంటాడు కానీ పూర్తిగా తగ్గాలంటే రెండేళ్లు పడుతుంది అన్నాడు. చాలా ఖర్చవుతుంది అన్నాడు. ఖర్చుదేముంది. నా రెక్కల్లో శక్తి ఉంది.* కష్టపడతాను. ఇప్పటిదానికి ఇంకా ఇంత సంపాదిస్తాను. కానీ ఆయన అలా మంచంలో పడుంటే నేను చూడలేక పోతున్నాను "సావిత్రి గొంతు పూడుకు పోయింది. పూజ మనసు కరిగి పోయింది.
“అయ్యో, మరి కష్టంకదా!" అప్రయత్నంగా సావిత్రి చెయ్యి మీద తన చెయ్యి వేసింది పూజ.
"నిజమే అక్కా. దేనికీ లోటులేని నా సంసారంలో ఈయన అనారోగ్యం ఒక అగ్గిరవ్వలా చొరబడి నా మనశ్శాంతిని జీవితాన్ని కొల్లగొట్టే స్థితి కొచ్చింది.అన్నిటికి ఆ భగవంతుడే ఉన్నాడు. నేనెవరికీ చెడు చెయ్యలేదు. నాకు చెడు జరగదు. అందుకే నా మనిషికి తగ్గే జబ్బొచ్చింది. అదే మనిషినే మాయం చేసే జబ్బొస్తే నా బతుకు ఏమయ్యి ఉండేనో? జీవితంలో రెండేళ్లు నావి కావనుకుంటే మొత్తం వందేళ్ళ జీవితం నాదే కదా. అయినా సమస్య లొచ్చి నప్పుడేగా మనమెంత గట్టి మనుషులమో తెలిసేది. కష్టాలు మనని పరీక్ష చెయ్యటానికే వస్తాయట, బెంగ పడి కూర్చుంటే బాధ తీరదు కదా. బయట పడే దారి *మనమే వెతుక్కోవాలి." కళ్ళు తుడుచుకుంటూ ఆత్మ విశ్వాసంతో అంది సావిత్రి.
ఇప్పుడు సావిత్రి పేదరికం కానీ మరే విషయం కానీ తక్కువగా, చులకనగా కనిపించటం లేదు పూజకి. అసలు ఆమే ఒక అద్భుతంలా అనిపిస్తోంది. కొండంత కష్టాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కొంటూ ఉన్న తీరు నిజానికి పూజను అబ్బుర పరుస్తోంది.
“అవునూ, మీ అయన *రాలేదు?” అడిగింది పూజ.
"రాలేడు " క్లుప్తంగా చెప్పింది సావిత్రి.
ఈ లోగా నర్స్ సావిత్రిని పిలిచింది. "రా సావిత్రీ , డాక్టర్ పిలుస్తున్నారు"
"వస్తా అక్కా" లోపలి వెళ్ళింది సావిత్రి.
ఒక్కసారిగా పూజకు ఒక అరుదైన వ్యక్తి తో పరిచయం అయినట్టు అనిపించింది. నిజంగా తాను ఎంత నేర్చుకోవాలి ఈమె నించి. నేర్చుకుంటే తన బ్రతుకు ఎంత మారుతుంది? ఆత్మ విమర్శ మొదలైంది పూజలో. ఆమె గురించే ఆలోచిస్తూ ఉండి పోయింది పూజ. ఎంత ఆత్మ స్థైర్యం!ఎంత గొప్ప వ్యక్తిత్వం!!పేదరికం ఆమె సంతోషాన్ని వేలితో కూడా తాకలేక ఓడిపోయింది.డబ్బుకీ , సంతోషానికీ సంబంధమే లేదని సావిత్రి నిరూపిస్తోంది. సంపాదించే మనిషి అడ్డం పడినా అధైర్య పడలేదు సావిత్రి. ఈ పరిస్థితిని అధిగమించటం ఓ లెక్కా అన్నట్లు ఉంది. ఇలాంటి వాళ్ళు సమస్యల్నే పరిహసిస్తారేమో! భర్త పరిస్థితి కి బాధ పడుతోందే తప్ప భయపడట్లేదు.
"వాళ్ళాయనకు ఏమి జబ్బు సిస్టర్?అటు వైపు వెళ్తున్న నర్సుని ఆపి అడిగింది పూజ.
"సావిత్రీ వాళ్ళాయనకా? వెన్ను పూసలో టీ బీ మేడం. మంచం మీదనించి లేచే పరిస్థితి లేదు.రెండేళ్లు పూర్తిగా విశ్రాంతి ఇస్తే తగ్గే అవకాశం ఉంది. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూస్తే ఆ వీలు లేదు. పాపం కష్ట జీవి. ఎలా బయట పడుతుందో ఏమో? కానీ అలా వున్నా ఏ మాత్రం అధైర్య పడదు. ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది. ఎవరికీ ఏమి కావలసి వచ్చినా అందరికి తలలో నాలిక లాగా ఉంటుంది . ఆమె ఉండే చోటుకి వెళ్లి ఎం ఎల్ ఏ ఇల్లు ఎక్కడ అంటే చెప్పలేని వారు ఉంటారేమో కానీ సావిత్రి ఇల్లు అంటే అందరు చూపిస్తారు. చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి. ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది ..ఎవరిని నోరు తెరిచి సాయం అడగదు. గొప్ప అభిమానవతి." నర్సు ఇంకా ఏమి చెప్పేదో కానీ ఈలోగా డాక్టర్ బెల్ కొట్టటంతో పరిగెత్తినట్టు వెళ్ళిపోయింది.
బయటకు వచ్చి “మేడం మీరే, వెళ్ళండి. ఇందాకటినించి ఒకటే హడావిడి పడుతున్నారుగా."అన్నది చిరునవ్వుతో.
అప్పుడే బయటకు వచ్చిన సావిత్రిని చూస్తూ పూజ "సావిత్రి, నేను ఇప్పుడే వచ్చేస్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయి ప్లీజ్" అన్నది
“అలాగే అక్కా" అన్నది చిరునవ్వుతో సావిత్రి. మందులు తీసుకుంటూ ఉంటా ఇక్కడ. వెంటనే వచ్చెయ్యి మరి. ఎక్కువ ఆలస్యమైతే కొంచెం ఇబ్బంది ఔతుంది మా ఆయనకి"
"అలాగే " అంటూలోపలికి వెళ్ళింది పూజ.
*డాక్టర్ ఆమె వంక సాదరంగా చూస్తూ "రండమ్మా , ఏమిటి ప్రాబ్లెమ్ "అన్నాడు
" సర్, ఒక గంట క్రితం వరకు నాకు ఈ ప్రపంచం లో బ్రతకటమే ఒక సమస్య. పెద్ద ప్రాబ్లెమ్. ఆత్మ హత్య చేసుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది. అలాగని నాకు ఏ సమస్యలు లేవు. నేను అవలీలగా రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను. నా భర్త ఒక మూడు లక్షలు సంపాదిస్తారు. ఇద్దరివీ బ్రహ్మాండమైన బిజినెస్ లు.మూడు కార్లు. ఇంట్లో నలుగురు పని మనుషులు. పాపని స్కూల్కి పంపేదుకు ఒక కారు, నాకు ఒకటి మా వారికి ఒకటి. నెలకి కనీసం మూడు సార్లు పార్టీలు ఇస్తుంటాము. పెద్ద పెద్ద వాళ్ళతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి. కానీ తీవ్రమైన అసంతృప్తి. దానితో చావాలనే బలమైన కోరిక. ఏ సమస్యని ఎదుర్కోలేను. బిజినెస్ లో ఒక రోజు ఒక సమస్య వస్తే మందు కొట్టకుండా పడుకోలేను.
ఒక బ్యాంకు లోన్ శాంక్షన్ అవలేదంటే విపరీతమైన టెన్షన్. మా వారు ఒక రాత్రి ఇంటికి రాలేదంటే ఎవతితో ఉన్నాడో అని అనుమానం, అసూయ.అలాగని నాతో ఉన్నప్పుడు ఆయనను సంతోషంగా ఉంచలేను. ఏదో ఒక దానికి పోట్లాడుతూనే ఉంటాను. ఆయనను సంతోష పెట్టలేను, నేనూ సంతోషంగా ఉండలేను. నిద్రమాత్రలు వేసుకున్నా నిద్ర రాదు.”బలంగా ఊపిరి పీల్చుకుంది పూజ ఉద్వేగాన్ని *అదుపులో ఉంచుకోవటానికి.*
“చుట్టాలందరు మా ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నారని ఆలోచన . అవకాశం వస్తే మమ్మల్ని చంపటానికి చూస్తున్నారని భయం, అనుమానం. ఏ ఒక్కళ్ళకు కూడా సాయం చెయ్యను. ఎందుకు చెయ్యాలి? నేను కష్ట పడి సంపాదిస్తేనేగా ఆ డబ్బు వచ్చింది. వాళ్ళూ సంపాదించు కోవచ్చుగా అనిపిస్తుంది. ఇన్ని టెన్షన్స్ నేను పడుతున్నా ఆయన పట్టించుకోడని కసి. ఒక్కో సారైతే ఆయన్ని చంపేసి నేను చచ్చి పోదామనిపిస్తుంది. ఇంకా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు.
అట్లా ఉన్న నన్ను చూసి మా బాబాయి భయపడి, మీ దగ్గిరకి నన్ను కౌన్సిలింగ్ కి పంపారు. చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తారని , నా జీవితాన్నే మార్చేస్తారని చెప్పి పంపించారు.నిజానికి మిమ్మల్ని కలవకపోతే నా మొహం చూడనని ఆయన చెప్పటంతో వచ్చాను. లేక పోతే వచ్చేదాన్ని కాదు. బయట విసుక్కుంటూ ఎదురుచూస్తున్న నాకు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం అయ్యింది."
డాక్టర్ గారు ఎదో అనబోయారు.
పూజ ఆయనను చేతితో వారిస్తూ అన్నది. "అక్కరలేదు సర్. ఇప్పుడు నాకు చావాలని లేదు. బతకాలని ఉంది. కొత్త జీవితం గడపాలని ఉంది. నా జీవితాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అర్ధం అయ్యింది. ఊరికే పేరుకున్న సంపద ఉపద్రవానికే. ఎవరికన్నా ఉపయోగపడేంత డబ్బు మనకున్నప్పుడు దాన్ని వారికి ఉపగయోగించటమే సార్ధకం అని ఇప్పుడే.!! తెలుసుకున్నాను . ఒక అపురూపమైన మనిషి నుంచి. ఆమే నా కౌన్సెలర్. నా వ్యర్ధ జీవితాన్ని ఫల వంతం ఎలా చేసుకోవాలో ప్రాక్టికల్ గా చెప్పిన గైడ్. థాంక్ యు. నేనిక మీ దగ్గరకి రాను. గుడ్ బై. డాక్టర్” ఉద్వేగంగా తన మాటలు ముగించిన పూజ ఆయనకు రెండు చేతులు జోడించి బయటకు వచ్చి సావిత్రిని చేరుకుంది.
"పద చెల్లి, పోదాం. మీ ఇంటికి . నీ అక్కకు మీ ఇల్లు చూపించవా?"
సంతోషంతో విప్పారిన మొహం తో "అయ్యో రా అక్కా. బ్రహ్మాండమైన గారెలు చేసి పెడతాను, పద. వెళ్తూ వెళ్తూ దోవలో ఈ జ్వరం మాత్రలను ఒక ముసలవ్వకు ఇచ్చి వెళ్దామేం. పాపం మూడురోజుల నుంచీ అవస్థ పడుతోందని డాక్టర్ గారిని అడిగి తీసుకున్నాను" అన్నది సావిత్రి.
సరేనన్నట్లు తల ఊపుతూ తన జీవితంలో అదృష్టవశాత్తు కనిపించిన ఆ గోరంత దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళింది పూజ, తన గుండెల్లోని కొండంత చీకటిని అంతం చేసుకోవటానికి.
No comments:
Post a Comment