*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు.*
💖*పూజాద్రవ్యాలు శుభ్రంగా ఉండాలనుకోవడం సహజమే. కస్తూరి, పునుగు వంటి సుగంధ ద్రవ్యాల్ని జంతువుల నుంచి సేకరిస్తారు. ఆవుపాలను లేగదూడ, తేనెను తేనెటీగలు ఎంగిలి చేస్తాయి. అటువంటి బాహ్యసామగ్రికి సంబంధించిన శుచికైనా, శుద్ధతకైనా ఒక కొలమానం అంటూ ఏమీ లేదు. దైవానికి శుచిగా అర్పించదగినది మనస్సొక్కటే.*
❤️ *మనసు, బుద్ధి, చిత్, అహంకారంతో కూడినది అంతఃకరణ. దీన్ని శుద్ధి చేయాలంటే సంస్కరించాలి.* 💓 *మానవదేహం అన్నింటి సమాహారం. ఇందులో పరమాత్మ ఉన్నాడని అతడు గ్రహించి వ్యవహరించాలి. పవిత్రత ఉండటం, లేకపోవడం అనేవి కేవలం మనోభావాలు. దోషపూరితమైనవాటిని దోష రహితంగా చూసేదీ మనస్సే. దైవానికి అర్పించే పదార్థాల పరిధిని గుర్తించాల్సిందీ, వాటి యథార్థ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాల్సిందీ భక్తహృదయమే.*
💞 *సకల చరాచర సృష్టి పంచభూతాత్మక మయం. దీనికి చిహ్నంగా భగవంతుడికి చేసే అర్చన పంచోపచార పూజ.*
💕*భక్తుడు పృథ్వీతత్వంతో గంధాన్ని, వాయుతత్వంతో ధూపాన్ని, అగ్నితత్వంతో దీపాన్ని సమర్పిస్తాడు. జలతత్వంతో అర్ఘ్యం, ఆకాశతత్వంతో పుష్పం భగవంతుడికి అర్పిస్తాడు.*
💖 *దైవంలో లేనిదీ, దైవం కానిదీ ఏదీ లేదు. పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన సర్వజ్ఞత్వం, స్వతంత్రత, అనంతశక్తి తత్వాలతో భాసిల్లుతుంటాడు. ఆ మహాపూర్ణ స్వరూపానికి సమర్పించడానికి మనిషి వద్ద ఏదీ లేదు. చేతులు జోడించి శరణాగతి వేడటమే తప్ప మరో మార్గమూ లేదు.*
💓 *వస్తుదోషం, కర్మలోపం లేని కార్యం ఏదీ ఉండదు. విధి నిర్వహణలో లోపాలు దొర్లడమూ సహజం. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్యే యజ్ఞం చేసినా ఏవో కొన్ని కర్మలోపాలు తప్పవు. యజ్ఞయాగాదుల్లో చోటుచేసుకునే లోపాలకు ప్రాయశ్చిత్తహోమాలున్నాయి. వాటిలోనూ దొర్లే చిన్నపాటి తప్పిదాలకు క్షమాపణ అర్థించడమూ పరిపాటియే.*
💖 *భగవదారాధనలో వస్తువు పవిత్రత కన్నా పావనమైన భావనే మిన్న. శ్రద్ధగా కర్మల్ని ఆచరించాలి. బుద్ధిని వికసింపజేసి, సారాన్ని గ్రహించాలి. విగ్రహారాధన వల్ల నిగ్రహం కలుగుతుంది. భక్తి, శ్రద్ధ, ప్రపత్తులు దీని ఫలాలు. వీటితో భావశుద్ధికి బీజం పడుతుంది.*
💓 *ఆరాధనామార్గంలో తాత్విక దృష్టి, తార్కి కత, శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉన్నాయి. ‘నా ముఖాన్ని అవలోకించేందుకు అద్దం ఉపాధి (ఆధారం). నన్ను నేను తెలుసుకునేందుకు దైవం ఉపాధి’ అనే సత్యాన్ని భక్తుడు అవగతం చేసుకుంటే చాలు.*
💞 *’నాలోని పరమాత్మను నేను గుర్తించాలంటే, అందరిలోనూ ఆయనను దర్శించడాన్ని ముందుగా అలవరచుకోవాలి’ అని గ్రహించి మసలుకుంటూ, ఎదుటివారి లోపాల్నెంచక వారిని సంస్కరించడానికి ప్రయత్నించాలి. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి.*
💖 *భావశుద్ధి ఉంటే, భావ సిద్ధి లభిస్తుంది. ఏ భావనతో అర్చిస్తే, పరమాత్మ ఆ భావననే సిద్ధింపజేస్తాడు. ఏ రూపంలో భావిస్తే, ఆ రూపంలోనే స్వామి దర్శనమిస్తాడు.*
💓 *ఒక భక్తుడు ఆధ్యాత్మిక దృష్టితో విష్ణుసాన్నిధ్యం కోరాడు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సంబారాలు సమకూర్చాడు. రుత్విజులకు ఆహ్వానం పలికాడు. అంతలోనే అకాల మరణం పొందాడు. యజ్ఞసంకల్పం నెరవేరలేదన్న బాధ అతడిది. అయినప్పటికీ, ఆ భక్తుడికి విష్ణుపదం ఆహ్వానం పలికిందని పురాణ కథనం.*
💓 *‘నువ్వు తలపెట్టిన కార్యంతో పని లేదు, నీలో వెల్లివిరిసిన భావనే ప్రధానం’ అనే అంతరార్థాన్ని మనమిక్కడ గ్రహించాలి.*
💕 *మనకున్నదానితో సంతృప్తిపడటం ఉత్తమమే…!కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానమే ఔతుంది సుమా…!*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment