*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్ 🌎కథతో*
♥️ *కథ-29* ♥️
*అనుభూతి: నా అంతర్గత వివేకానికి నేను కృతజ్ఞతతో ఉంటాను, ఇది జీవితం యొక్క* *నిజమైన భావాన్ని అర్థం చేసుకోవడంలో నాకు* *సహాయపడుతుంది.*
*జీవితపు పరమార్ధం*
ఒకప్పుడు, ఒక వ్యక్తికి జీవితంలోని నిజమైన సత్యాన్ని కనుగొనాలనే బలమైన కోరిక కలిగి, దానిని వెతకడానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉన్నాడు.
ఒక రోజు, అతడు ఒక వ్యక్తిని కలిశాడు, ఆ ఊరి చివర ఉన్న గుహకు వెళ్ళమని సలహా ఇచ్చాడు, అక్కడ అతనికి కావలసిన సమాధానాలు అన్నీ లభిస్తాయని చెప్పాడు.
ఆదేశానుసారం, ఆ వ్యక్తి గుహలోకి వెళ్ళి, అక్కడ ఒక సాధువుని కలుసుకున్నాడు.
ఆ సాధువు అతనికి ఒక గ్రామం గురించి చెప్పి, "ఆ ఊరి కూడలికి వెళ్ళు, నువ్వు వెతుకుతున్నది దొరుకుతుంది" అన్నాడు.
చాలా ఉత్సాహం, ఆశతో ఆవ్యక్తి ఆ గ్రామాన్ని వెదుక్కుంటూ బయలుదేరాడు.
చాలా వారాల వెతుకులాట తర్వాత, ఆ గ్రామాన్ని కనుగొని, చివరకు ఆ ఊరి కూడలికి చేరుకున్నాడు.
అక్కడ మూడు దుకాణాలు చూశాడు.
ఆ దుకాణాల దగ్గరికి వెళ్లి చూడగా ఒక దానిలో చెక్క ముక్కలు. రెండవ దానిలో లోహపు ముక్కలు, మూడవ దానిలో సన్నని లోహపు తీగలను అమ్ముతున్నారు.
ఆ వ్యక్తి చాలా సేపు దుకాణాల వైపు చూశాడు, కానీ అతను వెతకడానికి బయలుదేరిన సత్యానికి వీటికి ఎటువంటి సంబంధం కనుగొనలేకపోయాడు. అతను తీవ్రంగా ఆలోచించాడు, కానీ ఏమీ అర్థం కాలేదు.
నిరాశ చెంది సాధువు వద్దకు తిరిగి వచ్చి దుకాణాల గురించి చెప్పాడు.
" సమయం వచ్చినప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి" అని సాధువు బదులిచ్చారు.
ఆ వ్యక్తి వివరణ ఇవ్వమని బతిమాలాడు, కానీ సాధువు సమాధానం ఇవ్వలేదు.
ఆ వ్యక్తి నిరాశతో వెళ్ళిపోయాడు, అక్కడికి వచ్చి తాను మూర్ఖుడినయ్యానని అనుకున్నాడు.
అయితే అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా సత్యాన్వేషణను కొనసాగించాడు.
కాలం గడిచేకొద్దీ, ఈ అనుభవానికి సంబంధించిన జ్ఞాపకాలు మసకబారాయి.
ఒక రోజు రాత్రి, అతను నడుస్తూండగా, మధురమైన సంగీతం అతని దృష్టిని ఆకర్షించింది.
మంత్రముగ్ధులను చేసే సంగీతంతో తీవ్రంగా ప్రభావితుడయ్యి, దాని వైపు ఆకర్షితుడయ్యాడు.
సంగీతo ఎక్కడ నుండి వస్తుందో దానిని అనుసరించి కనుగొని, అక్కడ సంగీతకారుడి వేళ్లు సితార్ తీగలపై నృత్యం చేయడం చూశాడు.
అకస్మాత్తుగా ఏదో స్పురించి ఆనందంతో, అతడి కళ్ళు చెమ్మగిల్లాయి!
తీగ, లోహపు ముక్కలు, చెక్కతో చేసిన సితార్ ని చూడగానే అతనికి కూడలిలో ఉన్న మూడు దుకాణాలు గుర్తుకు వచ్చాయి.
అప్పుడు వాటి ప్రాముఖ్యత అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అతనికి అవగాహన కలిగింది.
తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు, హృదయం ద్రవించడం ప్రారంభమైంది, అతను పూర్తిగా ప్రేమతో నిండిపోయాడు.
ఆ రోజు అతనికి వాస్తవ జీవిత పరమార్థం అర్థమైంది, సాధువు సందేశం అవగతమైంది!
ప్రతిదీ మనలో ఇప్పటికే ఉంది, మనకు చేయవలసినది ఏమిటంటే దానిని సరైన మార్గంలో సర్దుబాటు చేయడం, సమీకరించడం మాత్రమే.
మనం జీవిత పరమార్ధం కోసం వెతుకుతూనే ఉంటాం, కానీ మనం శకలాల లాగా జీవిస్తూ, దాని అర్థాన్ని గ్రహించలేకపోతున్నాం.
మన మనస్సు, శరీరం, హృదయం ఈ క్షణంలో కలిసిఉన్నప్పుడు, ఆ క్షణం నిజంగా మధురమైన సంగీతం అవుతుంది, అప్పుడు మనకు జీవితం యొక్క అసలైన అర్థం అవగతమవుతుంది.
No comments:
Post a Comment