*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *మనమందరం తరచుగా దేవాలయాలకు వెళ్లి గర్భగుడి లోని ఈశ్వర లింగాన్నో, దేవతా ప్రతిమనో దర్శించుకుని మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి “ఈరోజు గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నాను” అనుకుని తృప్తి పడతాము.*
💖 *నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవ శరీరమే. ఇక్కడ 'తత్' (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది.*
❤️ *దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం.*
💞*భగవంతుడు లేకుండా మానవుడు లేడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కనుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాం. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్షియస్ బాడీ) ప్రతిబింబిoచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక లంకె.* 💓 *దేవాలయాల నిర్మాణాలు ఎప్పుడు, ఎక్కడ ఆరంభించ బడినవో చెప్పడం కష్టం. వేదకాలంలో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలాల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రమంలో దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.*
💞 *దేహమే దేవాలయం. శరీరం ‘శీర్యతే ఇతి శరీరః!!’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం, శిథిలమై పోవటం దీని లక్షణం. ముసలితనంలో కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే.*
💖 *ఈ దేహాన్ని “దేహం” అని ఎందుకన్నారు ? 'దహ్యతే ఇతి దేహః' అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా ? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా ! అవి దహింపబడవు గదా ! మరి వాటిని దేహాలు అని అనరా ? చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలనే అగ్నిచేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే ఆ తాపత్రయాలు.*
💖 *కాగా దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. "దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవ స్సనాతనః" - అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం? ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చరదేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి ఉన్న గుడికి - ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ' అన్నమాట.*
💓 *’దేహమే దేవాలయం' ఔను. నీ దేహమే, పంచ భూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడైన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. నీ శరీరపు అంతరంలోనే వున్న ఆయన స్వయం ప్రకాశితమై వెలుగుతూ ఉన్నాడు. అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయంప్రకాశి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment