Tuesday, November 7, 2023

నిరుపమాన ధైర్యము, ఆత్మజ్ఞానము వలన అఖండధైర్యము, ఆనందము కలుగును కావున అద్దానిని మానవుడు తన జీవితమునందు తప్పక బడయవలెను.

1609.    1-4.   200223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *నిరుపమాన ధైర్యము* 
                 ➖➖➖✍️

*పూర్వము అలెగ్జాండరు అను చక్రవర్తి అనేక దేశములను జయించి తుట్టతుదకు భారతదేశమునుగూడ జయింపనెంచి సింధు నదీప్రాంతమున అడుగుపెట్టెను.* 

*ఆ నదితీరమున ఒకానొక తపస్వి నివసించుచుండెను.* 

*అలెగ్జాండరు సైన్యసమేతుడై ఆ మార్గము గుండ బోవుచుండ ఆ బ్రహ్మనిష్ఠు డచ్చోటనే కూర్చొనియుండెను, లేవలేదు.* 

*సామ్రాజ్యధిపతియగు తన్నుజూచి లేవలేదను నెపమున ఆతని శిరస్సును ఛేదించి వేయుటకై అలెగ్జాండరు తన ఖడ్గమును పైకిదీయగా సాధువు పకపక నవ్వెను.* 

*అంతట అలెగ్జాండరు చకితుడై “నిన్ను చంపుటకు ఉద్యమింప నీవేల నవ్వుచున్నావు?! ఇట్టి వైపరీత్యమును నేనెన్నడును గొంచలేదే?! నవ్వుటకు కారణమేమి?!” యని యడుగ నా ఋషిపుంగవు డిట్లు వచించెను“నీవు నన్ను చంపెద నంటివి, అందులకు నాకు పట్టరాని నవ్వు వచ్చినది. ఏలయనిన నేను నిత్య సత్య ఆత్మ స్వరూపుడను.*

*నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః* | 
*న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః* ॥       (గీత 2-32) 

*నేను శస్త్రములచే ఛేదింపబడువాడను కాను. అగ్నిచే దహింపబడువాడను కాను, నీటిచే తడుపబడవాడను కాను, గాలిచే ఎండింపబడువాడను కాను. నేను సచ్చిదానంద పరిశుద్ధ స్వరూపుడను. భౌతికశక్తులు నన్నేమియు చేయజాలవు” అని ఠీవిగ పలికెను.* 

*అలెగ్జాండరు దిగ్భ్రమ జెంది భారతదేశములో మృత్యువునుగూడ ధిక్కరించు నట్టి మహిమాతిశయముగల జనులున్నారే! ఆహా! ఇట్టి ఆధ్యాత్మికవైభవముతో గూడిన పరమపావన ప్రదేశముపై దండెత్తుట అపచారము. నైతిక సంపత్తిచే తులతూగు మహర్షులకు ఆలవాలమైన భారతదేశమున కివియే నా జోహారులు! అని మొక్కి వెనుకకు మరలిపోయెను.*

*ఇంత ధైర్యము, ఇంత నిర్భయత్వము ఆత్మజ్ఞానముచే దప్ప మఱి దేనిచేతను గలుగనేరవు. “ద్వితీయాద్వై భయం భవతి” అను శ్రుతిప్రకారము ఆత్మకంటె వేఱుగ మఱియొక వస్తువు సత్యమని నమ్మినచో వెంటనే భయముదయించును. అజ్ఞానజనులు దృశ్యమును సత్యమని నమ్మి భయమును, దుఃఖమును పొందుచున్నారు.*

*జ్ఞాని దృశ్యమును నశ్వరముగను, ఆత్మను శాశ్వతముగను నమ్మి నిర్భయత్వమును, అనంతానందమును బడయుచున్నాడు. కావున మనుజునకు బలవీర్యతేజములు, ఉత్సాహగాంభీర్యాదులు ఆత్మజ్ఞానమువలననే కలుగగలవు.*

*నీతి:- ఆత్మజ్ఞానము వలన అఖండధైర్యము, ఆనందము కలుగును కావున అద్దానిని మానవుడు తన జీవితమునందు తప్పక బడయవలెను*.✍️
.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment