100223c1857. 110223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀267.
శ్రీ మహాభారతం
➖➖➖✍️
267 వ భాగం
శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
#ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట:
ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహా మునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది… "దేవతలారా ! ఇదివరకు మీరు నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు. ఎందుకనో ఆ మాట మరిచారు. నాకు రోజు రోజుకు భారం పెరిగి పోతోంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి" అని అడిగింది.
అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో…
“భూదేవీ ! నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. అందులోని జ్యేష్టుడైన దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు. ఇది త్వరలో సంభవించగలదు. అతడి కారణంగా కుఱుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి పోతారు. సోదరసమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు. నీ భారం తగ్గ గలదు" అని పలికాడు.
ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళి పోయింది. విష్ణువు ఆదేశానుసారం కలి పురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. అతడు మహా బలిష్టుడు, కోపిష్టి, పరుల ఉన్నతిని సహించ లేడు. అతడు ఎవరినీ లక్ష్యపెట్టక అందరితో వైరము పెట్టుకుని అతడికి తోడుగా అతడి మేన మామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు. అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర, బంధు మిత్ర సమేతంగా నశిస్తాడు. ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించ పని లేదు.”
#వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యంచెప్పుట:
కానీ నీమనసులో ఒక సందేహం ఉంది. పాండుసుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని శంకిస్తున్నావు. పాండవుల వలన నీకు కీడు జరుగదు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్భుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఇంచుక అపకారబుద్ధిని ప్రదర్శించ లేదు. సంధి కొరకు ప్రయత్నించారు. నేను కూడా అనేక విధముల సంధి చేసుకొనుట మంచిదని నీకుమారునకు చెప్పాను. నీ కుమారుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం. ఎవరూ తప్పించ లేరుకనుక కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించపని లేదు. నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాతశత్రువు. అతడు సాటి మనుష్యులయందే కాదు పశుపక్షులందు జాలి కలిగి ఉంటాడు. ఈ విషయము నీకూ తెలుసు. ధర్మరాజుకు నీయందు విముఖత లేదు. కనుక పాడవులను నీ కుమారుల వలె ఆదరించు. మహాజ్ఞానివైన నీవు నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధంచెయ్యి. ప్రశాంతిని పొందు" అని పలికాడు వ్యాసుడు.
ధృతరాష్ట్రుడు వ్యాసుడితో… “మహానుభావా ! అమృతతుల్యమైన
నీ మాటలవల్ల నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను పాండవులను
నా కుమారుల వలె ఆదరిస్తాను" అని పలికాడు.
ఆమాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు
ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి..
"సంజయా ! మనం యుద్ధ భూమికి వెళదాము, అందుకు కావలసిన సన్నాహములు కావించండి. గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణముకు సిద్ధం కమ్మని చెప్పు" అన్నాడు.
సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధ భూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చేసాడు.
#ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట:
పుత్రశోకంతో గాంధారికి అడుగులు తడబడుతున్నాయి. గాంధారి కోడళ్ళు కంటికిమంటికి ఏకథారగా ఏడుస్తున్నారు. దుఃఖ భారంతో నడుస్తున్న వారు పైట తొలగినా జుట్టు విడివడినా పట్టించుకునే స్థితిలో లేరు. కుంతీదేవి వారిని ఓదారుస్తోంది. అందరూ ఓదారుస్తున్నారు. హస్థినాపురంలో ఉన్న సాధారణ స్త్రీలపనీ అలాగే ఉంది. వారిని ఓదార్చే వారే కరువైయ్యారు. పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యాబిడ్డలు అనాధలవలె మిగిలారు. వాళ్ళలో వాళ్ళు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. అందరి ఇళ్ళు ఆర్తనాదాలతో నిండి పోయాయి. ఇదంతా చూసి విదురుడికి మనసు కలత చెందింది. యుద్ధపరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా ! ఎంత మందిని అని ఓదార్చగలడు. కొంత దూరం నడిచేసరికి రధికత్రయం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి…
"మహారాజా ! నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు. మేము ముగ్గురం తప్ప మిగిలిన కుఱు సైన్యమంతా మరణించింది" అన్నారు.
#కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట:
గాంధారిని చూసిన కృపాచార్యుడు దుఃఖం ఆగక "అమ్మా గాంధారీ ! నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా !
నీ కొడుకుల్లో ఒక్కడూ యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారి పోలేదు. యుద్ధముకు జంక లేదు. అమ్మా ! పాండవులకు జయించినా సంతోషం లేదు. భీముడు సుయోధనుడిని అధర్మంగా నాభి కిందభాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు. అది విని మాకు కోపం ఆగలేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను, బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును గజములను హయములను దారుణంగా చంపాము. కనుక పాండవులవిజయం వ్యర్ధమైంది. ఆ సమయంలో పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి అక్కడ లేరు కనుక బ్రతికి పోయారు.
లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక నెరవేరేది. మేము అర్ధరాత్రి పాడవుల కుమారులను, బంధువులను ససైన్యంతో చంపిన విషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు శలవిప్పించండి వెళతాము" అని శలవు తీసుకుని తమ తమ రధముల మీద వెళ్ళారు. కొంత దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి హస్థినకు వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయ మహారాజా ! వ్యాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా ! తరువాత ధృతరాష్ట్రుడు అంతః పుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు.
#ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట:
ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు తన తమ్ములతోనూ కృష్ణుడితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగాడు. కాని తన కుమారులను అంరదినీ పోగొట్టుకుని మనసంతా దహించుకు పోతున్న మనసుతో వస్తున్న ధృతరాష్ట్రుడిని చూడడానికి ధర్మరాజు మనసులో కలవర పడ్డాడు. ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రుడికి ఎదురు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు, ద్రౌపది వెళ్ళారు.
#కుఱుసామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట:
ధర్మరాజును చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేసారు. మరి కొంత మంది ధర్మరాజును తిట్ట సాగారు
"ఇతడు ధర్మరాజట ! ఇతడికి ధర్మం తెలుసా ! ఇతడికి జాలి, దయా ఉన్నాయా ! ఉంటే తాతలను, తమ్ములను, బంధువులను, మిత్రులను, గురువులను, కుమారులనూ చంపాడు. వీడికి కనికరమేమిటి ?" అని ఈసడించుకొనగా ! మరి కొంత మంది ధర్మరాజుకు వెళ్ళి …. "ఓ ధర్మరాజా ! చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీకు మనసెలా ఒప్పింది?" అని అడిగారు. మరికొంత మంది…
"ఓయీ ధర్మరాజా ! చెల్లెలి భర్త అని చూడక జయధ్రధుడిని చంపించావే ! స్మశానం లాగా మారిన ఈ రాజ్యం అంతా కట్టకట్టుకుని ఊరేగు" అన్నారు.
ఎవరేమన్నా పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు.
అయినా వారు తిట్టడం ఆపలేదు. ఇంకొంత మంది పాండవులకు అడ్డంగా వచ్చి "ఓయీ ! ధర్మరాజా ! నీ వలన కాదా ! అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులంతా వధించబడింది. నీ మరుదులందరినీ వధించినా నీ రక్త దాహం తీరలేదా !" అన్నారు.
అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. పక్కన ఉన్న వారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చి భోరున ఏడుస్తూ ధర్మరాజును కౌగలించుకున్నాడు.
#ధృతరాష్ట్ర హృదయం:
తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారి వలన భీమార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా మారింది దహించుకు పోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోసాడు. లోహవిగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు ఘాఢకౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా… అతడు మూర్చిల్లాడు. తరువాత… "నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను" అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెల్లి విరిసినా పక్కన ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి ఏడవసాగాడు. పక్కన ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి భుజం తట్టి.. “ధృతరాష్ట్ర మహారాజా ! భీముడు జీవించే ఉన్నాడు. నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని
నీ ముందుంచాను. నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా ! నీ బలం ముందు ఈ భీముడెంత ! ఈ మూడు లోకాలలో నీకు సాటి రాగల బలాఢ్యుడెవ్వడు ! కొడుకులు పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా ! అయినా మహారాజా ! భీముడే కాదు పాండవులు అందరిని చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా? అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప" అన్నాడు.
#శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట:
ధృతరాష్ట్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తనవంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి కృష్ణుడు "ధృతరాష్ట్ర మహారాజా! వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రములను పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహామునులు నీకు పరిపరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన ఫలమేమి ! భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా! అది నీవు ఎరుగవా ! నీ మనస్సును నీవు నియంత్రించ లేక పోయావు. నీకుమారుడి చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేతకాలేదు.
జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని, నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్ట లేని అసమర్ధుడవయ్యావు. కాని భీముడు నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీకుమారులను చంపినందుకు అతడిని నిందిస్తున్నావు. ఇది న్యాయమా? ధర్మమా ! నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచి పెట్టు" అని హితవు పలికాడు.
ధృతరాష్ట్రుడు… "కృష్ణా ! నీవు పలికినదంతా నిజమే. కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీదట పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను" అని పలికి తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. తరువాత యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా యుయుత్సుడిని కౌగలించుకున్నాడు.
#వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట:
ధృతరాష్ట్రుడు పాండవులతో…
"పాండుకుమారులారా ! మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళి ఆమెను ఓదార్చండి" అన్నాడు. ధర్మరాజాదులు తమ పెదతల్లి గాంధారి వద్దకు వెళ్ళారు. ఆమెకు నమస్కరించారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది. అంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి పాండవులు నమస్కరించారు. గాంధారి మనస్సు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ "అమ్మా గాంధారీ ! ధర్మరాజును శపించడం ధర్మం కాదు. ధర్మజుడి మీద కోపం మాని శాంతించు. నీకింత రజోగుణం ఎందుకు. సాత్వికంగా ఉండు. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా !" ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది" అన్నావు. అదేనిజమైంది. ఈ మహా సంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా! అసూయను వదిలి పాండవులలో ఉన్న ధర్మనిరతిని చూడు. నిదానించి యోచించిన నీకే అర్ధం ఔతుంది. అమ్మా ! గాంధారి ! జరిగి పోయిన విషయం తలచి బాధపడిన ఫలితమేమి ! కనుక పాండవుల మీద కోపం మాను " అన్నాడు.
#గాంధారి శాంతించుట:
ఆ మాటలకు శాంతించిన గాంధారి…
"మహర్షీ ! నాకు పాండవుల మీద కోపము, అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ కీడు తలపెట్ట లేదు. కుమారులను పోగొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతికి ఎంతో నాకూ అంతే!
నా కుమారుడి దుర్బుద్ధి, దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దుర్బోధలు కుఱువంశ నాశనానికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు నా కుమారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా ! యుద్ధంలో చంపడం చావడం న్యాయమేకాని యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా ! ద్రోహం కాదా !" అని పలికింది.
ఆ మాటలు విన్న భీముడు… గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు "అమ్మా గంధారీ దేవీ! నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేసానో జరిగి పోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా! నా కంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేసాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది.
నీ కుమారుడు ధర్మరాజుకు చేసినదంతా ధర్మమా ! ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమని చెప్పడం ధర్మమా ! తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ! ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి
నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మం కాదా ! నేను క్షత్రుయుడను కనుక నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కుఱుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్నగారి మాట మీర లేక అడవులకు వెళ్ళి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుడిని కుఱు సభకు రాయబారానికి పంపే సమయాన నా పలుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పు పట్టి ఉండే దానివి కాదు. నేను "సుయోధనా ! అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము" అన్నాను. నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ! ఎవరి మాటను లక్ష్యపెట్టక మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు, చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేసాము. మా కర్తవ్యం మేము నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు" అన్నాడు.
#గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట:
గాంధారి కొంత సేపు ఆలోచించింది.
"భీమసేనా ! నీవు చెప్పినది నిజమే అయినా నా కుమారుని తొడలు విరుచుట ధర్మమా ! నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే ! కాని భీమసేనా ! యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా ! రాక్షసులు మాత్రమే చేయగలిగిన ఆపని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్ధకం చేసుకున్నావా! ఇది ధర్మమా!"
అని అడిగింది.
భీముడు "సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా! నాడు ద్రౌపది కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నేను అలా చేసాను. కాని నెత్తురు నోటికి తాగించానే కాని తాగలేదమ్మా ! అలా చేయడానికి నేను రాక్షసుడనా ! అమ్మా ! ఇంకొక విషయం నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు కుఱు వీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయరక్షణ కొరకు అలా భీకరాకారందాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా ! ఆ సమయంలో నేను అలా చేయకుంటే కుఱు వీరులు నన్ను ముక్కలు చేసి ఉండే వాళ్ళు. సాటి మనుషుల రక్తంతాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తాగేపాతకం చేసేంత దుర్మార్గుడినా ! నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగ లేదు" అన్నాడు.
#గాంధారి ఆగ్రహం:
గాంధారి అంతటితో ఊరుకోలేదు…
"భీమసేనా ! నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్ళను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా చంపావే! ఇది ధర్మమా! నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు ఒక్కడైనా నీకు కనిపించ లేదా! ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా! నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలాచేసావా !" అని పక్కకు తిరిగి… "ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు" అని కోపంగా అరిచింది.
ఆ అరుపుకు ధర్మరాజు గడగడ లాడుతూ… "అమ్మా ! ఇక్కడ ఉన్నానమ్మా ! నేనమ్మా ! పాండవాగ్రజుడను ధర్మరాజును.
నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను నన్ను క్షమించకమ్మా ! నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాగ్నిలో నన్ను ధగ్ధం చెయ్యి. అమ్మా నీ నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలం లోని రాజులందరిని యుద్ధ భూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను, అనుభవిస్తాను. బంధు మిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేల ఈ శరీరంలో ప్రాణం ఎందుకు ! నా లాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు?" అని భోరున ఏడ్చాడు.
ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది. ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలి గోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తల నిమిరి "నాయనలారా! మీ అమ్మ కుంతీ దేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి" అన్నది.
హమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీ దేవి దగ్గరకు వెళ్ళారు.
#పాండవులు కుంతీ దేవిని చూచుట:
చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీ దేవికి దుఃఖము ఆనందమూ కలగలుపుగా స్పందించింది.
పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాడవులను చూసి వారి తలలు నిమిరి భోరుమంది. "పాండు కుమారులారా ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా!” అని వారి శరీరాలు తడిమి కుమిలి పోయింది. పక్కనే శోక మూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి "అమ్మా ! ఏరమ్మా నా మనుమలు ! అభిమన్యుడు ఎక్కడమ్మా ! ఎక్కడికి వెళ్ళారమ్మా! నన్ను చూడడానికి ఎందుకు రాలేదు " అని అడిగుతూ పేరుపేరు వరుసనా పిలిచింది.
#గాంధారి ద్రౌపదిని ఓదార్చుట:
ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ "అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా ! మీ అత్త కుంతీదేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా! అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు. ఇలా జరుగుతుందనే విదురుడు కుఱు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నేను ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప లేక పోయాను. కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధివిలాసం కాల మహిమ ఊరుకోమ్మా!" అని ద్రౌపది ఓదార్చింది.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment