090223c1855. 100223-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀266.
శ్రీ మహాభారతం
➖➖➖✍️
266 వ భాగం
శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:
#ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట:
విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు మరికొంత శాంతించిన మనసుతో… "విదురా! అసలు సంసారంలో దుఃఖం ఎందుకు ఉంటుంది. దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి?" అని అడిగాడు.
విదురుడు "మహారాజా ! పురుషుడి తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను. క్రమక్రమంగా అవయవ నిర్మాణం జరిగి శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఆశిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ శిశువు గిరగిరా తిరుగుతూ బాధను అనుభ విస్తుంది. ఆ శిశువు వేదనను భరించ లేక గర్భముఖద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి. ఆ తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది. ఆశిశువు బాలుడిగా ఉన్నప్పుడు శుచి, అశుచి తెలియదు. వివేకము తెలియదు. ఆట పాటలతో తెలియక పొరబాటుగా అనేక దుష్టకార్యాలు చేస్తాడు. బాల్య చేష్టలతో బాల్యావస్థ దాటగానే యవ్వనంలోకి ప్రవేశించగానే కామపరమైన ఆసక్తి జనిస్తుంది. స్త్రీ సౌఖ్యం కొరకు పాకులాడుతాడు. ఆ సమయంలో అధికంగా. ఇంద్రియ లోలత్వం వలన సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. కోరికలతో వేగిపోతూ అనేక దుష్కార్యములు చేస్తాడు. బాల్యంలాగే యవ్వనమూ గడిచి పోతుంది. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగి పోయి వ్యాధి పీడితుడు ఔతాడు. అయినా ఉచితానుచితాలు తెలియక అనుచిత కార్యములను చేస్తాడు. వ్యాధిప్రాబల్యంతో వయోభారంతో కృంగి కృశించి పోతాడు. అప్పుడు యముడు వచ్చి తన పాశముతో ప్రాణములను హరిస్తాడు. ఈ జీవుడు పోలేక పోలేక యాతన అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కనుక ఈ లోకం నిరంతర దుఃఖ భూయిష్టమైంది అన్నది స్పష్టము. ఈ మానవులు కామ, క్రోధ, మదోన్మత్తులై లోభంతో అనేక దుష్కృత్యములు ఆచరిస్తారు. కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మపరులౌతారు. చివరకు యమలోక ప్రాప్తిని పొందుతారు. వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమున పయనిస్తారు.
#సంసారమును అధిగమించుట:
విదురుడు తన మాటలను కొన సాగిస్తూ “ధృతరాష్ట్రమహారాజా ! నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దలవలన విని యున్నాను అది నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను. దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని వెన్నంటాయి. ఆ బ్రాహ్మణుడు ప్రాణ భయంతో అడ్డదారిలో పరుగెడగా ఆ కౄర జంతువులు అతడిని వదిలి వెళ్ళి పోయాయి. ఇంతలో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది. ఆ బ్రాహ్మహ్మణుడు ప్రాణ భయంతో కాళ్ళు గజగజ వణుకుతుండగా చలన రహితంగా నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారి పోసాగాడు. వెనుక నుండి దొంగలు ముందు నుండి కౄరజంతువులు ఎంత పరుగిడినా అడవికి అంతు దొరకడం లేదు. ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒకస్త్రీ అతడిని కౌగలించుకుంది. అతడిలో భయం ఇనుమడించింది. అయిదు తలలు కలిగిన ఏనుగులను చూసాడు. ఆస్త్రీని విడిపించుకుని పరుగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తల కిందులుగా వేలాడ సాగాడు. కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంరంగా చాస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్ళతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగి పోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి. కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు, ఎలుకలు కొరకడంతో ఏనిముషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు వీటితో మనసు కకావికలు ఔతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణముల మీద తీపి చావ లేదు" అన్నాడు విదురుడు.
ధృతరాష్ట్రుడు "విదురా ! ఈ కథ నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పు" అన్నాడు.
#సన్మార్గ బోధన:
విదురుడు "మహారాజా! ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్తారు. ఈ కథ మన జీవితంలాంటిది. ఈ కథని వివరిస్తే కాని అర్ధంకాదు. ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం. అందు ఉన్న క్రూరమృగములు, దొంగలు, మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు, భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ ముసలి తనము, అయిదు తలల ఏనుగు పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుషు, దాని వైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు, పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు.
ఆచెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝోంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు. పూలనుండి స్రవిస్తున్న మకరందం సుఖసంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా జీవుడు ఆ సుఖసంతోషాల కొరకు పాకులాడుతుంటాడు. కలకాలం బ్రతకాలని అనుకుంటాడు. బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ సంసారచక్రంలో బంధించ బడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వితమైన ఆనందాన్ని పొందుతారు.
#విదురుని జ్ఞానబోధ:
ఓ ధృతరాష్ట్ర మహారాజా ! నిరంతరం ప్రాపంచిక సుఖాల కొరకు పరితపిస్తూ ఈ బురద గుంటలో మునుగుతూ తేలుతూ తననుతాను మరచి పోతాడు మానవుడు. శరీరబలం తగ్గగానే రోగాలు ఆవహిస్తాయి. ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది. సుఖాలు అనుభవించడానికి పనికిరాక దిక్కులేని చావు చస్తాడు. మహారాజా ! ఈ దేహమే ఒక రథము. బుద్ధి రథ సారథి. పంచేంద్రియములే గుర్రములు. మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు బుద్ధి అనే పగ్గాలు పఠిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇచ్ఛవచ్చిన రీతిలో ప్రవర్తిస్తాయి. కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని నియంత్రించిన మానవుడు దుఃఖభాజనుడు కాడు. పుట్టినప్పటి నుండి ఈ జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలము. వివేకవంతులు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు. వివేక వంతులు తమ బుద్ధిని ఉపయోగించి గుర్రములను అదుపులో పెట్టి రథమును సక్రమ మార్గమున నడిపించి ముక్తిని పొందుతారు. కనుక ధృతరాష్ట్ర మహారాజా ! నీ కుమారుల మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు, బంధుమిత్రులకు దహనసంస్కారం జరిపించు " అని అన్నాడు విదురుడు.
#వ్యాసుడి రాక:
విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్చిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి విదురుడు, సంజయుడు నమస్కరించారు. మూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. ధృతరాష్ట్రుడు చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి " మహామునీ ! చూసితివా ! నా దుర్గతి. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత దుర్బరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా ! కుమారులంతా మరణించారు బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయాయి. అయినా నా ప్రాణములు నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు " కుమారా ! నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చనిపోయిన కుమారుల కొరకు దుఃఖించుట సమంజసం కాదు. పుట్టిన వాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా ! అసలు నీకుమారులకూ పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా ! కురువంశనాశన కారకుడు నీ కుమారుడు కాదా ! ఇక నీవు దుఃఖించడం తగునా ! జూద క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో బాధపడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను…✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.🙏
No comments:
Post a Comment