270223f1405. 280223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ధర్మం తప్పని దారిలో…*
➖➖➖✍️
*రామాయణాన్ని మూడే ముక్కల్లో చెప్పాలంటే 'కట్టె కొట్టె తెచ్చె' అంటారు.*
*రామాయణ భారతాలను ఒక్క వాక్యంలో ముక్తాయించమంటే పురుషార్థాలైన ధర్మ అర్థ కామాల్లో- ‘కామంపై ధర్మం గెలుపొందిన కథ రామాయణం,’ ‘అర్ధంపై ధర్మం విజయం సాధించిన గాథ మహాభారతం!’*
*కామం అంటే కోరిక మనిషికి ధర్మసమ్మతమైన కోరికలు ఉండటంలో తప్పులేదు. దాన్ని గీతాచార్యుడే సమర్ధించాడు. 'ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని 'నేనే' అన్నాడాయన గీత ఏడో అధ్యాయంలో.*
*దశరథుడి 'పుత్ర కామేష్టి' అందుకు ఉదాహరణ. ఆయన సంతానం కోసం నిత్యం తపించి పోయాడంది రామాయణం. అది ధర్మసమ్మతమైన కామం. దోషరహితమైన, మానవ సహజమైన కోరిక ధర్మాన్ని అనుసరించిన ఆ కోరిక నెరవేరింది. సంతాన భాగ్యం దక్కింది.*
*రావణ శూర్పణఖలది అలాకాదు, అప్పటికే వివాహితుడైన రాముణ్ని కామించింది… ఆ చుప్పనాతి. పైగా అది రాముడికి ఇష్టం లేనిది, ధర్మానికి విరుద్ధమైనది. పరపురుషుడి భార్యపై రావణుడు కామమోహితుడు కావడం మరింత పెద్ద తప్పు.... ధర్మాతిక్రమణం. చివరకు వారిద్దరూ పతనమయ్యారంది రామాయణం, దోషపూరితమైన కామంపై ఇలా అన్ని సందర్భాల్లోనూ ధర్మం గెలిచింది కనుక రామాయణాన్ని ‘కామంపై ధర్మం గెలుపొందిన’ కథగా చెప్పుకోవచ్చు.*
*భారతంలో దుర్యోధన దృతరాష్ట్రులది బలమైన అర్థకాంక్ష. అర్ధమంటే సంపద. రాజ్య సంపదపైనే సదా వారి గురి. దానికోసం వారు చేయని దురాగతాలు లేవు. వాస్తవానికి రాజ్యం పాండురాజుది. తన స్వీయ పరాక్రమంతో దాన్ని వృద్ధి చేసినవాడూ పాండురాజే.*
*‘భార్యలతో కలిస్తే మరణిస్తావని పాండురాజుకు ‘కిందమ’ ముని శాపం. అప్పటికింకా పాండవులు జన్మించలేదు. పాండురాజుకు ఇక పిల్లలు పుట్టరు కాబట్టి, తనకు కాకున్నా తన సంతానానికైనా రాజ్యాధికారం శాశ్వతంగా దక్కుతుందని ధృతరాష్ట్రుడు ఎంతో ఆశపడ్డాడు. కానీ అలా జరగలేదు. దేవతల వరంతో పాండురాజుకు సంతానం కలిగింది. దరిమిలా కౌరవులు మాయోపాయంతో రాజ్యాన్ని చేజిక్కించుకొన్నారు. జూదంలో ఓడి పాండవులు అడవుల పాలయ్యారు. వారు అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి చేసి వచ్చాక తమ రాజ్యభాగం కోరుతూ రాయబారం పంపితే- దృతరాష్ట్రుడు ఏం చెయ్యాలో ఆలోచిస్తానని మొండిచేయి చూపించాడు.*
*దర్మంగా అయితే, జూద నియమాలు ప్రకారం గడువు పూర్తయ్యాక తానే వారిని స్వయంగా పిలిపించి రాజ్యభాగం పంచి ఇవ్వాలి. కౌరవుల రాజ్యకాంక్ష అందుకు అడ్డుపడింది. అది ధర్మానికి వ్యతిరేకం.*
*ఫలితంగా కౌరవులంతా దుంపనాశనమయ్యారు. అది ‘ధర్మానికి అర్ధంపై తిరుగులేని విజయం’.*
*అదే సందర్భంలో రాజసూయ, అశ్వమేధయాగాల పేరుతో ధర్మజుడు తన రాజ్యాన్ని విస్తరించడం ధర్మ సమ్మతం. అది క్షత్రియ ధర్మం. కాబట్టి పాండవులు విజేతలయ్యారు. అంటే మహాభారతంలో ‘అర్ధంపై ధర్మానిది అన్నింటా పైచేయి’ అయింది. ధర్మార్థకామమోక్షాలు పురుషార్థాలు. అర్థకామాలు రెండూ ధర్మాన్ని అనుసరిస్తే, ధర్మమార్గం మోక్షానికి దారి చూపిస్తుంది. ధర్మార్థ కామాలు మూడూ సరైన దారిలో నడిస్తే మోక్షమార్గం సుగమం అవుతుంది!*✍️
-ఎర్రాప్రగడ రామకృష్ణ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment