Tuesday, November 7, 2023

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: #ఆధ్యాత్మవిద్య:#పరమాత్మసిద్ధి:

 020323c0809.    030323-3.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀287.

             శ్రీ మహాభారతం 
              ➖➖➖✍️
              287 వ భాగం
  శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

#ఆధ్యాత్మవిద్య:#పరమాత్మసిద్ధి:

భరద్వాజుడు “పరలోకం, ఇహలోకం గురించి వాటికి కల భేదం గురించి వివరించండి” అని అడిగాడు. 

భృగువు.. “భరద్వాజా ! ఇహలోక సుఖములకు, పరలోక సుఖములకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉన్నది. ఈ లోకంలో సుఖాలకు ఆలవాలమైన ఇళ్ళు, మంచములు, పడకలు, సింహాసనములు, మంచి దుస్తులు, సుగంధద్రవ్యములు, పూలు, సంగీతము, నాట్యము, వినోదములు, ఆరామాలు, స్త్రీజనములు వీటిలో ఒక దానికి ఒకటి పరస్పర బేధము కలిగి ఉంటాయి. పరలోక సుఖాలకు ఇలాంటి భేదం ఉండదు. పాపచింత కలవారు అధోలోకముకు పోతాడు. అక్కడ దుఃఖమే కాని సుఖము ఉండదు. విషయవాంఛల మీద మమకారం లేని వాడికి పాపపుణ్యములు అంటక శాశ్వతానందం పొందుతాడు” అని భృగువు భరద్వాజుడికి చెప్పాడు.


#ఆచార విధులు:

ధర్మరాజు… “పితామహా ! ఆచారవిధులను గురించి వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! చెడుప్రవర్తన.. మంచి వాళ్ళను చెడువాళ్ళను బాధపెడుతుంది కనుక మంచిప్రవర్తన కలిగి ఉండడం శ్రేయోదాయకం. రాజమార్గంలో, రచ్చబండల వద్ద, పశువులను కొనుచోట మలమూత్ర విసర్జన చేయ రాదు. ఉదయం సాయంత్రం నదీస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అసురసంధ్యవేళ నిద్రించరాదు. స్నానం, సంధ్యావందనం చేసిన పిదప భుజించాలి. తినే ఆహారాన్ని నిందించకూడదు. ఆహారాన్ని బ్రహ్మస్వరూపంగా పూజించాలి. తడి కాళ్ళతో నిద్రించరాదు. ఇవి సదాచారములు. ఉదయించే సూర్యుడిని చూడరాదు. ఇతర స్త్రీలను వస్త్రహీనలుగా చూడరాదు. చేసిన పాపం బహిర్గతం చేసి విముక్తిపొందాలి కాని దాచరాదు. దాంపత్యాన్ని, జీవితాన్ని బహిర్గతం చేయకూడదు. గురుశుశ్రూష చెయ్యడం, బ్రాహ్మణులను పూజించడం మనిషి ఆయువును వృద్ధిచేసి, లక్ష్మీ కటాక్షం కలిగించి స్వర్గలోకప్రాప్తి కలిగిస్తుంది.


#ఆధ్యాత్మ విధ్య:

ధర్మరాజు.. ”పితామహా ! ఆధ్యాత్మవిధ్య గురించి వివరించండి”అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! మానవునిలో    భూమి నీరు, ఆకాశము, వెలుగు, గాలి అను పంచ భూతములు, వాటి గుణములైన శబ్ధము, రసము, గంధము, చలనము, తేజస్సు సముద్రంలో కెరటాల వలె పుడుతూ ఉంటాయి అంతమౌతూ ఉంటాయి. ఇంద్రియములు పంచ భూతములకు వశులై వర్తిస్తుంటాయి. మనసు ఇంద్రియాలకు ఆధారమై ఉంటుంది. మనసు ఒక నిర్ణయానికి రావడానికి బుద్ధి తోడ్పడుతుంది. పురుషుడు ఇలా విషయాలను గ్రహిస్తుంటాడు. అలా కాక పురుషుడు బాహ్య విషయాలను వదిలి అంతర్ముఖుడై మనసుని కట్టడి చేసి, బుద్ధితో విషయాలను క్షేత్రజ్ఞుడైన ఆత్మను దర్శనంచేయాలి. ఈ ఆత్మ క్షేత్రజ్ఞుడని, పురుషుడని, భూతాత్ముడని, పరమేశ్వరుడని, బుద్ధి సాక్షి అని, జనన రహితుడని పిలుస్తుంటారు. పురుషుడు అంతఃచేతనాన్ని అనుభవంతో తెలుసుకుంటాడు.   బాహ్య విషయాలను మాయ అని, కల అని, మిధ్య అని మాయకారణంగా అని తెలియక మానవుడు మోసపోకూడదు. మాయకు సత్వ రజతమో గుణాలు శరీరం. కనుక రజ, తమో గుణాలను వదిలి సత్వ గుణాలన్ని పెంపొందించుకుని జ్ఞాన వంతుడై చివరకు సత్వగుణాన్ని కూడా వదిలి ఆత్మను పరమాత్మలో లీనం చెయ్యాలి.✅


#యోగము:

“ధర్మజా! యోగము గురించి చెప్తాను విను. ఎప్పుడూ తామరాకు మీది నీటిబొట్టు లాగా, మేఘములో మెరుపు తీగలా సదా చలించే మనసును ఏకాగ్రతతో ఉంచుకోవాలి. మనసుకు ఉచ్వాస, నిశ్వాసములు ఆధారములు. వాటి మీద దృష్టినిలిపి క్రమపరచి ఏకాగ్రత సాధించాలి. కష్ట సాధ్యమైన దీనిని అభ్యాసముతో సాధించాలి. అలా యమ, నియమములను అభ్యసించి ఆలోచనలను నిగ్రహించాలి. అప్పుడు క్రమబద్ధం చేసిన శ్వాశ అంతర్నాడి ద్వారా బ్రహ్మపదము చేరి నిశ్చలమైన ఆనందం ఇస్తుంది.


#జపము:

ధర్మరాజు భీష్ముడితో… “పితామహా! నాకు జపము దాని మహిమ గురించి వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు.. “ధర్మనందనా ! జపము గురించి యముడు, మృత్యుదేవత, కాలము, బ్రాహ్మణుడు, ఇక్ష్వాకులకు మధ్య జరిగిన సంవాదము గురించి చెప్తాను. ఈ జపకర్మ వేద విదుల చేత ఆమోదించబడిన కర్మ. జపము చేయువారు అత్యంత శుచిగా ఒక చదునైన ప్రదేశంలో ధర్భాసనం మీద దర్భలు చేత పట్టుకుని కూర్చుని ఇంద్రియములను నిగ్రహించి, మనసును నిగ్రహించాలి. ఇంద్రియములను విషయాసక్తి, డంభము, మత్సరము, అహంకారము, మానము, అవమానము తొలగించి బ్రహ్మచర్యము పాటించాలి. ఈ విధ నియమములను అనుసరించి జపమును ఆచరించిన పురుషుడు సర్వ లోకములను జయించి తుదకు మోక్షము సాధిస్తాడు. అలా కాక అశుచిగా, దుర్గుణముతో, నీచమైన ఆలోచనతో, మనస్సు నిశ్చలము లేకుండా జపము ఆచరించిన పురుషుడు నరకానికి పోతాడు.


#కౌశికుడు ఇక్ష్వాకుడు:

పూర్వము వేదవేదాంగ పారంగతుడైన కౌశికుడు అనే బ్రాహ్మణుడు అత్యంత నిష్టతో సావిత్రీదేవిని గురించి జపము చేసాడు. 
ఆ నిష్టాపూర్వక జపముకు మెచ్చిన సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏమి వరము కావాలో  కోరుకొమ్మని అడిగింది. కౌశికుడు తనకు జపమునందు నిష్ఠ కావాలని కోరాడు. సావిత్రీదేవి “ఓ కౌశికా! నీకు ఉత్తమగతులు కలుగుతాయి. యముడు, కాలము, మృత్యువు నీ వద్దకు వచ్చి మాట్లాడుతారు” అని వరమిచ్చి వెళ్ళింది. 
కౌశికుడు అలా నూరు సంవత్సరాలు జపతత్పరుడై గడిపాడు. అతడి జపముకు తృప్తి చెంది ధర్మదేవత సాక్షాత్కరించి… “కౌశికా ! నీ జపము సిద్ధించింది. నీవు సిద్ధి పొందావు.
నీవిక ఈ శరీరము విడిచి పుణ్యలోకముకు వెళ్ళు” అని చెప్పింది. 
కౌశికుడు… “ధర్మదేవతా ! నేను జపము చేయాలంటే నాకు ఈశరీరము కావాలి కదా! కనుక నేను ఎంత దుఃఖమైనా ఓర్చుకుంటాను కాని పుణ్యలోకాలకు వెళ్ళడానికి ఈ దేహము వదలను” అని అన్నాడు. ధర్మదేవత.. “కౌశికా! పుణ్యలోకాలకు వెళ్ళకుండా ఎప్పటికైనా వదలవల్సిన ఈ శరీరాన్ని వదలనని చెప్పడం ధర్మమా!” అని అడిగింది. 
కౌశికుడు…. “నా తపసుకు ఆలంబనమైన ఈ శరీరమును నేను విడువను” అన్నాడు. 
ధర్మదేవత… “నిన్ను పుణ్యలోకాలకు తీసుకు పోవడానికి యముడు, మృత్యువు, కాలము వచ్చారు” చూడు అని చెప్పింది. 

అప్పుడు మృత్యువు, యముడు, కాలము ముందుకు వచ్చి తమని తాము పరిచయము చేసుకున్నారు. యముడు… “నువ్వు చేసిన జపము ఫలించింది” అని చెప్పాడు. కాలపురుషుడు… “నీకు పుణ్య లోకాలకు వెళ్ళ వలసిన కాలము సమీపించింది” అన్నాడు. మృత్యుదేవత… “కాలపురుషుని ఆదేశం మేరకు నేను నిన్ను తీసుకు రావడానికి వచ్చాను” అని చెప్పింది. కౌశికుడు వారి మాటను పెడ చెవిన పెట్టి.. “మీరు చెప్పిన పని కాక నేను మీకు ఏమిచేస్తే సరిపోతుంది?” అని అడిగాడు. 
ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఇక్ష్వాకుడు అక్కడ ఉన్న దేవతలకు నమస్కరించాడు. కౌశికుడు ఇక్ష్వాకుడికి మర్యాదలు చేసి… “మహాత్మా ! నేను నీకు ఏవిధంగా సత్కరించగలను” అని అడిగాడు. 

ఇక్ష్వాకుడు…. “మహాత్మా ! క్షత్రియులమైన మేము దానాలు ఇస్తాము కాని దానాలు పట్టము. నీకేమి కావాలో అడుగు నేను తీరుస్తాను” అన్నాడు. 

కౌశికుడు… “ఇహలోక మమకారం ఉన్న వాళ్ళకు మర్యాదలు కావాలి కాని నాకు ఎందుకు? నా అతిథివైన నీకు నేను కానుకలు సత్కారంగా ఇస్తాను. కనుక అవి దానము కాదు” అన్నాడు. 

ఇక్ష్వాకుడ… “నీకు ఇవ్వాలని అనుకుంటే నీ జపఫలము సగము నాకు ఇవ్వు” అని అడిగాడు. కైశికుడు… “నీకు కావాలంటే పూర్తిగా అయినా ఇస్తాను. ఎంత కావాలి” అని అడిగాడు. 

ఇక్ష్వాకుడు “నీ జపఫలము ఏమిటి?” అని అడిగాడు. 

కైశికుడు… “నేను ఫలితమును ఆశించి రాలేదు కనుక నా జపఫలము ఏమిటో నాకు తెలియదు. నా జపఫలము ముందు తీసుకుని తరువాత ధర్మవిధులను అడిగి తెలుసుకో” అని అడిగాడు. 

ఇక్ష్వాకుడు “కైశికా ! ఫలితము తెలియకుండా దానము ఎలా స్వీకరించగలను. నాకు వద్దు” అన్నాడు. 

కైశికుడు… “రాజా! నీవు అడిగావు, నేను ఇస్తాను కనుక ఇప్పుడు మనకు అసత్య దోషము అంటదా?” అని అడిగాడు. 

ఇక్ష్వాకుడు నవ్వి “క్షత్రియుడనైన నేను నీతో మాటల యుద్ధము చేసాను” అన్నాడు. 

కౌశికుడు.. “మహారాజా! నీవు ఏమి చేసావో కాని నేను త్రికరణ శుద్ధిగా నా జపఫలితాన్ని ఇస్తున్నాను నువ్వు తీసుకుంటాన్నావు. ఇప్పుడు నీవు తీసుకోవడానికి నిరాకరిస్తే క్షత్రియుడివైన నీకు బ్రాహ్మణుడినైన నాకు సత్యవ్రతభంగము వాటిల్ల కలదు. ఇది ధర్మముకాదు. రాజా! సత్యవ్రతమే తపస్సు, సత్యమే యజ్ఞము, సత్యమే వేదము, శాంతి, ఇంద్రియ నిగ్రహము. 
ఆ సత్యవ్రతానికి భంగం వాటిల్లినప్పుడు నేను ఇప్పటి వరకు చేసిన జపతపములు ఫలించవు” అన్నాడు. 

వీరి మాటలు వింటున్న ధర్మదేవత..“మీలో మీకు వాదన ఎందుకు దానము ఇచ్చిన ఫలము కౌశికుడికి, సత్యవ్రతమును పాటించే ఫలము ఇక్ష్వాకుడు పొందగలరు” అని అన్నాడు. 

అప్పుడు పుణ్యలోకము మానవాకృతిలో వచ్చి…. “అయ్యా ! మీలో మీకు వాదన ఎందుకు. ధర్మదేవత ! చెప్పినట్లు చేయండి. మీరిద్దరూ సమాన ఫలితం పొందుతారు” అన్నది. 

ఇక్ష్వాకుడు బ్రాహ్మణుడు కూడా తానిచ్చేది స్వీకరించాలని పట్టుపట్టాడు. 

కైశికుడు నేను నియమనిష్టలు, జపతపాదులలో నిమగ్నమై ఉన్నాను. నేనేదీ కోరను కనుక నేనేది స్వీకరించను.” అన్నాడు. 
ఇక్ష్వాకుడు “నీకు తగినదే నేను ఇస్తాను. నేను చేసిన సుకృతములఫలము నీకిస్తాను తీసుకో” అన్నాడు. 

ఇంతలో వికృతమైన వేషధారులు ఇద్దరు అక్కడకు వాదులాడుకుంటూ వచ్చారు. ఇక్ష్వాకుడు వారిని ఎందుకు వాదులాడుకుంటారని అడగగానే “అయ్యా ! నేను గోదానము చేసాను. ఇతడు ఆ గోదానఫలితాన్ని ఇమ్మని అడిగాడు. నేను అలాగే ఇచ్చాను. ఇతడు అది తనకు చాలదని చెప్పి రెండు మంచి జాతి 

#జపము చేసిన  బ్రాహ్మడు మరియు ఇక్ష్వాకు రాజుల ఊర్థ్వగతి:

ఆవులను కొని ఆ గోవులను అర్హుడికి దాన మిచ్చాడు. తరువాత ఆదాన ఫలితం నాకు ఇస్తానని చెప్పాడు. నేను మొదట అంగీకరించి తరువాత నిరాకరించాను. అదే మా వాదులాట. మీరే చెప్పండి నేనేం చేయడము ధర్మము” అని అడిగాడు. 

రెండవ వాడు… “అయ్యా ! ముందు అంగీకరించి తరువాత నిరాకరించడం న్యాయమా?” అని అడిగాడు. 

ఇది విన్న కౌశికుడు “మహారాజా ! చూసారా వీరి వాదులాట మనవంటిదే. నీవు అంగీకరించినటుల దానం స్వీకరించు లేకున్న నిన్ను శపిస్తాను”అన్నాడు. 

ఇక్ష్వాకుడు ఇక తప్పదనుకుని దానము స్వీకరించడానికి అంగీకరించి కౌశికుడి వద్ద నుండి దానం స్వీకరించి బదులుగా తాను చేసిన యజ్ఞఫలమును దానంగా స్వీకరించమని కోరాడు. 

అప్పుడు అక్కడకు వచ్చిన మానవులు వారితో “అయ్యా! మేము కామము, క్రోధము. మీరిద్దరు ధర్మదేవత చేతను, యముడి చేతను మా చేత పరీక్షింపబడ్డారు. అంతే కాని ఇవ్వడము తీసుకోవడము దైవ నిర్ణయాలు, మీ చేత ఏమీలేదు” అన్నారు. 

అప్పుడు కౌశికుడు “మహారాజా ! నా జపతపాలకు అదిష్టాన దేవత అయిన సావిత్రిదేవి ఆమె నుండి నేను బలము, శ్రద్ధను పొందాను. ఇక నేకు జప తపాదులు చేయనవసరం లేదు. నీవు నా పుణ్యఫలమును స్వీకరించి నాకు అవసరం లేకున్నా నీ యజ్ఞఫలాన్ని నాకు ఇచ్చావు.
ఇక నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. వారి ధర్మ నిష్టకు మెచ్చిన దేవతలు వారి మీద పూలవృష్టి కురిపించి దేవదుందుభులు మ్రోగుతుండగా కిందకు దిగి వచ్చి వారిని అభినందించారు. 
ఆకాశవాణి “అయ్యలారా ! మీరిద్ధరు సిద్ధి పొందారు. మీకిక ఉత్తమ గతులు కలుగుతాయి” అని పలికింది. 

అప్పుడు కౌశికుడు భవబంధాలు తెంచుకుని అక్కడ ఉన్న ధర్మదేవతకు, యమధర్మరాజుకు, మృత్యుదేవతకు, కాలపురుషుడికి నమస్కరించి, మనసును నిలిపి ప్రాణాలను కనుబొమల మధ్య నిలిపి, ప్రాణాన్ని బ్రహ్మరంధము వద్ద నిశ్చలంగా నిలిపి ప్రాణములను విడిచాడు. 
అతడి ప్రాణములు దేదీప్యమాన కాంతిగా బయటకు వెడలింది. ఆకాంతికి బ్రహ్మదేవుడు ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. బ్రహ్మదేవుడు ఉత్తమ నిష్టతో జపము చేసే యోగులకు వారి పుణ్యవశమున పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. నిష్టతో జపము చేయడము వలన తమకు తాముగా శరీరము నుండి విడివడి ఉత్తమ లోకములకు వెళ్ళగలరు. “కైశికా రా!” అనగానే బ్రహ్మరంధ్రం ద్వారా శరీరం నుండి విడివడిన కౌశికుడి ఆత్మ బ్రహ్మదేవుడి ముఖము నందు ప్రవేశించి బ్రహ్మదేవుడిలో ఐక్యమైంది. 

తరువాత ఇక్ష్వాకుడు కూడా తనకు తానుగా శరీర త్యాగం చేసి బ్రహ్మదేవుడిలో ఐక్యము అయ్యాడు. 

అది చూసిన దేవతలు ఆశ్చర్య పోతూ కౌశికుడిని, ఇక్ష్వాకుడిని పొగిడారు” అని చెప్పిన భీష్ముడు “ధర్మనందనా ! నిష్టతో జపము చేసిన వారు బ్రహ్మైక్యము పొందగలరు” అన్నాడు.


#జ్ఞానయోగము:

ధర్మరాజు… “పితామహా ! నాకు అన్ని యోగాలకంటే మిన్న అయిన జ్ఞానయోగము గురించి వివరించండి” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మనందనా! ఒకప్పుడు మనువు, బృహస్పతి సంవాదము వినిపిస్తాను విను… ‘మనువు దేవ గురువును జ్ఞానయోగము వివరించమని కోరగా బృహస్పతి… ‘అనఘా ! జ్ఞానయోగముకు మూలము సత్కర్మాచరణమే. ఇష్టమైనది పొందుటకూ ఇష్టము కానిది విడుచుటకు మానవుడు కర్మాచరణ చేస్తుంటాడు. అటువంటి కర్మలు ముందు సుఖము కలిగించి తరువాత దుఃఖమును కలిగిస్తాయి. కర్మఫలాన్ని ఆశించకుండా చేసే కర్మలు సుఖదుఃఖాలను కలిగించవు. అతడి అరిష్డ్వర్గాలకు అతీతంగా ఉండి జ్ఞానయోగ సిద్ధి పొంది చివరకు జ్ఞానం పొందుతాడు. పరతత్వము ఆధారరహితము. శబ్ధ, గంధ, రస, రూపాదులు లేనిది. అది అగోచరమైనది. పరతత్వానికి స్త్రీ పురుష నపుంసక భేదము లేదు. అది జ్ఞానస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది. దేదీప్యమానమైన దీపము చుట్టూ ఉన్న వస్తువులను వెలిగించినట్లు జ్ఞానము ఇంద్రియములను, మనసును వెలిగించి వాటికి పట్టిన జాడ్యములను వదిలిస్తుంది. రాజుకు మంత్రులు సాయపడినట్లు జ్ఞానము అనుదిన కార్యములలో ఇంద్రియములకు, మనసుకు తోడ్పడుతుంది. చెట్టులో దాగిన అగ్ని గొడ్డలితో నరికినప్పుడు కనిపించదు అయినా ఒకటికి ఒకటి రాచుకున్నప్పుడు దానిలోని అగ్ని ప్రజ్వలించినట్లు మన శరీరంలో ఉన్న పరతత్వమనే గురువుతో వెగించబడేదే జ్ఞానం. అంతే కాని ఈ శరీరాన్ని హింసించినా బాధపెట్టినా జ్ఞానంకలుగదు. పరతత్వము ఇంద్రియ గోచరము కాదు. అందువలన పరతత్వము అస్తిత్వము లేనిదికాదు. వలతో మృగములను పట్టినట్లు, గాలంతో చేపలు పట్టినట్లు, కందకముతో ఏనుగును పట్టుకున్నట్లు, పరతత్వాన్ని జ్ఞానముతో మాత్రమే తెలుసుకోగలము. 
కనుక జ్ఞానిమాత్రమే పరతత్వము తెలుసుకోగలడు. పాము కాలును పాము గ్రహించినట్లు పరతత్వాన్ని జ్ఞాని మాత్రమే గ్రహించగలడు. అమావాస్యనాడు చంద్రుడు లేనంత మాత్రాన చంద్రుడు లేడని అనగలమా! అలాగే పరతత్వము కనపడనంత మాత్రాన పరతత్వము లేదని అనగలమా ! రాహువు మింగిన సూర్యుడు కనిపించనంత మాత్రాన సూర్యుడు లేడని అనగలమ? రాహువు విడువగానే సూర్యుడు కనిపించినట్లు జ్ఞాననేత్రము తెరవగానే పరత్వము నిర్మలమైన నీటిలో ప్రతిబింబంలా భాసిస్తుంది. అరిషడ్వర్గాలకు లొంగి ఇంద్రియములను బయట ప్రపంచంలో తిరుగునట్లు విడిచిన దుఃఖమును నివారించుట అసాధ్యము. 
ఇంద్రియములను నిగ్రహించి దృష్టిని ఏకాగ్రతచేసి అంతరావలోకనము చేసి ఆత్మను ఉద్దరించాలి. నిశ్చలమైన మనసు మలినము లేని అద్దంలా భాసిస్తుంది. ధ్యానయోగము చేత మనసును కట్టడి చేసి విషయవాంఛల నుండి దూరము చేసి త్రిగుణాతీతుడై ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. అదే మోక్షము.


#మాయ త్రిగుణాలు:

జ్ఞానమును మాయ కప్పి ఉంచుతుంది. ముందుగా మానవుడు మాయను గురించి తెలుసుకోవాలి. పక్షులు పోయే మార్గము ఎలా తెలుసుకోలేమో మాయ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోలేము. మాయకు ఆకారము లేదు కంటికి కనిపించదు. సత్వరజోతమో గుణాలే మాయకు ఆకారము. త్రిగుణాలను తొలగించిన మాయ దానంతట అదే తొలగి పోతుంది. ఆత్మను ఆవరించి ఉన్న త్రిగుణాలను వైరాగ్యము అనే కొడవలితో కోసి వేయాలి. మణులు, మాణిక్యాలు, బంగారు పూసలు, వెండి పూసలను ఒకే దారం ఎలా మాలలా కట్టి ఉంచుతుందో పరమాత్మ జీవాత్మలలో అంతర్లీనంగా ఉండి ఈ లోకాలను నడిపించి ఉంచుతాడు. ఒకే సారము ఉన్న భూమిలో అనేక విధాల ఔషధీమొక్కలు ఉన్నట్లు ప్రాణులందు ఉన్న బుద్ధి అనేక విధముల కర్మలకు కారణం ఔతుంది. భూమికంటే జలము, జలము కంటే తేజస్సు, తేజస్సు కంటే వాయువు, వాయువు కంటే ఆకాశము విశాలమైనది. వీటన్నిటికంటే మనసు పెద్దది. మనస్సు కంటే బుద్ధి విశాలమైనది. ఇవి అన్ని కాలానికి లోబడి ప్రవర్తిస్తాయి. ఆ కాలాన్ని శాసించకలిగిన వాడు పరమాత్మ.

పరమాత్మకు ఆది, మధ్య, అంతము లేదు. అతడు అవ్యయుడు, వేదములకు అధిపతి. అతడు తలపుకు అందడు, పలుకుకు అందడు, కర్మలకు గోచరము కాడు. అతడే సకల ప్రాణులను భవబంధ విముక్తులను చేయగలడు. మనసును తరువాత బుద్ధిని తరువాత జ్ఞానమును అంతరింపజేసిన అక్షరుడు జ్ఞానమయుడు అయిన విష్ణుసాయుజ్యమును పొందగలడు. ఆ పరతత్వము అవ్యయము, అచ్యుతము, అమలము, అమేయము, అమృతము, అమేయము, అనంతము. అట్టి పరమాత్మను మనసును యమ నియమాలతో మనసును నియంత్రించి మాత్రమే తెలుసుకొనగలము.” 
ఇలా బృహస్పతి మనువుకు పరమాత్మ తత్వము భోదించాడు” అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


#శ్రీకృష్ణతత్వం:

ధర్మరాజు… “పితామహా ! నాకు శ్రీకృష్ణతత్వము గురించి తెలుసుకోవాలని ఉంది” అని భీష్ముడిని అడిగాడు. 

భీష్ముడు…  “ధర్మనందనా ! నారదాది మునుల వలన నేను తెలుసుకొన్నది ఇప్పుడు నీకు చెప్తాను… “శ్రీకృష్ణుడే పరమాత్మ అయిన విష్ణుమూర్తి. అతడు తన వినోదము కొరకు భూమి, ఆకాశము, నీరు, వాయువు అను పంచ భూతములను కల్పించాడు. అలా కల్పించిన జలములో ఒక భవ్యమైన తల్పము మీద అతడు శయనించి ఉన్నాడు. అతడి నాభినుండి ఒక కమలము ఉద్భవించింది. ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ తన సంకల్పంచేత ఏడుగురు మానస పుత్రులను సృష్టించాడు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యపప్రజాపతి జన్మించాడు. కశ్యపుడి వలన దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించారు. ఆ కశ్యప ప్రజాపతి పుత్రుడు సూర్యుడు. అత్రి మహామునికి చంద్రుడు జన్మించాడు. ఈ సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు అనేక సంవత్సరాలు రాజులై ఈ భూమిని పాలించారు. దేశ కాల పరిస్థితులను అనుసరించి రాజవంశస్థులు శాఖోపశాఖలై వర్ధిల్లాయి. ఆ రాజ వంశీయులు తమలో తాము కలహించుకుని విభేదించి యుద్ధములు చేసుకున్నారు. ఆ యుద్ధముల కారణంగా విష్ణువు జనక్షయం చేస్తూ వచ్చాడు. ఆ దేవదేవుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దుడు అనే నాలుగు దివ్యరూపములతో దివ్యనామాలతో వినోదించాడు” అని చెప్పి భీష్ముడు శ్రీకృష్ణుడిని చూపి “ధర్మనందనా ! ఈ మహాపురుషుడిని సామాన్య మానవుడిగా చూడటము మన అజ్ఞానము. శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు, తన కటాక్షవీక్షణాలతో భక్తుల కోరికలను తీరుస్తుంటాడు.” ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు.


#పరమాత్మసిద్ధి:

#వరాహుని స్తుతించుచున్న మునులు:

ధర్మరాజు.. “పితామహా ! ఎవ్వని తలచుకుంటే మానవుడు పరమాత్మను చేరగలడు. ఏ ఉపాయంతో మానవుడికి పరమాత్మచింతన అలవడుతుంది” అని అడిగాడు. 

భీష్ముడు… “ధర్మనందనా ! ఈ విషయము నేను నారదుడి ద్వారా విన్నాను. అది ఇప్పుడు నీకు చెప్తాను.” అని నారదుడిని, మహా విష్ణువును మనసున తలచుకుని ఒక సారి నారదుడు దేవదేవా, నిన్ను పొందగోరు జనులు నిన్ను ఏ విధంగా తలుస్తారు. ఏ జపము చేస్తారు నాకు తెలపండి” అని అడిగాడు. 

అప్పుడు విష్ణువు “నారదా ! నన్ను ధ్యానించడానికి మూడు లక్షణాలు కావాలి. ఒకటి పరమభక్తి, రెండవది నిర్మలమైనశ్రద్ధ, మూడవది ఇంద్రియనిగ్రహము. 
అకల్మషహృదయము కల వారికి ఈ మూడుగుణాలు సులభంగా లభ్యమౌతాయి. నిరంతరము నన్ను ధ్యానం చేయడం వలన మనసులోని కల్మషము హరించబడి నిష్కల్మషులౌతారు. ఓం కారముతో మొదలై నమహ్ అనే పదము వద్ద ఆరు గుణములు కలిగిన ఐశ్వర్యవాచకము, ఈ పదములకు శివ నామంతో చేరిస్తే అది మహామంత్రము ఔతుంది. ఈ మంత్రము వలన ధర్మార్ధ కామ మోక్షములు సిద్ధిస్తాయి. తరువాత నారదుడు అనుస్మృతి గురించి చెప్పసాగాడు. అవ్యక్తుడిని, శాశ్వతుడిని, అఖిలప్రభవై భూమిని పాలించువాడిని, భక్తవత్సలుడిని, విష్ణువును, పరమపురుషుడిని, అక్షయుడిని చేతులు జోడించి ఆశ్రయించాలి. పుండరీకాక్షుడిని, భువనసాక్షిని, నిత్యుడిని, పురాణపురుషుడిని ప్రార్ధిస్తాను. పరుని, సహస్రాక్షుడిని, అక్షరుడిని, లోకైకనాధుడిని, భవ్యుని కొలిచెదను. భూతభవ్యభగవత్ప్రభువును, సర్వతోముఖుని, భూతసంప్రవర్తిని, అమృతుని, అచ్యుతుడిని, అనంతుడిని, హృషీకేశుడిని, రవిసహస్రవిభుడిని, హిరణ్యగర్భుడిని, అబ్జనాభుడిని, సత్యుడిని, ఆద్యంతరహితుడిని, భూగర్భుడిని, ప్రభుడిని, ప్రభువును, భక్తిగమ్యుడిని, ధ్యానిస్తాను. అచలుడిని, సూక్ష్మరూపుడిని, వరేణ్యుడిని, సహస్రశీర్షుడిని, అభయకారుడిని, అశీర్షుడిని, నారాయణుడిని, సనాతుడిని, యోగమూర్తిని, లోకాతిరక్తుడిని, ధ్రువుడిని, ఈశ్వరుడిని, హరిని భక్తితో కొలుస్తాను. ఈ చరాచర జగత్తుకు ఎవడు అధిపతో, ఎవని నాభి నుండి పుట్టిన పద్మము నుండి బ్రహ్మ జన్మించాడో, ఎవరి కారణాన ఈ జగములన్నీ సృష్టించబడ్డాయో ఆ ముకుందుడిని నేను కొలుస్తాను. స్థావరములు, జంగమములు, బ్రహ్మదేవుడు మహాప్రళయములో లయమైన తరువాత ఎవరు శాశ్వతముగా ఉంటాడో ఆ నిత్య స్వరూపూడైన విష్ణువును నియమంతో కొలుస్తాను. కాలపురుషుడు, పర్జన్యుడు, భూమి, పంటలు, అన్నీ తానే అయి లీలలు సాగించు వాడు అయిన ఆ వాసుదేవుడిని నేను సదా కీర్తిస్తాను. ఎవరి వలన అగ్నికి, సూర్యుడికి, చంద్రుడికి, గ్రహములకు, నక్షత్రములకు తేజస్సు కలుగుతుందో ఆ స్వయం ప్రకాశకుడిని నేను కొలుస్తాను.

యజ్ఞధరుడు, పంచయజ్ఞుడు, లక్ష్మీనివాసుడు, యోగముకు ఆధారమైన వాడు, ఈ సర్వజగత్తుకు ఆధారమైన వాడు, ఈ సర్వజగత్తు తో ఆరాధింపబడు శ్రీహరిని నేను ఆశ్రయించెదను. నిశ్చలమైన వాడిని, పాంధుడిని, సకలలోకథరుడిని, నిరాకారుడిని, సాగరమంత పరిజ్ఞానము కలవాడిని, అయిదు కాలములను ఎరిగిన వాడిని సకలగుణములు కలిగినవాడిని, నిర్గుణుడిని నేను భక్తితో కొలుస్తాను. అగుపించు సకలముకు కారణమైన వాడిని, ఎవ్వరికి కనిపించక ఆవల ఉండువాడిని, భక్తపరాధీనుడిని, వాక్చాతుర్యము కలవాడిని, సకల శుభములు కలిగించేవాడిని నేను స్తుతిచేస్తాను. జ్ఞానులు, యోగులు, జితేంద్రియులు ఎవరిని పొందిన తిరిగి రారో అతడిని నేను శరణు కోరుతున్నాను. 
ఈ సమస్తలోకములను తన అంశతో నిర్వహించు వాడిని, దయాకరుడిని, పద్మనాభుడిని నేను స్తుతిస్తాను. పంచభూతాత్మక ప్రకృతిని తన పంఛముఖాలతో అనుభవించు క్షేత్రజ్ఞుడిని, త్రిగుణాలను లీలగా అనుభవించు మహానుభావుడిని ఆత్మానుసంధానం చేసుకుంటాను. జ్ఞానులు సాంఖ్యులు ఎవరి అందు చేరుతారో ఆ పరమాత్మను నేను ధ్యానిస్తాను. సూర్యుడిలో లీనమై, చంద్రుడిలో ఉండి ప్రకాశించే ఆ అంతరాత్ముడిని భజిస్తాను. సూర్యుడిలో, తారలలో, చంద్రుడిలో తేజమై ఉన్నవాడిని నేను దర్శిస్తాను. గుణములకు ఆది అయినవాడు, నిర్గుణుడు, లక్ష్మీవల్లభుడు, అజుడు, సూక్ష్ముడు, అంతటా తానై నిండి ఉన్న వాడైన హరిని ప్రసన్నమయ్యే వరకు ప్రణతిస్తాను. అంతటా నీ ముఖములతోను, కళ్ళతోనూ, నీ తలలతోనూ నిండిన, నిర్వికారుడిని, నిర్మలుడిని, సర్వసాక్షి అయిన గోవిందుని నేను కొలుస్తాను. ఓ నారాయణా ! నిన్ను తెలుసుకుంటే కాని ప్రాణులకు ఈ సంసారబంధాలు వీడవు. మనస్సుకు, ఇంద్రియములకు గోచరము కాని నిన్ను చేరుమార్గము ఏది ? సిద్ధులు అరిష్డ్వర్గాలను విడిచి నిన్ను కొలుస్తారు. కర్మఫలాలను జ్ఞానాగ్నిలో ఎవరు దగ్ధము చేయుదురో వారే నిన్ను చేరగలరు. అన్ని దేహములలో ఉండే నీవు దేహదారుడివి కాదు. ద్వందాతీతులయిన యోగులను సదా రక్షించే వాడివి నీవే. ఈ ప్రకృతి, సమస్తభూతములు, బుద్ధి, అహంకారము నీ వలెనే ప్రకాశిస్తున్నాయి. సమస్త సృష్టి 
నీ మయమే సమస్త సృష్టి నీలో ఒదిగి ఉన్నది. నీ మహిమ వలన భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వము ప్రకాశిస్తున్నాయి. దారములో ఉన్న మణుల వలె సమస్త జగత్తు నీయందు ఇమిడి ఉంది. నీకు పుట్టుక లేదు. నీవు అకారణుడివి. అన్నిటికి కర్తవు. 
ఈ భూతకోటిని సృష్టించి చివరకు లయము చేసే వాడివి నువ్వే. తత్వము, అతత్వము నీవే. అందరిలో ఉన్న కూటస్తచైతన్యము నీవే. ఓ ముకుందా నాకు ఎవరి అందు ప్రేమ కాని ద్వేషము కాని లేదు. నాకు యుక్తి, బుద్ధి, అహంకారము, సత్వ, రజో తమోగుణములు నాకులేవు. ఏ కర్తవ్యము నాకు లేదు, ధర్మాధర్మములు, ఇంద్రియ లోలత్వము విషయవాంఛలు నాకు లేవు. నాకు బాధల నుండి మరణము నుండి మోక్షము ప్రసాదించు దేవా. నిన్నే శరణు వేడే నామీద కరుణ చూపించు. నా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పంచ భూతములలో కలిపి నన్ను కటాక్షించు. గోవిందా ఈ పంచభూతాత్మక శరీరమందలి నీటిని నీటి అందు, అగ్నిని అగ్ని అందు, వాయువును వాయువు అందు, ఆకాశతత్వమును ఆకాశమందు, చిత్తము చిత్తము అందు, అహంకారమును అహంకారము అందు కలిపి ఈ వ్యక్త శరీరమును అవ్యక్తమున కలిపి నాలోని త్రిగుణములను తన్మాత్రలను నశింపజేసి నాకు ముక్తిని కలిగించు దేవా ! నన్ను నీలోకి తీసుకుని జనన మరణ చక్రము నుండి నన్ను విముక్తుడిని చెయ్యి. నేను హరి అందు ఉన్నాను నా యందు హరి ఉన్నాడు. నాకు సతతము నిన్ను కొలుచే భాగ్యము కలిగించు దేవా. నేను పూర్వజన్మలో చేసిన పాపపుణ్యములు నా అనుభవములోకి రానిచ్చి ఋణవిముక్తుడిని చేయి దేవా ! ఎల్లపుడూ నిన్ను మనమున తలిచే నన్ను నీవు నీ వాడిగా భావించి వాత్సల్యంతో కాపాడు. వాసుదేవా నన్ను మరువకు. నిన్ను సదా నాలో నిలుపుకుంటాను. అవ్యయుడవు, సనాతుడవు, అగ్రాహ్యుడవు, చిన్మయుడవు అయిన నిన్ను పునరావృత్తి లేకుండా పునరావృత్తి రహితము కొరకు స్మరిస్తాను. పరమాత్ముడిని, నారాయణుడిని, ఆది అంతము లేని వాడిని, భక్తసులభుడిని, షడ్వైశ్యర్యములను కలవాడిని ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. సర్వకాల సర్వావస్థల అందు నిష్టతో నిన్ను కొలిచిన వాడు సకల పాపముల నుండి విముక్తుడై అవ్యయానందము పొందగలడు. అన్ని కల్మషములను ధ్వంసము చేసే ఈ విష్ణు అను స్మృతిని ఎవడు యజ్ఞము చేసే సమయాన, దానము చేసే సమయాన ఎవడు స్మరిస్తాడో అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా తగిన ఫలమును శతాధికంగా పొందగలడు. ఈ అను స్మృతిని దేవతా పూజలలోనూ, పితృ కార్యములోనూ పరమ నిష్టతో చదువుతారో అతడికి పుణ్య 
లోకములు కలుగుతాయి. ఆ అనుస్మృతిని అమావాస్య, పౌర్ణమి దినాలలో స్మరించిన వాడికి సకల సంపదలు కలుగుతాయి. ఈ అనుస్మృతిని విన్న భగవంతుడిని స్మరించిన వాడికి అతడు అంటరాని వాడైనా హీనకులజుడైనా అతడికి ఉత్తమగతులు కలుగుతాయి. ఇక ఉన్నతజాతుల వారి సంగతి చెప్ప పని లేదు” అని విష్ణు మూర్తి నారదుడికి చెప్పాడు. 

ఇంకా విష్ణుమూర్తి నారదుడితో 
“ఓ మునీంద్రా ! మానవుడికి కర్మఫలములన్నీ అంతము అయిన తదుపరి మోక్షమును పొందగలడు. అన్ని దానముల కంటే జ్ఞానదానము గొప్పది. జ్ఞాని మరొకజ్ఞానికి బోధించిన అది భూదానము కంటే గొప్పది.
కనుక నారదా నేను నీకు చెప్పిన జ్ఞానమును పుణ్యాత్ములకు, పరిశుద్ధ హృదయులకు బోధించు. 
నారదా ! వేయి అశ్వమేధ యాగాల కంటే అధికఫలమూ నా అందు నిశ్చల భక్తి కలిగిన మానవులు పొందగలరు.” అని విష్ణు మూర్తి నారదుడికి చెప్పిన విషయాలను ధర్మనందనా ! నేను నీకు బోధించాను. నీవు కూడా నారదుడిలా ఆ పరమాత్మను నిశ్చలభక్తితో పూజించి కృతార్ధుడవు కమ్ము. కోరిన వరములను ప్రసాదించే ఈ అనుస్మృతి పఠించిన బుద్ధి పెరుగుతుంది. దుఃఖములు, బంధములు నశించి నిత్య శుభము కలుగుతుంది” అని భీష్ముడు చెప్పాడు. 

అది శ్రద్ధగా విని ధర్మరాజు భీష్ముడికి నమస్కరించాడు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment