Friday, November 3, 2023

హార్ట్ ఫుల్ నెస్* 🌍 *కథతో. బుస కొట్టు, కానీ కాటువేయకు

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్* 🌍 *కథతో* 

♥️ *కథ - 64 ♥️* 

 *చదివే ముందు... సున్నితంగా  కళ్ళు మూసుకోండి... ఒకసారి మన జీవితాలలో* *వెనక్కివెళదాం ... పొరపాట్లు చేసిన ఆ క్షణాలను మనస్ఫూర్తిగా గుర్తుచేసుకుందాం...* 
 *మీ హృదయంతో అనుసంధానం అవ్వండి... అవే తప్పులు మళ్ళీ జరగకూడదన్న ఆలోచన* *చేయండి...... మన హృదయాన్ని అనుసరించడం, వీటన్నిటినీ సరిదిద్దడంలో* *సహాయపడుతుంది, ఎందుకంటే మన హృదయం ఎప్పుడూ మనల్ని తప్పుదారి పట్టించదు... ఇప్పుడు చదవడం* *ప్రారంభించండి....* 

‘ *బుస కొట్టు, కానీ కాటువేయకు’* 

శ్రీరామకృష్ణ పరమహంస తన "శ్రీరామకృష్ణ కథలు - ఉపమానాలు" అనే పుస్తకంలో పంచుకున్న ఒక కథను ఇక్కడ అందిస్తున్నాము.
ఒకానొకప్పుడు, ఒక గడ్డిభూమిలో ఒక ప్రమాదకరమైన పాము నివసించేది, అక్కడ నివసించే కౌబాయ్ లు ఆ పచ్చికబయలులో తమ ఆవులను మేపుకునేవారు. పాము భయంతో అందరూ అప్రమత్తంగా ఉండేవారు. ఒకరోజు ఒక సాధువు ఆ గడ్డిభూమి గుండా వెళుతున్నాడు. కొంతమంది కౌబాయ్‌లు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, "స్వామి, దయచేసి ఆ దారిలో వెళ్లకండి. అక్కడ ఒక విషపూరితమైన పాము నివసిస్తోంది" అని చెప్పారు.
దానికి సాధువు,"అయితే ఏమిటి, నాయనలారా? నాకు పాము అంటే భయం లేదు. నాకు కొన్ని మంత్రాలు తెలుసు!" అని చెబుతూ చిరునవ్వుతో ఆ పచ్చిక బయలులో ప్రయాణం కొనసాగించాడు. కౌబాయ్ లు, భయపడి, అతనితో పాటు వెళ్ళలేదు.
కొద్దిసేపటికే, ఎత్తిన పడగతో తన వైపు వేగంగా పాకుతూ వస్తున్న ఆ పామును సాధువు చూసాడు. తన దగ్గరికి రాగానే ఒక మంత్రం పఠించాడు, కొద్దిసేపటికే ఆ విషసర్పం అతని పాదాల దగ్గర వానపాములా పడిఉంది!
సాధువు పాముని ఎదుర్కొని, "చూడు, ఇతరులకు హాని ఎందుకు చేస్తున్నావ్? నేను నీకు పవిత్రమైన మంత్రాన్ని ఇస్తాను. దానిని పునరావృతం చేయడం ద్వారా, భగవంతుడిని ప్రేమించడం నేర్చుకుంటావు. చివరికి, నీవు అతనిని తెలుసుకుంటావు, ఆయనను పొందుతావు కూడా. నీ హింసాత్మక స్వభావాన్ని వదిలించుకో" అని అన్నాడు.
సన్యాసి పాముకి ఒక పవిత్రమైన మంత్రాన్ని బోధించి, ఆధ్యాత్మికతను ఉపదేశించాడు. పాము తన కొత్త గురువు ముందు వంగి, "స్వామి, నేను ఆధ్యాత్మిక క్రమశిక్షణను ఎలా అభ్యసించాలి?", అని అడిగింది.
" ఆ పవిత్రమైన మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండు, ఎవరికీ హాని చేయవద్దు" అని గురువు బదులిచ్చారు. బయలుదేరబోతూ, సాధువు చిరునవ్వుతో పాము వైపు తిరిగి "నేను త్వరలో నిన్ను మళ్ళీ కలుస్తాను!" అని వెళ్ళిపోయాడు.
కొద్దిరోజులు గడిచేసరికి పాము కాటేయట్లేదని ఆ కౌబాయ్ లు గమనించారు. ఇప్పుడు వాళ్ళు దానిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. కానీ పాము కోపగించుకోకుండా ఒక వానపాములా స్తబ్ధుగా ప్రవర్తించింది.
ఒకరోజు, ఒక అబ్బాయి దాని దగ్గరికి వచ్చి, దాని తోక పట్టుకుని, గుండ్రంగా తిప్పుతూ, నేలమీద పదే పదే కొట్టి, విసిరేశాడు. ఆ పాము స్పృహతప్పి పడిపోయి, కదలలేదు.  చనిపోయిందని భావించిన అబ్బాయిలు దాన్ని వదిలేయాలని నిర్ణయించుకుని తమ దారిన తాము వెళ్లిపోయారు.
రాత్రికి పాము స్పృహలోకి వచ్చింది. నెమ్మదిగా, అతికష్టంమీద ,  తన పుట్టరంధ్రంలోకి వెళ్ళింది. దాని ఎముకలు విరిగిపోయి, కదలలేకపోయింది.
రోజులు గడిచాయి. చర్మంతో కప్పబడిన అస్థిపంజరంలా పాము మారిపోయింది. అప్పుడప్పుడూ ఆహారం వెతుక్కుంటూ రాత్రిపూట బయటకు వచ్చేది. కౌబాయ్ లు కనబడతారేమోనన్న భయంతో, పగటిపూట దాని పుట్ట వదలట్లేదు. తన గురువు నుండి పవిత్రమైన మంత్రాన్ని స్వీకరించినప్పటి నుండి, అది ఇతరులకు హాని చేయడం మానేసింది. ఆకులు, చెట్ల నుండి పడిపోయిన పండ్లు తిని జీవించడం మొదలుపెట్టింది.
ఒక సంవత్సరం తరువాత, సాధువు మళ్ళీ ఆ గడ్డిభూమి ద్వారా ప్రయాణం చేసాడు. దారిలో కౌబాయ్ లను కలుసుకుని పాము గురించి అడిగాడు. చాలా కాలం క్రితమే అది చనిపోయిందని కౌబాయ్‌లు చెప్పారు. కానీ అతను వారిని నమ్మలేకపోయాడు. పాము ఆధ్యాత్మికతలోకి ఉపదేశింపబడిన పవిత్ర మంత్ర ఫలాన్ని పొందకముందే చనిపోదని అతనికి తెలుసు. పాము ఉన్న ప్రదేశానికి మార్గాన్ని కనుక్కుని, దాని కోసం అక్కడ, ఇక్కడ వెతకడం ప్రారంభించాడు. దానికి తను ఇచ్చిన పేరు పెట్టి పిలిచాడు.
చాలా సేపటి తర్వాత గురువుగారి గొంతు విని, పాము ఒక్కసారిగా తన పుట్టలో నుండి బయటకు వచ్చి ఎంతో భక్తితో ఆయన ముందు నమస్కరించింది.
"ఎలా ఉన్నావు , నాయనా ?" అని చాలా ఆందోళనతో అడిగాడు సాధువు.
" బాగానే ఉన్నాను స్వామి", అని పాము బదులిచ్చింది.
"అయితే, మరి నీవు ఎలా ఇంతగా బక్కచిక్కిపోయావు?",అని గురువు అడిగాడు.

పాము ఇలా సమాధానమిచ్చింది: “పూజ్యమైన గురుదేవా, ఎవరికీ హాని చేయవద్దని మీరు నన్ను ఆదేశించారు. అందుకే చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు, పండ్లపైనే బతుకుతున్నాను. బహుశా, అది నన్ను సన్నగా చేసిఉంటుంది."
స్పష్టంగా, పాము సాత్వికగుణాన్ని అభివృద్ధి చేసుకుంది; అది ఎవరితోనూ కోపంగా ఉండట్లేదు. కౌబాయ్‌లు దాన్ని ఏమి చేశారో అది పూర్తిగా మరచిపోయింది.
ఆ సన్యాసి "తిండి లేకపోవడమే నిన్ను ఈ స్థితికి దిగజార్చి ఉండుండదు, ఇంకేదో కారణం ఉండాలి. కొంచెం ఆలోచించు" అన్నాడు.
 పిల్లలు దానిని నేలపై కొట్టారని అప్పుడు పాము గుర్తుచేసుకుంది. అది ఇలా ఉంది, "అవును, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అబ్బాయిలు ఒకసారి నన్ను నేలకేసి దౌర్జన్యంగా కొట్టారు. వారు తెలివితక్కువ వారు, నా మనస్సులో ఎంత గొప్ప మార్పు వచ్చిందో వారు గ్రహించలేదు. నేను ఇంక ఎవరినీ కాటేయననీ లేదా ఎవరికీ హాని తలపెట్టనని వారు తెలుసుకోలేరు కదా ?"
సన్యాసి గట్టిగా, " అయ్యో ఎంత అవమానం! నిన్ను నీవు ఎలా రక్షించుకోవాలో నీకు తెలియదా? నిన్ను కాటేయద్దని, హింస చేయవద్దని చెప్పాను కానీ, బుసకొట్టవద్దని చెప్పలేదు కదా. నీవు వారిని ఎందుకు భయపెట్టలేదు? మనల్ని మనం రక్షించుకోవడం మన మొదటి కర్తవ్యం, నిన్ను నీవు రక్షించుకునే సామర్థ్యాన్నిభగవంతుడు నీకు ఇచ్చాడు.
నీకు హాని చేయాలనుకునే వారిని నీవు భయపెట్టాలి. కానీ ఎప్పుడూ నీ విషాన్ని వారిలోకి ఎక్కించకూడదు. గుర్తుంచుకో, 'ఇతరులను గాయపరచకూడదు, కానీ మనలని మనం  రక్షించుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి!' అది మన బాధ్యత.
               ♾️
 *ధ్యానం ద్వారా మనల్ని మనం కేంద్రీకరించుకుని, ఎరుకను కలిగిఉన్నప్పుడు, వాస్తవంగా* *మనం ఎవరు, మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని తీసుకువస్తుంది.* 🌼
 *దాజి* 

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం  💌
HFN Story team
💜🔺💜🔺💜🔺💜🔺💜

No comments:

Post a Comment