Friday, November 3, 2023

సజ్జనులతో స్నేహం

 *సత్సంగం* 

సమయాన్ని సంపాదనకే కేటాయించక 
మంచి వారితో సాంగత్యం అనే నౌక ద్వారా
 సంసార సముద్రాన్ని దాటమని శంకర భగవత్పాదులు శిష్యులకు చెప్పినట్టుగా నిన్న చదివాం

350 సంవత్సరాలు క్రితం నిజంగా జరిగిన ఈ సంఘటన ఈ అంశాన్ని వివరిస్తుంది

 ఆరావళీ పర్వత లోయల్లో
 ఓ భిల్ల జాతికి చెందిన ఖైమాలుడు అనే అతను
 నిత్యం వేటాడి కుటుంబానికి ఆహారాన్ని సమకూర్చేవాడు

 ఓసారి అతను వేటకు వెళ్ళినప్పుడు
 హరి కీర్తన వినిపించింది

 అతను ఆ దిక్కుకు వెళితే
 ఓ శిథిలమైన శివాలయంలో రామకీర్తన పాడే ఇద్దరు సాధువులు కనిపించారు

 అతను తన్మయత్వంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోగా 
వాళ్ళు అతనిని చూసి చిరునవ్వు నవ్వి 
అతని మూటలోంచి 
కారుతున్న రక్తాన్ని చూసి 
దాని గురించి ప్రశ్నిస్తే 

ఖైమాలుడు మూటను విప్పి వేటలో కొట్టిన పావురాలు, కౌజు పిట్టలు, కుందేళ్ళ దేహాలని చూపించాడు

 నువ్వు ఈ అమాయక ప్రాణాలును దేనికి చంపావు

 అని బాధగా సాధువులు అడిగారు

 నేను ప్రతిరోజూ చేసే పని ఇదేగా
 వేటాడకపోతే నేను
 నా భార్యా పిల్లలకు ఏం పెట్టాలి 

అన్నాడు ఖైమాలుడు

 ఇలా అమాయక ప్రాణాలను చంపి తినటం పాపం అని నీకు తెలియదా

 పాపం అంటే ఏమిటి అన్నాడు ఖైమాలుడు 

  ఆ బిల్లుని సరళ స్వభావాన్నీ, నిష్కపట హృదయాన్నీ
 అర్థం చేసుకున్న సాధువులు వెంటనే 
అతని అంబులపొది లోంచి
 ఓ బాణాన్ని తీసుకుని ఖైమాలుడి తొడ మీద గీశాడు

 వెంటనే ఖైమాలుడు బాధగా అరిచాడు
 ఆ గాయం నుంచి స్వల్పంగా రక్తం కారింది

 ఇప్పుడు నీకు కలిగిన బాధ
 నీ బాణం ఇంకా లోతుగా గుచ్చుకోవడం వల్ల
 ఆ మూగ ప్రాణులకు కూడా కలుగుతుంది
 అవునా అన్నారు సాధువులు

అవును 
అది నేనెప్పుడూ ఆలోచించలేదు అన్నాడు ఖైమాలుడు 

ఆ సాధువు సంచిలోంచి ఒక మూలిక తీసి 
అతని గాయానికి రాయగానే రక్తం కారడం ఆగింది 

ఇప్పుడు ఎలా ఉంది 

హాయిగా ఉంది అన్నాడు ఖైమాలుడు 

 ఇక మీదట నువ్వు ప్రాణులకు ఇలా హాయిని కలిగించే పనులు మాత్రమే చెయ్యి. బాధను కలిగించే పనులను మానేయ్.

 మరి నా కుటుంబ పోషణ ని ఎవరు చేస్తారు?  అన్నాడు ఖైమాలుడు 

ఈ అడవిలోని అన్ని ప్రాణులకూ
 ఎవరు పోషణ చేస్తున్నారో వారే
 ఈ ప్రపంచంలోని అన్ని జీవులకీ పోషణ చేసేది అన్నారు సాధువులు

 అతనికి రామతారక మంత్రం ఉపదేశించారు

 ఈ మంత్రాన్ని జపించు 
అన్నీ భగవంతుడే చూసుకుంటాడు 
ఎప్పుడో ఒకరోజు నీకు రాముడు కనిపిస్తాడు ఆయనని చావు పుట్టుకలు లేని ముక్తిని కోరుకో
 అని చెప్పారు సాధువులు 

నేను చాలా జీవాల్ని చంపి పాపం చేశాను కదా
 మరి నాకు రాముడు నిజంగా దర్శనం ఇస్తాడా అన్నాడు ఖైమాలుడు 

 పాపులందరిలోకి పాపి అయినా సరే 
తన భక్తులైతే చాలు 
రాముడు తప్పకుండా దర్శనం ఇస్తాడు

సంచార సాధువులు  ఖైమాలుడి  దగ్గర సెలవు తీసుకుంటూ

 వెళ్ళొస్తాం  మేము ఒకే చోట ఎక్కువ రోజులు ఉండకూడదు అన్నారు

 మీ దర్శనం లభించి ,
మీ మాటలు వినకపోతే,
 నేను ఇంకా ఎన్నో జీవుల్ని చంపుతూ, పాపాలు చేస్తూ ఉండేవాడిని 
నేను కూడా మీతో వస్తాను అన్నాడు   ఖైమాలుడు 

 గృహస్థువైన నువ్వు
 నీ కుటుంబాన్ని వదిలి రావడం కూడా పాపమే
 రాముడి మీద విశ్వాసంతో రామనామం  జపించు
 నీకు మంచి జరుగుతుంది 

అని సాధువులు వెళ్లి పోయారు

12 సంవత్సరాలు గడిచేయి 

ఖైమాలుడు జపించేది శివాలయంలో కనుక 
ఓ రోజు అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడు 

నేను కోరేది రాముడి దర్శనం తప్ప నీ దర్శనం కాదు అన్నాడు ఖైమాలుడు 

మా ఇద్దరికీ భేదం లేదు అన్నాడు శంకరుడు 

 నన్ను నువ్వు మోసం చేయలేవు 
మీకు భేదం లేకపోతే 
నాకు రాముడి దర్శనమే జరిగేదిగా అన్నాడు ఖైమాలుడు 

శంకరుడు నవ్వాడు 
చిన్న మెరుపు మెరిసింది
 శివుడి స్థానంలో 
చేతిలో ధనుర్బాణాలతో రాముడు దర్శనమిచ్చి 
ఏం కావాలి 
అని కోరాడు 

మా గురువు నిన్ను అడగమన్నది అడుగుతున్నా
 
నాకు చావు పుట్టుకలు లేని ముక్తినివ్వు 
అన్నాడు ఖైమాలుడు 

తదాస్తు అన్నాడు శ్రీరాముడు 

తర్వాత మళ్లీ 
సంచార సాధువులు అక్కడికి వచ్చారు 
ఆ సాధువుల కాళ్ళ మీద పడి వారిద్దరి పాదాలకి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు ఖైమాలుడు

ఆ క్షణమే ఖైమాలుడి 
ప్రాణాలు పోయాయి

 ఆ సాధువులు
 ఆ శివాలయంలో 
అతని పార్థివదేహాన్ని 
సమాధి చేశారు

నర్మదా నది ఒడ్డున గల ఖైమాలుడి సమాధిని 
నేటికీ చూడొచ్చు 

సజ్జనులతో స్నేహం యొక్క మహత్యం అది

No comments:

Post a Comment