Tuesday, November 7, 2023

జడభరతుడు

 0510.   1-8.3️⃣.   160223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *జడభరతుడు*
              ➖➖➖✍️

*ఎంతటి బ్రహ్మజ్ఞానులకైనా, విషయ వాంఛలు ఉండటం వల్ల వారు ఆ రుణాన్ని,        ఆ కర్మానుబంధాన్ని తీర్చుకోవడం కోసం ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందనడానికి ఉదాహరణ జడభరతుని వృత్తాంతం.*

*జడభరతుడు రుషభుడనే రాజుకు కుమారుడు. రాజపుత్రుడుగా పుట్టినా, బాల్యం నుంచి    విషయ వాంఛలకు అతీతంగా, దైవభక్తి కలిగి ఉండేవాడు. అందువల్ల అతనిని జడభరతుడని పిలిచేవారు. (జఢత్వం అంటే దేనికీ చలించకపోవడం అనే అర్థం ఉంది. అంతేకానీ, జడలు కలిగి ఉండటం వల్ల కాదు).* 

*రుషభుని అనంతరం జడభరతుడు తనకు ఇష్టం లేకపోయినా, రాజ్యపాలన చేపట్టవలసి వచ్చింది.*

*ఎన్నో సంవత్సరాలపాటు ప్రజాను రంకజమైన పాలన అందించాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. పాలన చేస్తూనే,  జపధ్యానాలలో మునిగి తేలేవాడు. దేనినీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు.* 

*చివరకు వృద్ధాప్యం మీదపడడంతో ఆయన పాలన బాధ్యతలను తన కుమారులకు అప్పగించి, ప్రజాజీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.    నిశ్చలమైన, నిర్మలమైన మనస్సుతో ‘జన్మరాహిత్యాన్ని’ కోరి చేసే ఆయన తపస్సు శ్రీహరిని మెప్పించింది.*

*శ్రీహరి ఇక మోక్షం అనుగ్రహించాలను కున్నాడు. ఇంతలో జరిగిన ఒక చిత్రమైన సంఘటన భరతుడి జీవితాన్ని మలుపు తిప్పింది.* 

*జడభరతుడికి ప్రతిరోజూ నదిలో స్నానం చేసిన తర్వాత, ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. ఒకరోజు ఆయన అలా ధ్యానానికి కూర్చున్నాడు. అదే సమయంలో నిండు చూలింత అయిన  లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది.*

*దానికి దగ్గరలో నుంచి ఒక పులిగాండ్రింపు వినపడింది. సరిగ్గా అప్పుడే పెద్దపెట్టున పిడుగు పడింది.   ఈ రెండు సంఘటనలకు తీవ్రంగా బెంబేలెత్తిపోయింది ఆ లేడి. భయంతో వణికిపోతూ, ఒక్క గంతు వేసింది. ఆ గంతుకు లేడికి అప్పటికప్పుడు ప్రసవం జరిగిపోయింది. లేడి మాత్రం నీటిలో మునిగి చచ్చిపోయింది.*

*దూరాన కూర్చుని ఇది గమనిస్తున్న జడభరతుడు అక్కడికి చేరుకునేలోపు అప్పుడే పుట్టిన లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోతూ కనిపించింది.* 

*దాంతో ఆయన ఒక్క అంగలో దాన్ని అందుకుని, చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్లు కూడా తెరవని ఆ పసిదాన్ని చూసేసరికి ఆయనలో వాత్సల్యం కలిగింది. దిక్కులేని ఆ పసికూనను కొన్నాళ్లు పెంచి, అది కాస్త పెద్దయ్యాక తిరిగి అడవిలో వదిలేద్దామనుకున్నాడు.*

*తన పర్ణశాలకు తీసుకుని వెళ్లి, దానికి సపర్యలు చేశాడు. లేత గడ్డిపరకలు తినిపించాడు. అది కోలుకోవాలని కోరుకున్నాడు. అప్పటినుంచి తల్లి లేని దానికి అన్నీ తానే అయ్యాడు.* 

 *బంగారు రంగులో మెరిసి పోతూ, అది ఆశ్రమ ప్రాంగణంలో చెంగనాలు వేస్తూ ఉంటే చూసి మురిసిపోయాడు. దాని ధ్యాసలో పడి తన తపోదీక్షను కూడా పక్కన పెట్టాడు.*

*సర్వసంగ పరిత్యాగి అయిన ఆ రాజర్షికి అనుక్షణం దాని ఊహే! దానితో ఆటలే! కాసేపు ఆ లేడి ఎక్కడికైనా వెళ్తే, అది తిరిగి వచ్చేవరకు ఆయన ప్రాణం విలవిలలాడేది క్రూరమృగ మేదైనా దానిని పొట్టన పెట్టుకుందేమోనని.* 

*ఆటల్లో, అది యజ్ఞానికని తెచ్చుకున్న సమిధలను అపరిశుభ్రం చేస్తున్నా, దర్భగడ్డిని తొక్కిపాడుచేస్తున్నా, అదిలించేవాడు కాదు. అది కూడా భరతుడంటే ప్రాణాలు పెట్టేది. ఆయన తినిపిస్తే తప్ప పచ్చగడ్డి కూడా కొరికేది కాదు. ఓసారి ఆ లేడి ఎక్కడికో వెళ్లింది. నాలుగురోజులపాటు తిరిగి రాలేదు. ఎంత వెదికినా కనిపించలేదు. దానికి ఏమైనా అయిందేమోనని బెంగపెట్టుకుని, ఆయన జబ్బుపడ్డాడు. తనకు అంత్యసమయం వచ్చిందని గ్రహించాడు.*

*సరిగ్గా అదే సమయంలో ఆ లేడి వచ్చి, ఆయన కాళ్లు నాకుతూ ఉండిపోయింది. దానినే చూస్తూ, తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో ఆయన ప్రాణాలు విడిచాడు.* 

*జీవుడు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తే, ఆత్మ తిరిగి ఆ రూపం తీసుకుంటుందంటారు. జన్మరాహిత్యం కోరిన భరతుడు చివరి దశలో ఆ లేడిపిల్లను చేరదీసి, దాని ధ్యాసలో పడి మరణించడం వల్ల ఆయన అంతవరకు చేసిన తపస్సంతా వ్యర్థమై, మరుజన్మలో ఆయన లేడిగా పుట్టవలసి వచ్చింది.* 

*ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది. అందుకే అంత్యసమయంలో భగవన్నామ స్మరణ చేయాలంటారు.”*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment