Tuesday, November 7, 2023

**** ఆధ్యాత్మిక హృదయం

 1611.   1-7.    190223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *ఆధ్యాత్మిక హృదయం* 
                ➖➖➖✍️

*ఆధ్యాత్మికత మానవ జీవన వికాసానికి, ఉన్నత విలువల సముపార్జనకు సాధనం.* 

*దైవాన్ని అందరూ చూడలేరు.*

*ఆయన భౌతిక నేత్రాలతో దర్శించేందుకు అతీతుడు. శిల్పి మనోభావనకు అనుగుణంగా రూపుదిద్దుకొన్న విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. నాస్తికుడు తనదిగా చెప్పుకొనే ఆధ్యాత్మిక స్పర్శ లేనివాడు. అది పుష్కలంగా ఉన్న ధన్యజీవి ఆస్తికుడు.*

*ఆస్తికత్వం అంటే దైవభావనను విశ్వసించి ఆ ఉనికిని హృదయంలో ప్రతిష్ఠించుకొని శాంతిని, ఆనందాన్ని అనుభవించడం! ఎలాంటి దైవభావనకు, ఆధ్యాత్మిక చింతనకు తావివ్వక తనపై, తన స్వశక్తిపై అపార విశ్వాసం ప్రదర్శించి జీవనగమనాన్ని సాగిస్తాడు నాస్తికుడు.*

*మనిషి బాల్య కౌమార దశల్లో పెద్దలు చెప్పే కథలను ఆసక్తిగా వింటాడు. పౌరాణిక, జానపద కథల్లో లీనమై ఏదో తెలియని ఆనందాన్ని అనుభవిస్తాడు. శ్రీకృష్ణుడి బాల్య క్రీడలు, లీలావినోదాలు పిల్లలను ఆకర్షిస్తాయి. అక్కున చేర్చుకుంటాయి. *

*ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్పే కథలు పిల్లల్లో కథనాసక్తిని పెంచుతాయి. రంజిల్లజేస్తాయి. ఊహావినోదాల వినువీధిలో బాలలు విహరించి శాంతికి ఆనందానికి చిరునామాగా మారతారు.*

*ఓ బాలకుడిగా శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసులను చంపడం, తోటి బాలలతో చల్దులారగించడం, పొన్నమాను ఎక్కి కోతికొమ్మచ్చు లాడటం, నదీనదాల తీరాల్లో జలకాలాడటం, గోమాతలను కడుపారా మేపి గోధూళి వేళ గృహోన్ముఖులు కావడం, మలిసంధ్య వెలుగుల్లో స్నేహితులతో ఇల్లు చేరుకొని తల్లిదండ్రులను మురిపించడం... పుస్తకాల్లో కథలుగా చదివిన పిల్లల ఆనందానుభూతులు వర్ణింపనలవి కానివి. అలా చిన్నారి దశనుంచి ప్రవర్ధిల్లేదే ఆధ్యాత్మిక హృదయం! ఆధ్యాత్మిక హృదయం ఎల్లలు లేని ఆనందాలకు వేదిక.*

*స్వశక్తిని నమ్ముకొని ముందుకు సాగుతుంది నాస్తికత్వం. నాస్తికభావంతో మమేకమై జీవితాన్ని ఉత్పాదకంగా మలచుకొని విజయతీరాలవైపు ప్రస్థానం సాగించినవారు ప్రాచ్య, పశ్చిమదేశాల్లో ఉన్నారు.*

 *పరమాత్మ శక్తిని తనలో నింపుకొని ప్రస్థానిస్తుంది ఆస్తికత్వం. ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం మానవ శక్తిపై ఆధారపడి ఎంతో పురోగమించడం చూస్తాం. దైవం కానిది ఈ దృశ్యప్రపంచంలో ఏదీలేదని నమ్మే దేశాలు భౌతికసంపదతో సంబంధం లేకుండా శాంతి, ఆనందాలతో అలరారుతున్నాయి.*

*మనిషి తన శ్రేయస్సును మాత్రమే తాను నమ్మినప్పుడు ఎదుటివాడిని మానవత్వంతో చూడగల సహృదయం కొరవడుతుంది. పోటీని అధిగమించే ప్రయత్నంలో విలువలకు తిలోదకాలు ఇవ్వడం వాంఛనీయం కాదు. దైవాన్ని హృదయగతంగా విశ్వసించినప్పుడు మనిషిలో నేరభావన నశిస్తుంది. పాపచింతన అంతర్థానమవుతుంది.*

*ఈ జీవితంలో చేసే పాపాలు ప్రారబ్ధఫలంగా మరోజన్మలో అనుభవించాలని నమ్మే సాధకులు నైతిక విలువలకు పట్టంకడతారు. కల్మషాలు పోగుపడకుండా హృదయాన్ని రక్షించుకొనే ప్రక్రియ ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక హృదయం నిర్మల, నిశ్చలమైన మనసుతోపాటు శాంతిని ఆనందాన్ని ప్రసాదించే గొప్ప సాధనమని తెలుసుకున్న నాడు సాధకుడి ఆనందాతిరేకాలకు లోటుండదు. ఆనందంగా జీవించడం ఓ కళ.*

*ఆ అనుభూతిని పొందడానికి ధనంతో పని లేదు. అరణ్యాల్లో ఆధ్యాత్మిక సాధనచేస్తూ కుటీరాల్లో నివసించి, దైవానురక్తితో బతుకులను సాఫల్యం చేసుకున్న మహర్షుల ఆధ్యాత్మిక హృదయం మనకు ఆదర్శనీయం.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment