Wednesday, November 8, 2023

కట్టెలు ఎక్కి పోతాడు

 090323b1829.    100323-2.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀X17.

             కట్టెలు ఎక్కి పోతాడు
                  ➖➖➖✍️

ఇది తంజావూరు జిల్లాలోని రిషివంతియంలో జరిగిన సంఘటన. 

ఆ ఊరి చివర్లో ఒక పాత ఇల్లు    ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉంది. 
1930లలో ఒకరోజు తెల్లవారుఝామున జరిగిన సంఘటన ఇది. 

“ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు వాడు?” అంటూ కోపంగా అరుస్తూ ఒక పూర్వసువాసిని బ్రాహ్మణస్త్రీ వీధిలోకి వచ్చి ఎడంపక్కగా తను చూడగలిగినంత మేర చూస్తోంది. కాని అంత ఉదయాన్నే అక్కడ ఎవరూ కనపడడం లేదు. ఆమె ఇంటి కుడిపక్కన ఊరు ఆగిపోయింది.

ఇంటి లోపలికి వెళ్ళి, మరలా బయటకు వచ్చి నీళ్ళల్లో గోమయం కలిపి చేతులతో ఇంటిముందర కళ్ళాపి చల్లుతోంది. 
ఆ గోమయం కలిపిన నీళ్ళు శబ్ధం చేస్తూ నేలపై పడుతూ, ఆమె నోటివెంట వస్తున్న తిట్లతో పాటు కలిసిపోతున్నాయి. 

”వాడు కట్టెలెక్కి పోతాడు (పాడె ఎక్కి వెళ్ళిపోతాడు అనే భావం గల తమిళ సామెత).   నాకు ఇలాంటి పాలవాడు దొరకాలా? నేను, ఒక ముసలి విధవని ఇంటి తలుపు కొద్దిగా తీసి, ఏదో కొద్దిగా అలసటగా తోచి నిద్ర తూగితే గట్టిగా పిలిచి, అరిచి నన్ను నిద్ర లేపొచ్చు కదా? ఎంత అహంకారం! దర్జాగా ఇంట్లోకి దూరి, వంటింటి వాకిట్లో పెట్టిన పాలగిన్నెలోకి పాలు పోసి వెళ్ళిపోతాడా! ఎంత ధైర్యం. ఎక్కిడికి వెళ్ళాడో ఇంతలోనే. ఎక్కడికి వెళ్ళీనా వాడు కట్టెలెక్కి పోతాడు.”

”ఎక్కడికీ వెళ్ళలేదు పాట్టి! వాడు ఇక్కడే ఉన్నాడు” అంటూ తన ముందుకు వెళ్ళి నిలుచున్నది వేరెవరో కాదు సాక్షాత్ కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు, ‘నడిచే దైవం’, ‘పరమాచార్య’ శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. 

పాట్టియమ్మ హడలిపోయింది. నమస్కారం చెయ్యడానికి చేతులు రావట్లేదు. భయంతో కాళ్ళు కంపిస్తున్నాయి, నోట మాట రావడం లేదు. మూగబోయి కదలిక లేకుండా అలా నిలబడిపోయింది. “పరమాచార్య స్వామివారా? పెరియవనా నిజంగా? ఈ పేదరాలి ఇంటి ముందర. తెలతెలవారుతుండగా? ఎంత పని చేశాను. ఎంతటి బుద్ధిలేని పనిచేశాను. ఇది మహాపచారం” అంటూ గట్టిగా లెంపలేసుకుంటోంది. 

ఆ పెద్దావిడని శాంతింపజేస్తూ, కొంటె చూపులు చూస్తూ నిలబడ్డారు స్వామివారు. “భయపడకు పాట్టి! పాలవాడు చాలాసార్లు పిలిచాడు. నీవు బాగా నిద్రపోయావు. కనుక నీకోసం నేను నీలాగా పాలు తీసుకుని లోపల పెట్టాను. అతని తప్పు ఏమి లేదు. నీది కూడా లేదు. నేనే ఈ కొంటె పని చేసినది” అని చిన్నగా చెప్పారు. 

అసలేంజరిగిందంటే. . .

పల్లె నుండి పల్లెకు మకాం చేస్తూ మేనాలో వెళ్తున్న మహాస్వామివారు ముందురోజు రాత్రి రిషివంతియం చేరుకున్నారు. పల్లకి మోసేవారు బాగా అలసిపోవడంతో, అదికూడా అప్పుడు రెండవ జాము కావడంతో ఆ రాత్రికి ఊరి శివార్లలోని చెట్లకింద విశ్రమిద్దామని స్వామివారు సెలవిచ్చారు. ఎప్పటిలా స్వామివారు మేనాలో పడుకున్నారు. వారందరూ విశ్రమించిన చెట్టు పాట్టియమ్మ ఇంటికి ఎదురుగా ఉంది.

సూర్యోదయానికి ముహూర్తకాలం ఉందనగా పాట్టియమ్మ ఇంటి ముందరి తలుపు గొళ్ళెం తీస్తున్న కీచుమన్న చప్పుడు స్వామివారికి వినిపించింది. మమూలుగా ఉదయం మూడు మూడున్నరకు నిద్రలేచే మహాస్వామివారు మేనాలో నుండే విన్నారు. 

ఆమె పాలవాడికోసం చూసి, వాడు కనపడకపోవడంతో వాడిని తిట్టుకోవడం స్వామివారు గమనించారు. 

మరలా ఆ కీచుశబ్ధం వినపడకపోవడంతో పాట్టియమ్మ ముందరి తలుపు వేయలేదని అర్థం చేసుకున్నారు. చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షీంచే స్వామివారికి, విరిగిపోయిన వెనుక వాకిలి తీయడం వల్ల నేలకు తగిలిన శబ్ధ సంగీతాన్ని కూడా విన్నారు. ఆమె వెనక పెరటిలో ఉంది అని నిర్ధారించుకున్నారు. కొద్దిసేపటికి మరలా శబ్ధం రాకపోవడంతో తలుపు వెయ్యకుండా ఆమె లోపలికి వెళ్ళిపోయిందని తెలుసుకున్నారు.

అప్పుడు పాలవాడు వచ్చాడు. చాలాసార్లు పిలిచాడు. ‘పాపం పాట్టియమ్మ, నిద్రపోయింది’ అని అర్థం చేసుకుని పాట్టియమ్మను అనుగ్రహించాలనుకున్నారు. అనుగ్రహంతో పాటు కొంత తమషా, కొంటెతనం చూపించాలనుకున్నారు. 
వారి పనికి తగ్గట్టుగా మేనాలోనే ఉన్న ఒక తెల్లని శాలువా తీసుకున్నారు. దాన్ని మొత్తంగా కప్పుకుని మేనానుండి బయటకు వచ్చారు. బోయీలందరూ దగ్గర్లోనే గాఢనిద్రలో ఉండడం కూడా స్వామివారికి అనుకూలించింది. ఇంకా చీకటిగా ఉండగానే, మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పాట్టియమ్మ ఇంటి వెనకవైపుకు వెళ్ళి పిట్టగోడ ఎక్కి పెరడువైపు దిగారు. వెనక తలుపు నుండి మెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళారు. 

వెనకవైపు వరండా నుండి లోపలి ప్రాంగణంలోకి వచ్చి వంటగది తలుపు వద్ద ఉంచిన పాల గిన్నె చూశారు. గిన్నెను తీసుకుని హాలు మూలలో కునుకు తీస్తున్న ఆ ముసలామెను దాటుకుంటూ ముందరి తలుపు వద్దకు వచ్చి, శాలువాను నిండుగా కప్పుకుని బయటకు వచ్చారు. 

పాలగిన్నెను పిట్టగోడపై పెట్టారు. ఆ పాలవాడికి ఎవరు వచ్చారు అని చూసే తీరికెక్కడిది. ఉషోదయపు చీటిలో జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక బీదరాలుగా వచ్చి తనవద్ద పాలు పోయించుకుంటారని కలలో కూడా అనుకుని ఉండడు. ఒక్కపెట్టున పాలుపోసి చక్కా వెళ్ళిపోయాడు. నకిలీ పాట్టియమ్మ వంటగది తలుపు వద్ద పాలగిన్నెను ఉంచి మేనాలోకి వెళ్ళిపోయారు తను మొదలుపెట్టిన తమాషాక్రీడలో పాట్టీయమ్మ ఏమి చేస్తుందో చూద్దామని. ఏం జరిగిందో మనకు తెలుసు. శ్రీకృష్ణుడు పాలు, వెన్న దొంగిలించి తిట్లు తిన్నాడు. కాని స్వామివారు పాట్టియమ్మకు సహాయం చెయ్యదలచి పాలు పోయించుకున్నందుకు శ్రీకృష్ణుడు పొందని చీవాట్లు, శాపనార్థాలు తీసుకున్నారు. 

అంతా తెలుసుకుని పాట్టియమ్మ నిశ్చేష్టురాలైంది. ఒక రాజుని ఆహ్వానించవలసిన రీతిలో స్వాగతం పొందాల్సిన స్వామివారు, ఈ దుఃఖమయ ప్రపంచాన్ని ఉద్ధరించే కరుణాసముద్రులు తన ఇంటినంతటిని తమ చరణ స్పర్శచే పావనం చేసి పాలు పోయించుకున్నందుకు తను ఎంతటి మాటలు అన్నది. 

ఏమీ పాలుపోక, ఏం మాట్లాడాలో తెలియక, ఎలా క్షమాపణ అడగాలో అర్థం కాక కళ్ళ వెంట నీరు కారుస్తూ నిలబడిఉన్న పాట్టియమ్మను చూసి మహాస్వామివారు, “నువ్వు అన్న మాటలు చీవాట్లు కావు. నువ్వు చెప్పినది నిజమే. నేను కట్టెలెక్కి పోయేవాణ్ణే కదా? చక్కలతో చేసిన మేనాలో కదా తిరుగుతాను. కాలినడకలో కూడా చెక్క పాదుకలు వేసుకుని కదా నడుస్తాను” అని అన్నారు. 

నిందించేవారిని కూడా రక్షించే ఆ దైవం, ఆమె చీవాట్లకి కూడా కొత్త భాష్యం చెప్పారు.

--- రా. గణపతి, ‘కరుణైకడలిల్ సిల అలైగళ్’ నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య
వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్
ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam
# కంచి పరమాచర్య స్వామి వైభవం#
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment