Saturday, December 23, 2023

అమోఘ కృష్ణస్తుతి

 *అమోఘ కృష్ణస్తుతి* 

🌹విష్ణుభక్తిని ప్రచారం చేసిన పన్నెండుమంది ఆళ్వార్లలో కులశేఖరుడు ఒకడు. రాజై ఉండీ తనను తాను సామాన్యుడిలా భావించుకొంటూ, కృష్ణుడి సేవలో తరించిన మహనీయుడు. అతడు రచించిన అమూల్య కృష్ణస్తుతి రత్నం ‘ముకుంద మాల’. ముకుందుడు అంటే కృష్ణుడు. కృష్ణుడిపై అచంచల భక్తితాత్పర్యంతో కులశేఖరుడు రచించిన శ్లోకాల దండ ఇది. ఈ స్తోత్రంలో మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఏ మార్గాలను అనుసరించాలో చక్కగా ప్రబోధించిన తీరు కనిపిస్తుంది.

🌷‘ఓ ముకుందుడా! నీపై నా భక్తి విడువకుండా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 
🌷నిన్ను ఎన్నడూ మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించు!’ అని కోరాడు కులశేఖరుడు. 
🌷రాజభోగాలను అనుభవించడానికి తగిన యుక్తవయస్సు, అపార సంపదలు, అధికారం ఉన్నప్పటికీ, వాటన్నింటినీ గడ్డిపోచలుగా భావించాడు. 
🌷కృష్ణుడి పాదారవిందాలను సేవించడమే తన జీవిత లక్ష్యం అని ప్రవచించాడు.
🌷 తాను భువిపై ఉన్నా, మరణించి దివికి వెళ్ళినా, నరకానికి పోయినా, కృష్ణభక్తిని మాత్రం వీడనని ప్రతిజ్ఞ చేసిన భాగవతోత్తముడాయన. 
🌷వృద్ధాప్యంలో మరణం ఆసన్నమైనప్పుడు శరీరంలో కఫ, వాత, పిత్తాలు ప్రకోపించిన సమయంలో నిన్ను తలుస్తానో లేదో, అందువల్ల ఇప్పుడే నా మనసు అనే రాజహంసను నీ పాదపద్మాల ముందు సమర్పిస్తాను అంటాడు ఈ భక్తశిఖామణి. 

🌷లౌకిక సుఖాలపైన, వస్తువులపైన విపరీతమైన ఆసక్తిని పెంచుకుంటే కృష్ణుణ్ని ధ్యానించడానికైనా సమయం ఉండకపోవచ్చు కనుక వ్యర్థ విషయాలపై ఆసక్తి పెంచుకోరాదని, అవేవీ మనిషిని కాపాడలేవని అంటాడు కులశేఖరుడు.

🌷మనిషి శరీరంలోని అన్ని అంగాలనూ కృష్ణ సేవలో వినియోగించాలని ప్రబోధించిన ఈ మహనీయుడు- ‘ఓ నాలుకా! నీవు కేశవుణ్ని కీర్తించు, ఓ మనసా! నీవు శ్రీధరుణ్ని తలచుకో, ఓ హస్తద్వంద్వమా... అచ్యుతుణ్ని అర్చించు, ఓ చెవులారా! మీరు కృష్ణుడి కథలు వినండి, ఓ కన్నులారా! మీరు హరినే దర్శించండి, ఓ పాదయుగళమా! నీవు కృష్ణుడి గుడికి చేరుకో, ఓ నాసికమా! నీవు శ్రీహరి పాదాల చెంత ఉన్న తులసీగంధాన్ని ఆఘ్రాణించు; ఓ శిరస్సూ! నీవు కృష్ణుడి పాదాలపై పడి నమస్కరించు’ అంటాడు.

‘🌷లోకంలో మనిషి పుట్టుక కష్టంతో కూడింది. 
🌷తల్లి పురిటి నొప్పులను అనుభవిస్తే కానీ పుట్టుక సాధ్యం కాదు. 
🌷మరణం కూడా కష్టమయమైనదే. 
🌷మరణకాలంలో మనిషి పడే వేదన దుర్భరం.
 🌷ఈ రెండూ మనిషికి వ్యాధుల వంటివే. 
🌷వీటికి చికిత్స కృష్ణుడి ధ్యానమే. 
🌷అదే అమృతౌషధం. 
🌷ఆ అమృతౌషధాన్ని మనిషి సేవించాలి. 
🌷అప్పుడే బాధలు తొలగిపోతాయి’ అంటాడు కులశేఖరుడు.

🌷‘తృష్ణ తరగని జలధార వంటిది.
 🌷కామం సుడిగాలి వంటిది. 
🌷మోహం కెరటం వంటిది. 
🌷భార్యాపుత్రులు సుడిగుండాలు, మొసళ్లవంటివారు. 
🌷సంసారం ఒక సముద్రమే. 
🌷ఈ సముద్రంలో మునుగుతూ, తేలుతూ మనిషి అగచాట్లు పడుతుంటాడు.
 🌷అతణ్ని కాపాడేవాడు కృష్ణుడే’ అంటాడు ఈ రాజకవి!

🌷మనిషి శరీరం అనుక్షణం పరిణామం చెందుతూ ఉంటుంది.
🌷 నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండదు. 
🌷ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. 
🌷ఈ శరీరం ఎప్పటికైనా శిథిలమై రాలిపోయేదే. 
🌷రోగాలు, నొప్పులు, బాధలు వస్తూనే ఉంటాయి. 🌷అనారోగ్యాల పాలైనప్పుడు ఔషధాలను సేవించడం అవసరం.
🌷 ఔషధాలేవీ పనిచేయని దశలో మనిషికి భగవంతుడే దిక్కు. 
🌷కృష్ణుడే మనిషికి శాశ్వత బాధలను తొలగించే దివ్యరసాయనం వంటివాడు. 
🌷కనుక కృష్ణుణ్నే ఆశ్రయించాలి’ అని వేనోళ్ల ప్రవచించిన ఈ భక్తశిఖామణి వైష్ణవభక్తి సాహిత్యంలో చెరగని ముద్రవేశాడు.🙏🙏🙏

- ✍️డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment