Friday, December 1, 2023

****ఆధునిక జీవితంలోని సకల సంక్షోభాలకూ కృష్ణతత్వమే సరైన జవాబు.....

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *ఆనందాల వెన్నముద్దలేమైపోయాయి?*
💕 *ఆత్మీయతల పాలకుండకు చిల్లులెలా పడ్డాయి?*
💕 *దారితప్పిన లేగదూడల్లాగా సమూహాల్లోనూ ఒంటరితనాలు ఎందుకు?*
💕 *కాళీయసర్పం కాటేయడానికి వస్తున్నట్టు, బతుకునిండా ఇన్నిన్ని భయాలేమిటి?*
❤️ *మధురాధిపతే...అఖిలం విషాదం!*

❤️*ఆధునిక జీవితంలోని సకల సంక్షోభాలకూ కృష్ణతత్వమే సరైన జవాబు. ఐతే ఆ పరిష్కారం ఏమీ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో కనిపించదు ! అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో ‘సేమ్‌ డే డెలివరీ’కి సిద్ధంగా ఉండదు ! యశోదమ్మ సువ్వీసువ్వంటూ చల్ల చిలికి వెన్న తీసినట్టుగా మనల్ని మనం మట్టికుండల్ని చేసుకుని శ్రీమద్భాగవతమనే కవ్వంతో
అంతర్మథనం చేసుకోవాలి.
అంతరంగాన్ని చిలికినకొద్దీ వెన్న!
కాచినకొద్దీ మీగడ!!*
💕 *కృష్ణతత్వం ఓపట్టాన ఒంటబట్టదు. అర్థమై, కానట్టు ఉంటుంది. పైపైకి ఆ లీలలన్నీ బాల్యచేష్టల్లా అనిపిస్తాయి.
అదికాదు… భాగవతాన్ని చూడాల్సిన పద్ధతి.*
❤️ *కృష్ణుడిని యశోదలా ప్రేమించాలి ! రాధలా అర్పించుకోవాలి !! ద్రౌపదిలా విశ్వసించాలి !!! గోపబాలకుల్లా స్నేహం చేయాలి !!!!అర్జునుడిలా అహాన్ని వదిలేసుకోవాలి !!!!అప్పుడిక కృష్ణుడు ఉట్టి కొట్టినా, 
వెన్న తిన్నా, పాము పడగను ఎక్కినా... ప్రతీకాత్మకంగానే అనిపిస్తుంది. ప్రతి లీలా ఓ ఉపనిషత్తు వాక్యంలా, గీతా శ్లోకంలా వినిపిస్తుంది.*
❤️ *’కృష్ణుడిని అర్థం చేసుకోనంత కాలం ఈ శరీరం ఓ చెరసాల. వ్యామోహాలు సంకెళ్లు. కామక్రోధాదులు శత్రువులు’ అంటారు శుక మహర్షి. ఆ బంధనాల్ని తొలగించే తాళం చెవి... కృష్ణతత్వం!ఆనందతత్వం!!*
💕 *రవివర్మ చిత్రాల నుంచి బాపు బొమ్మల వరకూ, ఉడుపీ క్షేత్రంలోని బాలకృష్ణుడి నుంచి ఇస్కాన్‌ ఆలయంలోని చైతన్య కృష్ణుడి వరకూ...ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా 
ఆ సమ్మోహన దరహాసమే.
ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తి పట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద తకధిమి తకధిమి నాట్యం చేస్తున్నప్పుడూ, కంస చాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ,
రణక్షేత్రంలో భీతహరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...
అసలెప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు.*
💕 *వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ...‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట! ఆనందానికి సంకేతమే చిరునవ్వు. మరి, ఆనందంగా ఎప్పుడుంటాం? ‘కష్టనష్టాలు లేనప్పుడే...’ అని బల్లగుద్ది మాత్రం చెప్పలేం. ఎందుకంటే... మనిషన్నాక కష్టం ఉంటుంది,నష్టాలూ వాటిల్లుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనసులోకి తీసుకోకుండా, జీవితాన్ని ఓ ఆటలా ఆడేసుకుంటే ఏ బాధా ఉండదు. బాల్యలీలల ద్వారా కృష్ణయ్య మనకు బోధించింది ఇదే. కృష్ణతత్వ అంతస్సూత్రం కూడా ఇదే. పాపం పసివాడు…!పుట్టీపుట్టకముందే పుట్టెడు కష్టాలొచ్చిపడ్డాయి! కఠినాత్ముడైన కంసమామ అమ్మానాన్నల్ని చెరసాలలో పెట్టాడు. తోబుట్టువుల్ని తెగనరికాడు. బకాసురుడు, శకటాసురుడు, తృణావర్తుడు, పూతనాది రాక్షస గణమంతా కట్టకట్టుకుని వచ్చి మరీ కడతేర్చడానికి సిద్ధపడింది.
అయినా కృష్ణుడు బిత్తరపోలేదు, తత్తరపడలేదు. ఆట బొమ్మల్ని పుటుక్కున విరిచేసినట్టుగా మహామహా రాక్షసుల్ని కూడా చటుక్కున చంపేశాడు.*
❤️ *ఇదంతా ఓ జగన్నాటకం అన్న ఎరుక ఉంటే... ఎదుటి మనుషుల స్వార్థ స్వభావాలూ, అహంకార ప్రసంగాలూ తోలుబొమ్మల ఆటల్లా నవ్వు పుట్టిస్తాయి. ఎవర్నీ ద్వేషించం. మహా అయితే ప్రేమిస్తాం.*
❤️ *మనలోని ఆనందం మన చుట్టూ ఉన్న మనుషులకూ విస్తరిస్తుంది. పరిసర ప్రకృతిలోనూ ప్రతిధ్వనిస్తుంది. కాబట్టే, ఆనంద స్వరూపుడికి జన్మనిస్తున్న సమయంలో దేవకి ప్రసవ వేదనను భరించలేదు, ప్రసవానందాన్ని పొందింది.*
❤️ *”సువ్వీసువ్వీ సువ్వాలమ్మా... నవ్వుతు దేవకి నందను గనియె” అంటాడు సంకీర్తనాచార్యుడు. శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి నాటికి ప్రకృతి మొత్తం పరమ ప్రశాంతంగా మారిపోయింది. రేపల్లెలోని ఆవులు పలుపుతాడు తెంచుకుని వచ్చి మరీ వీధుల్లో నాట్యం చేశాయి.*
💕 *ఆనంద కృష్ణుడు మనతో ఉన్నాడన్న భావన చాలు. ఇక బాధలుండవూ కష్టాలుండవూ. ఉన్నా అవి బాధల్లా కష్టాల్లా అనిపించవు.*
❤️ *’కృష్‌...ణ’ అన్న రెండక్షరాల్లో సత్‌, చిత్‌ ఆనందాలు రెండూ దాగి ఉన్నాయి. కృష్ణుడిని పురాణాలు సచ్చిదానంద స్వరూపుడని కొనియాడాయి. వసుదేవుడు చిమ్మచీకట్లో యమునను దాటొచ్చాడు. నందుడి ఇల్లాలి పక్కన పండంటి పసిబిడ్డను పడుకోబెట్టి మళ్లీ చెరసాలకు వెళ్లిపోయాడు. అంతలోనే తెల్లారిపోయింది. కృష్ణోదయ వార్త పల్లెకంతా పాకిపోయింది. పూల సజ్జెలతో, పండ్ల బుట్టలతో రేపల్లె వాసులంతా నందుడి ఇంటికి బయల్దేరారు. అమ్మ యశోదమ్మ ఆనందానికి హద్దేం ఉంటుంది. జగదేకపతిని తన కన్నబిడ్డే అనుకుంది. లాలపోసి మురిసిపోయింది. పాలకడలిలో పవళించేవాడికి పాలబువ్వ తినిపించి పరమానందాన్ని అనుభవించింది. శేషతల్పశాయి ఆడుకోడానికెళ్తుంటే ‘పాములు ఉంటాయ్‌. జాగ్రత్త కన్నా!’ అంది. మహామహారాక్షసుల్ని సంహరించినవాడిని ‘అదిగో బూచి!’ అని భయపెట్టింది. నిరంతర నిర్నిద్రుడికి ‘జోజో కమలదళేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణా’ అంటూ జోలపాడింది. ఆనందతత్వమే కొలువైన చోట ఆనందానికి కొదవేం ఉంటుంది? నందవ్రజం ఆనంద వ్రజమైంది. ఆనందం ఉందంటే సకల ఐశ్వర్యాలూ, సర్వ సుఖాలూ ఉన్నట్టే. పశువులు సమృద్ధిగా పాలిస్తున్నాయి. గోపికలు కృష్ణ లీలలే తలుచుకుంటూ, కృష్ణగీతాలే పాడుకుంటూ ఉత్సాహంగా వెన్న తీస్తున్నారు. మధురానగరికి వెళ్లి పాలూ, పెరుగూ అమ్ముకుని వస్తున్నారు. చేతినిండా వరహాలు ఆడుతున్నాయి. ఇళ్లలో శుభకార్యాలు జరుగుతున్నాయి. మనసులు మహా ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇన్ని మార్పులకూ మూలం...ఆనందమే, కృష్ణానందమే!*
❤️ *అందుకే సుధామాది భక్తులు... చిన్నికృష్ణుడిని చేరి కొలుస్తున్నప్పుడు మణులో మాణిక్యాలో అడగలేదు. కృష్ణపాద కమలసేవను కోరుకున్నారు. కృష్ణప్రియులతో నేస్తాన్నీ, కృష్ణతత్వమైన భూతదయనూ దయచేయమన్నారు. ఈ మూడూ ఆనంద సోపానాలే.*

💕 *అహంకారి దుర్యోధనుడు మాత్రం పరమాత్మ కంటే పదివేల సైన్యమే ఎక్కువని భ్రమపడ్డాడు. చివరికి భంగపడ్డాడు.’నువ్వుంటే చాలు బావా!’ అంటూ కృష్ణుడి సాన్నిధ్యాన్ని కోరుకున్న అర్జునుడికి... యోగేశ్వరుడి సారధ్యంతో పాటూ విజయమూ వైభోగమూ మహదానందమూ దక్కాయి కదా…!*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment