చాలా కాలం దానవులను ఆశ్రయించుకొని ఉన్న
శ్రీ మహా లక్ష్మీ దేవి దానవులను విడిచి ఇంద్రుని వద్దకి వెళ్ళగా, ఆమెను స్వాగతిస్తూ -
- "నీవు దానవులను ఎందుకు విడిచివేశావు?" -
అని శ్రీ మహా లక్ష్మీ దేవి ని అడుగగా ఆ మాత చెప్పిన సమాధానం.
భీష్ముడు ధర్మరాజుకు విశేష ధర్మాలు చెపుతూ, చెప్పిన అనేక వృత్తాంతాలలో ఇదొకటి.
"మహేంద్రా! దానవులు, యజ్ఞయాగాదులూ, దానాలూ చేస్తూ, పెద్దలను గౌరవిస్తూ, ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నంత కాలం వారి వద్ద సంతోషంగా నివసించాను. ఈ మధ్య కాలంలో వారు ధర్మమార్గాన్ని త్యజించి యథేచ్చగా, ధర్మవిరుద్ధంగా జీవించడం మొదలు పెట్టారు. వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉన్నది -
"సభలో వయోవృద్ధులైన సత్పురుషులు మాట్లాడుతున్నప్పుడు గుణహీనులైన యువకులు హేళనగా నవ్వుతుంటారు."
"ఆసనాలమీద కూర్చున్న యువకులు ఎవరైనా పెద్దలు వచ్చినపుడు లేచి నిల్చొని వారిని గౌరవించడంలేదు."
"తల్లిదండ్రులు బ్రతికుండగానే పుత్రులు ఇంట్లో అధికారం చలాయిస్తున్నారు."
"ధర్మవిరుద్ధంగా డబ్బు సంపాదిస్తున్నవారిని అందరూ గౌరవిస్తున్నారు. రాత్రులందు అరుపులూ, గోలలూ ఎక్కువయ్యాయి. అగ్నిహోత్రాలు ఆర్పివేశారు."
"పుత్రులు తండ్రి మాట వినడం లేదు. భార్యలు భర్త మాట వినడం లేదు. తల్లిదండ్రులనూ, వృద్ధులనూ, ఆచార్యుణ్ణీ, గురువునూ గౌరవించడం లేదు. చిన్నవాళ్ళను సరిగా చూచుకొనడంలేదు."
"అడిగినవారికి బిక్ష పెట్టకుండా, దేవతలకు నైవేద్యాలు చేయకుండా తింటుంటారు."
"అక్కడి వంటవాళ్ళకు శౌచం అంటే ఏమిటో తెలియదు.
"స్త్రీలు పురుషుల వేషం వేసుకొని, పురుషులు స్త్రీల వేషం వేసుకొని క్రీడిస్తుంటారు."
"వృద్ధులైన తల్లిదండ్రులు అన్నం కోసం పిల్లలను యాచిస్తుంటారు."
"అందరూ కూడా కృతఘ్నులు, నాస్తికులు, అభక్ష్యభక్షకులు, కట్టుబాట్లు ఏవీ లేనివారు."
"ఇంద్రా! ఇలాంటి అలవాట్లతో ఉన్న దానవుల వద్ద నేను నివశించను."
పైన ఉటంకించిన లక్షణాలను తెలుసుకొని, ఎవరు ఎలా ఉండాలో నిర్ణయించు కొనవలెను.
(మహాభారతం-శాంతిపర్వం-228 అధ్యాయం)
ఓం భగవతే వాసుదేవాయ
No comments:
Post a Comment