Saturday, December 30, 2023

పారమార్థిక జ్ఞానం

 పారమార్థిక జ్ఞానం

🍁అదేం విచిత్రమో కాని- మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి. ఎలాగో ఓలాగా ఇల్లు కట్టుకొంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి. ఆ కోరికా తీరిపోయిందనుకొంటే- కారు... నగలు... ఇలా ఎన్నో. తీరిన కోరికలతో ఆనందంగా ఉందామంటే కొత్తగా పుట్టుకొచ్చిన తీరని కోరికలు మనసును ఇంకా కలవరపరుస్తూనే ఉంటాయి. నిజానికి ఇదొక నిస్సహాయ స్థితి కోరికలతో సతమతం కావడం మనిషి బలహీనతే. ప్రాపంచిక సౌకర్యాలకోసం ఎన్నో. కష్టాలు పడతాం... కోరికలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయం. ఇదొక సాలెగూడు వంటిది... ఇందులోనుంచి వెలుపలికి వచ్చి ఇదే జీవితం కాదనుకోవడానికి ఆత్మజ్ఞానం అవసరం.. 

🍁మనిషి నిజమైన జీవితం మంచి బుద్ధితో మెలగడంపై ఆధారపడి ఉంటుంది. తప్పు పనులు చేయకుండా అందరిలో మంచివాడని పేరు తెచ్చుకున్నవారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. దీనంగా అజ్ఞానంలో దేవుళ్ళాడుతూ జీవితం గడిపే బతుకులో విలువలు శూన్యం. మంచి భోజనం తినాలనిపించే కోరిక, చక్కని దుస్తులు ధరించాలనే ఆశ- ఆ కోరికలు తీరిన అనంతరం తొలగిపోతాయి. భౌతికమైన అవసరాలు తీరిపోతే చాలనుకొంటే పొరపాటే ఎందుకంటే ఆకలి తిరిగి వస్తుంది... గుడ్డలు చిరిగిపోతాయి. మనిషికి కోరికలే లేని స్థితికి చేరాలి. అలా అని కూడు గుడ్డా ఇల్లు వాకిలి అవసరం లేదని కాదు. మౌలికమైన బతుకు బతుకుతూనే ఆధ్యాత్మిక జీవితం గడపాలని ఆది శంకరాచార్యులు వివేక చూడామణిలో తెలిపారు. సుఖదుఃఖాలు కష్టసుఖాలు సహజమైనవి. వాటికోసం వెంపర్లాడటం తగదు. ఆధ్యాత్మికంగా బలంగా సాగే బతుకులో పవిత్రత ఉంటుంది.

🍁 ఎలాంటి బాధలూ మనల్ని కదిలించలేవు. మనిషి స్వభావం మారేదాకా భౌతికమైన అవసరాలు కలుగుతూనే ఉంటాయి. బాధలు ఎదురవుతూనే ఉంటాయి. మనకు సహాయం ఎంత లభించినా కష్టాలను పూర్తిగా నివారించలేం. మనలో మంచితనాన్ని నింపుకొని పవిత్రులుగా జీవించడమే అంతులేని కోరికలకు పరిష్కారం. కోరికలకు అనుబంధాలకు సంబంధం ఉందని ఆలోచిస్తే అర్థం అవుతుంది. చెడుకు అనవసర అనుబంధాలకు దూరంగా ఉండాలి. మనసులోని చెడు ఆలోచనలు పూర్తిగా తొలగిపోయే వరకు, ఈ కోరికలు గుర్రాలై స్వారీ చేయాలనే ఆశపెట్టి కిందికి తోయాలని చూస్తూనే ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గమనిస్తే అనుభవాలు గుణపాఠం నేర్పుతాయి. 

🍁ధనం రావడం పోవడం మన చేతుల్లో ఉండదు. అవసరాలకు తగినంతగా కష్టపడి సంపాదిస్తే చాలు. కోరికలను నియంత్రిస్తే మనకు మనమే మేలు చేసుకోగలం. మితిమీరిన ఆశలు కోరికలు ముప్పుతెచ్చి పెడతాయి. తద్వారా వాటిల్లే కీడుకు మనమే బాధ్యులం అవుతాం. మనం పవిత్రులం ధన్యులం కావాలంటే నైతికతతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అవసరం. అలాంటి జీవితమే అత్యుత్తమమైనది.

No comments:

Post a Comment