గుండాపిండం ‘లైఫ్ స్టైల్’ పత్రికలో జర్నలిస్ట్.
అతను ముందు వారం పత్రికలో రాసిన కొటేషన్ చదివి, పాఠకులు స్పందించారు. “డియర్ గుండాపిండం! మీ కొటేషన్ చాలా బావుంది. జీవితంలో ఆటలు, స్నేహితులు చాలా ముఖ్యం. ఆస్తులు కాదు. మీ కొటేషన్ కి మరొక్కసారి కృతజ్ఞతలు”
గుండాపిండం రాసిన కొటేషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇక చదవండి.
*****
కారులో వెళ్తూ ఆనందోబ్రహ్మని ఇంటర్వ్యూ చేస్తున్నాడు గుండాపిండం.
ఆనందోబ్రహ్మకి ఇప్పుడు వయసు డెభ్భై.
“సార్! డెభ్భై వసంతాలు చూశారు. ముప్ఫై ఐదేళ్ల సుదీర్ఘ సర్వీసు తర్వాత రిటైరయ్యారు. అలసిపోయుంటారు. అయినా ఉల్లాసంగా ఉన్నారు. రహస్యం ఏమిటి?” అని అడిగాడు గుండాపిండం.
కారు హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ పక్కగా వెళ్తోంది.
“నా కథ విను. నా ఉల్లాసానికి కారణం అర్థమవుతుంది,” అన్నాడు ఆనందోబ్రహ్మ.
“చెప్పండి సార్. చాలా క్యూరియస్ గా ఉంది”
“నలభై ఏళ్ల కితం ఇక్కడ ఒక ఎకరం కొందామనుకున్నా! ఎకరం వెయ్యి రూపాయలు”
“కొన్నారా? ఇప్పుడు వెయ్యి కోట్లు పై మాటే! అదే మీ ఆనందానికి కారణం! అవునా!”
“కొనలేదు. మా డాడీ, నా ఫ్రెండ్స్ పడనీలే. అప్పుడు ఈ ఏరియా ఓ అడవి!”
“ముప్ఫై ఏళ్ల కితం ఇన్ఫోసిస్ షేర్లు వెయ్యి కొందామనుకున్నా”
“అదీ సంగతి. మరి చెప్పరేం! వాటి విలువ ఇప్పుడు వందల కోట్లలో…”
“కొనలేదు. స్టాక్ బ్రోకర్, ఫ్రెండ్స్ పడనీలే. ఐటీ ఒక బబుల్ అన్నారు”
“ఇరవై ఏళ్ల కితం నార్సింగిలో వెయ్యి గజాల స్థలం పాతిక వేలకు ఆఫర్ తరుముకుంటూ వచ్చింది”
“అసలు విషయం ఇప్పడు బయటపెట్టారు. ఇంకేం...కోట్లకి అధిపతి మీరు!”
“కొనలేదు. బావమరిది, నా ఫ్రెండ్స్ పడనీలే. ఇక్కడ స్థలం ఏంటి? పిచ్చా నీకు అన్నారు”
కారు శ్రీశైలం రోడ్డులో పరిగెడుతోంది. Infinity Villas అనే గేటెడ్ కమ్యునిటీ దాటుకెళ్తోంది.
“ఇవేం లగ్జరీ విల్లాలు సార్! ఒక్కోటి పాతిక కోట్లు ఉంటుందేమో?” అడిగాడు గుండాపిండం.
“పై మాటే! పదిహేనేళ్ల కితం ఈ వెంచర్ ప్రమోటర్ ఈ విల్లాలు అమ్ముకోలేక ఒక్కోటి కోటి రూపాయలకి ఆఫర్ ఇచ్చాడు”
“ఈసారి మీరు కొనేసే ఉంటారు. మీరు తక్కువోళ్ళా?”
“కొనలేదు. తోడల్లుడు, నా ఫ్రెండ్స్ పడనీలే. ఇది ఒక ఘోస్ట్ వెంచర్ అన్నారు”
“ఇదెక్కడి ఫ్రెండ్స్ సార్! వాళ్ళని వదిలిపెట్టుంటారు. అందుకే హాయిగా ఉన్నారు”
కారు ఆపాడు ఆనందోబ్రహ్మ. ఇద్దరూ కారు దిగారు. ఓ బిల్డింగ్ లోకి వెళ్లారు. లోపల పదిమంది ఉన్నారు. అందరికీ వయసు రమారమి డెభ్భై ఉంటుంది.
ఆనందోబ్రహ్మని చూడంగానే వాళ్ళంతా సంతోషంగా కెవ్వుమని కేకలు వేశారు.
“వీళ్ళంతా నా ఫ్రెండ్స్” అన్నాడు ఆనందోబ్రహ్మ గుండాపిండంతో.
ఆనందోబ్రహ్మ టేబిల్ ముందు ఓ కుర్చీలో కూర్చున్నాడు.
టేబిల్ పై తనకోసం వేసి ఉన్న పదమూడు పేకముక్కలు చేతిలోకి తీసుకున్నాడు. అంతే! మైమరచి పోయాడు.
గుండాపిండం ఆ వారం పత్రికలో ఆనందోబ్రహ్మతో జరిగిన ఇంటర్వ్యూ మొత్తం రాయకుండా, ఓ కొటేషన్ ఇలా రాశాడు:
“స్నేహితులుంటే ఆస్తులుండవు. ఆట తప్ప మరో ధ్యాస ఉండదు. ఆస్తులుంటే స్నేహితులుండరు. ఆస్తి తప్ప మరో ధ్యాస ఉండదు”
ఇప్పుడు కధానిక మొదలుకి వెళ్ళి పాఠకుల స్పందన మరొక్కసారి చదవండి. ప్లీజ్.. 😝
ఆర్కే 😎
No comments:
Post a Comment