Saturday, December 30, 2023

పిల్లల్లో అంతకంతకూ పెరుగుతున్న ఊబకాయం సమస్య

 *🔊‘బొద్దు ముద్దే..’ కొనసాగితే ముప్పే!*

*🔶పిల్లల్లో అంతకంతకూ పెరుగుతున్న ఊబకాయం సమస్య*

*🔷సత్వర చికిత్సతో ముప్పు తప్పించవచ్చంటున్న స్వీడన్‌ పరిశోధకులు*

*🔶ముందస్తు జాగ్రత్తలతో సమస్యను అధిగమించవచ్చంటున్న వైద్యులు*

*🍥బొద్దుగా ఉండే చిన్నారులు ముద్దొస్తారు. దీర్ఘకాలం అదే కొనసాగితే మాత్రం ముద్దొచ్చే సంగతి దేవుడెరుగు..వారికి వారే భారమవుతారు. భవిష్యత్తులో దేశంలోని పిల్లలు ఇదే ప్రమాదంలో పడబోతున్నారని, ఊబకాయం ఉప్పెనలా వారిని కబళించబోతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను ఎదుర్కొని, రక్షణ చర్యలతో ముప్పు నుంచి క్రమంగా బయటపడుతుండగా.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాలు ఆ ఊబిలో చిక్కుకుపోతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.*

*🌀ఆహార విధానంలో మార్పులు, శారీరకశ్రమ కల్గించేలా ఆటలాడించడం సహా కొన్ని ముందస్తు జాగ్రత్తలతో సమస్య నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. తాజాగా స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో ఇదే విషయం తేటతెల్లమైంది. ఈ సమస్య ఉన్న పిల్లలకు ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిదని ఆ అధ్యయనం చేసిన పరిశోధకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఊబకాయం సమస్యకు గల కారణాలు, దానివల్ల తలెత్తే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ వి.ఎస్‌.వి.ప్రసాద్‌ వివరించారు.*

*💥పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణమేమిటి?*

*♦️కొవిడ్‌ తర్వాత పిల్లల్లో ఊబకాయం సమస్య పెరుగుతోంది. కొవిడ్‌ కంటే ముందు పది శాతం మంది పిల్లల్లో ఈ సమస్య ఉంటే, తర్వాత 20-30 శాతం వరకూ  పెరిగింది. హైదరాబాద్‌ సహా పెద్ద నగరాలు, జిల్లా కేంద్రాల్లోని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పిల్లల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. ప్రధానంగా ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌లపై ఎక్కువ సేపు గడపడం ఎక్కువ నష్టం కలిగిస్తోంది. కొవిడ్‌ తర్వాత లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇది మరీ ఎక్కువైంది. ఆ సమయంలో అదే పనిగా తినడం, అవీ ఆరోగ్యకరమైనవి కాకపోవడం వంటివి సమస్యకు ఊతమిస్తున్నాయి.*

*💥ఆహారం ఎలాంటి ప్రభావం చూపుతోంది*

*♦️ఎక్కువ ఉప్పు ఉన్న, అధికంగా వేగిన చిరుతిళ్లు, తీపి పదార్థాలు తినడం సమస్యను పెంచుతోంది. గతంలో ఈ సమస్య బడి ఈడు చిన్నారుల్లో కన్పించేది. ఇప్పుడు మూడేళ్లకంటే తక్కువ వయసు, పదేళ్లు పైబడిన వారిలోనూ కన్పిస్తోంది. ఆదాయ వనరులు పెరగడంతోపాటు, మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ  బాగా తగ్గిపోవడం, విద్యా సంస్థల్లో చదువులకే తప్ప.. ఆటలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి సమస్యను పెంచుతున్నాయి.*

*💥చిన్నారుల ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి?*

*♦️చిన్నారుల ఆహార అలవాట్లకు మొదటి అయిదారేళ్ల కాలం కీలకం. ఆ వయసులో ఏ ఆహారం అలవాటు అయితే అదే శాశ్వతం అవుతుంది. ఈ సమయంలోనే ఆరోగ్యకరమైన కాయగూరలు, పండ్లు, పీచు ఉండే పదార్థాలు తినేలా వారిని ప్రోత్సహించాలి. ప్రధానంగా చిరుధాన్యాలతో చేసిన వంటలపై వారిలో ఇష్టం పెంచాలి. ఆ తరహా ఆహారం తక్కువ తిన్నా కడుపునిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఎక్కువ తినలేరు. అలాగే మిఠాయిలకు ప్రత్యామ్నాయంగా బెల్లం, ఖర్జూరం వంటి డ్రైపూట్స్‌ అందించాలి. వాటిలో ప్రొటీన్‌లు, సూక్ష్మపోషకాలు, ఖనిజాలు, పీచు అధిక మోతాదులో ఉండటంతో జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తగ్గడంతోపాటు శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.*

*💥ఊబకాయంతో వచ్చే ఇతర సమస్యలు, వాటి ప్రభావం*

*♦️చిన్నతనంలో పిల్లల బరువును నియంత్రించకపోతే అవి 14-20 ఏళ్ల వయసులో అనేక  దుష్పరిణామాలకు కారణమవుతాయి. ప్రధానంగా కీళ్లపై ఒత్తిడి, రక్తపోటు(బీపీ), మధుమేహం వంటి ముప్పు పెరుగుతుంది. రక్తపోటు, మధుమేహం రెండూ ఉంటే గుండెపై ఒత్తిడి, రక్తనాళాల సమస్య, గుండెపోటు వంటి సమస్యలు పెరుగుతాయి. నియంత్రణ లేకుండా ఆహారం తీసుకుంటే కొవ్వు పదార్థాలు అధికమై శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గి మెటబాలిక్‌ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. మరోవైపు ఊబకాయం సమస్య ఉన్న పిల్లలపై మానసిక ఒత్తిడి ఉంటుంది. సహ విద్యార్థులు వారితో వ్యవహరించే తీరుతో మరింత పెరుగుతుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది.*

*💥అధిక కేలరీలున్న ఆహారంతో ముప్పు..*

*♦️చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌, బర్గర్‌, పిజ్జా వంటి ఎక్కువ కేలరీలతో నిండిన ఆహారం, జంక్‌, ప్యాకేజ్డ్‌, ఫాస్ట్‌ఫుడ్‌లు పిల్లల్లో ఊబకాయం సమస్యకు మరో కారణం. తక్కువ పరిమాణంలోనే తీసుకుంటున్నామని సర్దిచెప్పుకుంటున్నా, అందులో ఎక్కువ కేలరీలు ఉండటం సమస్యను పెంచుతోంది. ఉదాహరణకు ఒక కేకు ముక్కలో 500 నుంచి 700 కేలరీల పిండిపదార్థాలు ఉంటాయి. అందులో ఉండే వెన్న (బటర్‌), సుగర్‌ క్రీంల వల్ల వచ్చే కొవ్వులు అదనం. అవన్నీ శరీరంలోకి వెళ్తే గ్లూకోజ్‌ పెరుగుతుంది. అదనంగా ఉండే గ్లూకోజ్‌లు కొవ్వుగా మారి నడుం చుట్టూ పేరుకుపోతుంది.*

*💥ఆటలు అత్యంత అవశ్యం?*

*♦️దశాబ్ద కాలానికి ముందు అభివృద్ధి చెందిన దేశాల్లోని పిల్లల్లో ఊబకాయం సమస్య ఎక్కువ ఉండేది. ఆయా దేశాలు మేల్కొని తగిన చర్యలు తీసుకోవడంతో తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో సమస్య పెరుగుతోంది. ఆరోగ్యకర ఆహారాన్ని అందించడం, శారీరకశ్రమ పట్ల అవగాహన కలిగించడం, కనీసం రోజుకు 45 నిమిషాల నుంచి గంటసేపు ఆటలాడేలా ప్రోత్సహించడం వంటి చర్యలతో సమస్య నుంచి క్రమంగా బయటపడొచ్చు.*

*💥స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనం ఏం చెబుతోందంటే..*

*♦️పిల్లల్లో ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయిస్తే సత్ఫలితాలు ఉంటాయని స్వీడన్‌కు చెందిన కరొలిన్‌స్కా వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. స్వీడన్‌లో 4-6 ఏళ్ల వయసులో ఊబకాయంతో ఉన్న పిల్లల చికిత్సపై వారు అధ్యయనం చేశారు. ‘ప్రధానంగా చికిత్సలో తల్లిదండ్రుల తోడ్పాటు లభించిన పిల్లల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ఊబకాయం తగ్గిన తర్వాత వారి ఆరోగ్య స్థితి ఎంతో మెరుగైంది’ అని ఆ వర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైన్స్‌ పీడియాట్రిక్‌ సైన్స్‌ అసోసియేట్ ప్రొఫెసర్‌ నొయికా తెలిపారు. ‘పిల్లలు తాము ఇష్టపడే ఆహారాన్నే అధికంగా కోరుకుంటున్నారని, వారి ఇష్టాలను కాదనలేని క్రమంలో నియంత్రించలేకపోతున్నామని అధ్యయన సమయంలో పలువురు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇలాంటి పిల్లలకు ఇంట్లో అందించే ఆహారంలోని పోషకాలు, కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్గించాలి. వంటల్లో వారిని భాగస్వాములను చేయాలి’ అని ఆమె వివరించారు.*

*💥2030 నాటికి ప్రతి పది మందిలో ఒకరు మన వద్దే*

*♦️దేశంలోని పిల్లల్లో ఊబకాయం అంతకంతకూ పెరుగుతోంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో ఉన్న పది మంది పిల్లల్లో ఒకరు భారత్‌లోనే ఉంటారని అంచనా. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయం శాతం 3.4. 2015-16లో ఇది 2.1 శాతం మాత్రమే. ప్రస్తుతం ఐదేళ్లలోపు పిల్లల్లో 1.44 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ అంశంలో చైనా తర్వాత స్థానంలో మనమే ఉన్నాం.*

No comments:

Post a Comment