“మహా భాగ్యం..” అంటే…
ప్రతి మనిషి తన జీవితంలో బాగా సంపాదించాలి, పాలరాతితో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టు కోవాలి అని, ఆ ఇంటి ముందు ఖరీదైన ఫారిన్ కారును నిలపాలి అని, జీవితంలో ఇంతకంటే సాధించ వలసినది, సంపాదించ వలసినది ఇంకేముంది అనుకుంటున్నారు…
మొన్నీమధ్య ఒక పనిమీద బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. పని మధ్యాహ్నానికే అయిపోయింది. తిరుగు ప్రయాణం మాత్రం మరుసటిరోజు, బాగా సమయం ఉంది. రెండునెలలక్రితం మా దగ్గరి బంధువు ఒకాయన అక్కడ ఒక మంచి ఇళ్ళు కట్టుకొని గృహప్రవేశం చేశాడు, కానీ కరోనా ప్రభావం వల్ల అప్పుడు రాలేకపోయాం. సరే ఇప్పుడు టైమ్ ఉంది కదా అని కలిసి వద్దాం అని బయలు దేరి వెళ్లాను.
ఇంటిముందు ఆటోదిగి ఇంట్లోకి ప్రవేశించబోతూ ఒకసారి ఇంటి బయట చేయించిన ఎలివేషన్ చాలా రిచ్ గా ఉంది. బయటనుండే గ్రానైట్ రాతితో నిర్మించబడింది. ఇంటిముందు ఒక పెద్ద విదేశీ కారు నిలిపి ఉంది.
గడపలోనే ఎదురైన వెంకటేష్ … “వచ్చావా బావా, లోపలికిరా” అంటూ సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చుండబెట్టాడు.
అవి విదేశీ ఫర్నీచర్ అనుకొంటా సుతిమెత్తగా ఉన్నాయి. “ఏమేవ్ మీ అన్నయ్య వచ్చాడే ఒకసారి వచ్చి పలకరించు” అన్నాడు.
పనిమనిషి ఖరీదైన వీల్ చైర్ ను తోసుకుంటూ వస్తోంది. అందులో కూర్చొన్న పద్మావతి దూరం నుండే “నమస్కారం అన్నయ్యా, ఇప్పుడు తీరిందా మమ్మల్ని చూడడానికి” అంటూ, పనిమనిషితో “అన్నయ్యకు కాఫీ తీసుకురా” అంటూనే..
“ఆయనకు చెక్కర వేసి తీసుకురా, నాకు మీ అయ్యగారికి చెక్కర లేకుండా తీసుకురా” అంటూ, “ఏంటన్నయ్యా విశేషాలు ఇంట్లో అందరూ బావున్నారా.. ఆ బాగానే ఉంటారులే! మేమేమో అక్కడ నుండి వచ్చాక కేవలం డబ్బు సంపాదన అంటూ ఈ ఇరవై ఏండ్లూ ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో డబ్బు సంపాదించాం, కానీ ఏం లాభం అదే రీతిలో ఎన్నో రకాల జబ్బులను కూడా సంపాదించు కొన్నాము. చూశారుగా మాకు బీపీలు, షుగర్లు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చూశారుగా మొన్నే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకొని ఇదిగో ఇలా వీల్ చైర్ లో తిరగాల్సిన కర్మ పట్టింది.”
“ఇక మీరు, వదినగారు, చక్కగా యోగా గురూజీలుగా, ఆక్యుపంక్చర్ డాక్టర్లుగా ఎదిగి మీరు, మీ పిల్లలు హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమే కాకుండా ఊరూరు తిరుగుతూ కొన్ని వేలమందికి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తున్నారు. మీరెంతో గొప్ప పని చేస్తున్నారు అన్నయ్యా,” అంటూ మాట్లాడడానికే ఆయాస పడసాగింది.
ఇంతలో రెండు జంటలు ఇంట్లోకి వస్తున్నారు. వారి వేషధారణ చూస్తే ఆ జీన్స్ ప్యాంట్లు చాలా ఖరీదైనవే కానీ ప్యాంట్ల నిండా రంధ్రాలు, చిరుగులే, వాటిపైన వేసుకొన్న బనియన్లు పిచ్చి పిచ్చి రంగులలో ఉండి శరీరంలో వేటిని దాచాలో వాటినే ప్రదర్శించుకొంటూ వస్తున్నారు.
వారిని చూస్తుంటే సంతల్లో అడుక్కునే బిచ్చగాళ్ళు గుర్తుకు వచ్చారు.
వారితో… “ఇదిగో మామయ్యోచ్చాడు”అంటే, 'హాయ్ హలో ' అంటూ చేతులూపుతూ, బూటుకాళ్ళతోనే పైనున్న వారి గదుల్లోకి వెళ్ళిపోయారు. “మీకు ఇద్దరేకదా పిల్లలు” అంటే, “వాళ్ళకి వాళ్ళే లవ్ మ్యారేజ్ లు చేసుకొన్నారు. ఎవరు ఏ కులమో, ఏ మతమో తెలియదు కానీ రిచ్ ఫ్యామిలీ వారట. అందుకే ఎవరికీ తెలియకుండా ఏదో అలా ముగించేసాము” అన్నది.
ఇంతలో పనిమనిషి సుబ్బమ్మ వచ్చి “అమ్మా భోజనానికి రండంది. చాలా కాస్ట్లీ డైనింగ్ టేబుల్, నాకేమో అన్నీ వడ్డించారు వారికి మాత్రం రాగిజావ, కూరగాయల సూపులు, డాక్టర్ల సలహా మేరకు రోజు వారి భోజనం అదేనట. భోజనం తర్వాత వారితో … “ఒక కథ చెబుతాను వినండి!” అని చెప్పాను.
***************
“నాకు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర రంగయ్య అనే గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ఉండేవాడు. అతని నైపుణ్యం అద్భుతం! ముప్ఫై సంవత్సరాలుగా అతను అదే కాంట్రాక్టరు దగ్గర పని చేస్తుండడం వల్ల ఆ కాంట్రాక్టరుకు కూడా ఆ మేస్త్రీ అంటే చాలా గౌరవం అభిమానం. అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో ‘అయ్యా! ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని అయిపోగానే, నేను ఇక రిటైరు అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, శరీరం కూడా సహకరించడం లేదు. ఇక పనిని చాలించి శేష జీవితాన్ని విశ్రాంతిగా గడపాలని ఉన్నది, అందుకే ముందుగానే తెలియ జేస్తున్నాను, ఏమంటే మీకు పనిలో కష్టం కలగకూడదు గద, అందుకని..’ అన్నాడు.
కాంట్రాక్టర్… ‘సరే కానీ నాదొక చిన్న కోరిక కాదనకు. నాకోసం మరొక్క చక్కని ఇల్లు కట్టిచ్చి వెళ్ళు’ అన్నాడు.
మేస్త్రీ కూడా కాదనలేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు గాని, నిజానికి కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి, మేస్త్రీకి ఆ పని పెద్ద బరువులాగా తోచింది. మనసు ఏమాత్రం పనిలో అస్సలు నిలవలేదు. దాంతో ఆ పని అరకొరగా సాగింది. నిర్మాణపు క్వాలిటీ కూడా బాగా రాలేదు. కాంట్రాక్టర్, మేస్త్రీలు కూడా ఆ మార్పును గమనించారు, అయినా కాంట్రాక్టర్ సర్దుకు పోతూ కొన్ని సూచనలను ఇచ్చినా మేస్త్రీ వాటిని అన్నిటినీ పెడచెవిన పెట్టాడు. "ఎలాగో ఒకలాగా జరిగిపోయి, పని గడిస్తే చాలు" అనుకున్నాడు.
కొత్త ఇంటి పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టరు వచ్చి చివరి ఇన్స్పెక్షను చేశాడు. నిర్మాణపు పనితనం ఏమంత బాగా రాలేదు, చాలా లోపాలు కనబడ్డాయి. ఆయనేమీ ఆశ్చర్య పోలేదు ముందునుండీ పనిని చూస్తూనే ఉన్నాడు కాబట్టి, నిట్టూర్చి తన జేబులోంచి ఆ ఇంటి తాళాల గుత్తి తీసి, మేస్త్రీ చేతుల్లో పెడుతూ అన్నాడు… ‘చూడు రంగయ్య ఇదిగో ఇకనుండి ఈ ఇల్లు నీకే సొంతం. ఇన్నాళ్ళ మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలచిన బహుమతి ఇది!’ అని అంటూ రంగయ్య భుజం తట్టి వెళ్ళి పోయాడు.
మేస్త్రీ నిర్ఘాంత పోయాడు. ‘అయ్యో ! ఎంత ఘోరం జరిగి పోయింది, ఈ ఇల్లు నాకు ఇవ్వడానికే అనే సంగతి ముందుగానే నాకు తెలిసుంటే ఎంత బాగుండేది, తను ఆ ఇంటి నిర్మాణంలో తన ముఫై ఏండ్ల అనుభవాన్ని రంగరించి ఆ ఇంటికి జీవం పోసి ఉండేవాడిని! ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు. లోపభూయిష్టమైన ఈ ఇంట్లోనే తన శేష జీవితాన్ని గడపాల్సిందే, తన తప్పుల్ని తను ప్రతిరోజూ చూసుకొంటూ, అందుకు ప్రతిరోజూ సిగ్గుపడుతూ గడపాలి! అయ్యో! ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో! ఇప్పుడేమీ చెయ్యలేమే’ అనుకొంటూ కుమిలి కుమిలి ఏడవ సాగాడు.
అలాగే మనందరమూ కూడా ఈ మన శరీరాలను నిర్మించుకునే మేస్త్రీలం మనమే. మనదే ఈ ఇల్లు. ఇందులో ఉండాల్సిందీ మనమే. మనం మన యీ శరీరాన్ని ప్రేమ, ఆప్యాయతలతో, ఆరోగ్యంగా ఉండేటట్లు శ్రద్ధగా నిర్మించుకుంటే, అది మన జీవితానికి అనుకూలంగాను, వసతిగాను ఉంటుంది. బాగా పని చేస్తుంది. అట్లా కాక, మనం దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అది పాడై అనారోగ్యం పాలౌతుంది. అప్పుడు మనం రోగాలతో బాధలు పడుతూ, పశ్చాత్తాపంతో బ్రతకాల్సిందే.
నిజానికి "మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ". ఆరోగ్యమే మహాభాగ్యము. భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని మనకు ఆరోగ్యాన్ని పెంచే ఆహారపు అలవాట్లతో కాపాడుకోవడం, రోజూ వ్యాయామం, యోగా ప్రాణాయామం, ధ్యానం చేయడం, మంచి పుస్తకాలను చదవడం లాంటివి చేయడం మన చేతుల్లోనే ఉంది. అది మన ధర్మం. అది మన బాధ్యత. మనం నివసించే ఇంటిని ఎంతో ఖర్చు చేస్తూ ఎంత శ్రద్ధగా నిర్మించు కొంటామో, అంతే శ్రద్ధగా మన శరీరాన్ని కూడా నిర్మించుకొని కాపాడుకోవాలి. అందుకే పెద్దలన్నారు… "మన దేహమే దేవాలయం " అని…!✍️
ఆరోగ్యమే మహాభాగ్యం…!
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.🙏🙏🙏
No comments:
Post a Comment