ఆత్మీయులు.. ---- అసలు ఆత్మీయులు అంటే ఎవరు.. మనపట్ల ఆత్మీయుతా భావంతో అభిమానం చూపెట్టేవారే కదా. కొంతమందిని మొదటిసారి చూడగానే ఒక రకమైన ఆత్మీయుతా భావం మనకి కలుగుతుంది. కారణం.. వాళ్ళ మంచితనం కావొచ్చు, అందం కావొచ్చు, ప్రతిభ కావొచ్చు, మాటకారితనం కావొచ్చు. హ్యూమర్ కావొచ్చు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో.. వారే మన ఆత్మీయులు. పూర్వపు రోజుల్లో కటుంబాల మధ్య, స్నేహితుల నడుమ యీ ఆత్మీయత ఉండేది. ఒకరిపై ఒకరు చాలా అభిమానంతో ఉండేవారు. కాలం తెచ్చిన మార్పుతో, టెక్నాలజీ ప్రభావంతో క్రమంగా ఇటువంటి అనుభూతులు కరువౌతున్నాయి. ఎవరికీ సమయం సరిపోవడం లేదు. చిన్న కుటుంబాలు కావడంతో అందరూ చదువుకుని ఉద్యోగాలలో లేదా ఇతర వ్యాపకాలలో నిమగ్నం కావటంతో ఆత్మీయత కి అర్ధం లేకుండా పోయింది. నీడ్ బేస్డ్ విధానంతో ఇప్పుడు అందరూ ప్రవర్తిస్తున్నారు. మనతో ప్రొఫెషనల్ గా పని ఉన్న వాళ్ళకి.. ముందు ఎంతో స్నేహంగా ఆత్మీయంగా ఉంటూ .. మనతో పని ఐపోయాక మనల్ని పట్టించుకోరు. కారణం మనతో అవసరం వారికి తీరిపోయింది గనుక. అంటే ఇక్కడ స్వార్ధ చింతన స్పష్టంగా కనిపిస్తోంది. సొంత వాళ్ళైనా సరే.. పై వాళ్ళైనా సరే. చిరకాలం ఆత్మీయ బంధం కొనసాగించేవారు బహుస్వల్పం ఈరోజుల్లో. ఆత్మీయత కి అర్ధం తెలియకుండా పోతోంది ఈరోజుల్లో. నా టీనేజ్ ఆరంభం లోనే ఆత్మీయులు అనే కుటుంబ కథా చిత్రం వచ్చింది. ఆత్మీయత విలువను చక్కగా చెప్పిన మంచి కథాచిత్రం ఇది. కుటుంబం లోని, కుటుంబాల మధ్య ఆత్మీయత ఎలా ఉండాలో ఈ సినిమా చెబుతుంది. కథాబలం, బలమైన తారాగణం, చక్కని సంభాషణలు, మంచి.. చాలా మంచి పాటలు ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చివరిలో వచ్చే ఘంటసాల సుశీల యుగళగీతం.. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే.. నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. చిత్రీకరణ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహబంధం లో ఉన్న మధురిమ పాట సాహిత్యంలో కనిపిస్తుంది. నా పెళ్ళి నిశ్చయం అయ్యాక ఎక్కువగా యీ ఆత్మీయ గీతాన్ని తలుచుకుంటూ.. నేను నాగేశ్వరరావు లాగ, కాబోయే శ్రీమతిని వాణిశ్రీ లాగ ఊహించుకునే వాణ్ణి. ఆత్మీయంగా ఉన్నవారిని.. నేనే కాదు.. మంచి మనసు ఉన్నవారందరూ ఇష్టపడతారు. ------- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment