Friday, December 22, 2023

మనిషి బాగుపడాలంటే....

 ✍️✍️

మనిషి బాగుపడాలంటే భయమైనా ఉండాలి. లేకుంటే భక్తి అయినా ఉండాలని పెద్దలమాట. ఈ రెండూ లేకపోతే మనిషి జీవితం తెగిన గాలిపటంలా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మనిషి స్వేచ్ఛాజీవి తనకు నచ్చిన రీతిలో బతకాలనుకొంటాడు అలా అనుకోవడం తప్పు కాదు. ఆ స్వేచ్ఛకూ కొన్ని హద్దులుంటాయి. తన స్వేచ్ఛ వల్ల ఇతరులకు కష్టనష్టాలు కలగకూడదు. ఎవరికి ఏ విధంగా ఇబ్బందిని కలిగించని స్వేచ్ఛ మనిషికి మంచి చేస్తుంది.

పూర్వకాలంలో రాక్షసులు ఘోరతపస్సులు చేసి, ఎవరూ పొందలేని అమోఘ వరాలను పొందారు. కానీ ఏమి లాభం? వారంతా తామసగుణాలతో దేవతలను, మునులను, సాధుజనులను కష్టపెట్టారు. వారి సంపదలను బలవంతంగా దోచుకున్నారు. ఇందుకు ఉదాహరణ హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుణ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏండ్ల తరబడి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు- 'వీటిని బుద్ధిమంతుడవై చక్కగా వినియోగించుకోవొ ఇతరులకు హాని తలపెట్టకు' అని హెచ్చరించాడు. కానీ వర గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలను, మాన వాళిని ఎంతగా గురిచేశాడో భాగవతం వెల్లడిస్తుంది. అతన్ని అణచడానికి సాక్షాత్తు. మహావిష్ణువే నరసింహావతారాన్ని ఎత్తవలసి వచ్చింది. ఇలాగే రావణ, శిశుపాలాదులు సైతం గర్వాంధుడై...

చివరికి హతులయ్యారు. మనిషి భయానికి లొంగుతాడు. ఇతరులు తనపై దాడిచేసి చంపు తారనే అనుమానం వచ్చినప్పుడు భయంతో వణికిపోతాడు. లేదా దుశ్చర్యలకు పాల్పడితే పాపాలు.. వెంటాడతాయని నమ్మితే తగ్గు తాడు. ఈ భయం మనిషిని విశృంకలత నుండి కట్టడి చేస్తుంది. 
రెండోది భక్తి, తన ఇష్టదేవతలపైన భక్తి ఉన్నవాడు ఆ దేవతలపైన గల భక్తితో తన ప్రవర్తనను సన్మార్గంలో ఉంచుకోవడానికి యత్నిస్తాడు. వెచ్చలపై గౌరవం ఉన్న సందర్భాలలో వాళ్ళు చెప్పినట్లు వింటాడు.

మనిషి ఏది చేసినా తనకు, తన చుట్టూ ఉన్న సమాజానికి నష్టం కలగనంతవరకు ఎవరైనా సహిస్తారు. మనిషి సంఘజీవి. సంమాన్ని కాదని బతకలేడు. కనుక సాంఘిక నీతి సూత్రాలను మనిషి తప్పక పాటించవలసిందే. లోకానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే ఏటికి ఎదురీదడమే హద్దులు దాటితే మునిగిపోక తప్పదు. మనిషి తన ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని భగవద్గీత చెబుతోంది. శ్రేష్టులు ఏది ఆచరిస్తారో సామాన్యజనులూ దానినే ఆచరిస్తారు కనుక మనిషి శ్రేష్ఠంగా ఆలోచించాలి. శ్రేష్ఠంగా ఆచరించాలి. ఇదే లోకనీతి.

కొందరు ధనగర్వంతో, అధికార గర్వంతో తాము ఎవరిమాటా వినవలసిన పనిలేదని భావిస్తుంటారు. తమకు తోచినదే నీతి అనీ, తాము చేసేదే న్యాయం అనీ వితండవాదం చేస్తుంటారు. ఇలాంటివారు సమాజద్రోహులే అవుతారు కానీ, ఆదర్శప్రాయులు కాలేరు. అధికారం వస్తుంది. పోతుంది. సంపదలు వస్తాయి. పోతాయి. ఏవీ శాశ్వతం కావు. మనిషి ప్రవర్తన ఒక్కటే శాశ్వతం, మంచి పనులు చేసి చరిత్రలో శాశ్వతకీర్తిని పొందాలో, చెడుపనులతో అపకీర్తిని మూటగట్టుకొని చరిత్రలో కనుమరుగైపోవాలో తేల్చుకోవలసింది మనిషి మాత్రమే!

✍️✍️

No comments:

Post a Comment