మౌనమ్
మౌనం నిశ్శబ్దం మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంథకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ మహానుభావుడు. ''గొంతు మౌనంగా ఉన్నప్పుడు...మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'' అంటారు మెహర్ బాబా. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనసు, నమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత సృష్టితో మమేకమై మాట్లాడటం. టీ.వీ. చూస్తూ కూర్చోవడం మౌనం కాదు. అది కొన్ని పాత్రలతోనో, వార్తలతోనో చేసే సంభాషణ. కంప్యూటర్ ముందు కూర్చోవడం మౌనం కాదు, అది వేయి గొంతుకల కబుర్లతో సమానం. మౌనంలో మాటలుండవు ఆలోచనలుండవు, అదో తపన్సు.మాట ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే. కానీ ఇదొక్కటే వ్యక్తీకరణకాదు. మాటలు నేర్పే సంస్థలున్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు...అయితే ఒక్కమాట...మౌనాన్ని మించిన కమ్యూనికేషన్ లేదు. మౌనం అర్థ అంగీకారం మాత్రమే కాదు. ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు ముసుగులో బుర్రలోని సామా నంతా పక్కనపెట్టి, నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. ఇది ఆత్మసాక్షాత్కారమే. గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో, అనవసరంగా తూలనాడినం దుకో పశ్ఛాత్తాపపడే వారెంతో మందిని చూస్తుంటారు. కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు. మనుషులందరూ మాటలకు అలవాడి పడిపోయారు. మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే, వారి మీద వారికే అనుమానమోచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు. కనీసం కలలు కూడా కనలేరు. అలాంటి కలలు రావు. కలల మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి. మౌనంలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలను కునేవారు. ముందుగా మాటల మత్తునుంచి బయట పడాలి ఇది ఏ ఒక్కరోజులో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి. పొదుపుగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతించడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. రోగాల మనసు మౌనంగా ఉండలేదు. బాధతో మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉం చుకోవాలి. మంచి అలవాట్లు పెంచుకోవాలి. కృత్రిమ జీవన శైలిని పదిలిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. నోరు జారడం వల్ల వచ్చే ఇబ్బందులుండవు. మాటతూలడం వల్ల పుట్టికొచ్చే విపరీత పరిణామాలుండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తి గత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ...మౌనంగా ఉన్నప్పుడే మనం బాగా ఆలోచించగలం, మాటలకు, ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు. సాఫీగా తనపని తాను చేసుకు పోతుంది. నిండుకుండ తొణకదు. స్థిరంగా ఉంటుంది. సమర్థులు కూడా అంతే. మౌనంగా తమపని తాము చేసుకు పోతుంటారు. 'మౌనం' మనలోంచి పుటుకొచ్చే అపారశక్తిని వృధాగా పోనివ్వదు. ఎందుకంటే -వృధా ఆలోచనలుండవు. వృధా మాటలుండవు. ప్రతి ఆలోచనా లక్ష్యంవైపే, ప్రతిమాటా అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉం డగలం. అవసరమైతే ఒంటరి సమూహం కాగలం. ఏకాం తానికి, జనసంద్రానికీ తేడా ఉండదు.ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా..మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది...
No comments:
Post a Comment