*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *నిజానికి "హిందూ” అనేది మతం కాదు. మనది "హిందూ ధర్మం”. ధర్మానికీ, మతానికీ చాలా తేడా ఉంది. ధర్మం అంటే "ధరతి విశ్వమితి ధర్మః" “ప్రపంచాన్ని ధరించేది ధర్మం."’ధారణాద్ధర్మమిత్యాహు:’అన్నారు. అంటే ఆధారమైనది. 'దేనికీ..?' అంటే సమస్తానికి ఆధారమైనది ధర్మం. ఈ ధర్మం ఉంటేనే సమస్త ప్రపంచమూ నిలబడిఉంటుంది. ధర్మం నశిస్తే ఆధారంలేనిది పడిపోవడం సహజం కాబట్టి ప్రపంచం పతనమౌతుంది.*
💖 *”దృఞ్ ధారణే” అనే ధాతువునుండి ‘ధర్మ’ శబ్దం పుట్టింది."ధారణాద్ధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాః”యత్స్యాద్ధారణ సంయుక్తః సధర్మమితి నిశ్చయః" అని ధరించేది ధర్మం. ప్రజలను ధరించేది. కనుక ధర్మమని చెప్పబడింది.*
❤️ *ధర్మానికి పది లక్షణాలు ఉన్నవి "ధృతిః క్షమా దమో స్తేయం - శౌచమింద్రియనిగ్రహః ధీ ర్విద్యా సత్యమక్రోధః- దశకం ధర్మలక్షణం." అని వేదాలను ప్రమాణంగా అంగీకరించడం, సంప్రదాయబద్దంగా వచ్చే విభిన్న సాధనామార్గాలను అనుసరించడం, ఉపాసనీయ దేవీదేవతల యందు భక్తి కలిగియుండడం. ఆధారమైన ధర్మం నశిస్తే జరిగేది పతనం. ధర్మం అన్నిచోట్లా ఉండాల్సిందే. మనుష్యునిలో మనుష్యధర్మం ఉంటే వాడు మనుష్యుడని అనిపించుకుంటాడు. వాడు ధర్మం తప్పితే పతనమే.*
💕 *~అలా స్త్రీ, పురుష, పితృ, మాతృ, సోదర ధర్మాలుంటాయి. వారిలో ఆ ధర్మాలున్నంతవరకే గౌరవించబడతారు. ఆ ధర్మాలు నశిస్తే వారు పతనమైనట్లే. అలా ప్రపంచానికి భగవద్దత్తమైన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం. ఆద్యంతాలు లేనిది కాబట్టే దీనిని "సనాతనధర్మం" అంటాం. (సనా-సదా భవతీతి సనాతనః) ఋషిసత్తములు అందించిన ధర్మం కాబట్టి దీనిని "ఆర్షధర్మం" అన్నారు.*
💞 *”ప్రపంచమంతా ధర్మము నందే నిలిచిఉన్నది” కాబట్టే "ధర్మే సర్వం ప్రతిష్ఠితం" అని చెప్పబడింది."ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా " అని సమస్త ప్రపంచాన్ని నిల్పగలిగినది ఈ ధర్మమే. వేదం "ధర్మం చర" అని ధర్మాన్ని ఆచరించమని లోకాన్ని శాసిస్తోంది. అది కాదనరాని దైవశాసనం. "ధర్మాన్న ప్రమదితవ్యం "ధర్మంలో ఏమరపాటు తగదని."ధర్మమేవ హతోహంతి- ధర్మోరక్షతి రక్షితః" ధర్మాన్ని నాశనంచేస్తే అది మనకే ప్రమాదమని తెలుపుతుంది.*
❤️ *’యతోభ్యుదయ నిశ్శ్రేయసస్సిద్దిః స ధర్మః’ అంటే ఇహపర సద్గతులనొసగేది ధర్మమని ధర్మప్రయోజనాన్ని కణాదుని వైశేషిక సిద్ధాంతం చెబుతోంది. అభ్యుదయం అనేది జీవితానంతరం స్వర్గంలోను, ఇతర జన్మపరంపరలోను రాబోవు సుఖాన్ని తెలియజేస్తుంది. నిశ్రేయసం మోక్షానందాన్ని తెలియజేస్తుంది. ఈ ధర్మాలు సాధారణ ధర్మాలు, విశేషధర్మాలు అని రెండు విధాలు.యజ్ఞ, దాన, తపస్సుల వంటివి సాధారణ ధర్మాలు. ఆపద్ధర్మాలు, ధర్మసూక్ష్మాలు వంటివి విశేష ధర్మాలు.*
💞 *”అధ్యయనాత్ న చ పండితః ధర్మం చరతి పండితః” ధర్మాధ్యయనం వల్ల పండితుడు కాడు, ధర్మాచరణ చేయువాడే పండితుడు. ఒకే విషయంలో భిన్నధర్మాలు కనబడితే పెద్దల ఆచరణలో ఏది నిలిచిందో అదే ధర్మం. ఫలితాంశంగా మానవులు దేనినాచరించటం వలన శ్రేయస్సు పొందుదురో, పాపం పొందకుందురో అది ధర్మం. ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలలో శ్రేష్ఠం ధర్మం. మిగిలిన మూడింటిని సాధించడానికి ఇదే మార్గం.*
💓 *"విద్వద్భిస్సేవితం సద్భిః నిత్యమత్వేషరాగిభిః హృదయేనాభ్యనుజ్ఞాతో - యో ధర్మస్తం నిబోధత” అని ధర్మానికి నిర్వచనం. అంటే రాగద్వేషాలకు అతీతులగు మహాజ్ఞానులచే ధర్మాన్ని అనుసరించమని మనల్ని ఆదేశించారు. “అనిత్యాని శరీరాణి-విభవో నైవ శాశ్వతః ; నిత్యం సన్నిహితో మృత్యుః-కర్తవ్యో ధర్మ సంగ్రహ:" అన్నారు.శరీరం అశాశ్వతమైనది. సంపదలూ అశాశ్వతమైనవే. మృత్యుదేవత ఎల్లప్పుడూ ప్రక్కనే ఉంటుంది. కాబట్టి ధర్మరక్షణే మన కర్తవ్యం అని భావార్థం.*
💖 *అనేకంలో ఏకత్వాన్ని చూడగల సామర్థ్యం హిందూ ధర్మానికే ఉంది. ఈ ఏకత్వం కనబడక అనేకత్వం కనబడితే ఆ లోపం మనదే.ధర్మమే హిందువు యొక్క ఆత్మ. భారతదేశ ఆత్మ ధర్మం కనుకనే ధార్మికులైన హిందువులు తినడం, త్రాగటం, శయనించడం కూడా ధర్మ బద్ధంగానేచేస్తారు. పుట్టుక ముందునుండీ చనిపోయాక కూడా ధర్మబధ్ధులుగానే ఉంటారు. పుట్టకముందు పుంసవన, సీమంతాది ధర్మ కర్మలుంటాయి. చనిపోయాక అంత్యక్రియ, శ్రాధ్ధకర్మలుంటాయి. అంటే హిందువుది పూర్తిగా ధర్మమయ జీవితం.ఆ ధర్మం తప్పితే హిందువు బ్రతికినా నిర్జీవుని కిందే లెఖ్ఖ.*
💓 *కనుక ప్రతి హిందువూ ధర్మమెరిగి నుచుకోవాలి. ఐహిక, పారమార్థికప్రయోజనాలు సాధించే ఈ ధర్మానికి నాలుగు లక్షణాలుంటాయి. 1) వేద ప్రతిపాదితమై ఉండాలి. 2)సంస్కృతిలో విశదీకరించబడి ఉండాలి. 3)పెద్దల ఆచరణలో ఉండాలి. 4)మనకు ప్రియమైనది కావాలి. వాటితో పాటుగా హిందూ ధర్మంలో ప్రధానాంశాలుగా దైవ విశ్వాసం, సదాచారం, శారీరక కర్మాధారమైన వర్ణధర్మం, మానసిక పరిణితి ఆధారంగా ఆశ్రమధర్మం, పాతివ్రత్యం, విగ్రహారాధన, యోగవిధి ; బ్రహ్మ - దేవ - పితృ - భూత - మానుష పంచయజ్ఞాలు; అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ పంచకోశ పవిత్రత ; శ్రుతి, స్మృతి, పురాణ, మంత్ర, తంత్రాది విశ్వాసం; కర్మసిద్ధాంత, పునర్జన్మసిద్ధాంత విశ్వాసాలు;నిర్గుణ,సగుణోపాసన ముక్తి విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి. ఈధర్మం విశ్వధర్మం. దీనిని రక్షించడమంటే విశ్వాన్నే రక్షించడమని అర్థం. అలాంటి ధర్మరక్షణకు బద్ధులం కావాలి.*
💖 *ధర్మాచరణే ధర్మరక్షణలో ప్రధానాంశం. "యువైవ ధర్మశీలస్స్యాత్ - అనిత్యం ఖలు జీవితం; కోహిజానాతి కస్యాద్య - మృత్యుకాలో భవిష్యతి"*
💞 *~”యువకులుగా ఉన్నప్పుడే ధర్మాచరణకు పూనుకోవాలి. ఈ జీవితం అశాశ్వతం కనుక. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కనుక వెంటనే ధర్మకార్యానికి పూనుకోవాలి.”*
💕 *”ఏక ఏవ సుహృద్ధర్మో నిధనేప్యనుయాతి య:" చచ్చాక కూడా తోడుండే ఒకేఒక మిత్రుడు మనమాచరించిన ధర్మమే. ఒకప్పుడు ఈ ధర్మమే మనలను పాలించేది. ఆనాటి రీతి "న రాజ్యం న చ రాజాసీత్ - న దండ్యో న చ దాండిః; ధర్మేణైవ ప్రజాస్సర్వా: - రక్షంతిస్మ పరస్పరం" అన్నారు. అలనాడు రాజ్యం లేదు, రాజులేడు, దండన లేదు, దండింపబడే వాడు లేడు. ప్రజలంతా ధర్మాన్ని ఆధారంచేసుకొని పరస్పర రక్షణలో ఉన్నారని దాని భావం. అలా అత్యున్నత స్థితిని ఈ ధర్మంలో చవిచూచాము. మరల అట్టి ధార్మిక సమాజాన్ని ఆశిద్దాం. అందుకై కృషిని మనమే ఆరంభించాలి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment