. *ఆత్మ సత్య తత్వములు*
. ************************
ఓ మనిషీ ! నీవెందుకొ స్వార్థానికి బానిస !
అదను చూచి నిను హరించ
పొంచి ఉంది మృత్యు నిషా !
ఈ తనువూ చితికెనా !
వినూత్న తనువు కావలెనా !
వెంటనె నీ వెంట ఉన్న మృత్యువును వరించుమా !
ధన్యుడిగ తరించుమా !
ప్రతి జన్మకు జననము మరణములు
ఆది అంతములు.
కానీ నిజముగ ఆత్మకు లేవు ఆది అంతములు.
చెడి తడబడు ఈ తనువును
విసర్జించుటే మరణము.
సరికొత్త వినూత్న తనువు ధారణయే జననము.
జనమునకు మరణమునకు
నడుమ ఉండు జీవనము
ఆత్మకు తాత్కాలికమౌ
స్వప్న తుల్య భావనము.
ఎక్కడ ఎపుడెటులున్నను ఇంతె గాద మనము !
ఇంతేగా దమనము !
ఏనాడూ ఎటులుండునొ పరిస్థితుల తోరణము !?
పరిస్థితులతో రణము !?
దేవుడు కలడని కొందరు !
దేవుడు లేడని కొందరు !
దేవుడు కలడో లేడో తెలిసిన వారెందరు ?!
అగ్ని అగ్నిలోన కలిసి
విడిపోతూ కలియు రీతి
పరమాత్మలొ ఆత్మ కలిసి
విడిపోవుటె అనుభూతి.
ఈ మున్నాళ్ళా ముచ్చటకే
ఎందుకు తలబిరుసు మనకు ?!
సుగుణ సత్ప్రవర్తనమున
కలుగు ముక్తి ప్రగతి మనకు !
ఇది గ్రహించి నడుచుకొనిన
ఉండవు సుఖ దుఃఖమ్ములు.
సుఖ దుఃఖములకు అతీత -
మాత్మ సత్య తత్వమ్ములు.
********************
రచన :---- రుద్ర మాణిక్యం (✍️కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
*************************************
No comments:
Post a Comment