Monday, March 25, 2024

స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 18. ఆత్మ స్వరూపము - 1

 త్రిపురా రహస్యము - 28

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 
 
 18. ఆత్మ స్వరూపము - 1 

బంగారు వస్తువును ఒకచోట జాగ్రత్తగా దాచి ఉంచాము. అది దాచిపెట్టిన చోటు మరచిపోయాము. ఆలోచించగా కొంతసేపటికి వస్తువును దాచిపెట్టినచోటు గుర్తు వచ్చింది. అప్పుడు అది దొరికింది. 
 
ఇక్కడ వస్తువు క్రొత్తగా కనిపించలేదు. అది దాచినచోటు గుర్తు వచ్చింది. అప్పుడు వస్తువు దొరికింది. అలాగే “బాహ్యవస్తు నిరోధం వల్ల ఆత్మభాసిస్తుంది” అనే మాట సరియైనది కాదు. నిత్యప్రాప్తమైనది ఆత్మ. 
 
అయికే నిత్యప్రాప్రమైన అత్మ నిత్యమూ ఎందుకు కనిపించదు ? అనేదే ప్రశ్న. ఒక వ్యక్తితో పరిచయం లేనంత వరకూ అతను ఎదురుగా ఉన్నప్పటికీ అతనే ఆ వ్యక్తి అని తెలుసుకోలేము. అలాగే గతంలో ఆత్మ పరిచయం లేదు కాబట్టి ఆత్మను మనం గుర్తించలేకుండా ఉన్నాము. రాకుమారా ! ఆత్మకు సంబంధించిన వూర్వజ్ఞానం లేకపోవటం చేత నీలోనే ఉన్న ఆత్మతత్త్వాన్ని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. నాధా |! 
 
బాహ్యవిషయాలను నిరోధించిన తరువాత నీకు చీకటి కనిపించింది కదా ! ఈ రెంటికీ మధ్య, అంటే ఇంద్రియ నిగ్రహానికి, అంధకారానికీ మధ్య ఉన్నదే ఆత్మస్వరూపము.  ఎప్పుడూ దాన్ని గురించే భావన చెయ్యి. అదే పరమానందాన్నిస్తుంది. మాయా మోహంతో ఆవరించబడినవారు, బావ్యావిషయాలపైనే దృష్టి నిలిపేవారు ఆత్మను గురించి తెలుసుకోలేరు. ఆత్మజ్ఞానం పొందలేరు. శాస్త్ర పాండిత్యము గలవారు, తార్కికులు, వీరెవరూ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు. అందుచేతనే వారు ఆత్మను గురించి పరితపిస్తూ ఉంటారు. ఆత్మను బాహ్యేంద్రియాలద్వారా తెలుసుకోలేము. శాస్త్రాలు చదివినా, కర్మలు చేసినా ఆత్మజ్ఞానం రాదు. ఇంద్రియ వ్యాపారం నశించినప్పుడే ఆత్మను గురించి తెలుసుకోగలము.  నిర్మలము, నిశ్చలము అయిన మనస్సుకే ఆత్మను గురించి తెలుస్తుంది. మన ముందు పడుతున్న నీడను మనం ఎంత పరుగెత్తినా పట్టుకోలేము. అదే విధంగా ఇంద్రియాలు ద్వారా ఆత్మను పొందలేము. 
 
అద్దంలో అనేక వస్తువుల ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. అప్పుడు అజ్ఞానియైన బాలుడు ప్రతిబింబాన్నే చూస్తాడు కాని అద్దాన్ని చూడలేడు. అలాగే ఆత్మ అనే అద్దంలో  జగత్తంతా ప్రతిబింబిస్తున్నప్పుడు, గతంలో ఆత్మను ఎరగం కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మను గుర్తించలేము. అంటే సామాన్యుడు ఆత్మచేత కల్పితమైన ప్రపంచాన్ని చూస్తున్నాడు కాని ఆత్మను గుర్తించలేదు. 
 
నాధా | ప్రపంచము అంటే జ్ఞానము, జ్ఞేయము మాత్రమే. జ్ఞానానికి విషయమైన ప్రపంచం ఆత్మ కాదు. అది అనాత్మ. ఇంద్రియ గ్రాహ్యము. అంటే ఇంద్రియాలద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. మరి జ్ఞానము - ఇంద్రియ గ్రాహ్యం కాదు. అది స్వయం ప్రకాశమైనది. చీకటిలో వస్తువులు ప్రకాశించాలంటే దీపం కావాలి. కాని జ్ఞానం ప్రకాశించటానికి ఏమీ అక్కరలేదు. జ్ఞానజ్యోతి లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఈ ప్రపంచం అంతా జ్ఞానాధీనమై ఉన్నది. జ్ఞాత అనగా - తెలుసుకొనేవాడు తాను ఉన్నాను అని తెలుసుకోవటానికి, తనకన్న ఇతరమైన సాధనాలను అపేక్షించడు. సూర్యుడు ప్రకాశించాలంటే దీపాలు అవసరం లేదు. జ్ఞానమనేది ఒకటే. రెండు లేవు కాబట్టి సాధ్య, సాధనాలుండవు. ఈ రకంగా ఆత్మ స్వయం ప్రకాశము, సత్యము, నిత్యము అయి ఉన్నది. ఇంకా దీనిమీద తర్కం అనవసరం. జ్ఞానం లేదన్నవాడు తాను లేని వాడవుతాడు. ప్రతిబింబం కనిపించే అద్దం లేదనటం ఎంత అవివేకమో, సర్వ ప్రపంచానికి ఆధారమైన జగత్తు లేదనటంకూదడా అంత అవివేకమే.  
 
రాజా ! దేశకాలాలుకూడా ఈ జ్ఞానంలో అంతర్భూతాలే, కాబట్టి అవి జ్ఞానానికి పరిమితి కలిగించలేవు. సూర్యకాంతిలో ఉన్న కుండ ఆ కాంతిని పరిమితం చెయ్యలేదు.  అయితే ఆ కాంతి కుండ యొక్క ఏ భాగం మీద పడుతుందో, ఆ భాగం మాత్రమే ప్రకాశిస్తుంది. ఆకాశంలో అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అవి ఆకాశం యొక్క సర్వవ్యాపకత్వాన్ని సంకోచింప చెయ్యలేవు. అదేవిధంగా జ్ఞానంలోనే ఆయిన దేశకాలాలు జ్ఞానాన్ని పరిమితం చెయ్యలేవు.  
 
కాబట్టి రాకుమారా! నీ స్వరూపాన్ని గురించి సూక్ష్మదృష్టితో ఆలోచించు. ఏ చైతన్యంలో అయితే ఈ జగత్తంతా ప్రకాశిస్తోందో, అదే నీ స్వరూపము అని తెలుసుకో.  అన్ని రకాల కుండలయందు ఉండే మట్టి ఒకటే. అలాగే జగద్వస్తువులన్నిటియందు ఉండే చైతన్యము ఒక్కటే. అదే నీ ఆత్మ...🙏

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

J N RAO 🙏🙏🙏

No comments:

Post a Comment