Friday, March 15, 2024

సాధనా చతుష్టయాల గురించి తెలుసా?

 సాధనా చతుష్టయాల గురించి తెలుసా?
సాధన చతుష్టయాలైన సంతోషం, శమం, విచారణ, సాధు సంగమం అనేవి సంసార సాగరం నుంచి తరింపజేసే ఉపాయాలట. దీనికి సంబంధించిన శ్లోకం, దాని వివరణ ఇలా ఉంది..
'సంతోషమే పరమ లాభం. సత్సంగమే పరమగతి. విచారమే పరమ జ్ఞానం. శమమే పరమ సుఖం'.
ఈ నాలుగు రకాలైన ఉపాయాలనూ అభ్యసించేవారే ఘనీభూతమై ఉన్న ఈ మోహజాలాన్ని జయిస్తారు. వీటిలో ఏ ఒక్క దాన్నైనా సర్వశక్తి యుక్తులతో అభ్యసిస్తే, మిగతా మూడూ కూడా లభిస్తాయి. స్వచ్ఛమైన శమం వల్ల హృదయం నిర్మలమైనప్పుడు అలాంటి వ్యక్తి వద్దకు మిగతా మూడూ వచ్చి చేరుతాయి. సంతోషం, విచారణ, సత్సంగం ఉన్నచోట 'జ్ఞానం' రూపు దిద్దుకుంటుంది, సుగుణాలన్నీ ఆశ్రయిస్తాయి, విజయలక్ష్మి వరిస్తుంది.  "స్వప్రయత్నం" అనే పురుషకారం చేత మనస్సును జయించి, ఈ నాల్గింటిలో ఏ ఒక్కదానినైనా నిరంతరం ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి.  “శ్రద్ధతో, ఓర్పుతో, నేర్పుతో  ఒక్కటైనా దైనందికమైన అలవాటుగా మార్చుకోవాలి.  ఈ నాల్గింటినీ కాస్త కాస్త ఆశ్రయిస్తూ పోగా, కొంతకాలానికి అంతా సుసాధ్యమే అవుతుంది. మొదట్లో కొంత పట్టుదలతో ఆ తరువాత ప్రయత్నం వీడకుండా ఉంటే  సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అసలు ప్రయత్నమనేదే చేయకుండా, "మానవ మాత్రులం! మా వల్ల ఏమవుతుంది?" అని నిరుత్సాహ పడి, తుచ్ఛ విషయాలకై పరుగులు పెడితే అది మూర్ఖత్వమే కదా! ఎందుకంటే మనుషుల్లోనే అత్యంత మహనీయులు, ఆత్మజ్ఞులు... అత్యంత మూర్ఖులు కూడా ఉన్నారు. అందువల్ల సాధన చెయ్యాలి.  అసలు రహస్యమంతా సాధనలోనే ఉంది కానీ దైవంలో కాదు.
ఈ మనస్సును పురుషకారంతో జయించి, ఈ నాల్గింటిలో ఒక్కదానినైనా వశం చేసుకుంటేనే 'ఉత్తమగతి'. అలా కాకుండా మనసుకు నచ్చినట్టు ఉండటం.  ఇంద్రియ విషయాలను మాత్రమే ఆశ్రయించడం, కల్పిత వ్యవహారాలనే నమ్ముకొని ఉండడం... అది శుభప్రదం అవుతుందా? ఈ నాల్గింటి కోసం కష్టపడి ప్రయత్నించాలి. చంచల మనస్సు గుణదోషాలనే ప్రీతిపూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఆ గుణ దోషాలను మొట్టమొదట జాగ్రత్తగా గుర్తించాలి. అయితే ఈ గుణదోషాలు తొలగేదెలా? మంచి గుణాలను ఆశ్రయించడమే అందుకు ఉపాయం.  ఏ మార్గం కావాలో బాల్యంలోనే నిర్ణయించుకోవాలి. చక్కగా ఆలోచించాలి, మార్గాన్ని అన్వేషించాలి. తరువాత దాన్ని అనుసరించాలి. . అంతేకానీ, బాధపడుతూ కూర్చుంటే ఎవరికీ  ఏ లాభమూ ఉండదు.
సాధన చతుష్టయం
వేదాంత శాస్త్రమంతా ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగించి అధ్యాస తొలగడానికి ఉపకరిస్తుంది. అందుచేత బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని గృహస్థ, వానప్రస్థాశ్రమాల తర్వాత కర్మలనాచరిస్తూ చిత్తశుద్ధిని సంపాదించుకొని బ్రహ్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ధర్మాన్ని తెలిసికొని ఆచరించడం వల్ల కలగే ఫలితం విషయాది సుఖం. బ్రహ్మజిజ్ఞాసకు ఫలం మోక్షం. 
సాధన చతుష్టయం సాధించాక శ్రవణ మననాదులు చెయ్యాలని అది శంకరులు చెబుతారు. నిజానికి వేదాధ్యనం గాని, యజ్ఞాది కర్మలను గాని చెయ్యకుండానే కొందరు మహాపురుషులు బ్రహ్మజ్ఞానులయ్యారు. అంచేత బ్రహ్మమును తెలుసుకోవాలనే జిజ్ఞాసకు  వీటి ఆవశ్యకత లేదనే చెప్పవచ్చు. కాని అవిచేస్తే మంచిదే. ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము, చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకొనే జ్ఞానము, సూక్ష్మబుద్ధీ ఉంటే సరిపోతుంది. బ్రహ్మమును తెలుసుకోడానికి కులభేదం గాని, లింగభేదం గాని లేకుండా సంసారమే బంధంగా ఉందనీ, దాన్నుంచి విముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక కలిగితే చాలు. అలాంటి వ్యక్తి ఏమీ తెలియనివాడు కాని, అన్నీ బాగా తెలిసినవాడు కాని గాకూడదు.        
వివేకజ్ఞానము, ఇహపరలోకాల్లో ఉండే భోగవిషయాలపై వైరాగ్యము, శమదమాది సాధనాసంపత్తి, మోక్షం పొందాలనే తీవ్రవాంఛ కలిగిన తర్వాత బ్రహ్మను తెలిసికో శక్యమవుతుంది. శమదమాది సాధనాసంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానం, శ్రద్ధ  అనేవి సమకూరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చెయ్యాలి.
బ్రహ్మ ప్రాప్తికి, శ్రవణాదులు చెయ్యడానికి తగిన యోగ్యతను సాధించే సాధనాలని సాధనచతుష్టయం అంటారు. అవి (1) నిత్యానిత్య వస్తువివేకము – భూత భవిష్యద్వర్తమాన కాలాలు మూడిట్లోను నాశనం లేకుండా ఉండేది నిత్యమైనది. కొంతకాలం ఉండి తర్వాత నశించే దాన్ని అనిత్యమైనదని అంటాం. ఈ రెండిటి జ్ఞానమే నిత్యానిత్య వివేకము అంటారు. మన కంటికి కనిపించే రూప సముదాయమంతా కొంతకాలం ఉండి నశించేదే. అలాగే ఇంద్రియాల ద్వారా తెలియబడే వ్యక్త ప్రపంచమంతా కొంత కాలం ఉండి నశించి పోయేనే భావన కలుగుతుంది. అప్పుడు నాశనం లేని పదార్ధం ఒకటి ఉండాలని తెలుస్తుంది. అదే ఆత్మ అని తెలిసి దాన్ని పొందాలనే నిశ్చయం కలుగుతుంది.
(2) ఇహాముత్రార్ధ ఫలఫలభోగ విరాగం ( వైరాగ్యం) – ఈలోకంలో గాని పరలోకంలో గాని లభించే అన్ని సౌఖ్యాలను తృణీకరించి నిరాదరణ కల్గి ఉండటాన్ని వైరాగ్యమంటారు. 
(3) శమాదిషట్కము - ఇది ఆరు విధములు.
(అ) శమము -  మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము అనే  అంతరింద్రియములను వాటి వృత్తులకు పోనీయక బ్రహ్మమునందే నిరంతరము నిలపటడాన్ని శమము అంటారు. అంటే అంతరింద్రియ నిగ్రహము /మనోనిగ్రహం.
(ఆ) దమము - ఇంద్రియాలను బాహ్య విషయాలవైపు పోనీయకుండా మరలించి, అత్మయందే లగ్నం చెయ్యడం  దమము. అంటే  బాహ్య ఇంద్రియ నిగ్రహము. దీన్లో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించడం ముఖ్యమైనది. శమ దమాదులకు వైరాగ్యం అవుసరం.  
(ఇ) ఉపరతి - విషయాలయందు దోష దృష్టిని విచారణ చేసి వాటిని తిరస్కరించటం. మళ్ళీ ఇంద్రియాలు వాటి స్వభావం ప్రకారం బయటి విషయాల జోలికి పోనీయకుండా నిలపడాన్ని ఉపరతి అంటారు.
(ఈ) తితీక్ష - అంటే ఓర్పు. శీతోష్ణములు సుఖదుఃఖములు మొదలైనవి వచ్చి పోతూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండవు.  అంచేత వీటిని సహనంతో ఓర్చుకోవడం అలవరచుకోవాలి. ఆ ఒర్పునే తితీక్ష అంటారు. 
(ఉ) శ్రద్ధ - శాస్త్రాలయందు, గురువాక్యాల యందు విశ్వాసము కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు.
(ఊ) సమాధానము-  తన బుద్ధిని అన్ని విధాలా బ్రహ్మమందే  ఎపుడూ  స్థిరపరచుకొని ఉండటాన్నే సమాధానం అని అంటారు. మరికొందరు శాస్త్రమందు చెప్పబడిన విషయాలు, గురువుచే ఉపదేశించబడిన వాక్యాలు ఒక్కటే అని శృతియుక్తి, అనుభవములచేత  ఆత్మ నిశ్చయం పొంది, సంశయాలను నివృత్తి గావించు కోవడమే సమాధానమని అంటారు.
 (4) ముముక్షుత్వము – సంసార బంధ నివృత్తి ఎప్పుడు ఏవిధంగా కలుగుతుందా అని ఆలోచిస్తూ, మోక్షమందే ఆపేక్ష కలిగి ఉండటాన్ని ముముక్షత్వం అంటారు.
ప్రపంచంలో ఆకర్షణలన్నీ అశాశ్వతాలే ననే విషయాన్ని గ్రహించడమే వివేకం. అప్పుడు వాటి మీద ఆసక్తి తొలగి పోతుంది. అదే వైరాగ్యమంటే. విజ్ఞానము లేక అపవిత్రమైన జీవనాన్ని గడిపేవాడు ఆ పరమపదాన్ని పొందలేడు. సంసారంలోనే చిక్కుకొని ఉంటాడు. మనోనిగ్రహం కలిగిన విజ్ఞానవంతుడు పవిత్ర జీవితాన్ని గడిపేవాడు ఆ పరమ పదాన్ని పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదని కఠోపనిషత్తు జ్ఞానవైశిష్యాన్ని చెబుతోంది. ఈ విధంగా  మనోనిగ్రహం ఉన్నవాడు ఇంద్రియాలను మనస్సులో లీనం చేసుకోవాలి. మనస్సును బుద్ధిలోను, బుద్ధిని మహత్తత్వంలోను విలీనం చేసి, దాన్నిప్రశాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలనే సాధనను కఠోపనిషత్తు చెబుతోంది. ఇలా సాధన చతుష్టయాన్నిపొందినవాడు, ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు; సర్వమూ అత్మగానే చూస్తాడు. మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉంటేనే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. సద్గురువును సేవించి సఫలయత్నుడవుతాడు.

No comments:

Post a Comment