Monday, April 1, 2024

జిడ్డు కృష్ణమూర్తి, ఓషో బోధనల మధ్య సారూప్యతలు, తేడాలు ఏమిటి?

 


జిడ్డు కృష్ణమూర్తి, ఓషో బోధనల మధ్య సారూప్యతలు, తేడాలు ఏమిటి?
మహా కవి సుమిత్రానందన్ పంత్ - ఓషో అభిమాని. ఒక సందర్భంలో ఓషోను ఓ ప్రశ్న అడిగారు. "భారతదేశంలో జన్మించిన మహాపురుషులు, తాత్వికులలో ఒక పది మంది పేర్లు చెప్పండి?".
ఆ ప్రశ్నకు ఓషో జవాబు చెబుతూ ఉటంకించిన మహనీయుల్లో పదవ వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి.
నిశ్శంసయంగా ఆధునిక కాలంలో భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప తాత్వికులలో ఈ ఇద్దరు ప్రముఖ స్థానం లో ఉంటారు.
ఈ ఇద్దరున్నూ గొప్ప తాత్వికులు, దార్శనికులు,అనుభవజ్ఞానులు. "ఏది" తెలిస్తే మనిషి లోని అన్ని చికాకులు, చిత్తవికల్పాలు అంతమవుతాయో ఆ ఆత్మస్వరూపాన్ని దర్శింపజేసుకున్న సత్యాన్వేషణపరులు. (లేదా అలా సామాన్యులకు అగుపించేవారు.)
ఇద్దరూ తాత్వికులే అయినా ఓషో ఆధ్యాత్మిక ప్రపంచాన్నే కాక భౌతికప్రపంచాన్ని కూడా సమగ్రంగా చూచినట్టు కనిపిస్తుంది. ఓషో జన్మతః జైనమతంలో జన్మించాడు. తండ్రిది బట్టల దుకాణం. ఓ మోస్తరుగా ధనవంతుల కుటుంబమే అనుకోవాలి. చిన్నప్పుడు ఓషో తన తాతయ్య అమ్మమ్మల వద్ద పెరిగాడు. బాల్యం నుండి గొప్ప రెబెల్.
పెరిగి పెద్దయిన ఓషో కాలేజ్ లో తత్వశాస్త్రం ప్రధాన సబ్జెక్ట్ గా చదివాడు. ప్రపంచంలో దాదాపు ఆన్ని ప్రముఖ మతాల సారాన్ని లోతుగా అవగాహన చేసుకొన్నాడు.
యౌవనంలోనే ఓషో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాడు. తన అమ్మమ్మ మరణాన్ని దగ్గరగా చూసి ప్రేరణ పొందాడంటారు. ఆపై ఓషో అభిమానుల అండతో ఆశ్రమాన్ని స్థాపించి నియో- సన్యాస పద్ధతి నెలకొల్పాడు.
ఉపనిషత్తులు, ఆదిశంకరులు, సూఫీమతం, బౌల్స్, గౌతముడు, యోగా, జెన్, తావో, బోధిధర్ముడు, కబీర్, శ్రీకృష్ణుడు, ఇలా అధ్యాత్మికతలో ఓషో ప్రసంగించని ప్రపంచ తత్వం కానీ దర్శనం కానీ దాదాపు లేదనే చెప్పాలి. బాహ్యంగా కూడా ఓషో నిర్భీతిగా, ఉండేవాడు. 99 రోల్స్ రాయస్ కార్లు ఆయనకు ఉండేవి. ఆవి ఉన్నా, లేకున్నా ఒకే విధంగా ఆయన ఉండేవాడేమో.
ఓషోతో పోలిస్తే, కృష్ణాజి తత్వం సూటిగా ఉంటుంది. ఈయన చదువుకోలేదు. పదవ తరగతి వరకే చదివాడు. మతపరమైన పుస్తకాలేవీ కృష్ణాజీ చదవలేదు. ఈ విషయం కృష్ణాజీయే చెప్పాడు. ఇంగ్లీషు కోసం బైబిల్ కాస్త చదివాడట.
కృష్ణాజీ తన తల్లితండ్రులకు ఎనిమిదవ సంతానం. బాల్యంలోనే అమ్మను పోగొట్టుకొన్నాడు. మలేరియా వచ్చి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్ళాడు. బాల్యంలో కృష్ణాజీ ఒక ఫ్రీక్. ఎప్పుడూ చెరువు ఒడ్డున చీమలను, పువ్వులను, పక్షులను, ప్రకృతినీ చూస్తూ ఏదీ పట్టకుండా గడిపేవాడట. అప్పుడప్పుడూ చనిపోయిన తన తల్లితో మాట్లాడేవాడని కొందరు అంటారు. చదువు అస్సలు వంటబట్టలేదు.
కృష్ణాజీ బాల్యం చాలా ఒడిదుడుకులతో గడిచింది. ఈయన కూడా తన యౌవనంలో - తమ్ముడు నిత్య మరణాన్ని చూచి, ఆపై అచ్చం బుద్ధుడిలా ఓ వృక్షం క్రింద ఆత్మదర్శనం చేసుకొన్నాడు. ఆ అనుభవం ఎంతో తన్మయంగా వివరించాడు.
"I was supremely happy, for I had seen. Nothing could ever be the same. I have drunk at the clear and pure waters and my thirst was appeased. ...I have seen the Light. I have touched compassion which heals all sorrow and suffering; it is not for myself, but for the world. ...Love in all its glory has intoxicated my heart; my heart can never be closed. I have drunk at the fountain of Joy and eternal Beauty. I am God-intoxicated."
కృష్ణాజీ తత్వం గహనం, గంభీరం. ఎవరెస్ట్ శిఖరం పైకి చేరుకోవాలంటే, శిఖరం ఎక్కాల్సిందే. అది క్రిందకు రాదు. సత్యం కూడా అంతే. ఈ సత్యాన్ని ఎవరికి వారు అన్వేషించుకోవలసిందే.
కృష్ణాజీ తత్వం సూటిగా ఉంటుంది. ఎందరో గొప్ప ప్రొఫెసర్లు మొదలుకుని సామాన్యుల వరకు ఆయనతో - మెదడు లో జరిగే ఆలోచనలు - వాటి పర్యవసానాలు, భయం, కోపం, ప్రేమ, సెక్స్, ఆధ్యాత్మికత, ఇలా ఎన్నో విషయాలపై చర్చించారు.
కృష్ణాజీ బోధ - ఒక్కొక్క పొరను ఒలుస్తూ మూలతత్వాన్ని వెదికే దిశగా వెళుతుంది. ముఖ్యంగా మనిషి బుర్ర - ఇమేజ్ ఫార్మేషన్, దాని స్వరూపం, మెదడు నిర్వ్యాపారంగా ఎలా మారగలదు - దీనిపై ఆయన ప్రసంగిస్తాడు.
ఓషో కృష్ణాజీ ఇద్దరున్నూ వ్యవస్థీకృత మతాలను నిరసించారు. ఇద్దరూ బాల్యంలో రెబెలియస్ మనస్తత్వం ఉన్నవారు. ఏ ఒక్కరి అథారిటీని వీరు ఒప్పుకోలేదు. ఇద్దరు బయటకు పూర్తీగా వేర్వేరుగా కనిపించినా బోధ సారాంశం ఒక్కటే.
శ్రీకృష్ణుడు ఎంత గొప్ప భోగి, ఎంత సంపూర్ణావతారుడో మనకు తెలుసు. భగవద్గీత లో ఓ శ్లోకం ఇది.
"ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||"
ఇదే సారాన్ని - మహాశ్రమణుడు గౌతమబుద్ధుడు కూడా చెప్పాడు - "ఆత్మదీపో భవ".
ఇద్దరిలో ఎన్నో భేదాలు. మౌలికంగా మాత్రం ఇద్దరి బోధ ఒక్కటే. పోలిక సబబో కాదో తెలియదు కానీ, ఓషో కృష్ణాజీల విషయంలో అలాంటిదే అని నా అవగాహన.
సేకరణ....

No comments:

Post a Comment